Ponniyin Selvan 1: మణిరత్నం కలల సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడానికి కారణాలేంటి?

ఫొటో సోర్స్, LYCA/Madras talkies
ప్రముఖ దర్శకుడు మణిరత్నం కలల ప్రాజెక్టు ‘‘పొన్నియన్ సెల్వన్:1’’ బాక్సాఫీసుపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? ఈ సినిమా కథాకమామిషులపై సుధా జీ తిలక్ విశ్లేషణ ఇదీ.
తమిళ్‌లో క్లాసిక్ నవలగా ప్రఖ్యాతి గాంచిన ‘‘పొన్నియన్ సెల్వన్’’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. భారత్‌కు చెందిన అతిగొప్ప రాజుల్లో ఒకరైన రాజరాజ చోళ కుటుంబంలోని పాత్రల చుట్టూ ఈ కల్పిత కథ తిరుగుతుంది.
రాజరాజ చోళ అంటే చోళ వంశానికి చెందిన ‘‘రాజులకు రాజు’’ అనే అర్థముంది. ఈ వంశం తమిళ భూభాగాన్ని తొమ్మిది నుంచి 13వ శతాబ్దం మధ్య పాలించింది.
చోళ రాజుల్లో రాజరాజ చోళ ఆద్యుడు కాదు. కానీ, ఆ వంశ పాలనను పతాక స్థాయికి తీసుకెళ్లింది మాత్రం ఆయనేనని చెప్పుకోవాలి. ఒక చిన్న రాజ్యాన్ని అతిపెద్ద సామ్రాజ్యంగా ఆయన విస్తరించారు.
శ్రీలంక, మాల్దీవులు, సుమత్రా, థాయిలాండ్, మలేసియాలోని కొన్ని ప్రాంతాలపైనా ఆయన ప్రభావం ఉండేది. మరోవైపు చైనాతోనూ ఆయనకు దౌత్య సంబంధాలు ఉండేవి.

ఫొటో సోర్స్, LYCA/Madras talkies
అప్పటివరకు ఏ రాజూ ఊహించని స్థాయికి సామ్రాజ్యాన్ని రాజరాజ తీసుకెళ్లారని చరిత్రకారుడు సునిల్ ఖిలానీ తన పుస్తకంలో రాసుకొచ్చారు. ‘‘ఆయన ఆధీనంలో భారీ వాణిజ్య నౌకలు ఉండేవి. సముద్ర మార్గం గుండా దండయాత్రలు చేసి భారీగా సంపదను ఆయన తన రాజ్యానికి తరలించుకొని వచ్చేవారు’’అని సునిల్ చెప్పారు.
రాజరాజ చోళతోపాటు ఆ కుటుంబ సభ్యుల పాత్రల చుట్టూ కల్పిత కథగా పొన్నియన్ సెల్వన్ నవల వచ్చింది. దీని ఆధారంగా భారీ తరాగణంతో 70 మిలియన్ డాలర్ల (రూ.500 కోట్లు) వ్యయంతో సినిమా తెరకెక్కింది. ప్రధానంగా పొన్నియన్ సెల్వన్ (రాజరాజ చోళ) సింహాసనాన్ని ఎలా అధిష్టించారు? అనారోగ్యంతో పాలనకు దూరమైన తండ్రి తర్వాత ఆయన సింహాసనంపైకి ఎలా వచ్చారు? అనే అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
ఈ మధ్యలో కొన్ని తిరుగుబాట్లు, సింహాసనాన్ని అధిష్టించేందుకు రాచ కుటుంబంలో కొందరి ప్రయత్నాలు, శత్రువులతో వారు చేతులు కలపడం ఇలా కథ ముందుకు వెళ్తుంది.
అటువైపు శక్తిమంతమైన మరో రాజ కుటుంబ వంశీయురాలు నందినిగా బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కనిపిస్తారు. తన మాజీ ప్రేమికుడైన యువరాజు, రాజరాజ చోళుడి అన్నయ్య ఆదిత్య కరికాళన్‌కు సింహాసనం దక్కకుండా ఆమె ఎత్తులు వేస్తుంటారు.

ఫొటో సోర్స్, LYCA/Madras talkies
ఆమెకు ఎత్తులకు ఇటువైపు కుందైవి పైఎత్తులు వేస్తుంటారు. ఈ పాత్రలో త్రిష కనిపిస్తారు. తన సోదరులకు మద్దతుగా ఆమె పావులు కదుపుతుంటారు. నిబంధనల ప్రకారం అర్హులైన వారికే సింహాసనం అందేలా ఆమె ప్రయత్నిస్తుంటారు.
రాకుమారుడు ఆదిత్య కరికాళుడి మిత్రుడైన వందియ దేవుడి పాత్రలో కార్తి కనిపిస్తారు. యోధుడైన వందియ దేవుడు తనకు అప్పగించిన బాధ్యతలను ముందుకు తీసుకెళ్తుంటారు. తన తెలివితో ఆపదలను తప్పిస్తూ, ఎత్తులకు పైఎత్తులు వేస్తుంటాడు.
చోళుల సామ్రాజ్య వైభవం గురించి ఈ నవలలో చాలా గొప్పగా వర్ణిస్తారు. ఆధునిక తమిళనాడులోనూ వీటి ఆనవాళ్లు మనకు కనిపిస్తుంటాయి.
రాజుల శిలా శాసనాలు, శిల్పాల్లో ఆనాటి విశేషాలు మనం చూడొచ్చు. చోళుల రాజధాని తంజావూరులోని ఒక గ్రానైట్ దేవాలయంలో ఇప్పటికీ నాటి సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా శిల్పాలు కనిపిస్తాయి.
పొన్నియన్ సెల్వన్ కథను 1955లో తమిళ్ మ్యాగజైన్‌ను కల్కికి ఒక ధారావాహిక రూపంలో ప్రముఖ జర్నలిస్టు, రచయిత కల్కి కృష్ణమూర్తి రాశారు. ఇది దాదాపు మొత్తంగా 2,000 పేజీలు ఉంటుంది. ఆ తర్వాత దీన్ని ఇంగ్లిష్‌లోకి కూడా అనువదించారు.

ఫొటో సోర్స్, LYCA/Madras talkies
పిల్లల కోసం ప్రచురించే బొమ్మల కథలు, నాటకాల్లో ఇప్పటికీ ఈ కథ మనకు కనిపిస్తుంటుంది.
‘‘ఆ నవలను వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల తమిళ ప్రజలూ ఆస్వాదిస్తుంటారు. అయితే, 21వ శతాబ్దంలో గేమ్ ఆఫ్ థ్రోన్స్, బాహుబలిలను ఆదరించిన ప్రేక్షకులు.. 10వ శతాబ్దంనాటి తమిళ రాజకీయ కథను సినిమాగా ఎలా చూస్తారోనని తలచుకుంటే చాలా ఆసక్తిగా అనిపిస్తోంది’’అని చెన్నైకు చెందిన సినిమా విశ్లేషకుడు ప్రీతమ్ చక్రవర్తి వ్యాఖ్యానించారు.
పొన్నియన్ సెల్వన్ ద్వారా ప్రేక్షకులకు మంచి ఆనుభూతిని ఇవ్వాలని తను భావించినట్లు దర్శకుడు మణిరత్నం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
రక్తం ఏరులై పారిన యుద్ధాలు, వీరోచితంగా పోరాడే సైనికులు, యుద్ధ భూమిలో స్వైరవిహారం చేసే ఏనుగులు, గుర్రాలు, కళ్లను కట్టిపడేసే పాటలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంటాయి. సముద్ర మార్గంలో దండ యాత్రలు, మధ్యలో భారీ నౌకలు మునిగిపోవడం లాంటి ఘట్టాలు కళ్లుతిప్పుకోనివ్వవు. మరోవైపు ఆనాటి సంభాషణలను కూడా నేటి ప్రేక్షకులకు తగినట్లుగా మార్పులు చేశారు.
సంగీతం కూడా ఇటు జానపదం అటు పశ్చిమ దేశాల బాణీలు, మధ్యలో సూఫీ ఇలా అన్ని కలగలసి వినిపిస్తాయి. వీటిని ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ స్వరపరిచారు.
చారిత్రక నవలను రెండు భాగాలుగా సినిమా తీయడంపై మణిరత్నం మీద విమర్శకుల ప్రశంసలు కురుస్తున్నాయి. రెండో భాగం వచ్చే ఏడాది విడుదల కానుంది. కరోనావైరస్ మహమ్మారి వ్యాపిస్తున్నప్పటికీ, అనుకున్న సమయానికి సినిమాను 150 రోజుల్లో మణిరత్నం పూర్తి చేయగలిగారు.
గత వారాంతంలో ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి స్పందన వచ్చింది.
చెన్నైలో ప్రత్యేక షోలకూ ప్రజలు భారీగా వరుసలు కడుతున్నారు. పెద్దయెత్తున థియేటర్లకు ప్రజలు వస్తున్నారు. మరోవైపు థియేటర్ల బయట డప్పులు, వాయిద్యాలతో వేడుకలా కనిపిస్తోంది. మొత్తంగా బాక్సాఫీసు వద్ద సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది.
మరోవైపు సినిమా తర్వాత తమిళనాడులోని చారిత్రక ప్రాంతాలను చూసేందుకు వెళ్తున్న పర్యటకుల సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా నవలలో ప్రస్తావించిన ప్రాంతాలకు పర్యటకుల తాకిడి ఎక్కువైంది.
తర్వాత ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠ రేపుతూ మొదటిభాగం ముగిసింది. వచ్చే ఏడాది విడుదల కానున్న రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని అభిమానులు చెబుతున్నారు.
(సుధ జి తిలక్.. దిల్లీకి చెందిన జర్నలిస్టు, రచయిత)
ఇవి కూడా చదవండి:
- కొల్లాపూర్ మహాలక్ష్మి - అంబాబాయి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
- లీటర్ రూ. 200.. బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు తాగుతున్న ఈ నీటి ప్రత్యేకత ఏంటి?
- మొబైల్‌కు సిగ్నల్స్ దొరక్క ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేస్తే సరి
- పొన్నియన్ సెల్వన్ 1 రివ్యూ: మణిరత్నం సినిమా క్లాసిక్ అవుతుందా? కన్ఫ్యూజ్ చేస్తుందా?
- యుక్రెయిన్: పెంపుడు పులి, జాగ్వర్ను వదిలి బ్రతుకు తెరువు కోసం పోలండ్ వెళ్లిన తెలుగు వైద్యుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















