అమితాబ్ బచ్చన్‌కు 80 ఏళ్లు: మీరు ఇంతకు ముందెన్నడూ చూడని సూపర్ స్టార్ అరుదైన ఫొటోలు

ఫొటో సోర్స్, SMM Ausaja archive
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అక్టోబరు 11న 80వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రదేశాల్లో బచ్చన్ సినీ కెరీర్ తొలినాళ్లలో నటించిన కొన్ని సినిమాలను, అరుదైన ఫోటోలను ప్రదర్శిస్తున్నారు.
ఈ ప్రదర్శన అక్టోబరు 08న ప్రారంభమయింది. బచ్చన్ కెరీర్ తొలినాళ్లలో నటించిన కొన్ని సినిమాలను ప్రదర్శిస్తారు. హెరిటేజ్ ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థ ఈ ప్రదర్శనను నిర్వహిస్తోంది. వీటిని దేశవ్యాప్తంగా 17 నగరాల్లో 22 సినిమా హాళ్లలో నాలుగు రోజుల పాటు ప్రదర్శిస్తారు.
ఈ సంస్థను శివేంద్ర సింగ్ దుంగార్ పూర్ నిర్వహిస్తున్నారు. ఆయన దర్శకులు, సినీ పరిరక్షకులు, సంరక్షకులు.
బచ్చన్ నటించిన 60 సినిమాలను ముంబయిలోని నిర్ణీత ఉష్ణోగ్రతలతో కూడిన ఆర్క్‌హైవ్‌లో సంరక్షించే ప్రయత్నాలు చేస్తున్న వారిలో ముందున్నారు.
ఈ "ఆర్క్ హైవ్ పని చేస్తున్న తీరుకు అంతర్జాతీయ ప్రతిష్టను సంపాదించుకుంది" అని డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ అన్నారు.
సినిమా చరిత్రకారులు, రచయత, సినీ కళాఖండాల స్మృతుల సంరక్షకులు ఎం ఎం అసాజా సేకరించిన ఫోటోల నుంచి 50 ఫోటోలను ఈ స్క్రీనింగ్ తో పాటు ప్రదర్శిస్తారు.
అసాజా గత మూడు దశాబ్దాల నుంచి సినిమాలకు సంబంధించిన జ్ఞాపకాలను సేకరిస్తున్నారు. ఆయన అనేక పుస్తకాలను రచించారు.
ఈ ప్రదర్శనలో పెట్టిన కొన్ని అమితాబ్ బచ్చన్ అరుదైన ఫోటోలు.

ఫొటో సోర్స్, SMM AUSAJA ARCHIVE
ఈ ఫొటోలో అభిమాన్ సినిమా షూటింగ్ సమయంలో బచ్చన్, భార్య జయ బాదురితో కలిసి ఉన్నారు. సంగీత నేపథ్యం ప్రధానాంశంగా తీసిన ఈ సినిమాకు రిషికేష్ ముఖర్జీ దర్శకత్వం వహించారు.
ఈ సినిమాలో బచ్చన్ భార్య ఎదుగుదలను సహించలేని అభద్రతా భావంతో ఉన్న వ్యక్తిగా నటించారు. సినిమాలో ఆమె గాయనిగా పేరు తెచ్చుకుంటారు.
ఈ సినిమా 1973లో విడుదలయింది. బచ్చన్ కు బాదురికి పెళ్ళైన నెల రోజుల తర్వాత సినిమా విడుదలయింది.
బాక్స్ ఆఫీస్ దగ్గర విజయవంతమయింది.
బచ్చన్ బాదురి కలిసి నటించిన ప్రముఖ సినిమాల్లో ఇదొకటి అని సినీ విమర్శకులు జై అర్జున్ సింగ్ అన్నారు. ఈ సినిమా సంగీతానికి కూడా విశేష ఆదరణ లభించింది. బచ్చన్ కెరీర్ తొలి రోజుల్లో విజయవంతమైన సినిమాల్లో అభిమాన్ ఒకటి.

ఫొటో సోర్స్, SMM AUSAJA ARCHIVE
దేవా సినిమాలో నటించేందుకు బాలీవుడ్ డైరెక్టర్ సుభాష్ ఘయ్ బచ్చన్ ను ఎంపిక చేసుకున్నారు. కానీ, ఈ సినిమా ఎప్పటికీ వెలుగు చూడకపోవడానికి స్పష్టమైన కారణాలు మాత్రం ఎవరికీ తెలియవు.
ఈ సినిమాలో బచ్చన్ ది చట్ట వ్యతిరేక శక్తిగా నటించాల్సిన పాత్ర. కొన్ని దృశ్యాలు, ఒక డాన్స్ చిత్రీకరించిన తర్వాత ఘయ్ సినిమాను నిలిపేశారని కొన్ని నివేదికలు చెబుతాయి.
ఇది 1980ల మధ్యలో ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తీసిన ఫోటో. ఈ సినిమా షూటింగ్ నిలిపేసిన తర్వాత, వీరిద్దరూ కలిసి తిరిగి పని చేయలేదు.
"అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఇప్పటి వరకు పని చేయలేకపోయాను. నేను దేవా స్క్రిప్ట్ తో ఆయన దగ్గరకు వెళ్లాను. ఈ సినిమా పూర్తి కాకపోవడానికి నాదే తప్పు. నాకు మరో అవకాశం రాలేదు" అని ఘయ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
"చాలా సార్లు ఆయనతో కలిసి పని చేయాలని అనుకున్నాను. కానీ, అమితాబ్ బచ్చన్ తో సినిమా తీయాలంటే ఆయన స్థాయికి సరిపడే విధంగా, ఆయనకు తగిన పాత్రతో కూడినదై ఉండాలి" అని అన్నారు.

ఫొటో సోర్స్, SMM AUSAJA ARCHIVE
విలన్ ను అణచివేస్తూ కనిపిస్తున్న ఫోటో 1973 లో నిర్మించిన బంధే హాత్ సినిమా లోనిది. అమితాబ్ బచ్చన్ వెనుక సినీ దర్శకులు ఓపీ గోయల్ కనిపిస్తారు.
ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ దొంగగా ద్విపాత్రాభినయం చేశారు. అయితే, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించలేదు.

ఫొటో సోర్స్, SMM AUSAJA ARCHIVE
రాఖీతో కలిసి ఉన్న ఈ ఫోటో 1979 లో నిర్మించిన జుర్మానా సినిమా లోనిది. సినిమాకు రిషికేష్ ముఖర్జీ దర్శకత్వం వహించారు.
వీరితో పాటు ఫోటోలో దర్శకులు దేబేష్ గోష్ కూడా ఉన్నారు.
ఇందులో బచ్చన్ ప్లే బాయ్ పాత్రలో నటించారు.
"ఈ సినిమా నిర్మించడానికి చాలా కాలం పట్టింది" అని జై అర్జున్ సింగ్ అంటారు. ముఖర్జీ, బచ్చన్ కలిసి పని చేసిన 8 సినిమాల్లో జుర్మానా ఒకటి. "ముఖర్జీ సినిమాల్లో నటించడాన్ని తన గొప్పతనం అని చెప్పలేనని అమితాబ్ అంటారు.
"ఈ సినిమాల్లో కేవలం దర్శకుడు చెప్పిన పని చేశానని అంటారు" అని సింగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, SMM AUSAJA ARCHIVE
మర్ద్ సినిమా షూటింగ్‌లో తీసిన ఈ చిత్రంలో బచ్చన్‌తో పాటు సినిమాటోగ్రాఫర్ జల్ మిస్త్రీ ఉన్నారు.ఈ యాక్షన్ సినిమా 1985లో విజయవంతమైన సినిమా.
ఈ చిత్రానికి మన్ మోహన్ దేశాయ్ దర్శకత్వం వహించారు.
ఈ సినిమాతో అమితాబ్‌ను మాస్ హీరోగా మార్చేశారు.
ఈ సినిమాలో బచ్చన్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్య్ర సమార యోధుని కుమారునిగా నటించారు.
"ఈ సినిమాలో అమితాబ్ నటన తిరుగులేనిది. ఈయనకు ధీటుగా మరెవ్వరూ నటించలేదు" అని ఒక సినీవిమర్శకులు రాశారు.
అయితే, ఈ సినిమా విజయవంతం అవ్వడం పట్ల కొంత మంది అనుమానాలు వ్యక్తం చేశారు.
"మర్ద్ లాంటి సినిమాను విజయవంతం చేయడం చూస్తుంటే ప్రేక్షకుల అభిరుచి తెలుస్తోంది. కానీ, ఈ ఏడాది అత్యంత కలెక్షన్లను సాధించిన సినిమా ఇది" అని ఒక విమర్శకులు సినీ పత్రికలో రాశారు.

ఫొటో సోర్స్, SMM AUSAJA ARCHIVE
1998లో నిర్మించిన హీరో హీరాలాల్ సినిమా సెట్‌లో ఫోటో ఇది. ఈ సినిమాకు కేతన్ మెహతా దర్శకత్వం వహించారు.
ఈ ఫొటోలో ఎడమ వైపున మెహతా, సంజన కపూర్, హాస్య నటులు జానీ లీవర్, నిర్మాత గుల్ ఆనంద్ ఉన్నారు.
ఈ సినిమాలో ఆటో డ్రైవర్ పాత్ర పోషించిన నసీరుద్దీన్ షా సినిమాల్లో నిలదొక్కుకుంటున్న రూపా కపూర్ ను కలుస్తారు. ఈ ఇద్దరు ప్రేమలో పడతారు.
సినిమాలో బచ్చన్ అతిధి పాత్రలో నటించారు. ఈ ఒక్క సినిమాలోనే బచ్చన్ మెహతాతో కలిసి పని చేశారు.
ఇవి కూడా చదవండి:
- భారత రాష్ట్ర సమితి: జాతీయ పార్టీ స్థాపించడానికి అర్హతలేమిటి.? ఒక పార్టీకి జాతీయ హోదా ఎలా వస్తుంది?
- కొల్లాపూర్ మహాలక్ష్మి - అంబాబాయి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
- బల్లి పడితే ఆహారం విషపూరితం అవుతుందా, ఇంట్లో బల్లులు లేకపోతే మనుషులకు ఏం జరుగుతుంది?
- మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
- భారత రాష్ట్ర సమితి పార్టీ లక్ష్యం ఏంటి? కేసీఆర్ 'తెలంగాణ ప్రాంతీయ ఐడెంటిటీ'ని దాటుకుని జాతీయ నాయకుడు కాగలరా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














