హిమానీ బుందేలా: కంటి చూపు సరిగా లేకపోయినా ‘‘కౌన్ బనేగా కరోడ్‌పతి’’లో కోటి రూపాయలు గెలిచారు

ఫొటో సోర్స్, Bundela Family
దేశవ్యాప్తంగా తనకు గుర్తింపు వస్తుందని ఆగ్రాకు చెందిన హిమానీ బుందేలా కలలో కూడా అనుకోలేదు. ఆమె మేధస్సుపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ప్రశంసలు కురిపించారు.
25ఏళ్ల వయసులోనే ‘‘కౌన్ బనేగా కరోడ్‌పతి’’ సీజన్ 13లో ఆమె తొలి కరోడ్‌పతిగా నిలిచారు. ఆమె విజయం ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే కంటి చూపు సరిగా లేకపోయినా షోలో ఆమె కోటి రూపాయలు గెలుచుకోగలిగారు.
హిమానీకి 15ఏళ్ల వయసున్నప్పుడు ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో ఆమె కంటిచూపు మసకబారింది. మళ్లీ ఆమెకు మునుపటిలా కంటి చూపు రావడానికి వైద్యులు నాలుగు శస్త్రచికిత్సలు చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది.
అయితే, హిమానీ ధైర్యం కోల్పోలేదు. జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు. తమ కుటుంబంలో ప్రభుత్వం ఉద్యోగం పొందిన తొలి వ్యక్తిగా నిలిచారు.
ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయాలో హిమానీ టీచర్‌గా పనిచేస్తున్నారు. బాల్యం నుంచి కరోడ్‌పతిగా మారడం వరకు తన జీవిత విశేషాలు ఆమె మాటల్లోనే చూద్దాం.

ఫొటో సోర్స్, Bundela Family
2009 నుంచి ప్రయత్నిస్తున్నా..
నేను చిన్నప్పటి నుంచి టీవీ బాగా చూసేదాన్ని. రియాలిటీ షోలు చూసేటప్పుడు నేను కూడా అలా టీవీలో కనపడాలని అనుకునేదాన్ని.
ఒకరోజు కౌన్ బనేగా కరోడ్‌పతి చూసేటప్పుడు నాకొక ఆలోచన వచ్చింది. జనరల్ నాలెడ్జ్ మీదే కదా ప్రశ్నలు అడుగుతున్నారు.. నేనూ కూడా షోలో పాల్గొంటే ఎలా ఉంటుందని అనిపించింది. అప్పుడు అమితాబ్ సర్‌ను కూడా కలవొచ్చని అనుకున్నాను.
ఇప్పుడు నా ప్రపంచం పూర్తిగా మారిపోయింది. నేను షోలో పాల్గొనడమే కాదు.. కోటి రూపాయలు గెలుచుకున్నాను. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. అయితే, ఈ విజయం ఏదో ఒక్క రోజులో వచ్చింది కాదు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేను 2009 నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను. చాలాసార్లు ఆ ప్రయత్నాలు విఫలం అయ్యాయి.
మధ్యలో నేను కంటిచూపు కోల్పోవడంతో నా ప్రపంచమే తారుమారైంది. అయినా మళ్లీ ప్రయత్నించాను. 2019లో విజయవంతంగా రిజిస్ట్రేషన్ పూర్తైంది. అయితే, షోలో పాల్గొనే అవకాశం మాత్రం రాలేదు. 2020లోనూ అలానే జరిగింది. మొత్తానికి 2021లో షోలో పాల్గొనే అవకాశం దక్కింది.

ఫొటో సోర్స్, Bundela Family
‘‘కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ)’’లో పాల్గొనేందుకు మీరు ముంబయి రావాల్సి ఉంటుందని సోనీ టీవీ వాళ్లు చెప్పినప్పుడు, మొదట్లో నేను నమ్మలేదు. ఎవరైనా నన్ను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారా? అని ఆలోచించాను.
చాలాసేపు మాట్లాడిన తర్వాత ఈ ఆహ్వానం నిజమేనని నిర్ధారించుకున్నాను. పైగా అవతలి వారు నా బ్యాంకు ఖాతా నంబరు లేదా వ్యక్తిగత సమాచారం అడగలేదు. దీంతో అది నిజమైన ఆహ్వానమేనని ధ్రువీకరించుకున్నాను.
కేబీసీ సెట్‌కు వచ్చిన తర్వాత కూడా జరుగుతున్న పరిణామాలను నేను నమ్మలేకపోయేదాన్ని. అమితాబ్ సర్‌తో కలిసి కూర్చోవడం నిజమేనా అనిపించేది. ఆయన తన చేతులతో నాకు మంచినీరు ఇచ్చారు. ఇదంతా ఏదో కలలా అనిపించింది.
నా జీవితంలో అనుకున్నవన్నీ సాధించగలిగాను. ఇక్కడ కూడా విజయం సాధించాలని ఆ రోజే గట్టిగా అనుకున్నాను.

ఫొటో సోర్స్, Bundela Family
‘‘కొంచెం భయమేసింది’’
షోలో పాల్గొనేందుకు అర్హత సాధించిపెట్టే ‘‘ఫాస్టెస్ట్ ఫింగర్ టెస్ట్’’ పరీక్షకు వెళ్లే ముందురోజు రాత్రి నా బుర్రలో ఎన్నో ఆలోచనలు తిరిగాయి. నేను స్పష్టంగా చూడగలిగే వారితో పోటీపడబోతున్నానని కొంచెం భయమేసింది. నా దృష్టి లోపం వల్ల ఏమైనా వెనుకబడతానేమోనని అనిపించింది.
ఈ లోపం వల్ల అమితాబ్ సర్ ఎదుట కూర్చొనే అవకాశం చేజారిపోతుందా? అని కూడా ఆలోచన వచ్చింది. అయితే, ఆత్మ విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. కేబీసీ బృందం కూడా సాయం అందించింది. దీంతో నాలో భయాలన్నీ పోయాయి. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టేటప్పుడు ఒకటే అనుకున్నాను. ‘‘అయితే గెలుస్తా.. లేకపోతే కొత్త విషయాలు నేర్చుకుంటా..’’
కోటి రూపాయల ప్రశ్నను అడిగినప్పుడు, కాస్త గందరగోళంగా అనిపించింది. ఎందుకంటే, మాది మధ్య తరగతి కుటుంబం. అంత పెద్దమొత్తాన్ని మేం ఎప్పడూ చూసింది లేదు. ఒకవేళ నేను తప్పు సమాధానం చెబితే, నేరుగా 3.2 లక్షలకు పడిపోతాను. నేను అంత గందరగోళానికి ముందెన్నడూ లోనుకాలేదు. కానీ, నా శ్రమ వృథా కాలేదు. నేను చెప్పిన సమాధానం సరైనదే.

ఫొటో సోర్స్, Bundela Family
ఎన్నో ఎత్తు పల్లాలు..
నా జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలున్నాయి. చిన్నప్పటి నుంచి నాకు కంటి సమస్యలు ఉన్నాయి. దీంతో ఏదీ స్పష్టంగా కనిపించేదికాదు. అయితే, 2006లో ఎయిమ్స్‌లో ఆపరేషన్ అనంతరం, నా కంటి చూపు మెరుగుపడింది.
అందరిలానే నేను కూడా నా పనులు చేసుకోగలిగేదాన్ని. మా చెల్లిని వెనుక కూర్చోబెట్టుకుని స్కూటర్ కూడా నడపగలిగేదాన్ని. మొదట్నుంచి అనారోగ్య సమస్యలు ఉండటంతో డాక్టర్‌ను కావాలని అనుకున్నాను.
కానీ, ఓ రోడ్డు ప్రమాదం నా జీవితాన్నే మార్చేసింది. 2011 జులైలో నేను కోచింగ్ సెంటర్‌కు సైకిల్‌పై వెళ్తున్నాను. ఎదుటివైపు నుంచి వేగంగా వచ్చి బైక్ నన్ను ఢీకొట్టింది. దెబ్బలు బాగా తలిగాయి. రక్తం కూడా ఎక్కువే పోయింది. అయితే, ఆ ప్రమాదం అసలు ప్రభావం వారం రోజుల తర్వాత మొదలైంది.
వారం రోజుల తర్వాత, నెమ్మదిగా నా కంటిచూపు మరింత మందగించింది. మా నాన్నతో కలిసి వెళ్లి కంటి పరీక్షలు చేయించుకొని కొత్త అద్దాలు కొనుక్కుంటే సరిపోతుంది అనుకున్నాను. ఆ ప్రమాదం నా కంటిపై ప్రభావం చూపిస్తుందని అసలు ఊహించలేదు.
అయితే, ప్రమాదం వల్ల కంటి రెటీనా పక్కకు జరిగిందని డాక్టర్ చెప్పారు. దీంతో ఏం చేయాలో మా కుటుంబానికి అసలు అర్థంకాలేదు.

ఫొటో సోర్స్, Bundela Family
నాలుగో ఆపరేషన్ విఫలం
ఆ తర్వాత, నా కంటికి మూడు ఆపరేషన్లు చేశారు. కొంచెం కొంచెం నాకు కనపడటం కూడా మొదలైంది. కానీ చక్కగా కనపడేందుకు నాలుగో ఆపరేషన్ కూడా చేయాలని అన్నారు.
అయితే, ఆ ఆపరేషన్ విఫలమైంది. అప్పుడు నేను 12వ తరగతి చదువుతున్నాను. డాక్టర్ కావాలని అనుకున్నాను. కానీ నా భవిష్యత్ మొత్తం ఒక్కసారిగా తలకిందులైనట్లు అనిపించింది.
ఆపరేషన్ అయిన తర్వాత, కళ్లు తెరిచేసరికి.. ‘‘అంతా చీకటిగా అనిపించింది’’. ఏం జరిగిందో నాకు అర్థంకాలేదు. నా జీవితం ముగిసిపోయిందేమోనని అనిపించింది.
‘‘ప్రస్తుతానికి నీ కళ్లు బలహీనంగా ఉన్నాయి. కొన్ని రోజులకు నీ చూపు మెరుగుపడుతుంది’’అని వైద్యులు చెప్పారు. 2012 నుంచి 2021 అయ్యింది. ఇప్పటికీ.. ‘‘నేను మునుపటిలా చూడలేకపోతున్నాను.’’
కుటుంబ ప్రోత్సాహం
మాది మధ్య తరగతి కుటుంబం. మా నాన్న ప్రైవేటు ఉద్యోగం చేస్తారు. మేం మొత్తం ఐదుగురు పిల్లలం. నా కంటి చూపు కోసం అందరూ డబ్బులు పోగేసేవారు. ఒకసారి ఆపరేషన్‌కు 40 నుంచి 50 వేల వరకు ఖర్చయ్యేది. అంత డబ్బును మా నాన్న ఒక్కరే తీసుకురావడం కష్టమయ్యేది.
నా కంటి చూపు కోల్పోయిన ఆరు నెలల వరకు నా మొహంపై నవ్వు అనేదే కనిపించలేదు. ఎందుకు అన్నీ నాకే జరుగుతున్నాయి? అని దేవుణ్ని అడిగేదాన్ని. కానీ నా కుటుంబం నన్ను ఎంతగానో ప్రోత్సహించింది. నా స్నేహితులు కూడా అన్నీ మరచిపోయేలా చేసేవారు.
మా ఇంట్లో పిల్లలందరినీ మా అమ్మా, నాన్న చాలా బాగా చూసుకున్నారు. అమ్మాయిలను ఇంగ్లిష్ మీడియంలో ఎందుకు చేర్పించడం?అని చుట్టుపక్కల వారు అనేవారు. కానీ మా నాన్న ఎలాంటి పక్షపాతం చూపించేవారు కాదు. బాగా చదువుకోవడం వల్లే నేను ఇక్కడ వరకు వచ్చాను.
ఆగ్రా సదర్‌లోని బీడీ జైన్ డిగ్రీ కాలేజీలో నేను బీఏ పూర్తిచేశాను. డా.శకుంతల మిశ్ర రిహేబిలిటేషన్ యూనివర్సిటీ నుంచి ఎడ్యుకేషన్‌లో డిప్లొమా తీసుకున్నాను. ఇది దివ్యాంగుల కోసం ఏర్పాటుచేసిన ఆసియాలోనే అతిపెద్ద యూనివర్సిటీ. ఆ తర్వాత 2017లో కేంద్రీయ విద్యాలయాలో టీచర్‌గా ఉద్యోగం వచ్చింది.

ఫొటో సోర్స్, Bundela Family
‘‘టీచర్‌గా నేను చాలా సంతోషంగా ఉన్నాను’’
డాక్టర్‌ను ఎందుకు కాలేకపోయానా? అనే బాధ నేడు నాలో అసలు కనిపించదు. ఎందుకంటే, టీచర్‌గా మంచి వృత్తిని ఎంచుకున్నానని నాకు అనిపిస్తుంటుంది. వీలైనంత మంది విద్యార్థులను రోజూ కలవొచ్చు. వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దొచ్చు.
ఆ రోడ్డు ప్రమాదం తర్వాత, జీవితం పూర్తిగా మారిన మాట వాస్తవమే. నిజానికి రోడ్డు ప్రమాదానికి ముందు, తర్వాత జీవితాలను పోల్చిచూస్తే... ప్రమాదం తర్వాత జీవితాన్నే నేను ఎక్కువ ఆస్వాదిస్తున్నాను. సంగీతం నేర్చుకున్నాను. పాటలు కూడా పాడగలుగుతున్నాను. 21ఏళ్లకే మా కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన తొలి వ్యక్తిగా మారాను.
విద్యార్థులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారా? అని చాలా మంది అడుగుతుంటారు. కానీ అలా ఎప్పుడూ జరగలేదు. ఇన్నేళ్లుగా నేను టీచర్‌గా పనిచేస్తున్నాను కదా.. ఒక్కసారి కూడా విద్యార్థులు నా దృష్టిలోపాన్ని హేళన చేయలేదు.
ఇంకా చెప్పాలంటే, నన్ను గేట్ దగ్గర నుంచి క్లాస్ రూమ్‌కు తీసుకెళ్లేందుకు పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తారు. ‘‘ఈ రోజు మేడమ్‌కు నేను సాయం చేస్తాను’’అంటూ వాళ్లలో వాళ్లు ఒక్కోసారి పోట్లాడుకుంటారు.

ఫొటో సోర్స్, Bundela Family
‘‘దివ్యాంగుల కోసం ప్రత్యేక సంస్థ స్థాపించాలి’’
మా ఇద్దరు అక్కలతో కలిసి నేను ఇంటి దగ్గర 13-14ఏళ్ల పిల్లలకు ట్యూషన్ కూడా చెబుతున్నాను. పిల్లలతో ఎలా ఉండాలి? వారు ఎలా చదవాలని అనుకుంటారు? లాంటి విషయాలను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతోంది.
నేను ఎప్పుడూ లెక్కలు అంటూ విద్యార్థులను భయపెట్టను. మ్యాజిక్ పేరుతో లెక్కలు చెబుతుంటా. ఇప్పుడు ఈ మ్యాజిక్ ఎలా చేస్తున్నానో చూడండి అంటూ లెక్కలను నేర్పిస్తాను.
నా జీవిత ప్రయాణంలో అక్కలు చేతన, భావన, చెల్లి పూజ, తమ్ముడు రోహిత్ ఎంతో సాయం చేశారు. ప్రతి అడుగులోనూ వారు నాకు వెన్నంటే నిలిచారు. కంటిచూపు సరిగా లేదని నేనిప్పుడు బాధపడ లేదు. ఎందుకంటే నా వల్ల నా తల్లిదండ్రుల కళ్లు మెరుస్తున్నాయి.
నేను సంపాదించిన డబ్బులో కొంత దివ్యాంగ విద్యార్థుల కోసం ఖర్చుచేస్తాను. ఆగ్రాలో దివ్యాంగుల కోసం ఒక సంస్థను స్థాపించాలని అనుకుంటున్నాను. అక్కడ దివ్యాంగ చిన్నారులు వచ్చి కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. చదువుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సైనికులు పాకిస్తాన్ వెళ్లారా, అక్కడి స్టార్ హోటళ్లలోని విదేశీ సైనికులెవరు?
- అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్లకు తాలిబాన్‌కు మధ్య తేడా ఏంటి?
- ''ప్రజలను గౌరవించండి, మనం వారి సేవకులం'' -ఫైటర్లతో తాలిబాన్
- ‘తాలిబాన్ల రాకతో శాంతి వెల్లివిరుస్తుంది’ - పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది
- ‘బుర్ఖా వేసుకుని, మారువేషంలో 11 చెక్పాయింట్లను దాటి వెళ్లా. కానీ..’
- ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా.. తాలిబాన్‌ను ఎందుకు ఓడించలేకపోయింది?
- తాలిబాన్లు అధికారంలోకి రావడం వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం
- ‘పాకిస్తాన్ మాట వినకపోతే.. ప్రపంచానికి పెద్ద సమస్య తప్పదు’ - పాక్ మంత్రి ఫవాద్
- అఫ్గానిస్తాన్: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పాక్ సరిహద్దుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు
- తాజా నర మాంసాన్ని మేలైన ఔషధంగా ప్రాచీన వైద్య నిపుణులు ఎందుకు భావించేవారు?
- 'భారత అధికారుల్ని తీసుకొస్తుంటే తాలిబాన్లు చుట్టుముట్టిన వేళ..' : తెలుగు కమాండో రాజశేఖర్ స్వానుభవం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








