'ఓరి దేవుడా' మూవీ రివ్యూ: బెస్ట్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుంటే ఏమ‌వుతుంది?

ఓరి దేవుడా

ఫొటో సోర్స్, PVPCINEMA

ఫొటో క్యాప్షన్, ఓరి దేవుడా మూవీ స్టిల్
    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

ఉన్న‌ది ఒక్క‌టే జీవితం. రెండో ఛాన్స్ లేదు. ఆఖ‌రికి దేవుడే దిగి వ‌చ్చినా మ‌న‌కు సెకండ్ ఛాన్స్ ఇవ్వ‌లేడు. చేసిన త‌ప్పుల్ని ఇక్క‌డే స‌రిదిద్దుకొని, మ‌నుషుల్ని అర్థం చేసుకొంటూ మ‌న జీవితాన్ని మ‌న‌మే కొత్త‌గా మ‌ల‌చుకోవాలి.. ఇలాంటి కొటేష‌న్లు పుస్త‌కాల్లో చ‌దువుకోవ‌డానికి బాగుంటాయి. కానీ సినిమాగా తీస్తామంటే కుద‌ర‌దు. బోరింగ్ అనిపిస్తుంది. చాద‌స్తంలా తోస్తుంది. కానీ, దాన్నో అంద‌మైన ప్రేమ క‌థ‌గా మ‌ల‌చి, ఫిలాస‌ఫీని కూడా కొత్త ఫ్లేవ‌ర్‌లో చుట్టి ఇచ్చాడు అశ్వ‌త్ మారిమ‌ుత్తు.

త‌మిళంలో 'ఓ మై క‌డ‌వులే' సినిమాతో అంద‌రినీ క‌ట్టిప‌డేశాడు అశ్వ‌త్‌. ఓ ప్రేమ‌క‌థ‌లో ఫ్రెండ్ షిప్‌ని మిక్స్ చేసి, దేవుడ్ని తీసుకొచ్చి ఫిలాస‌ఫీ ట‌చ్ ఇచ్చి మ్యాజిక్ చేశాడు. ఈ ట్రీమ్‌మెంట్ అంద‌రికీ న‌చ్చింది. ఇప్పుడు అదే సినిమాని ఆయ‌న తెలుగులో రీమేక్ చేశారు. `ఓరి దేవుడా`గా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మరి, త‌మిళ‌నాట జ‌రిగిన మ్యాజిక్ తెలుగులోనూ క‌నిపించిందా?

ఓరి దేవుడా

ఫొటో సోర్స్, PVPCINEMA

ముస్త‌ఫా.. ముస్త‌ఫా..

అను పాల్ రాజ్ (మిథిలా పాల్క‌ర్‌), అర్జున్ దుర్గ‌రాజు (విశ్వ‌క్‌సేన్‌) ఇద్ద‌రూ చిన్న‌ప్ప‌టి నుంచీ బెస్ట్ ఫ్రెండ్స్‌. అర్జున్‌పై అనుకి క్ర‌మంగా ప్రేమ పుడుతుంది. 'పెళ్లి చేసుకుంటావా' అని అర్జున్‌ని అడుగుతుంది. అర్జున్‌కి `నో` చెప్ప‌డానికి ఒక్క కార‌ణం కూడా క‌నిపించ‌దు. 'స‌రే' అంటాడు.

ఇంట్లో ఇద్ద‌రికీ పెళ్లి చేసేస్తారు. కానీ, అనులో ఫ్రెండ్‌ని త‌ప్ప‌, భార్య‌ని చూడ‌లేక‌పోతాడు అర్జున్‌. పైగా మావ‌య్య (ముర‌ళీశ‌ర్మ‌) ఆఫీసులో త‌న‌కు ఇష్టంలేని ప‌ని చేయాల్సి వ‌స్తుంటుంది. లైఫ్ చాలా త్వ‌ర‌గా బోర్ కొట్టేస్తుంది. అనుకి అర్జున్‌పై అనుమానం కూడా మొద‌ల‌వుతుంది. దాంతో గొడ‌వ‌లు పెరుగుతాయి. అవి విడాకుల‌కు దారి తీస్తాయి.

అనుని ఎందుకు పెళ్లి చేసుకొన్నాను దేవుడా..? అంటూ అర్జున్ బాధ ప‌డుతున్న త‌రుణంలో, నిజంగానే దేవుడు దిగి వ‌చ్చి అర్జున్‌కి ఓ ప‌రిష్కార మార్గం చూపిస్తాడు. జీవితాన్ని కొత్త‌గా మొద‌లెట్ట‌డానికి సెకండ్ ఛాన్స్ ఇస్తాడు.

ఆ త‌ర‌వాత ఏమైంది? అర్జున్ త‌న త‌ప్పుల్ని స‌రిదిద్దుకొన్నాడా? కొత్త త‌ప్పులేమైనా చేసేశాడా? ఇదంతా తెర‌పై చూడాల్సిందే.

ఇలాంటి ముస్త‌ఫా.. ముస్తాఫా.. లాంటి స్నేహాలు, ఇద్ద‌రు స్నేహితులు ప్రేమికులుగా మార‌డం, ఆ త‌ర‌వాత విడిపోవ‌డం ఇవ‌న్నీ చాలా సినిమాల్లో చూశాం. ఇది కూడా అలాంటి క‌థే. కాక‌పోతే, ఇక్క‌డ మ్యాజిక్ దేవుడు. ఆ పాత్ర‌ని క‌థ‌లోకి తీసుకొచ్చి, క‌థానాయ‌కుడికి సెకండ్ ఛాన్స్ ఇవ్వ‌డం అనే ఫాంట‌సీ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. ఈ పాత క‌థ‌కు కొత్త ఫ్లేవ‌ర్ తీసుకొచ్చింది. సినిమా మొద‌లైన ఇర‌వై నిమిషాల్లోపే అను, అర్జున్‌లు పెళ్లి చేసుకోవ‌డం, కొట్టుకోవ‌డం, విడాకుల వ‌ర‌కూ వ‌చ్చేయ‌డం జ‌రిగిపోతాయి. అక్క‌డ్నుంచి క‌థ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. ఇంట్ర‌వెల్ బ్యాంగ్ స‌ర‌దాగా సాగిపోయి, ద్వితీయార్థంపై క్యూరియాసిటీని పెంచుతుంది.

ఓరి దేవుడా

ఫొటో సోర్స్, PVPCINEMA

'నీకు చెప్పినా అర్థం కాదురా...'

అయితే ఇలాంటి క‌థ‌ల్లో సెకండాఫ్‌ని డీల్ చేయ‌డం చాలా క‌ష్టం. కాస్త ఆద‌మ‌ర‌పుగా ఉంటే రొటీన్ ఎమోష‌న్స్‌లో క‌థ ప‌డి మున‌క‌లు వేస్తుంది. కానీ 'ఓరి దేవుడా' క‌థ‌లో ఉన్న మ్యాజిక్‌.. ఇంట్ర‌వెల్ త‌ర‌వాత మ‌రో ల‌వ్ స్టోరీ మొద‌ల‌వుతుంది. మీరాతో న‌డిచే ల‌వ్ ట్రాక్ ఫ్రెష్‌గా అనిపిస్తుంది. దాంతో ఒకే సినిమాలో రెండు ప్రేమ‌క‌థ‌ల్ని చూసే అవ‌కాశం ద‌క్కుతుంది.

క‌థానాయిక పాత్ర‌లను ద‌ర్శ‌కుడు చాలా డీసెంట్ గా రాసుకున్నాడు. ఈ రెండు పాత్ర‌లూ మెచ్యూరిటీ చూపిస్తుంటాయి. మీరా పాత్ర హుందాగా ప్ర‌వ‌ర్తిస్తుంటుంది. అర్జున్ - మీరాల మ‌ధ్య రెండేళ్ల వ‌య‌సు తేడా ఉంది. అందుకే, అర్జున్ కంటే మీరా పాత్ర డిగ్నిఫైడ్‌గా అనిపిస్తుంది. ఇంత స్ప‌ష్టంగా ఆలోచించి సీన్లు రాసుకోవ‌డం అశ్వ‌త్‌లోని ప్ర‌తిభ‌కు అద్దం ప‌డుతుంది.

చేతిలో ఉన్న వ‌స్తువు విలువ దూర‌మైన‌ప్పుడే తెలుస్తుందంటారు. అలా, తాను దేన్ని దూరం చేసుకొన్నాడో తెలుసుకొన్న త‌ర‌వాత‌, హీరో పాత్ర‌లో వ‌చ్చే మార్పుని ద‌ర్శ‌కుడు తెర‌పై చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఎక్క‌డా ఓవ‌ర్ మెలోడ్రామాలు ఉండ‌వు. స‌న్నివేశాలు, పాత్ర‌ల ప్ర‌వ‌ర్త‌న, మాట‌లూ అన్నీ స‌హ‌జంగానే సాగిపోతాయి. కేర‌ళ ట్రిప్పు, అక్క‌డ వ‌చ్చే సీన్లు కాస్త బోరింగ్‌గా అనిపిస్తాయి. కానీ, ఆ ట్రిప్‌లో కొన్ని కొన్ని మూమెంట్స్‌ని క‌థ‌లో బాగా వాడుకున్నాడు.

దేవుడి ద‌గ్గ‌ర టికెట్ తీసుకోక ముందు.. తీసుకొన్న త‌ర‌వాత‌.. జీవితాన్ని, తాను చూసిన మ‌నుషులను, త‌న ముందు జ‌రిగిన విష‌యాలను చూసే కోణంలో మార్పు వ‌స్తుంది. ఆ మార్పుని అర్థ‌వంతంగా స్క్రీన్ పైకి తీసుకొచ్చాడు ద‌ర్శ‌కుడు.

ప‌తాక స‌న్నివేశాలు ఊహించిన‌ట్టే సాగినా, వాటిని ఫీల్ గుడ్ ఎమోష‌న్‌తో తెరపై పండించిన విధానం ఆక‌ట్టుకుంటుంది.

'నీకు చెప్పినా అర్థం కాదురా..' అని చెప్పిన‌ప్పుడ‌ల్లా ఫ్రెండ్ (వెంక‌ట్ కాక‌మాను) ఇచ్చే రియాక్ష‌న్స్ థియేట‌ర్లో న‌వ్వులు పంచుతాయి. ఓ యూత్ ఫుల్ స్టోరీని చెబుతూ, సినిమా అంతా స‌ర‌దాగా, పెద్ద‌వాళ్లు చూడ్డానికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా క్లీన్ ఇమేజ్‌తో తీయ‌డం ఈ రోజుల్లో అరుదయిపోయింది. ఈ విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌ల అభిరుచిని మెచ్చుకోవాల్సిందే.

వీడియో క్యాప్షన్, ఒకే సినిమాలో రెండు ప్రేమకథలు, మధ్యలో దేవుడి ఎంట్రీ అదే ట్విస్ట్

విశ్వ‌క్ 'షైన్‌'...

విశ్వ‌క్ సేన్‌లోని ఎన‌ర్జీ అంతా ఈసినిమాలో క‌నిపిస్తుంది. ఆ పాత్ర‌లో చాలా షేడ్స్ ఉన్నాయి. అవ‌న్నీ బాగా ప‌లికించాడు విశ్వ‌క్‌. త‌న స్క్రీన్ ప్రెజెన్స్ చాలా నీట్‌గా ఉంది. కాస్ట్యూమ్స్ బాగున్నాయి. `నాకు ఫైట్లు కావాలి... డాన్సులు చేయాలి` అని గీత‌లు గీసుకోక‌పోవ‌డం వ‌ల్ల‌ అర్జున్ పాత్ర‌లో మ‌రింత స‌హ‌జ‌త్వం వ‌చ్చింది. ఈ పాత్ర‌కు ఏం కావాలో అవ‌న్నీ ఇచ్చేశాడు విశ్వ‌క్‌.

పూరి ముందు ఆడిష‌న్స్ ఇస్తున్న‌ప్పుడు నిజంగా విశ్వ‌క్ చ‌ప్ప‌ట్లు కొట్టించే పెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. కొన్ని స‌న్నివేశాల్లో అండ‌ర్ ప్లే చేయాల్సివ‌చ్చిన‌ప్పుడు కూడా బాగానే హ్యాండిల్ చేశాడు.

అను, మీరా పాత్ర‌ల‌కు త‌గిన క‌థానాయిక‌లను ఎంచుకున్నాడు ద‌ర్శ‌కుడు. అక్క‌డే ఈ సినిమాకి పాస్ మార్కులు ప‌డిపోయాయి. పొట్టి నూడిల్స్ అంటూ హీరోయిన్‌ని అందంగా పిలుచుకొంటాడు హీరో. ఆ అమ్మాయి కూడా అలానే ఉంది.

మీరా పాత్ర‌లో క‌నిపించిన ఆషాభ‌ట్ హుందాగా న‌టించింది. అర్జున్‌కి ఫ్లాష్ బ్యాక్ చెబుతున్న స‌న్నివేశంలో ముర‌ళీ శ‌ర్మ అనుభ‌వం మొత్తం క‌నిపించింది.

ఇక వెంకీ గురించి చెప్పుకోవాలి. దేవుడి పాత్ర ఈ క‌థ‌కి చాలా కీల‌కం. ఆ పాత్ర‌లో వెంక‌టేష్‌ కనిపించడం ఈ క‌థ‌కు ప్ల‌స్ అయ్యింది. గోపాల గోపాల సినిమాలో ప‌వ‌న్ పోషించిన పాత్ర ఇది. దాన్ని చాలా స్టైలీష్‌గా, త‌న‌దైన బాడీ లాంగ్వేజ్ మిక్స్ చేసి పండించాడు వెంకీ.

ఇలాంటి క‌థ‌ల్ని డీల్ చేయ‌డం చాలా క‌ష్టం. స్క్రిప్టు ప‌క‌డ్బందీగా రాసుకొన్న‌ప్పుడే అది సాధ్యం అవుతుంది. అశ్వ‌త్ స్క్రిప్టుపై చాలా క‌స‌ర‌త్తు చేశాడు.

త‌మిళంలో కంటే తెలుగులో ఇంకొంచెం బెట‌ర్ గా తీశాడ‌నిపించింది. పాట‌లు క‌థ‌లో క‌లిసిపోయాయి. 'బుజ్జ‌మ్మా' పాట హుషారుగా సాగిపోయింది. కెమెరా, నేపథ్య సంగీతం అన్నీ కూల్ గా ఉన్నాయి.

త‌రుణ్ భాస్క‌ర్ సంభాష‌ణ‌లు కొన్ని చోట్ల ఫ‌న్ పండించాయి. చాలా వ‌ర‌కూ ఆయ‌న కూడా క‌థ‌కు లోబ‌డే మాట‌లు రాశారు.

లైఫ్‌లో సెకండ్ ఛాన్స్ ఉండ‌దు. కానీ సినిమాల్లో ఉంటుంది. 'ఓ మై క‌డ‌వులే'ని 'ఓరి దేవుడా'గా మ‌ళ్లీ మ‌రోసారి తీసే ఛాన్స్ అశ్వ‌త్‌కి ద‌క్కింది. 'ఓ మై క‌డ‌వులే'ని ఎంత బాగా తీశాడో.. `ఓరి దేవుడా`నీ అంతే బాగా తెర‌కెక్కించి మ‌రోసారి మార్కులు కొట్టేశాడు. రీమేక్ క‌థ‌ల్లో జీవం ప‌ట్టుకుంటే క‌చ్చితంగా మంచి ఫ‌లితాలు వ‌స్తాయి అన‌డానికి ఈ సినిమా మ‌రో ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది.

వీడియో క్యాప్షన్, కాంతార మూవీ రివ్యూ: ఒక హీరోకి ఈ కథ చెప్పి ఒప్పించడం కష్టం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)