ఆంధ్రప్రదేశ్: పవన్ కల్యాణ్ జనసేన దారేది?

పుస్తకంతో పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, facebook/janasenaparty

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తాను- ఆరు నెలల క్రితం జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కల్యాణ్‌.

వైఎస్సార్సీపీ విముక్త పాలనే లక్ష్యం- విశాఖ పరిణామాల తర్వాత జనసేన అధినేత.

ఈ ప్రకటనలతో జనసేన రాజకీయ పయనం ఖరారయ్యింది. అధికార వైఎస్సార్సీపీని ఓడించడమే ఆపార్టీ లక్ష్యం. అందుకు అనుగుణంగా అందరినీ కలుపుకుని, ముందుకు సాగే లక్ష్యంతో పవన్ కల్యాణ్ ఉన్నారు. అయితే ఆయన ఎవరితో కలుస్తారన్నది అధికారికంగా ధ్రువీకరించలేదు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, ఈలోగా ఉమ్మడిగా అన్ని పార్టీలు కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసి సాగాలని టీడీపీ, జనసేన అధినేతలు ఉమ్మడి నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నికల్లో కూడా ఇరు పార్టీలు మరోసారి ఉమ్మడి పోరాటానికి సిద్ధమవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో బీజేపీలో ఈ పరిణామాలు వేడి పుట్టించాయి. ముఖ్యంగా ఆపార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన విమర్శలతో ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజుకి సెగ తగిలింది. ఆపార్టీ అధిష్టానం జోక్యం చేసుకుంది.

జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని ఆపార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ ప్రకటించారు. అదే సమయంలో వీర్రాజు తీరుతో అసంతృప్తిగా ఉన్న వారు బహిరంగ ప్రకటనలు చేయకుండా అధిష్టానం ఆదేశాలు ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి.

జనసేన పయనం ఎటూ అన్నది కీలకాంశంగా మారింది. ఒంటరిగా పోటీ చేయబోమని పవన్ సంకేతాలు ఇచ్చేసిన తరుణంలో ప్రస్తుతం ఆపార్టీకి మూడు దారులు కనిపిస్తున్నాయి.

  • ఒకటి టీడీపీతో కలిసి సాగడం.
  • రెండోది టీడీపీ, బీజేపీతో కలిసి 2014 నాటి కూటమి పునరావృతం చేయడం.
  • మూడోది బీజేపీయేతర విపక్షాలతో ముందుకు వెళ్లడం.

ఈ మూడింటిలో జనసేన ఏది అనుసరిస్తే ఏమవుతుందన్నది చూద్దాం.

పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు, నాదెండ్ల మనోహర్

ఫొటో సోర్స్, facebook/janasenaparty

స్థానిక ఎన్నికలతో మొదలు..

ఆంధ్రప్రదేశ్ విభజన నిర్ణయం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో జనసేన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంది. టీడీపీ- బీజేపీ కూటమికి మద్ధతు పలికింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత కాలంపాటు నాటి ప్రభుత్వాధినేతతో సన్నిహితంగానే ఉన్నారు.

2018 నాటికి రాష్ట్రంలో మారిన పరిణామాలతో బీజేపీకి టీడీపీ దూరమైంది. టీడీపీ తీరుపై పవన్ కల్యాణ్‌ తిరగబడ్డారు. తదుపరి 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ ఒంటరిగా బరిలో దిగాయి.

జనసేన మాత్రం వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో విడివిడిగా బరిలో దిగిన ఈ పార్టీలన్నీ ఘోర పరాభవం చవిచూడగా ఎన్నికల తర్వాత బీజేపీతో మరోసారి జనసేన జతగట్టింది.

2021లో జరిగిన స్థానిక ఎన్నికల్లో మరోసారి ఈ పార్టీలన్నీ కొన్ని చోట్ల ఉమ్మడిగా బరిలో దిగాయి. బహిరంగంగానే కలిసి పనిచేసి కొంత ఫలితాన్ని సాధించాయి. కానీ స్థానిక ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ సంపూర్ణ ఆధిక్యాన్ని దక్కించుకుంది.

విశాఖ పరిణామాలతో ఊతం...

అమరావతి రైతుల సమస్య సహా అనేక విషయాల్లో టీడీపీ, జనసేన ఒకే రీతిలో వ్యవహరిస్తున్నాయి. అమరావతి పరిక్షణ కోసమే తాము బీజేపీతో చేతులు కలుపుతున్నామని 2020లో పవన్ కల్యాణ్‌ ప్రకటించారు. ఇరు పార్టీలు కలిసి ప్రకాశం బ్యారేజ్ మీద కవాతు నిర్వహించబోతున్నట్టు తెలిపారు. కానీ ఆ కార్యక్రమం ముందుకు సాగలేదు.

బీజేపీ కూడా అమరావతి ఉద్యమానికి మద్ధతు ప్రకటిస్తోంది. కానీ రాజధాని విషయంలో సందిగ్ధానికి జగన్ తో పాటుగా చంద్రబాబు కూడా కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. ఇరు పార్టీల కారణంగానే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందనేది బీజేపీ వాదన.

పవన్ కల్యాణ్ మాత్రం జగన్ మీద గురిపెట్టారు. మూడు రాజధానుల అంశంలో వైఎస్సార్సీపీని దుయ్యబడుతున్నారు. అందుకు కొనసాగింపుగా విశాఖని పాలనా రాజధానిగా ప్రకటించాలంటూ అధికార పక్షం మద్ధతుతో నిర్వహించిన ప్రజాగర్జన కార్యక్రమం, పవన్ కల్యాణ్‌ జనవాణీ కూడా ఒకే సందర్భంలో నిర్వహించతలబెట్టడం పెద్ద వివాదానికి కారణమయ్యింది.

ఎయిర్ పోర్టులో మంత్రులు, వైసీపీ నేతలపై దాడులకు పాల్పడ్డారంటూ జనసేన కీలక నేతలను అరెస్ట్ చేయడం, పవన్ కల్యాణ్‌ హోటల్ రూమ్ కి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడం వంటి పరిణామాలను పవన్ సీరియస్ గా తీసుకున్నారు. ప్రభుత్వ తీరు మీద, పోలీస్ ఆంక్షల మీద ఘాటు విమర్శలు చేశారు.

పవన్ కల్యాణ్, సోము వీర్రాజు

ఫొటో సోర్స్, facebook/janasenaparty

బీజేపీతో జనసేన బంధం ఉంటుందా...

ముందు అనుకున్న ప్రణాళిక ప్రకారం దసరా నుంచే పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్త యాత్ర చేయాల్సి ఉంది. కానీ తమ యాత్ర వాయిదా వేస్తున్నట్టు ఆ తర్వాత జనసేన తెలిపింది. ఈలోగా జనవాణి నిర్వహణకు విశాఖ వెళ్లిన పవన్ కల్యాణ్ కి ఎదురయిన పరిణామాలతో ఆయన వైఎస్సార్సీపీ నేతల మీద తీవ్రపదజాలంతో విమర్శలు గుప్పించారు. ఇక తాడోపేడో తేల్చుకుంటామని తేల్చిచెప్పారు. యుద్ధం మొదలయ్యిందంటూ ప్రకటించారు.

కొనసాగింపుగా తొలుత సోము వీర్రాజు, ఆ మరునాడు చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ వరుస సమావేశాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపునకు దోహదపడుతున్నట్టు అంచనాలు పెరిగాయి. ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణకు టీడీపీతో కలిసి సాగుతామని, ఇతర పార్టీలను కూడా కలుపుకుని పోరాడుతామని పవన్ ప్రకటించడంతో టీడీపీ, జనసేన కూటమి అంటూ ఊహాగానాలు విస్తృతమయ్యాయి. అదే సమయంలో బీజేపీ భవితవ్యం చుట్టూ చర్చలు సాగుతున్నాయి.

జనసేన తమతో కలిసి ఉంటుందని బీజేపీ నేతలు ప్రకటిస్తున్నప్పటికీ తనకు బీజేపీ అంటే గౌరవం ఉన్నప్పటికీ ఊడిగం చేయలేనని పవన్ తేల్చిచెప్పేశారు. ముఖ్యంగా రోడ్డు మ్యాప్ ఇవ్వమని అడిగితే బీజేపీ ముందుకు రాలేదన్నారు. సంపూర్ణంగా కలిసి పనిచేయలేకపోతున్నామని, ఆ సమస్యలన్నీ బీజేపీ రాష్ట్ర నేతలకు కూడా తెలుసంటూ పవన్ పేర్కొనడంతో బీజేపీ తో బంధం మీద ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అదే సమయంలో పవన్‌తో సమన్వయం చేసుకోవడంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం విఫలమైందంటూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ చేసిన ప్రకటనతో బీజేపీ, జనసేన బంధం సజావుగా లేదనే విషయం స్పష్టమైంది.

వీడియో క్యాప్షన్, పవన్ కల్యాణ్: కమ్యూనిస్టు ఆదర్శాలు.. కాషాయ రోడ్ మ్యాప్.. జనసేన దారెటు?

టీడీపీతో జనసేన కలిస్తే ఏం జరుగుతుంది?

టీడీపీ, బీజేపీలు కలిసి పోటీ చేయగా జనసేన మద్ధతుతో 2014లో అధికారాన్ని దక్కించుకున్నాయి. అదే రీతిలో మూడు పార్టీలు ఏకంగా 2024లో కూడా బరిలో దిగాలనే అంచనాతో టీడీపీ, జనసేన అధినేతలున్నట్టు కనిపిస్తోందని రాజకీయ వ్యాఖ్యాత తెలకపల్లి రవి అంటున్నారు.

2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడిగా పోటీ చేసి టీడీపీ 23 సీట్లకు పరిమితం కాగా, జనసేన కేవలం ఒకే ఒక్క స్థానం దక్కించుకుంది. గెలిచిన స్వల్పకాలంలోనే జనసేన ఏకైక ఎమ్మెల్యే , రాజోలు నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ కూడా జగన్ కి జై కొట్టేశారు. దాంతో అసెంబ్లీలో బోణీ కొట్టినప్పటికీ జనసేన వాణీ వినిపించే అవకాశం లేకుండా పోయింది.

2019 ఎన్నికల ఫలితాలను బట్టి, టీడీపీ, జనసేనకు కలిపి లభించిన ఓట్ల ఆధారంగా చూస్తే ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆధిక్యం సాధించేందుకు అవకాశం ఉంటుంది.

  • భీమిలి
  • యలమంచిలి
  • పిఠాపురం
  • కాకినాడ రూరల్
  • రామచంద్రాపురం
  • ముమ్మిడివరం
  • అమలాపురం
  • పి గన్నవరం
  • కొత్తపేట
  • నరసాపురం
  • భీమవరం
  • తణుకు
  • తాడేపల్లిగూడెం
  • ఏలూరు
  • పెడన
  • మచిలీపట్నం
  • అవనిగడ్డ
  • విజయవాడ వెస్ట్
  • విజయవాడ సెంట్రల్
  • మంగళగిరి
  • పొన్నూరు
  • వేమూరు
  • తెనాలి
  • తిరుపతి

వీటిలో ఒక్క తిరుపతి మినహాయిస్తే విశాఖ, గుంటూరు జిల్లాల మధ్య ఉన్న ప్రాంతాల్లోనే ఇరుపార్టీల పొత్తు ప్రభావం ఎక్కువగా ఉంటుందని గత ఎన్నికల ఫలితాలు చాటుతున్నాయి.

అప్పట్లో నరసాపురం, భీమవరం, అమలాపురం వంటి నియోజకవర్గాల్లో టీడీపీ కన్నా జనసేనకే ఎక్కువ ఓట్లు లభించడం గమనార్హం. ఆ ఎన్నికల్లో జనసేన మద్ధతుతో విజయవాడ సెంట్రల్ సీటు నుంచి సీపీఎం, మంగళగిరి నుంచి సీపీఐ అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారికి లభించిన ఓట్లు నారా లోకేశ్ వంటి టీడీపీ అభ్యర్థుల విజయవకాశాలను దెబ్బతీసినట్టు లెక్కలు చెబుతున్నాయి.

"రాజకీయాల్లో లెక్కులు టూ ప్లస్ టూ అంటూ ఫోర్ అన్నట్టుగా ఉండవు. అది ఆరు కావచ్చు.. రెండుగానే మిగలవచ్చు. ఇరు పార్టీల మధ్య ఓట్లు ఏ రీతిలో బదలాయింపు జరుగుతుందన్నది కీలకాంశం. అంతేగాకుండా అంతకుముందు జరిగిన ఎన్నికలకు, ఇప్పటి ఎన్నికలకు మధ్య ప్రాధాన్యాంశాలు చాలా తేడా ఉంటాయి. కాబట్టి విపక్షాల కలయిక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కాపాడేందుకు ఉపకరిస్తుంది గానీ పూర్తి సానుకూల ఫలితాలను ఇస్తుందా లేదా అన్నది చెప్పలేం. కానీ ఏపీలో టీడీపీ, జనసేన కలయిక ఖచ్చితంగా రాజకీయ ప్రభావిత అంశాల్లో కీలకంగా ఉంటుందనడంలో సందేహం లేదు" అంటూ తెలకపల్లి రవి అభిప్రాయపడ్డారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: రాజకీయాలను ఇంకెంత దిగజారుస్తారు? -వీక్లీ షో విత్ జీఎస్

బీజేపీ పాత్ర ఏమిటి..

జనసేనతో తమ బంధం కొనసాగుతుందని, టీడీపీతో పొత్తుకి తాము సిద్ధంగా లేమని తాజాగా బీజేపీ నేతలు ప్రకటించారు. అంతకుముందే బీజేపీతో తమ బంధం సజావుగా లేదనే ప్రకటన జనసేన అధినేత నుంచి వచ్చింది. దాంతో జనసేన, బీజేపీ మధ్య బ్రేకప్ విషయంలో చెరో రీతిలో స్పందించినట్టు స్పష్టమవుతోంది.

జనసేన పూర్తిగా బీజేపీని వీడి టీడీపీ తో చేతులు కలుపుతుందా లేక పవన్ కి తమ అధిష్టానం నుంచి రోడ్డు మ్యాప్ వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించిన నేపథ్యంలో పవన్ ఆశిస్తున్నట్టు విపక్ష కూటమికి కమలనాథులు సిద్ధమవుతారా అన్నది చూడాలి.

2019 ఎన్నికల్లో జనసేనకి అత్యధికంగా నాటి తూర్పు గోదావరి జిల్లాలో 14.84 శాతం ఓట్లు దక్కాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 11.68 శాతం ఓట్లు లభించాయి. కడప జిల్లాలో అత్యల్పంగా 1.45 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి.

అందులో జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో 0.7 శాతం ఓట్లు మాత్రమే జనసేన అభ్యర్థికి లభించాయి.

బీజేపీకి ఉమ్మడి విశాఖ జిల్లాలో 2.08 శాతం, విజయనగరం జిల్లాలో 1.26 శాతం, నెల్లూరు జిల్లాలో 1.06 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. మిగిలిన జిల్లాల్లో ఒక్క శాతం లోపు మాత్రమే బీజేపీకి ఆదరణ లభించింది. అత్యల్పంగా అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో దక్కాయి.

లెఫ్ట్, బీఎస్పీ తో కలిసి బరిలో దిగిన జనసేన అభ్యర్థులకి గడిచిన ఎన్నికల్లో 5.53 శాతం ఓట్లు లభించాయి. బీజేపీకి కేవలం 0.84 శాతం ఓట్లు పడ్డాయి. దాంతో ఈ రెండు పార్టీలు మాత్రమే ఐక్యంగా పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనేది ప్రశ్నార్థకంగా ఉంది.

"ఏపీలో బీజేపీ బలపడిన దాఖలాలు లేవు. కానీ జనసేనకి కొంత ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా రోడ్లు, కౌలుదారులు వంటి సమస్యలపై పవన్ చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాన్నిస్తున్నాయి. ఆపార్టీ ఓటింగ్ కొంత పెరిగే అవకాశం ఉంది. కోస్తా ప్రాంతం వరకూ ఆదరణ ఉంటుంది. గడిచిన ఎన్నికల్లో కాపుల్లో కొంత ఓటింగ్ వైఎస్సార్సీపీ వైపు మళ్లింది. కానీ ఈసారి అది ఎంతవరకూ నిలబెట్టుకోగలదన్నది కీలకం. దాంతో పవన్ కి సొంత కులస్తుల్లో కొంత ఓట్లు పెరిగే అవకాశం ఉందని స్థానిక ఎన్నికల్లో కూడా స్పష్టమవయ్యింది. ప్రభుత్వ వ్యతిరేకత కూడా కలిసి వస్తుంది.ఎంత వరకూ జనసేన సొమ్ము చేసుకుంటుందన్న దానిపై తుది ఫలితాలుంటాయి " అంటూ సీనియర్ జర్నలిస్ట్ విజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

బీజేపీ కలిసి రాకపోతే..

రాష్ట్రంలో అధికార వైఎస్సార్సీపీతో పాటుగా, ప్రధాన ప్రతిపక్షం టీడీపీని కూడా బీజేపీ సమానంగా చూస్తోంది. ఇరు పక్షాలను వ్యతిరేకిస్తోంది. దాంతో పవన్ కళ్యాణ్‌ ఆశించినట్టుగా బీజేపీ, టీడీపీతో కలిసి సాగాలనే ప్రయత్నం ఫలిస్తుందా లేదా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకం.

ఎన్నికల నాటికి పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో నిర్వహించే ఉమ్మడి కార్యాచరణకు కూడా బీజేపీ కలిసి వస్తుందా లేదా అన్నది కీలకాంశం. ఇప్పటికే అమరావతి పాదయాత్రకు టీడీపీతో కలిసి బీజేపీ సంఘీభావంగా నడుస్తోంది. కాబట్టి పవన్, చంద్రబాబు నిర్ణయించిన కార్యక్రమంలో కూడా పాల్గొంటుందా లేదా అన్నది చూడాలి.

బీజేపీ లేని కూటమి అయితే తాము సిద్ధంగా ఉన్నామని సీపీఐ, సీపీఎం ఇప్పటికే ప్రకటించాయి. ఇక కాంగ్రెస్, బీఎస్పీ, లోక్ సత్తా వంటి పక్షాల నిర్ణయం ఎలా ఉంటుందన్నది చూడాలి. ఆయా పార్టీలను కలుపుకునేందుకు టీడీపీ, జనసేన అధినేతలు సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది కూడా కీలకమే.

"రాష్ట్రంలో బీజేపీయేతర ప్రతిపక్షాలు ఒకే వేదిక మీదకు వచ్చే అవకాశం కూడా ఉంది. తెలుగుదేశం, సీపీఐ కలిసి మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేశాయి. వారికి కొన్ని చోట్ల జనసేన కూడా మద్ధతునిచ్చింది. కాబట్టి దానిని కొనసాగించే అవకాశం లేకపోలేదు. బీజేపీ ముందుకు రాకపోతే రెండు కమ్యూనిస్టు పార్టీలతో పాటు ఇరతులను కూడా కలుపుకుని పోయే ప్రయత్నం జరగవచ్చు. బీజేపీ మనసు మార్చుకుంటే మాత్రం మళ్లీ పాత మిత్రుల కూటమి ఖాయమవుతుంది. ఏదయినా జరగవచ్చు. పవన్ ఆశించినట్టు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడగలరా లేదా అన్నది కీలకం" ఐ ప్యాక్ సంస్థలో పనిచేసిన ఎం రామకృష్ణ అభిప్రాయపడ్డారు.

టీడీపీ, జనసేన దాదాపుగా ఉమ్మడి పయనం ప్రారంభించినట్టేనని, వారితో కలిసే పార్టీలు ఎవరన్నదే తేలాలని ఆయన బీబీసీతో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)