మెక్సికో: 8 ఏళ్లుగా 43 మంది విద్యార్థులు మిస్సింగ్.. ఏమి జరిగిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బెర్న్డ్ డిబస్మన్ జూనియర్
- హోదా, బీబీసీ న్యూస్
సెప్టెంబరు 26, 2014లో 43 మంది మెక్సికన్ విద్యార్థులు కనిపించకుండా మాయమయ్యారు. ఈ సంఘటన మెక్సికన్ సమాజాన్ని కుదిపేసింది. ప్రభుత్వంలో లోతుగా పాతుకుపోయిన అవినీతి, వేల మంది ప్రాణాలను మంటగలిపిన హింసను బహిర్గతం చేసింది.
ఈ ఘటన జరిగి 8ఏళ్ళు అవుతోంది. ఇప్పటికీ ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు.
మెక్సికన్ పట్టణం కొకులా నుంచి అరగంట ప్రయాణ దూరంలో ఉన్న కొండల్లో ఉన్న మురికి గుట్టల్లో ఈ 43 మంది విద్యార్థులు సమాధి అయి ఉంటారని ప్రభుత్వం చెప్పింది. ఈ విద్యార్థులంతా ఒక నిరసనలో పాల్గొని ఇంటికి తిరిగి వస్తుండగా మాయమయ్యారు.
యునైటెడ్ వారియర్స్ గ్రూపుకు చెందిన సభ్యులు ఈ విద్యార్థులను గుట్టలుగా పడిన ప్లాస్టిక్ వ్యర్ధాలు, ప్రతిరోజూ విసిరేసిన తుక్కుపదార్ధాల మధ్యలో హతమర్చి కాల్చేశారని మెక్సికన్ అధికారులు తెలిపారు. ఈ విద్యార్థులంతా అయోట్ హినిపా రూరల్ టీచర్స్ కాలేజీ లో చదువుకుంటున్న విద్యార్థులు. అవినీతికరమైన పోలీసు అధికారులు ఇగ్వాలాలో వీరిని బంధించి నేరస్థ ముఠాలకు అప్పచెప్పారని ప్రభుత్వం చెబుతోంది.
ప్రభుత్వం చెప్పిన ఈ వాదన తప్పు అని 2016 నాటికి స్వతంత్ర పరిశోధకులు నిరూపించారు. ఈ కేసు మెక్సికో లో
వేళ్ళూనుకుపోయిన అవినీతి, పెట్రేగిపోయిన హింసను బహిర్గతం చేసింది.
ఈ సంఘటన జరిగి 8ఏళ్ళు అవుతోంది. ఇప్పటి వరకు ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను మాత్రమే గుర్తించారు.
ప్రజల నుంచి ఎదురైన విమర్శలతో ప్రస్తుత అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్ నిజాన్ని వెలికితీసేందుకు"ట్రూత్ కమిషన్' ను ఏర్పాటు చేశారు.
ఈ ఘటనను 'ప్రభుత్వ నేరం' అని అంటూ, ప్రభుత్వం నేరంలో భాగస్థులైన కొన్ని డజన్ల మంది ముఠా సభ్యులు, సైనికులు, స్థానిక, కేంద్ర, రాష్ట్రాలలోని అధికారుల పేర్లను బయటకు రాకుండా చేసిందని ఈ కమీషన్ పేర్కొంది.
ఈ సంఘటనలో నిజాలను వెలికితీయడంలో ఇప్పటివరకు అధికారం చేపట్టిన రెండు ప్రభుత్వాలు కూడా విఫలమయ్యాయని ప్రజలు విమర్శిస్తున్నారు.
ఈ విద్యార్థుల కిడ్నాప్ జరిగిన 8ఏళ్ల తర్వాత ఈ కేసులో కొంత మంది ముఖ్యమైన పాత్రధారులను అరెస్టు చేశారు. కొంత మంది కనిపించకుండా పోయారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలను ఇంకా వెతుకుతూనే ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జీసస్ మురిల్లో కరం, మాజీ అటార్నీ జనరల్
ఆగస్టు 19, శుక్రవారం మాజీ మెక్సికో అత్యున్నత ప్రాసిక్యూటర్ జీసస్ మూరిల్లో కరంను ఈ కేసులో అరెస్టు చేశారు.
ఎన్రిక్ పీనా నీటో మెక్సికో అధ్యక్షునిగా ఉన్న సమయంలో ఈయన అటార్నీ జనరల్ గా పని చేశారు. విద్యార్థుల అపహరణ కేసు విచారణను ఈయనే మొదలుపెట్టారు.
ప్రస్తుతం ఆయన పై అక్రమ నిర్బంధన, వేధింపులు, విద్యార్థుల అపహరణ కేసులో న్యాయం జరగకుండా నిరోధించిన అభియోగాల పై కేసు నమోదయింది.
కేంద్ర ప్రభుత్వం కళ్ళను కప్పి, మొత్తం వ్యవహారాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేశారనడానికి విద్యార్థులు కనిపించకుండా పోయిన తర్వాత చేసిన తప్పుడు అరెస్టులు నిరూపిస్తున్నాయని పీనా నీటో తర్వాత అధ్యక్ష పదవిని అధిరోహించిన లోపెజ్ ఓబ్రడార్ అన్నారు.
విచారణ విషయంలో కొన్ని తప్పులు చేసినట్లు కరం కోర్టులో ఆగస్టు 24న అంగీకరించినప్పటికీ, విద్యార్థులకు ఏమయిందనే విషయం పై ఎవరూ స్పష్టమైన సమాధానం చెప్పడం లేదు.
ఈయన పై విచారణ కొనసాగుతుంది. విచారణ మొదలయ్యేవరకు ఆయన నిర్బంధంలోనే ఉంటారని కోర్టు తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
టోమస్ జెరాన్, మెక్సికో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ సంస్థ మాజీ అధిపతి
ఈ కేసులో అప్పటి ప్రభుత్వ వాదనలను సమర్ధించేందుకు మెక్సికో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ సంస్థ మాజీ అధిపతి టోమస్ జెరాన్ సాక్షులను వేధించారని ఓబ్రడార్ ప్రభుత్వం ఆరోపించింది.
ఆధారాలను తారుమారు చేసినందుకు అధికారులు ఈయన కోసం కూడా గాలిస్తున్నారు. అయితే, ఆయన మాత్రం ఇవి రాజకీయ ఉద్దేశ్యంతో చేసిన ఆరోపణలని అంటూ వాటిని ఖండించారు.
ఆయన ప్రస్తుతం మెక్సికోలో లేరు. 2019లో ఆయన కెనడా వెళ్లారని అంటారు. జులై 2021లో ఆయన ఇజ్రాయెల్ వెళ్లి అక్కడ శరణార్థ భిక్ష కోరారని మెక్సికన్ అధికారులు చెబుతున్నారు. మెక్సికో ఆయనను అప్పగించమని కోరుతోంది.
అయితే, ఇజ్రాయెల్ అధికారులు మెక్సికో అభ్యర్ధనను ఆమోదించలేదు.
ఆయన పై ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు మెక్సికో రావాలని కోరుతూ టెల్ అవీవ్ లో ఉన్న జెరాన్ తో ఈ ఏడాది ఫిబ్రవరిలో మెక్సికన్ అధికారులు ఆయనతో సమావేశం నిర్వహించారని ప్రభుత్వ నివేదిక చెబుతోంది. ఆయన మాత్రం ఇజ్రాయెల్ లోనే ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
హోసే లూయి అబార్కా, మాజీ ఇగ్వాలా మేయర్
2014లో విద్యార్థుల అపహరణకు గురి అయిన కొన్ని రోజులకే ఇగ్వాలా మేయర్ హోసే లూయి అబార్కా భార్యతో కలిసి ఊరు విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఒక నెల రోజుల తర్వాత వారిని మెక్సికోలో అరెస్టు చేశారు. ఇద్దరూ ప్రస్తుతం మనీ లాండరింగ్, వ్యవస్థీకృత నేరాలతో సంబంధాలు ఉన్నాయనే నేరం పై జైలు శిక్షను అనుభవిస్తున్నారు.
విద్యార్థులు మాయమవ్వడంలో ఆయన పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నప్పటికీ, కొంత మంది విద్యార్థుల కుటుంబ సభ్యులు మాత్రం బహిరంగంగా వారిని సమర్థిస్తున్నారు. వారిని విడుదల చేయాలని కోరుతూ ఒక మార్చ్ కూడా నిర్వహించారు.
ఇగ్వాలా కిడ్నాప్ లతో వారికి సంబంధమున్నట్లు ఆధారాలు లేవని సెప్టెంబరు 14న కోర్టు చెప్పింది. కానీ, ఆయన 2013లో హత్యకు గురైన ఇద్దరు ఉద్యమకారుల కేసులో ఆయన పై అభియోగాలున్నాయి. అయితే, కోర్టు తీర్పును ప్రభుత్వం సవాలు చేస్తుందని మెక్సికో అసిస్టెంట్ పబ్లిక్ సేఫ్టీ కార్యదర్శి రికార్డో మిహియా అంటున్నారు. మాజీ మేయర్ ను నిర్బంధం నుంచి విడుదల చేస్తారని వస్తున్న వార్తలను కొట్టిపారేశారు.

ఫొటో సోర్స్, Getty Images
గురెరోస్ యూనిడోస్
విద్యార్థులను హతమార్చారని ఆరోపణలు వచ్చిన గురెరోస్ యూనిడోస్ ముఠా మాత్రం తమ కార్యకలాపాలు కొనసాగిస్తోంది.
ఈ ముఠా గురెరో, మరో రెండు మెక్సికో రాష్ట్రాల్లో దోపిడీలు చేయడంతో పాటు, అపహరణలకు కూడా పాల్పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ముఠా హెరాయిన్ ను ఉత్పత్తి చేసి మెక్సికో నుంచి అమెరికాకు రవాణా చేస్తుందని చెబుతారు.
ఈ ముఠా ప్రస్తుతం జాలిస్కో న్యూ జనరేషన్ కౌన్సిల్ తో కలిసి పని చేస్తుందని అంటారు. ఇది మెక్సికోలో చాలా శక్తివంతమైన సంస్థ,
విద్యార్థుల అపహరణ కేసులో అవసరమైన 83 మంది నిందితుల్లో 14 మంది ఈ గ్రూపుకు చెందిన సభ్యులున్నట్లు
ఆగస్టులో అధికారులు ప్రకటించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 14 మంది ముఠా సభ్యులు, ముగ్గురు కుటుంబ సభ్యులు ఇప్పటికే మరణించారు. కొంత మంది ఇతర నేరస్థుల చేతుల్లో లేదా మెక్సికన్ భద్రతా అధికారుల చేతుల్లో, కొంత మంది సహజంగా మరణించారు.
నిజాలు వెలికితీసేందుకు మెక్సికన్ అధికారులు కూడా నిందితులను వేధించేవారని ఆరోపణలు వినిపిస్తాయి.
ఈ గ్రూపుకు చెందిన ఆరుగురు సభ్యులు చెప్పిన నిజాలు ప్రస్తుతం మెక్సికన్ ప్రభుత్వం మురిల్లో కరం పై చేసిన ఆరోపణలకు కేంద్రంగా పని చేస్తాయి.
ఇగ్వాలా ఘటనలో కీలక పాత్ర పోషించిన మరో ముఠా సభ్యుడు హువాన్ సల్లాడో గుజ్మన్ ను పోలీసులు సెప్టెంబరు 2021లో కాల్చి చంపారు.

ఫొటో సోర్స్, Getty Images
మెక్సికన్ సైన్యం
ఇగ్వాలా అపహరణలు చుట్టూ అలముకున్న రహస్యాలు సైన్యం చుట్టూ కూడా తిరుగుతాయని అంటారు.
సైన్యానికి చెందిన ఇన్ఫార్మర్ కూడా ఈ విద్యార్థులతో కలిసి ప్రయాణం చేస్తున్నట్లు అధికారులు ధృవీకరించారు.విద్యార్థుల పై దాడి జరగడానికి ముందు విద్యార్థుల కదలికల గురించి సైన్యానికి సమాచారం ఉన్నట్లు అధికారులు చెప్పారు. కానీ, ఈ ఇన్ఫార్మర్ గురించి తెలుసుకునేందుకు సైన్యం ఎటువంటి చర్యలు తీసుకోలేదని అంటారు. ఈ ఇన్ఫార్మర్ కూడా విద్యార్థులతో పాటు మాయమైన వ్యక్తుల్లో ఒకరు.
విద్యార్థులను కనిపెట్టేందుకు అవసరమైన సమాచారాన్ని సైన్యం దాచి పెట్టి ఉంచిందని నిపుణులు ఆరోపిస్తున్నారు.
కొకులా మురికి గుట్ట దగ్గర ఆధారాలను నాశనం చేస్తున్నట్లు డ్రోన్ ఫుటేజీ ద్వారా ఆధారాలు లభించాయని అంటారు.
ఈ అపహరణలకు సంబంధించి సెప్టెంబరు 15న మెక్సికన్ అధికారులు మరో రిటైర్డ్ ఆర్మీ జనరల్ రాడ్రిగ్వేజ్ ను అరెస్టు చేశారు. ఈయనతో పాటు మరో ఇద్దరు సైనికాధికారులను కూడా అరెస్టు చేశారు.
అయితే. రాడ్రిగ్వేజ్‌కు వ్యతిరేకంగా లభించిన ఆధారాల పై స్పష్టత లేదు.
ముఠా సభ్యులు విద్యార్థులను హతమార్చి వారి మృతదేహాలను నాశనం చేయమని ఆదేశించిన ఒక కల్నల్‌కు వారిని అప్పగించే ముందు ఆరుగురు విద్యార్థులను ఒక వేర్ హౌస్‌లో బంధించినట్లు మెక్సికోలో మానవ హక్కుల అధికారి అంటున్నారు.
మొత్తం మీద ఇటీవల 20 మంది సైనిక సిబ్బందికి అరెస్టు వారెంట్లు జారీ చేశారు. ఇందులో కమాండర్లు, సైనికులు కూడా ఉన్నారు.
మానవ హక్కుల ఉల్లంఘనకు సైన్యాన్ని బాధ్యులను చేస్తామని మెక్సికన్ ప్రభుత్వం హామీ ఇస్తున్నప్పటికీ, ఈ విచారణ వెలికి తీసిన చాలా అంశాలను పరిష్కరించినట్లైతే కనిపించడం లేదు.
ఇవి కూడా చదవండి:
- శ్రీకాకుళంలో చీమల దండు: ఆ ఊరిపై ఎర్ర చీమలు ఎందుకు దాడి చేస్తున్నాయి, ఇవి మనుషులకు ఎంత ప్రమాదకరం?
- హీరోలకు దీటుగా నటించడం... ప్రభుదేవాతో కలసి స్టెప్పులేయడం ఆయనకే చెల్లింది
- హైదరాబాద్ సెక్స్ స్కాండల్: ఆనాటి బ్రిటీష్ సామ్రాజ్యంలో సంచలనం సృష్టించిన సెక్స్ కుంభకోణం కథ
- ఆంధ్రప్రదేశ్: 16 ఊళ్ళు ఏకమై ప్రభుత్వం చేయలేనిది చేసి చూపించాయి
- మ్యూచువల్ ఫండ్స్: ఎలాంటి ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









