ఏ.కోడూరు MPPS: ఒకే పాఠశాలకు తండ్రి, కొడుకు, మనవడు.. మూడు తరాల ప్రభుత్వ స్కూల్ ఇదీ

ఏ.కోడూరు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

60ఏళ్ల మల్లేశ్వరరావు కుమారుడు 33 ఏళ్ల ప్రవీణ్, అతడి కుమారుడు 7ఏళ్ల అనిరుధ్. మూడు తరాలకు ప్రతినిధులైన ఈ ముగ్గురు రోజూ అనకాపల్లి జిల్లా ఏ.కోడూరులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు వెళ్లి వస్తుంటారు.

ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లేశ్వరరావు. ప్రవీణ్ ఆ పాఠశాలలోనే టీచర్. అనిరుధ్ అదే పాఠశాలలో స్టూడెంట్.

ఇలా ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల ప్రతినిధులైన తాత, కొడుకు, మనవడు ఒకే పాఠశాలకు వెళ్లడం చాలా అరుదు.

అనిరుధ్ ప్రస్తుతం రెండో తరగతి చదువుతుంటే, అతడి తండ్రి ప్రవీణ్, తాత మల్లేశ్వరరావులు కూడా ఈ పాఠశాల పూర్వ విద్యార్థులే.

ఏ.కోడూరు

మూడు తరాలు ఒకే పాఠశాలలో... ఎలా?

పాఠశాలైనా, ఆఫీసైనా, మరేదైనా మూడు తరాలకు చెందిన వారు ఒకే చోటకు రోజూ వెళ్లి, రావడం కాస్త అరుదైన విషయమే. అందులోనూ తాత, కొడుకు, మనవడు ఇలా ఒకే కుటుంబానికి చెందిన వారు కలిసి వెళ్లి, రావడం ఇంకొచెం అరుదు.

ఈ విషయం తమకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందని, ఊర్లో కూడా చాలా మంది తమ కోసం మాట్లాడుకుంటారని బీబీసీతో మల్లేశ్వరరావు చెప్పారు.

“కొన్నిచోట్ల అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, భార్యభార్తలు ఒకే దగ్గర పని చేయడం కనిపిస్తుంది. కానీ తాత, కుమారుడు, మనవడు ఒకే చోటుకు రోజూ వెళ్లడం ఆశ్చర్యంగానే ఉంటుంది. అందుకే మా విషయం మాకే కొత్తగా అనిపిస్తుంది. పైగా మా సొంతూరు కూడా ఇదే. నేను 2021లో ఈ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా బదిలీపై వచ్చాను. ఆ తర్వాత కొన్ని రోజులకే నా కుమారుడు ప్రవీణ్ కూడా బదిలీపై ఈ పాఠశాలకే వచ్చాడు. ఆ తర్వాత, కొద్దిరోజులకే మా మనవడు అనిరుధ్‌ను పాఠశాలలో చేర్పించాం. ఎక్కడో ఎందుకు, ఇద్దరం ఇక్కడే ఉన్నాం కదా అని ఇదే స్కూల్లోనే చేర్పించాం. దీంతో ముగ్గురం ఒకే పాఠశాలకు వచ్చిపోతున్నాం” అని మల్లేశ్వరరావు తెలిపారు.

ఏ.కోడూరు

“ఈ పాఠశాలతో మాది ప్రత్యేక అనుబంధం”

1968-1973 వరకు మల్లేశ్వరరావు ఇదే పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. అనంతరం 1986లో ఉపాధ్యాయ వృత్తిలో చేరారు.

ఆయన కుమారుడు ప్రవీణ్ ఈ పాఠశాలలోనే 1994-1999 వరకు చదువుకున్నారు. 2010లో డీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి, ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించారు. ఇక్కడకు రాక ముందు ఇద్దరూ వేర్వేరు పాఠశాలల్లో పని చేసినా, 2021లో జరిగిన బదిలీ ప్రక్రియలో ఇద్దరూ ఏ.కోడూరుకే బదిలీ అయ్యారు.

“మేం బదిలీపై వచ్చిన ఏడాదికే అనిరుధ్‌ను కూడా మా పాఠశాలలోనే చేర్పించాం. ప్రస్తుతం అతడు రెండో తరగతి చదువుతున్నాడు. ముగ్గురం కలిసి ఒకేసారి ఇంటి దగ్గర నుంచి స్కూల్‌కు బయల్దేరి వస్తుంటే.. తెలిసిన వారంతా మా వైపు చూస్తూ, భలే అదృష్టవంతులంటూ కామెంట్ చేస్తుంటారు. అలా విన్నప్పుడల్లా నిజమే కదా అనిపిస్తుంది. నేను, మా నాన్నగారు ఒకే స్కూల్‌కు బదిలీ అవ్వగానే తండ్రి, కొడుకులు ఒకే చోట సూపర్ అనేవారు. తర్వాత మా అబ్బాయి కూడా అక్కడే చేరడంతో... మా ఊరిలో అందరూ దీని గురించి మాట్లాడుకునేవారు. ఏదిఏమైనా ఈ పాఠశాలతో మాకు ప్రత్యేక అనుబంధం ఉంది”అని ప్రవీణ్ బీబీసీతో చెప్పారు.

ఏ.కోడూరు

‘‘మనవడి చేరికతో అందరూ మాట్లాడుకుంటున్నారు’’

‘‘ఏ.కోడూరు గ్రామం మా సొంతూరు కావడంతో ఎక్కడ పనిచేసినా బదిలీ ప్రక్రియలు జరిగేటప్పుడు ఇక్కడికి వస్తే బాగుంటుందని అనిపించేది. నేను, మా అబ్బాయి కూడా ఇతర పాఠశాలల్లో పని చేశాం. అయితే 2021లో జరిగిన బదిలీ ప్రక్రియలో మాకు ఉన్న పాయింట్ల ఆధారంగా ఇద్దరికి సొంతూరైన ఏ.కోడూరు మండల ప్రాథమిక పాఠశాలకే బదిలీ అయ్యాం. తండ్రి, కొడుకులం ఒకే పాఠశాలలో పనిచేయడంతో సంతోషంగా అనిపించింది. ఇప్పుడు మనవడు కూడా చేరడంతో ఊళ్లో చాలా మంది మాట్లాడుకుంటున్నారు’’అని మల్లేశ్వరరావు అన్నారు.

“గత ఏడాది వరకు మా పాఠశాలలో 98 మంది విద్యార్థులతో ఐదో తరగతి వరకు ఉండేది. అయితే ఈ ఏడాది పాఠశాలల విలీనంలో భాగంగా ఇక్కడ ఒకటి, రెండు తరగతులకే పరిమితం చేశారు. ఇప్పుడు ఈ రెండు తరగతులు కలిపి 18 మంది విద్యార్థులున్నారు. వారిలో రెండో తరగతి చదువుతున్న మా మనవడు కూడా ఉన్నాడు. మా తండ్రి, కొడుకులకి బదిలీ కావడం, అదే సమయంలో మా మనవడు కూడా చదువుకునే వయసుకు రావడంతో అతడ్ని కూడా ఇక్కడే చేర్పించాం. ఇదంతా చాలా విచిత్రంగా జరిగింది. కొడుకు, మనవడితో కలిసి స్కూల్‌కు వెళ్లి, రావడం మంచి అనుభూతిని ఇస్తుంది”అని మల్లేశ్వరరావు చెప్పారు.

ఏ.కోడూరు

‘నాన్న ఇచ్చిన వర్క్ తాత చేయిస్తారు’’

పాఠశాలలో నాన్నని సర్ అని పిలుస్తానని అనిరుధ్ చెప్పాడు. ‘‘రోజూ నేను, నాన్న, తాత కలిసి బండి మీద స్కూల్‌కు వెళ్తాం. మళ్లీ సాయంత్రం ముగ్గురం కలిసి తిరిగి వస్తాం. నా ఫ్రెండ్స్ కూడా సర్ అనే పిలుస్తారు. అందుకే నేను కూడా సర్ అనే పిలుస్తా’’అని అనిరుధ్ వివరించాడు.

“స్కూల్‌లో తాతయ్య నాకు పాఠాలు చెప్పరు. నాన్నే మాత్రమే చెప్తారు. తాతయ్య మరో తరగతి గదిలో పాఠాలు చెప్తారు. పిల్లలతో నాన్న పాటలు కూడా పాడిస్తారు. ఒక్కోసారి ఏయ్ అని మందలిస్తారు కూడా. గొడవ చేయవద్దని అంటారు. ఇంటికి వచ్చాక మాత్రం తాత, అమ్మ నాతో హోంవర్క్ చేయిస్తారు. అది పూర్తయ్యాక నాన్న నాతో ఆడుకుంటారు. ఉదయం లేవగానే మళ్లీ నాన్న, నేను, తాత స్కూల్‌కు బండి మీద వెళ్తాం” అని అనిరుధ్ చెప్పాడు.

ఏ.కోడూరు

‘తండ్రి, కొడుకే కాదు.. కోడలు కూడా..’

మల్లేశ్వరరావు ఇంట్లో మరో విశేషం కూడా ఉంది. మల్లేశ్వరరావు, అతడి కుమారుడు ప్రవీణ్ కుటుంబం కలిసే ఉంటుంది. ప్రవీణ్ భార్య మల్లీశ్వరి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలే. ఆమె కోటపాడు మండలంలోని మరో ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్నారు.

“ఇలా ఒకే ఇంట్లో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులం ఉండటంతో మమ్మల్ని కొందరు టీచర్స్ ఫ్యామిలీ అంటారు. అంతా టీచింగ్‌లోనే ఉండటంతో పాఠశాలకు సంబంధించిన మాటలు, పనులు మాకు త్వరగా అర్థమవుతాయి. మా అబ్బాయిని చదువుకోవడానికి రోజూ తాత, తండ్రితోనే పంపిస్తుండటంతో చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలా ఎక్కడో గానీ జరగదు. మూడు తరాలు కలిసి ఒకే ఊరిలో ఉంటేనే అబ్బో అనుకుంటాం. అలాంటిది అంతా కలిసి ఒకే పాఠశాలకు వెళ్లి రావడం అనేది మాకు, చూసే వారికి కూడా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది”అని అనిరుధ్ తల్లి మల్లీశ్వరి బీబీసీతో చెప్పారు.

వీడియో క్యాప్షన్, బాగా చదివి డాక్టర్ కావాలనుకుంటోన్న ప్రియాంశు కుమారి

‘ఈ మ్యాజిక్ అందరికి జరగకపోవచ్చు’

తండ్రీ, కొడుకులం ఒకే పాఠశాలకు బదిలీ కావడం, అదే సమయంలో తమ అబ్బాయిని కూడా ఇదే పాఠశాలలో చేర్పించడం ఒక మ్యాజిక్ లాంటిదని ప్రవీణ్ అన్నారు. ‘‘అందరికీ ఇలా కుదరకపోవచ్చు. నాకు మా నాన్నగారితో కలిసి పని చేయడం, అక్కడే నా కుమారుడికి పాఠాలు చెప్పడం చాలా మంచి అనుభవం”అని ఆయన అన్నారు.

“పాఠశాలకు సంబంధించిన విషయాలేవైనా ప్రధానోపాధ్యాయులైన మా నాన్నగారికి రిపోర్ట్ చేయడం, ఆయన సూచనల మేరకు తరగతులు చెప్పడం, స్కూల్ నిర్వహణలో పాలు పంచుకోవడం, అలాగే నా కుమారుడికి నేనే పాఠాలు చెప్పడం, పాఠశాల ముగిసిపోగానే అంతా కలిసి ఇంటికి రావడం... అంతా బాగుంటుంది. కొన్నిసార్లు మా అబ్బాయి ఇంట్లో కూడా నన్ను సర్ అని, పాఠశాలలో నాన్న అని పిలుస్తుంటాడు. ఇది కూడా సరదాగానే అనిపిస్తుంది. మొత్తానికి మూడు జనరేషన్స్ కలిసి ఒకే పాఠశాలకు వెళ్లి రావడం ఒక మ్యాజిక్‌లా అనిపిస్తుంది” అని ప్రవీణ్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, విజయనగరం: ఆటపాటలు, బుర్రకథలతో సోషల్ పాఠాలు చెబుతున్న టీచర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)