అమితాబ్-రేఖ: వీరిది ‘అందమైన మలుపులున్న ముగింపు లేని ప్రేమ కథ’

సిల్‌సిలా సినిమా పోస్టర్

ఫొటో సోర్స్, SILSILA MOVIE POSTER

    • రచయిత, ప్రదీప్ సర్‌దానా
    • హోదా, సీనియర్ జర్నలిస్టు, చిత్ర సమీక్షకులు

యాదృచ్చికం అయినా రేఖ పుట్టినరోజు అక్టోబర్ 10 కాగా..అమితాబ్ అక్టోబర్ 11న జన్మించారు. రేఖ అమితాబ్ కంటే 12 ఏళ్లు చిన్న.

10 అక్టోబర్ నాటికి అలనాటి తార రేఖ 68వ వసంతంలోకి.. అక్టోబర్ 11 నాటికి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ 80వ వడి లోకి ప్రవేశించనున్నారు.

వీరిద్దరూ 1980లో చివరిసారి 'సిల్ సిలా' సినిమాలో కలిసి నటించారు. 1976-81 మధ్య వీళ్ళ జోడీ ఎంత ప్రాచుర్యం పొందిందో.. 41 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఈ జంటకు అంతే ప్రాచుర్యం ఉంది.

అమితాబ్-రేఖ జోడీ ప్రజాదరణను నేటి తరం యువత కూడా అదే స్థాయిలో ఆస్వాదిస్తోంది. ఈతరం యువత ఈలోకం చూడకముందే.. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు ఒక ఊపు ఊపేశాయి.

అమితాబ్-రేఖ ప్రాముఖ్యత ఏంటో.. నేటి 40 ఏళ్ల మధ్య వయస్కుల మొదలు. .20 ఏళ్ల యువత నుంచి 14 ఏళ్ళ యువకిశోరాల వరకు.. అందరికీ తెలుసు.

వీరిద్దరూ వెండితెరపై ఓ మాంచి హిట్ పెయిర్ అని గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ కలిసి ఎన్నో మర్చి పోలేని విజయవంతమైన చిత్రాల్లో నటించారు. వీరిద్దరిది సినిమాల్లో ఎంత హిట్ పెయిరో.. నిజ జీవితంలో వీరి ప్రేమ కథ అంతే ప్రాచుర్యం పొందింది.

వీడియో క్యాప్షన్, అమితాబ్ బచ్చన్ కరోనా కవిత: నన్ను నమ్ము ఇది రెండు నిమిషాలే...'

వాస్తవానికి అమితాబ్-రేఖ లవ్ ట్రాక్ బాహ్య ప్రపంచంలో పూర్తిగా బయట పడకపోయినా.. వీరిద్దరి ప్రేమగాధ.. అంత త్వరగా మరిచి పోయేది కాదన్నది నిజం.

ఈ ప్రేమ కథ 40-45 ఏళ్ళ ముందునుంచి ఎలా ప్రముఖ వార్తగా నిలిచిందో.. ఇప్పటికీ అంతే ప్రాముఖ్యతను సంతరించుకుంది. అప్పుడు ఎంత బలంగా వినిపించేదో.. ఇప్పుడూ అంతే బలంగా వినిపిస్తోంది.

ఆనాటి నుంచి కొనసాగుతున్న సుదీర్ఘ నిశ్శబ్ద ప్రయాణం.. నేటికీ అదే హోరు కొనసాగిస్తోంది.

నిజం చెప్పాలంటే.. సినీ ప్రపంచంలో ప్రేమ కథలకు కొదవే లేదు. ఎన్నో జంటలు అందాల తెరపై ప్రేమిస్తూ.. ప్రేమిస్తూ నిజ జీవితంలోనూ ప్రేమబాటలో నడిచారు. కానీ అందులో కొందరే వివాహబంధంతో ఒక్కటయ్యారు. మరికొందరి ప్రేమకథలు కొద్దిదూరం సాగాక.. అర్ధంతరంగా ముగిసిపోయాయి. ఇకపోతే కొందరి ప్రేమగాథలు మూడుముళ్ల వరకూ వెళ్లక పోయినా.. వారి గాథలు అజరామరంగా నిలిచిపోయాయి.

అలాంటి అజరామర ప్రేమగాథల్లో ముందుగా చెప్పుకునేది.. రాజ్ కపూర్-నర్గిస్ జోడీ గురించే. ఆ తర్వాత అమితాబ్-రేఖ ప్రేమ గాథ నిలిచింది. ఇవాళ రాజ్ కపూర్-నర్గిస్ లు ఈ లోకంలో సజీవంగా లేకపోయినా.. వీరిద్దరి ప్రేమకథ అమరం,అజరామరం. అచ్చం ఇలాగే అమితాబ్-రేఖల ప్రేమగాధ ఏళ్లు గడిచినా.. కాలం అనే నావలో కొట్టుకుపోకుండా శాశ్వతంగా నిలిచింది.

నమక్ హరామ్ సినిమా పోస్టర్

ఫొటో సోర్స్, NAMAK HARAAM MOVIE POSTER

అమితాబ్- రేఖ మొదటి కలయిక

అమితాబ్‌తో రేఖ తొలి పరిచయం అమితాబ్‌కు జయబాదురితో 1972లో పెళ్లి జరగడానికి ముందే జరిగింది. అయితే నిర్మాత జీఎం రమేష్, దర్శకుడు కుందన్ కుమార్ అమితాబ్- రేఖతో కలిపి అప్‌నే- పరాయే అనే సినిమాను అప్పటికే ప్రారంభించారు. కొన్నిరోజుల షూటింగ్ తర్వాత ఆ సినిమా ఆగిపోయింది.

తర్వాత అమితాబ్ స్థానంలో సంజయ్‌ఖాన్‌ను తీసుకున్నారు. సంజయ్ ఖాన్ - రేఖ నటించిన ఈ సినిమాను దునియాకా మేలా పేరుతో 1974లో విడుదల చేశారు. ఈ చిత్రం ఫ్లాపయింది.

1973లో నమక్ హరామ్ చిత్రం కోసం రేఖ- అమితాబ్ మరోసారి కలిసి నటించారు. అయితే ఈ సినిమాలో రేఖ అమితాబ్‌ సరసన కాకుండా రాజేష్ ఖన్నాకు జోడీగా నటించింది. అందుకే ఈ సినిమా సమయంలో అమితాబ్- రేఖ మధ్యన పెద్దగా సంభాషణ ఏమీ జరగలేదు. ఇలా అప్పటి వరకూ అమితాబ్- రేఖ మధ్య అంతగా పరిచయం పెరగలేదు.

దో అంజానే సినిమా పోస్టర్

ఫొటో సోర్స్, DO ANJAANE MOVIE POSTER

దో అంజానే సినిమాతో ఇద్దరి మధ్య పెరిగిన సాన్నిహిత్యం

అమితాబచ్చన్, రేఖ జీవితాలు 1976లో పెద్ద మలుపు తిరిగాయి. నిర్మాత టిటూ, దర్శకుడు దులాల్ గుహ వీళ్లిద్దరిని పెట్టి దో అంజానే సినిమా తీశారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే సినిమాలో వారి పేర్లు కూడా మొదట అమిత్ - రేఖ అని పెట్టారు. ఈ చిత్రంలో రేఖ హీరోయిన్. ఆమె పాత్ర నెగటివ్ టచ్‌తో ఉంటుంది.

రేఖ అంతకు ముందు సినిమాల విషయంలో అంత సీరియస్‌గా ఉండేది కాదు. ఏదో వచ్చామా చేశామా వెళ్లామా అన్నట్లుగా లైటర్ వీన్‌లో సినిమాలను చేసుకుంటూ వెళ్లింది. సినిమాల్లో పని చేసేందుకు ఇద్దరూ 1969లోనే ముంబయి వచ్చారు. అయితే రేఖ అంతకు ముందు బాల నటిగా అనేక చిత్రాల్లో నటించింది. మరో అంశం ఏంటంటే 1970లో ఆమె నటించిన మొదటి హిందీ చిత్రం సావన్ బాదోతో హిట్ కొట్టారు.

సావన్ బాదో తర్వాత దో అంజానేకు ముందు రేఖ ఏక్ బేచారా, రాంపూర్‌కి లక్ష్మణ్, కహానీ కిస్మత్‌కి, అనోఖి అదా, ధర్మ్, ధర్మాత్మ్, ధర్మ్ కర్మ్, కహతే హై ముజ్‌కో రాజా, ప్రాణ్ జాయే పర్ వచన్ న జాయే, సంతాన్ లాంటి చిత్రాలతో గుర్తింపు పొందారు.

దో అంజానేలో అమితాబ్ సరసన నటించడంపై రేఖ స్పందిస్తూ.. ఆ సినిమా కోసం ఆయన సంతకం చేశాడని తెలిశాక కాస్త భయపడినట్లు సిమి గరేవాల్ టీవీ షో రాండేవూలో ఆమె స్వయంగా తెలిపారు. కాగా, కొన్ని విషయాల్లో తాను ఆయన కంటే సీనియర్‌ని అని, అయితే అమితాబ్ దీవార్ చిత్రంతో మంచి విజయం అందుకున్నట్లు రేఖ అదే షోలో తెలిపారు.

‘‘అప్పటి వరకూ ఆయన గురించి నాకు పెద్దగా తెలియదు. ఎందుకంటే మేము కూర్చుని మాట్లాడుకోవడానికి అవకాశం దొరకలేదు. దో అంజానే సినిమా షూటింగ్ సమయంలో ఆయనతో కలిసి పని చేయడానికి కాస్త భయపడ్డాను. అయితే ఆ సినిమా సమయంలో నేను ఆయన నుంచి చాలా నేర్చుకునే అవకాశం లభించింది. సెట్‌లో ఉన్నప్పుడు నా ప్రవర్తనను మార్చుకున్నాను. ఆ తర్వాత సెట్ నాకు ఎప్పుడూ ఆటలాడుకునే మైదానంలా అనిపించలేదు’’ అని రేఖ చెప్పారు.

1982లో విడుదలైన ‘దీదార్ ఎ యార్’ సినిమాలో రేఖ

ఫొటో సోర్స్, TWITTER@NFAIOfficial

ఫొటో క్యాప్షన్, 1982లో విడుదలైన 'దీదార్ ఎ యార్' సినిమాలో రేఖ

రేఖపై అమితాబ్ ప్రభావం ఎప్పుడు పడింది?

ఈ విషయంపై ఆమె ఏం చెప్పారంటే "ఇంతకు ముందు నాపై ఎవరి ప్రభావం లేదు. అయితే అమితాబ్ ఎలాంటి వ్యక్తి అంటే.. అలాంటి వ్యక్తిని నేను అప్పటి వరకూ చూడలేదు. ఒక వ్యక్తిలో ఇన్ని లక్షణాలు ఉండటం ఎలా సాధ్యం అని ఆలోచిస్తూ నేను అయోమయంలో పడిపోయాను. ఎవరైనా మీకు నచ్చినప్పుడు అతనికి సంబంధించిన ప్రతిదీ మంచిదని అనిపిస్తుంది. ఆయన్ను కలిసినప్పుడు అప్పటి వరకూ అలాంటి వ్యక్తిని కలవలేదని అనిపించింది. మా ఇద్దరిదీ తుల రాశి. ఒక వ్యక్తిలో ఇన్ని మంచి లక్షణాలు ఉండటం ఎలా సాధ్యం".

‘‘నాకు ఏమనిపించేదంటే ఆ వ్యక్తి నుంచి చాలా నేర్చుకోవాలి, ప్రేరణ పొందాలి, ఆ ఒక్క క్షణం నా జీవితానికి టర్నింగ్ పాయింట్ అయింది. నేను అదృష్ట వంతురాలిని, తెలివైన దానినని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆయన నుంచి ప్రేరణ పొందాను. అతను ఎలాంటి నటుడంటే ఆయన ముందు నిల్చోవడం కూడా తేలిక కాదు."

అమితాబ్ నటనాశైలి, క్రమశిక్షణ, మర్యాద పూర్వక ప్రవర్తన, వృత్తి పట్ల అంకితభావం వంటి అంశాలు రేఖను ఆకట్టుకున్నట్లు ఆమె మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఇంతగా ప్రభావితం కాబట్టే అమితాబ్‌ పట్ల ఆమెకున్న భావాలు ప్రేమగా మారాయి.

సిల్‌సిలా సినిమాలో ఒక దృశ్యంలో అమితాబ్, రేఖ

ఫొటో సోర్స్, Silsila Movie

ఫొటో క్యాప్షన్, సిల్‌సిలా సినిమాలో ఒక దృశ్యంలో అమితాబ్, రేఖ

22 ఏళ్ల రేఖ, 34 ఏళ్ల అమితాబ్

నిజానికి 1976లో రేఖ, అమితాబ్‌లకు ప్రభావితమైనప్పుడు ఆమెకు 22 ఏళ్లు, అమితాబ్‌కు 34 ఏళ్లు. ఆ వయసులో అలాంటి పరిస్థితుల్లో, ఆ భావాలు వేరే ఎవరికి కలిగినా అలా జరగడం సాధ్యమే.

‘‘అయినా మనమూ మనుషులమే కదా. సినిమా షూటింగ్ సమయంలో హీరోహీరోయిన్లు ఒకరినొకరు ఇష్టపడితే, ఒకర్నొకరు గౌరవించుకుంటే.. ఇంటిమేట్ సీన్లలో ఇద్దరూ ఎమోషనల్ అయిపోతారు. తర్వాత అదంతా ప్రేమగా మారిపోతుంది’’ అని ఒకసారి మా కాలంలోని ప్రముఖ హీరో ప్రదీప్ కుమార్ అన్నారు.

ఇటు అమితాబ్-రేఖల ఈ ప్రేమకథ కూడా అలాంటి సంకేతాలనే ఇచ్చింది. దాని ప్రారంభం రేఖతో మొదలైంది. కానీ యవ్వనంలో ఉన్న అమితాబ్ కూడా ఆమె మోహం నుంచి తప్పించుకోలేకపోయారు.

1976లో వచ్చిన దో అంజానే రిలీజైన తర్వాత దిల్లీలోని ఆయన ఇంట్లో నేను అమితాబ్‌ను మొదటిసారి కలవడం కూడా యాదృచ్చికంగా జరిగింది. నేనా సినిమాను ముందు చూళ్లేదు. కానీ ,నేను విలింగ్డన్ క్రిసెంట్‌లో ఉన్న డాక్టర్ హరివంశ్ రాయ్ బచ్చన్‌ను కలవడానికి వెళ్లినపుడు, ఆయన నాతో ‘అమిత్ కొత్త సినిమా దో అంజానే చాలా బాగుంది. అవకాశం ఉంటే తప్పకుండా చూడు’ అన్నారు.

మరోవైపు వారి సినీ కెరీర్ వేగంగా పీక్స్‌కు చేరుకుంటున్న సమయంలోనే అమితాబ్-రేఖ మధ్య రొమాన్స్ నడుస్తోందని, ఇద్దరూ షూటింగ్ తర్వాత రేఖ ఒక స్నేహితుడి ఇంట్లో రహస్యంగా కలుస్తున్నారని సినిమా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.

నేను ఒక రోజు ధైర్యం చేసి ‘అమిత్ జీ గురించి వస్తున్న వార్తల గురించి మీరేమనుకుంటున్నారు’ అని నేను (హరివంశ్ రాయ్) బచ్చన్ గారిని అడిగేశాను. ఆయన నాతో ‘‘మొదట్లో నేను కూడా ఇలాంటి వార్తలు విని కంగారుపడ్డాను. కానీ ఇప్పుడు అలాంటి వార్తలను పట్టించుకోవడం లేదు. కొన్ని సినీ పత్రికలు ఇలాంటి నిరాధార మసాలా వార్తలు, గాసిప్స్ మీదే నడుస్తాయని నాకిప్పుడు అర్థమైంది’’ అన్నారు.

అయితే అమితాబ్ - రేఖ రొమాన్స్ వార్తల మార్కెట్ 1980 వరకూ చాలా హాట్ హాట్‌గా సాగింది. జయా బచ్చన్ కూడా దీనిపై చాలా ఆందోళనకు గురవుతున్నారని రాసేవారు. అదే సమయంలో 1981 జనవరిలో సిల్‌సిలా షూటింగ్ సమయంలో దిల్లీలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో నేను అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, రేఖ ముగ్గురినీ కలిశాను.

నేను జయా బచ్చన్‌తో మాట్లాడినపుడు ఆమె ఆందోళనగా ఉన్నట్లు నాకు కాస్త కూడా అనిపించలేదు. నాతో ఆమె చాలా సరదాగా, సంతోషంగా, నవ్వుతూ మాట్లాడారు.

1973లో విడుదలైన జంజీర్ సినిమాలోని ఒక దృశ్యంలో అమితాబ్, జయ

ఫొటో సోర్స్, TWITTER@NFAIOfficial

ఫొటో క్యాప్షన్, 1973లో విడుదలైన జంజీర్ సినిమాలోని ఒక దృశ్యంలో అమితాబ్, జయ

జయను దీదీభాయి అన్న రేఖ..

అటు కాసేపటి తర్వాత వారి టీమ్ సిల్‌సిలా అవుట్‌డోర్ షూటింగ్ కోసం ఒక ఫార్మ్ హౌస్‌కు బయల్దేరినప్పుడు, రేఖ, జయాబచ్చన్ ఇద్దరూ చాలా మామూలుగా మాట్లాడుకోవడం విన్నాను.

రేఖ జయాబచ్చన్‌తో మాట్లాడుతూ ఆమెను దీదీ భాయి అన్నప్పుడు నేను అదేంటి అనుకున్నా. అక్కడ ఎవర్నో అడిగితే, రేఖ మొదటి నుంచీ జయను దీదీ భాయి అనే పిలుస్తారని చెప్పారు. జయకు పెళ్లి కాక ముందే రేఖకు ఆమెతో పరిచయం ఉందని తర్వాత షూటింగ్ యూనిట్‌లో ఒకరు చెప్పారు.

అమితాబ్-రేఖ ప్రేమ వార్తల తుపానుల పరంపర సిల్‌సిలా రిలీజ్ తర్వాత మెల్లమెల్లగా చల్లారాయి. కొన్నేళ్ల తర్వాత.. 1990 మార్చిలో దిల్లీకి చెందిన పారిశ్రామికవేత్త ముకేశ్ గుప్తాను రేఖ పెళ్లాడారు.

కానీ పెళ్లి తర్వాత ముకేష్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో రేఖపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అటు ముకేశ్ మరణం తర్వాత కూడా రేఖ తన పాపిట కుంకుమతో కనిపించినపుడు, అమితాబ్-రేఖల ప్రేమ వార్తలు మళ్లీ జోరందుకున్నాయి.

సిల్‌సిలా విషయానికి వస్తే ఆ సినిమా 1981 ఆగస్టు 14న రిలీజయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ అద్భుతాలు సృష్టిస్తుందని ఆశించారు. కానీ ఆ సినిమా పాటలు చాలా పాపులర్ అయినప్పటికీ, సినిమా మాత్రం ప్రేక్షకులకు నచ్చలేదు.

నిజానికి సిల్‌సిలా సినిమాలో మొదట అమితాబ్‌ పక్కన పర్వీన్ బాబీ, స్మితా పాటిల్‌ను అనుకున్నారు. కానీ ఆ రోజుల్లో అమితాబ్-రేఖ ప్రేమ గురించి జోరుగా చర్చ జరుగుతుండడంతో డైరెక్టర్ యశ్ చోప్రా చివర్లో తన నిర్ణయం మార్చుకున్నారు. ఎందుకంటే ఇది కూడా ఒక భార్య, భర్త, ప్రియురాలి కథ ఆధారంగా తీసిన సినిమా.

ఈ సినిమాలో నీతో పర్వీన్ బాబీ స్థానంలో రేఖ, స్మిత బదులు జయా తీసుకుందామా అని యశ్ చోప్రా అమితాబ్‌ను అడిగారు.

యశ్ చోప్రా మాట విని అమితాబ్ షాకయ్యారని చెబుతారు. ఆయన "ఏమంటున్నారు. జయ దీనికి ఒప్పుకుంటుందని అనుకుంటున్నారా" అన్నారు. దాంతో యశ్ చోప్రా "అన్నీ అవుతాయి. నేను రేఖతో మాట్లాడతా. జయతో మొదట నువ్వు మాట్లాడు. తర్వాత నేను కూడా మాట్లాడతా" అన్నారు.

తర్వాత ఎవరూ ఊహించనిది నిజమయ్యింది. యశ్ చోప్రా చేసిన మ్యాజిక్‌తో కశ్మీర్లో పర్వీన్, స్మితా పాటిల్ బదులు రేఖ, జయా సిల్‌సిలా షూటింగ్‌లో ఉన్నారు.

అయితే, అమితాబ్ ఈ సినిమా తర్వాత రేఖతో మరో సినిమా చేయకూడదనే షరతుపైనే జయాజీ సిల్‌సిలాలో నటించడానికి ఒప్పుకున్నారని, తర్వాత ఆ సినిమాకు సంబంధించి చాలా ప్రత్యేకమైన ఒక వ్యక్తి నాకు చెప్పారు.

నేను దాన్ని అప్పట్లో నమ్మలేదు. కానీ నిజంగానే అలా జరిగింది. సిల్‌సిలా అమితాబ్, రేఖ ఇద్దరూ కలిసి నటించిన చివరి సినిమా అయ్యింది. సిల్‌సిలా తర్వాత రేఖ దాదాపు 80 సినిమాలు చేశారు. అటు అమితాబ్ సిల్‌సిలా తర్వాత దాదాపు 150 సినిమాలు చేశారు. కానీ ఇద్దరూ కలిసి అప్పటి నుంచి ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ కనిపించలేదు. అంటే సిల్‌సిలాతో ఆ పరంపరకు తెర పడింది.

అమితాబ్ రేఖ

ఫొటో సోర్స్, Silsila Movie

అమితాబ్-రేఖ గుర్తుండిపోయే సినిమాలు

  • అమితాబ్, రేఖ కలిసి మొత్తం 14 సినిమాలు చేశారు. నమక్ హరామ్‌లో రాజేష్ ఖన్నా హీరో.
  • ఇమాన్ ధర్మలో కూడా అమితాబ్, శశి కపూర్, రేఖ, సంజీవ్ కుమార్ నటించారు. రేఖ శశికపూర్‌కు జంటగా నటించారు.
  • ప్రముఖ నటుడు జగదీప్ సుర్మా భోపాలీలో కూడా అమితాబ్, రేఖ ఇద్దరూ అతిథి పాత్రల్లో నటించారు.
  • సిల్‌సిలా తర్వాత 2015లో వచ్చిన ఆర్.బాల్కి సినిమా షమితాబ్‌లో అమితాబ్ లీడ్ రోల్ చేస్తే, అందులో రేఖ ఒక చిన్న పాత్ర పోషించారు. అయితే అమితాబ్-రేఖ కలిసి ఒక్క సన్నివేశంలో కూడా కనిపించరు.
  • ఈ సినిమాలు కాకుండా అమితాబ్-రేఖ కలిసి నటించిన పది సినిమాలు ఉన్నాయి. వాటిలో దో అంజానే, సిల్‌సిలా కాకుండా ఖూన్ పసీనా, ముకద్దర్ కా సికిందర్, మిస్టర్ నట్వర్‌లాల్, సుహాగ్, రామ్ బలరామ్ హిట్ అయ్యాయి. వీటిలో ముకద్దర్ కా సికిందర్ ఇద్దరి కెరీర్లో మైల్ స్టోన్ మూవీగా నిల్చింది. కానీ ఈ ఇద్దరూ చేసిన ఆళాప్, గంగా కీ సౌగంధ్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
సిల్‌సిలా సినిమాలో ఒక దృశ్యంలో అమితాబ్, రేఖ

ఫొటో సోర్స్, Silsila Movie

ప్రేమబంధాన్ని ఎప్పుడూ అంగీకరించని అమితాబ్

‘మీరు, రేఖతో కలిసి సూపర్ హిట్స్ కొట్టారు. కానీ మీ 1981 తర్వాత ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా చేయలేదేంటి?’ అని 2014లో నేను ముంబయిలో ఒక ఇంటర్వ్యూ సమయంలో అమితాబ్ బచ్చన్‌ను అడిగాను.

‘మేమిద్దరం కలిసి నటిస్తే బాగుంటుంది అనేలాంటి కథను ఎవరూ తీసుకురాలేదు’ అని అమితాబ్ పెద్దగా ఆలోచించకుండానే చెప్పారు. అలాంటి ప్రతిపాదన ఏదైనా వస్తే, ఆ కథ బాగుంటే ఆమెతో కలిసి కచ్చితంగా చేస్తానని చెప్పారు.

ఒకవిధంగా రేఖతో ప్రేమబంధాన్ని అమితాబ్ ఎప్పుడూ అంగీకరించలేదు. కానీ, రేఖ మాత్రం వివిధ వేదికలపై సరదాగా, ఒక్కోసారి సీరియస్‌గా, ఇంకోసారి బాధగా, విషాద గీతాలతో, గజల్స్ తో అప్పుడప్పుడూ తమ బంధాన్ని వ్యక్తం చేస్తూనే వచ్చారు.

గత 42 ఏళ్లుగా ఆమె తన పాపిట కుంకుమ, మెడలో మంగళసూత్రం కూడా ధరిస్తూనే ఉన్నారు. 1980లో ఆమె మొదటిసారి రిషి కపూర్-నీతూ సింగ్ పెళ్లిలో కుంకుమ, మంగళసూత్రంతో కనిపించినపుడు, అమితాబ్-రేఖ రహస్యంగా పెళ్లి చేసుకున్నారేమో.. అని చాలామంది అనుకున్నారు.

1984లో ఫిల్మ్ ఫేర్ ఒక ఇంటర్వ్యూలో అఫైర్ విషయాన్ని అమితాబ్‌ ఖండించారా అని రేఖను అడిగినపుడు.. ‘‘తన ఇమేజ్, తన కుటుంబం, పిల్లల కోసం ఆయన అలా మాట్లాడుతున్నారు. అది మంచిదే అని నాకనిపిస్తోంది. కానీ దానివల్ల నాకే సమస్యా లేదు. ఆయన నన్ను, నేనాయన్ను ప్రేమిస్తున్నాం. ఆ విషయం ఆయన నాతో ఒంటరిగా చెప్పుంటే నేను బాధపడేదాన్ని. మిస్టర్ బచ్చన్ ఇప్పటికీ పాతకాలం మనిషే. ఆయన ఎవరినీ బాధపెట్టాలని అనుకోరు. అలాంటప్పుడు ఆయన తన భార్యను బాధపెట్టాలని ఎందుకనుకుంటారు. మేం మనుషులం. ఒకర్నొకరు ఇష్టపడుతున్నాం. ఎలా ఉన్నామో దానినే అంగీకరిస్తాం’’ అన్నారు రేఖ.

అలాగే ‘పది సినిమాల్లో పనిచేసిన సమయంలో మీరు అమితాబ్‌ ప్రేమలో పడ్డారా’ అని సిమీ గేర్వాల్ తన షోలో రేఖను అడిగినప్పుడు.. ఆమె ‘‘అది అర్థంలేని ప్రశ్న. ఆయన్ను పిచ్చిగా ప్రేమించని వ్యక్తి, మహిళ లేదా పిల్లలను నేనిప్పటివరకూ చూడలేదు. మీరాయన్ను ప్రేమించలేదా అనే ప్రశ్నను నేనెందుకు ఖండిస్తాను. కచ్చితంగా ప్రేమించాను. ప్రపంచంలోని మొత్తం ప్రేమను తీసుకోండి. దానికి ఇంకొంత కూడా కలపండి. నేను ఆయన్ను అంతగా ప్రేమిస్తున్నాను’’ అన్నారు.

సిల్‌సిలా సినిమా 1981 ఆగస్టు 14వ తేదీన విడుదలైంది

ఫొటో సోర్స్, SILSILA MOVIE

ఫొటో క్యాప్షన్, సిల్‌సిలా సినిమా 1981 ఆగస్టు 14వ తేదీన విడుదలైంది

రేఖ ఉంగరం తీసి అమితాబ్‌కు ఇచ్చినపుడు..

అయితే రేఖ ఒకసారి స్టార్ డస్ట్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గుండెలోని బాధను బయటపెట్టారు.

‘‘రేఖతో ఇక ఏ సినిమానూ చేయను అని అమిత్ జీ నిర్మాతలకు చెప్పినట్లు నాకు కొంతమంది చెప్పారు. కానీ ఆయన నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నేను ఆయన్ను దీని గురించి అడిగినపుడు ఆయన, ‘నేనేం మాట్లాడను, నన్ను అడగద్దు’ అన్నారు. నాకు ఆ మాటతో బాధేసింది. అప్పుడు నేను ఖూబ్‌సూరత్ సినిమా షూటింగ్‌లో ఉన్నాను. మీరు గమనిస్తే సినిమా చివరి భాగంలో, నా వేలికి రెండు ఉంగరాలు ఉండవు. వాటిని నాకు ఆయనే ఇచ్చారు. వాటిని నేనెప్పుడూ తీసేదాన్ని కాదు. పడుకున్నప్పుడు కూడా. కానీ మేం విడిపోయినప్పుడు నేను ఆ ఉంగరాలు ఆయనకు తిరిగిచ్చేశాను’’ అని రేఖ చెప్పారు.

ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా చెప్పడానికి ఏం మిగిలింది. అయినా అమితాబ్ రేఖ మధ్య ఎప్పుడూ ఎలాంటి బంధం లేకుంటే అమితాబ్ బహిరంగ కార్యక్రమాల్లో ఆమె ముందుకు రావడానికి అంత వెనుకాడడం ఎందుకు.

రేఖ సినీ కార్యక్రమాల్లో జయా బచ్చన్‌ను కలుస్తారు. అభిషేక్, ఐశ్వర్యతో మాట్లాడుతారు. కానీ రేఖ, అమితాబ్ దగ్గరకు చేరుకునేలోపే ఆయన వెంటనే అటూ ఇటూ తప్పుకోడానికి చూస్తారు. ఏళ్ల తరబడి చూస్తున్నాం. ఒక వేడుకలో ఆమె ఒక్కసారే అమితాబ్‌కు దగ్గరగా చేరుకోగలిగారు. ముంబయిలో పృథ్వీ థియేటర్‌లో 2015 మే 10న శశి కపూర్‌కు ఫాల్కే పురస్కారంతో సన్మానించినపుడు ఈ దృశ్యం కనిపించింది.

మరోవైపు, సరదా సరదాగా రేఖ అమితాబ్‌ అంటే ఉన్న ప్రేమ గురించి 2021లో ఇండియన్ ఐడల్‌కు వచ్చినపుడు కూడా వ్యక్తం చేశారు. షో హోస్ట్ జయ్ భానుశాలీ ‘కొంతమంది మహిళలకు పెళ్లైన మగాళ్లపై అంత ప్రేమ ఎందుకు పుడుతుంది’ అన్న ప్రశ్నకు ఆమె భానుశాలితో సరదాగా ‘అది నన్నే అడగచ్చుగా’ అన్నారు. హోస్ట్ చెప్పండి అనగానే, రేఖ తర్వాత క్షణమే నవ్వుతూ ‘నేనేం అనలేదులే’ అనేశారు.

కానీ అక్కడ రేఖ నోటి వెంట వచ్చిన ఆ రెండు మాటలు చాలా విషయాలు చెప్పేశాయి.

1986లో బీబీసీ ఉర్దూకు ఒక ఇంటర్వ్యూలో రేఖను కొన్ని పాటలు పాడి వినిపించాలని అడిగినప్పుడు.. మొహదీ హసన్ గజల్ ఒకటి పాడిన రేఖ తన గుండెలోని బాధను బయటపెట్టారు.

"ముఝే తుమ్ నజర్ సే గిరా రహే హో, ముఝే తుమ్ కభీ భులా నా సకోగే, నా జానే ముఝే క్యోం యకీ హో చలా హై, మేరే ప్యార్ కో తుమ్ మిటా నా సకోగే"

(నీ దృష్టిలో నుంచి నన్ను పడిపోయేలా చేశావు. నన్ను మాత్రం నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవు. నాకెందుకో చాలా నమ్మకంగా ఉంది, నా ప్రేమను నువ్వు తుడిచిపెట్టలేవు)

అయితే, అమితాబ్ మాత్రం సాహిర్ లుథియాన్వీ మాటలు తనకు సరైనవని భావించారు.

‘‘వో అఫసానా జిసె అంజామ్ తక్ లానా నాహో ముమ్‌కిన్, ఉసే ఏక్ ఖూబ్‌సూరత్ మోడ్ దేకర్ ఛోడ్‌నా అచ్చా’’

(ముగింపుకు తీసుకురాలేని కథను ఒక అందమైన మలుపుతో ముగించడం మేలు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)