'కుక్కల కంటే హీనంగా చూశారు'... రష్యా విడుదల చేసిన బ్రిటన్ ఖైదీ

రష్యా విడుదల చేసిన బ్రిటన్ ఖైదీ ఎడెన్ ఆజ్లిన్

ఫొటో సోర్స్, The Sun

ఫొటో క్యాప్షన్, బ్రిటన్ వాసి అయిన ఎడెన్ ఆజ్లిన్, యుద్ధంలో యుక్రెయిన్ తరపున పోరాడారు

'కుక్కల కంటే హీనంగా నన్ను చూశారు'

సుమారు అయిదు నెలల పాటు రష్యా బలగాల చేతిలో ఖైదీగా ఉన్న ఏడెన్ ఆజ్లిన్ చెప్పిన మాటలు ఇవి.

బ్రిటన్ పౌరుడు అయిన ఏడెన్, రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో యుక్రెయిన్ తరపున పోరాడారు. తూర్పు యుక్రెయిన్‌లోని మరియూపోల్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో రష్యా మద్దతు గల బలగాలకు ఆయన పట్టుబడ్డారు.

ఏడెన్‌తోపాటు మరొక అయిదుగురు బ్రిటిష్ జాతీయులను గత బుధవారం రష్యా విడుదల చేసింది. యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధఖైదీల అప్పగింత జరిగేలా తాను మధ్యవర్తిత్వం వహించినట్లు సౌదీ అరేబియా తెలిపింది.

బ్రిటన్‌లోని నాటింగ్‌హాంషీర్‌కు చెందిన ఏడెన్, ఆదివారం సన్ మీడియాతో మాట్లాడారు.

'నన్ను వారు కత్తితో పొడిచారు. ఆ తరువాత క్షణాల్లో చనిపోతావా లేక అందమైన చావు కావాలా? అని నన్ను అడిగారు' అని ఏడెన్ చెప్పారు.

'ప్రతి రోజూ ఉదయాన్నే ఖైదీలు రష్యా జాతీయగీతం పాడాలి. పాడక పోతే అందుకు శిక్షలుంటాయి. మిమ్మల్ని కొడతారు. నన్ను పట్టుకున్నప్పుడు కత్తితో పొడిచారు. నా ఒంటి మీది పచ్చబొట్టులను చూసి కొట్టారు' అని ఆయన వివరించారు.

ఎడెన్ ఆజ్లిన్‌తోపాటు మరొక నలుగురు బ్రిటన్ పౌరులను రష్యా విడుదల చేసింది

ఫొటో సోర్స్, AIDEN ASLIN

ఫొటో క్యాప్షన్, ఎడెన్ ఆజ్లిన్‌తోపాటు మరొక నలుగురు బ్రిటన్ పౌరులను రష్యా విడుదల చేసింది

బ్రిటన్ వాసులైన ఏడెన్ ఆజ్లిన్, షావున్ పిన్నర్‌తోపాటు మొరాకోకు చెందిన బ్రాహిమ్‌ను... స్వయం ప్రకటిత దొనెత్స్‌క్ రిపబ్లిక్‌లో విచారణ ఖైదీలుగా ఉంచారు. వారు మరణశిక్షను ఎదుర్కొవాల్సి ఉంటుందని గతంలో చెప్పారు.

తన వీపు వెనుక కత్తితో పొడిచిన నాటి రోజులను ఎడెన్ గుర్తు చేసుకున్నారు.

'నన్ను దాదాపుగా చంపేస్తారనే అనుకున్నా. నొప్పి తెలియకుండా క్షణాల్లో చనిపోవాలనుకుంటున్నావా? లేక అందమైన చావు కావాలా? అని ఒక రష్యన్ నన్ను అడిగాడు.

అప్పుడు నొప్పి తెలియకుండా క్షణాల్లో చనిపోవాలనుకుంటున్నానని చెప్పా.

నీ చావు చాలా అందంగా ఉండేలా చూస్తానని వారు అన్నారు.

నా ఒంటి మీద ఉన్న యుక్రెయిన్ త్రిశూలపు పచ్చబొట్టును చూసి, నన్ను కొట్టారు.

ఇద్దరు ఉండాల్సిన సెల్‌లో నాతోపాటు నలుగురిని ఉంచారు. నల్లులు ఉండే పరుపు మీద పడుకోవాల్సి వచ్చేది.

మాకు టాయిలెట్ లేదు. ఖాళీ బాటిల్స్‌ను అందుకు ఉపయోగించాల్సి వచ్చేది. అందువల్ల సరిగ్గా బాత్రూంకు వెళ్లే వాళ్లం కాదు.

మూడు వారాల పాటు ఒక బ్రెడ్ ముక్క, నీళ్లతో నెట్టుకొచ్చాను. కాసిన్ని మంచి నీళ్లు ఇవ్వమని వారిని అడుక్కోవాల్సి వచ్చింది.

సెల్‌కు ఒక కిటికీ ఉండేది. శీతకాలంలో చలికి విపరీతంగా వణికి పోయే వాళ్లం.

నా పాస్‌పోర్ట్ చెక్ చేసేటప్పుడు నేను గ్రేట్ బ్రిటన్ నుంచి వచ్చాను అని చెప్పగానే నా ముఖం మీద గట్టిగా గుద్దారు.

ఫోన్ కాల్స్ మాట్లాడటానికి లేదా ఇక్కడ అంతా బాగానే ఉందని చెప్పించడానికి మాత్రమే నన్ను బయటకు తీసుకెళ్లేవారు' అని ఏడెన్ వివరించారు.

వీడియో క్యాప్షన్, రష్యన్లను కీయెవ్ శివార్లలో అడ్డుకున్న తర్వాత యుక్రేనియన్లు పెద్ద విజయాన్ని సాధించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)