1,398 మంది రైతుల రుణాలు మాఫీ చేసిన అమితాబ్ బచ్చన్

అమితాబచ్చన్

ఫొటో సోర్స్, Getty Images

రూ.4 కోట్లకు పైగా రైతు రుణాలను చెల్లించినట్లు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ తెలిపారు. 1,398 మంది రైతులకు చెందిన రుణ బకాయిలను తానే చెల్లించానని ఆయన మంగళవారం తన బ్లాగ్‌లో వెల్లడించారు.

రైతుల బాకీలను తీర్చడం ద్వారా ఇప్పుడు తనకు ఎంతో సంతృప్తిగా ఉందన్నారు.

ఈ సాయం పొందిన రైతులందరూ అమితాబ్ జన్మించిన రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారే.

ప్రస్తుతం దేశంలో వేలాదిమంది రైతులు అప్పుల భారంతో సతమతమవుతున్నారు.

కరవు పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటిపోవడం, సరైన దిగుబడులు రాక కొన్ని దేశాబ్దాలుగా వ్యవసాయ రంగం తీవ్రంగా కుదేలవుతోంది.

అప్పుల భారం మోయలేక అనేక మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. 1995 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3 లక్షల మందికి పైగా రైతులు బలవర్మణానికి పాల్పడ్డారు.

రైతులు

ఫొటో సోర్స్, Reuters

ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 1,398 మంది రైతులు తీసుకున్న రుణాలను అమితాబ్ చెల్లించారు.

బ్యాంకువారు ఒకేసారి ఆ రైతులందరి "లోన్ తిరిగి చెల్లించిన పత్రాలను" తనకు ఇచ్చారని అమితాబ్ తన బ్లాగ్‌లో తెలిపారు.

"ఆ రైతులను నేరుగా కలిసి ఆ పత్రాలను అందజేయాలని ఉంది" అని బిగ్‌బీ చెప్పారు.

అయితే, ఆయన ప్రస్తుతం ముంబయిలో నివాసం ఉంటున్నారు. ఆ రైతులందరూ ముంబయికి వెళ్లడం కష్టమైన పని. అందుకే, వారిలో 70 మంది ముంబయి వచ్చి ఆ పత్రాలు తీసుకెళ్లేందుకు వీలుగా ప్రత్యేకంగా తానే ఒక రైలు కోచ్‌ను బుక్ చేసినట్లు అమితాబ్ వెల్లడించారు.

ఆ రైతులు ఈ నెల 26న ముంబయి చేరుకునే అవకాశం ఉంది.

ఇదే ఏడాది ఆరంభంలోనూ మహారాష్ట్రకు చెందిన 350 మంది రైతుల రుణాలను ఆయన చెల్లించారు.

అమితాబ్ బచ్చన్

ఫొటో సోర్స్, AFP

గతంలో వ్యవసాయ భూమికి సంబంధించిన ఓ వివాదంలో అమితాబ్ బచ్చన్ ఉన్నారు. ఆయనకు 90,000 చదరపు అడుగుల నివాస స్థలాన్ని అక్రమంగా కట్టబెట్టారంటూ 2007లో కోర్టు తీర్పు ఇచ్చింది.

ఆ విషయంలో ఆయన మీద మోసం కేసు కూడా నమోదైంది. అయితే, తర్వాత ఆయన ఆ భూమిని వదులుకుంటున్నట్లు ప్రకటించడంతో ఆ కేసు తొలగిపోయింది.

190కి పైగా భారతీయ సినిమాల్లో నటించిన అమితాబ్, ఇటీవల హాలీవుడ్‌లోనూ నటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)