మొబైల్ ఫోన్‌లో హాని కలిగించే కంటెంట్ నుంచి మీ పిల్లలను దూరంగా ఉంచడం ఎలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పూర్ణిమ తమ్మిరెడ్డి
- హోదా, బీబీసీ కోసం
ప్రస్తుతం పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడం చాలా కష్టమైపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా పిల్లలందరూ మొబైల్‍ని వాడుతున్నారు.
ఆన్‍లైన్ క్లాసుల కోసం... నోట్స్ కోసం, స్కూలుకి, బయటకి వెళ్ళినప్పుడు పెద్దలకు అందుబాటులో ఉండటానికి పిల్లలు, మొబైల్ ఉపయోగించడం తప్పనిసరిగా మారింది.
పెద్దలు వాడే సెట్టింగ్స్‌తోనే పిల్లలకు మొబైల్స్ ఇచ్చేస్తే కొన్ని అనర్థాలకు దారి తీయొచ్చు. ముఖ్యంగా ఆప్/ప్లే స్టోర్ నుంచి ఏదైనా డౌన్‌లోడ్ చేయడం మొదలుపెడితే డబ్బుపరంగా, భద్రతపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే పిల్లలకు ఇచ్చే మొబైల్ ఫోన్లలో కొన్ని అదనపు సెట్టింగ్స్ చేసి ఇవ్వాలి. ఆ సెట్టింగ్స్ హాని కలిగించే ఆప్స్/కంటెంట్ నుంచి పిల్లలను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్లే స్టోర్ సెట్టింగ్స్
ప్లే స్టోర్‌లో ఉండే అన్ని ఆప్స్‌కి ఏజ్ కేటగిరీ ఉంటుంది. అంటే, ఏ వయసువారికి ఏ ఆప్ సరిపోతుందో సూచించే డేటా అన్నమాట. దీన్ని ఆధారంగా చేసుకుని పిల్లల వయసుని బట్టి వారికి కొన్ని ఆప్స్‌ను మాత్రమే అందుబాటులో ఉంచి, మిగిలిన వాటిని దూరంగా ఉంచవచ్చు. దీని కోసం ఆండ్రాయిడ్ ఫోన్లలో కొన్ని సెట్టింగ్స్ అందుబాటులో ఉన్నాయి.
- ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేయండి.
- పైన కుడి వైపున ఉన్న "ప్రొఫైల్ ఐకాన్" పైన నొక్కండి.
- తర్వాత సెట్టింగ్స్ (Settings)ను ఓపెన్ చేయండి.
- సెట్టింగ్స్‌లో "Family" అనే ఆప్షన్‌ను క్లిక్ చేస్తే మరికొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది.
- వాటిలో "Parental Control" సెలెక్ట్ చేయాలి.
- ఇది అన్ని కొత్త ఫోన్లలో డిఫాల్ట్‌గా ఆఫ్ చేసి ఉంటుంది. దాన్ని ఆన్ చేయాలి.
- ఆన్ చేయగానే, పిన్ సెట్ చేయమని కోరుతుంది. ఇకపై ఈ కేటగిరీలో ఏవైనా మార్పులు చేయాలి అనుకుంటే ఈ పిన్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అందుకే మీకు మాత్రమే తెలిసిన (పిల్లలకు తెలిసే అవకాశం లేని) పిన్ ఇవ్వండి.
- పిన్ సరిగ్గా ఎంటర్ చేసిన తర్వాత "Apps & Games" , "Films" అని రెండు ఆప్షన్స్ హైలైట్ అవుతాయి.
- "Apps & Games" పైన క్లిక్ చేసి, ఏ వయసు వరకూ ఆప్స్/గేమ్స్‌ని పరిమితం చేయాలనుకుంటున్నారో అక్కడి వరకూ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి.
- ఉదా: మీరు ఏడేళ్ళ వరకు పరిమితం చేస్తే, మీ పిల్లలు ఆప్స్ కోసం వెదికినప్పుడు ఆ వయస్సు కేటగిరీకి సంబంధించిన ఆప్స్ మాత్రమే కనిపిస్తాయి. అంతకన్నా ఎక్కువ వయసున్న వారి కోసం రూపొందించిన ఆప్స్ వారికి కనిపించవు. "Films"ని కూడా ఈ విధంగానే వయసు/కంటెంట్ ప్రకారం సెట్ చేసుకోవచ్చు.
- కావాల్సినప్పుడల్లా వయస్సు కేటగిరీలను మార్చాలనుకుంటే Step 7 లో సెట్ చేసిన పిన్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, PRASHANTI ASWANI
గూగుల్ ఫ్యామిలీ లింక్ ఆప్‌తో కూడా
"గూగుల్ ఫ్యామిలీ లింక్" అనే ఆప్ ద్వారా కూడా పిల్లల ఫోన్ వాడకాన్ని పర్యవేక్షించవచ్చు. వాళ్ళ ఫోనులో స్క్రీన్ టైమ్‌ని, ఆప్స్ వాడే విధానాన్ని మీరు నియంత్రించవచ్చు.
మీ పిల్లల ఫోన్లలో కొన్ని రకాల ఆప్స్ డౌన్‌లోడ్ కాకూడదు అనుకుంటే, ఈ కింది చర్యలు తీసుకోండి.
- ఫోనులో "Google Family Link" లేకపోతే, ప్లే స్టోర్కి వెళ్ళి ఈ ఆప్‍ను డౌన్‌లోడ్ చేయాలి. (గమనిక: డౌన్‌లోడ్ చేసుకునే ముందు అది గూగుల్‌కు చెందినదా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. పేరున్న సంస్థల ఆప్స్‌కు నకిలీ రూపాలు చాలా త్వరగా వస్తుంటాయి. అందుకే జాగ్రత్త వహించాలి.
- ఆప్ ఇన్‍స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి అందులో మీ పిల్లల అకౌంట్‍ను జత చేయాలి.
- ఒకసారి అకౌంట్‌ను జత చేశాక, మీ పిల్లల ప్రొఫైల్‍కు వెళ్ళి "Manage Settings" మీద నొక్కాలి.
- సెట్టింగ్స్‌లో "మేనేజ్" అని ఉన్న దగ్గర నొక్కితే "గూగుల్ ప్లే స్టోర్" ఎన్నుకునే అవకాశాన్నిస్తుంది.
- ఇందులో "Apps and Games" సెక్షన్‍లో వయస్సు వారీగా పరిమితులు పెట్టుకోవచ్చు.
- చేసిన మార్పులన్నీ సేవ్ చేయాలి.
ఆ తర్వాత, ప్లే స్టోర్కి వెళ్ళి మీ పిల్లలు ఏవైనా ఆప్స్ కోసం వెదికితే, తమ వయసుకి సంబంధించినవే కనిపిస్తాయి. పిల్లల ఫోనులోని ప్లే స్టోర్‌లో మార్పులు చేసేకన్నా (పై సెక్షన్‍లో చెప్పుకున్నట్టు), ఇది మెరుగైన ఆప్షన్. ఎందుకంటే, సెట్టింగ్స్ ఎప్పుడూ మీ ఫోను నుంచి చేయవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
యాప్స్ కనిపించకుండా ఎలా చేయాలంటే...
ఈ మధ్య ఫోన్ కొనగానే బోలెడన్ని ఆప్స్ ప్రీ-ఇన్‍స్టాల్ అయిపోతున్నాయి. ఫోన్‍కు కొత్త అప్‍డేట్ వచ్చిన ప్రతీసారి ఫోన్ మోడల్, కంపెనీని బట్టి మనం వేయని ఆప్స్ కూడా కనిపిస్తుంటాయి.
పిల్లలు వాళ్లంతట వాళ్ళు డౌన్‌లోడ్ చేయకపోయినా, ఇలా తమ ప్రమేయం లేకుండా వచ్చే ఆప్స్‌ని వాడే అవకాశాలు ఉంటాయి.
ఈ బెడద నుంచి తప్పించుకోడానికి ఫోన్లపై ఆప్స్ కనిపించకుండా సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
దాని కోసం ఏం చేయాలంటే...
- ఫోన్ సెట్టింగ్స్‌కు వెళ్ళండి
- సెట్టింగ్స్‌లో Home Screen అని కనిపిస్తుంది. అందులో Hidden Apps అనే ఆప్షన్ ఉంటుంది.
- లేకపోతే, సెట్టింగ్స్ సెర్చ్ బార్‌లో Hidden Apps అని వెదకాలి.
- ఈ సెట్టింగ్‍కు చేరుకున్నాక, అది ఏ ఆప్‌లను దాచిపెట్టాలో అడుగుతుంది. పిల్లలకు అందుబాటులో ఉండకూడదనుకున్న ఆప్స్‌ని ఎంచుకొని సేవ్ చేయండి.
అంతే, మీరు వద్దనుకున్న ఆప్స్ ఆ ఫోన్ "Home Screen"లో కనిపించవు. కనిపించకపోతే వాడే అవకాశం కూడా ఉండదు.

ఇలా ముందస్తు జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నప్పటికీ, పిల్లలను ఓ కంట కనిపెడుతూనే ఉండాలి.
ఫోన్‌లో కొన్ని సెట్టింగులను నియంత్రించినంత మాత్రానా ఇక అంతా బాగుంటుందిలే అని అనుకోకూడదు. సైబర్ సెక్యూరిటీ విషయంలో ఒక తలుపుకి గట్టిగా తాళాలు వేస్తే ఇంకో కిటికీనో, తలుపునో తెరుచుకోడానికి ఎక్కువ సమయమేం పట్టదు. కాబట్టి, పిల్లల ఫోన్లలో ఈ సెట్టింగ్స్ చేసి ఊరుకోకుండా ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
1. "గూగుల్ ఫ్యామిలీ లింక్" లేదా అలాంటి ఫీచర్స్ ఉన్న ఇతర ఆప్స్‌తో పిల్లలను పర్యవేక్షించాలి. వారు ఏ తరహా ఆప్‌లు వాడుతున్నారు? ఎంతసేపు వాడుతున్నారో కనిపెట్టుకుని ఉండాలి.
2. పిల్లలతో పాటు కూర్చొని వాళ్ళు ఎలాంటి ఆప్స్ వాడుతున్నారు, అందులో ఏమేం చూస్తున్నారు వంటి విషయాలు కనుక్కుంటూ ఉండాలి.
3. మొబైల్ ఫోన్/ల్యాప్ టాప్/టచ్ పాడ్ వంటివి ఆట వస్తువులు కావు. వాటితో ఎంత లాభమో, అంత నష్టం కూడా. అందుకని జాగ్రత్తగా ఉండాలని పిల్లలకి చెప్తూ ఉండాలి. దీనివల్ల ఏదైనా అనుకోకుండా డౌన్‌లోడ్ చేసుకున్నా బెదరకుండా వెంటనే పెద్దలకి చెప్పే అవకాశం పిల్లలకు ఇచ్చినట్టు ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- Deepfake: ‘నా ముఖాన్ని మార్ఫింగ్ చేసి సెక్స్ వీడియోలలో వాడారు’
- చైనా: కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ నుంచి మాజీ అధ్యక్షుడిని బలవంతంగా బయటకు పంపించారు... కలకలం రేపుతున్న వీడియో
- తిరుమల: రక్తదానంతో ప్రత్యేక ఉచిత దర్శనం, 1985 నుంచి ఉన్న ఈ పథకం గురించి మీకు తెలుసా?
- మహిళలపై ఆర్ఎస్ఎస్ వైఖరి మారుతోందా... బీజేపీకి ఓట్ల కోసమే అలా చేస్తున్నారా?
- పవన్ కల్యాణ్ జనసేన దారేది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












