బ్రహ్మాస్త్ర: ఉజ్జయిని మహాకాళేశ్వర దర్శనం చేసుకోలేకపోయిన రణబీర్ కపూర్, ఆలియా భట్... ఏమిటీ వివాదం?

బ్రహ్మాస్త్ర

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, షురైహ్ నియాజీ
    • హోదా, బీబీసీ కోసం

బ్రహ్మాస్త్ర చిత్రం కోసం ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని దర్శించి, పూజలు చేసేందుకు వెళ్లిన బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, ఆలియా భట్‌లను హిందూ సంస్థలు అడ్డుకున్నాయి. దాంతో, దైవదర్శనం కాకుండానే ఈ జంట వెనుదిరిగారు.

మంగళవారం ఈ బాలీవుడ్ జంట ఇండోర్ విమానాశ్రయంలో దిగి నేరుగా ఉజ్జయిని మహాకాళేశ్వర దర్శనానికి వెళ్లారు. సాయంత్రం హారతికి హాజరవుదామనుకున్నారు. కానీ, హిందూ సంస్థలు నిరసనలకు దిగడంతో వెనుదిరిగి ముంబయికి వెళ్లిపోయారు.

రణబీర్, ఆలియా జంటగా నటించిన బ్రహ్మాస్త్ర చిత్రం సెప్టెంబర్ 9, శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమా విజయం కోసం పూజలు చేసేందుకు రణబీర్, ఆలియా ఉజ్జయిని వెళ్లారు.

వాళ్లు వస్తున్నారన్న సమాచారం అందగానే బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ఆలయానికి చేరుకుని వాళ్లను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.

మాహాకాళేశ్వరుడు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, మాహాకాళేశ్వరుడు

అయితే, ఈ గొడవ జరుగుతున్నప్పటికీ ఆ జంట ఆలయాన్ని దర్శించే ఏర్పాట్లు చేశామని, కానీ వాళ్లు దేవుడిని దర్శించుకోకుండానే వెనుదిరిగారని స్థానిక పోలీసు యంత్రాంగం పేర్కొంది.

ఈ విషయంపై రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ, "నిరసన తెలుపడం వేరే విషయం. దర్శనానికి ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది. కానీ, వాళ్లు దర్శనం చేసుకోలేదు" అన్నారు.

"ప్రజల మనోభావాలను దెబ్బతీసే మాటలు కళాకారులు మాట్లాడకూడదు" అని కూడా అన్నారు.

రణబీర్ స్వయంగా గొడ్డు మాంసం తింటానని చెప్పారని, అందుకే నిరసన చేపట్టామని బజరంగ్ దళ్ కార్యకర్తలు చెప్పారు.

"గొడ్డు మాంసం తినే వ్యక్తిని ఆలయంలోకి ఎలా అనుమతిస్తారు? దీనిపై అధికార యంత్రాంగం సమాధానం చెప్పాలి" అని బజరంగ్ దళ్ నేత అంకిత్ చౌబే అన్నారు.

ఆలియా భట్.

ఫొటో సోర్స్, RRR/FACEBOOK

రణబీర్, ఆలియా ఆలయం దగ్గరకు వెళ్లినప్పుడు ఏం జరిగింది?

చాలామంది బాలీవుడ్ నటులు, తమ కొత్త సినిమా విడుదలకు ముందు ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దర్శనం చేసుకోవడం పరిపాటి.

మంగళవారం నాడు రణబీర్ కపూర్, అలియా భట్, బ్రహ్మాస్త్ర చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ ఆలయ ప్రాంగణానికి చేరుకోగానే నిరసనలు ప్రారంభమయ్యాయి. దాంతో, వాళ్లు ఉజ్జయిని కలెక్టర్ ఇంటికి వెళ్లారు.

హిందుత్వ సంస్థల కార్యకర్తలు వాళ్లకు నల్ల జెండాలు చూపించేందుకు ప్రయత్నిస్తుండగా, పోలీసులు రంగంలోకి దిగారు. వాళ్లను అడ్డుకునేందుకు బలప్రయోగం చేయాల్సి వచ్చింది.

చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ పోలీసు బందోబస్తు మధ్య ఆలయంలోకి వెళ్లి, పూజలు చేశారు. ఆయనకు హిందూ సంస్థల కార్యకర్తలు నల్లజెండాలు చూపించారు.

అంతకుముందు, మంగళవారం సాయంత్రం ఇండోర్ విమానాశ్రయానికి చేరుకున్న బాలీవుడ్ జంట సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు.

ఉజ్జయినికి వెళ్లే దారిలో ఉన్నామని, బ్రహ్మాస్త్ర సినిమా గురించి ఉత్సహాంగా ఎదురుచూస్తున్నామని, ప్రజలందరూ ఈ సినిమా చూడాలని ఆలియా భట్ ఆ వీడియోలో విజ్ఞప్తి చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

బజరంగ్ దళ్ కార్యకర్తలు ఏం చెప్పారు?

గోమాత గురించి రణబీర్ కపూర్ చెప్పిన మాటలను నిరసిస్తూ తాము మహాకాళేశ్వర ఆలయానికి చేరుకున్నామని భజరంగ్ దళ్ నాయకుడు అంకిత్ చౌబే చెప్పారు.

"గోమాత గురించి తప్పుగా మాట్లాడిన వ్యక్తిని మహాకాళేశ్వరుడి దర్శనం చేసుకోనివ్వకూడదు అనుకున్నాం. మేం వారికి నల్లజెందాలు చూపించడానికి వచ్చాం. కానీ, ప్రభుత్వం మా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంది" అని అంకిత్ చౌబే బీబీసీకి చెప్పారు.

"మా నిరసన ఏ విధంగానూ హింసాత్మకం కాదు. కానీ, మా కార్యకర్తలందరినీ కొట్టారు. దేశం మొత్తం ఈ సినిమాని బహిష్కరించాలనే డిమాండ్ వినిపిస్తోంది. దానికి కారణం ఆయన (రణబీర్) చేసిన ప్రకటనలే" అన్నారు చౌబే.

ఈ గొడవ జరుగుతుండగా ఒక కార్యకర్త, సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సీఎస్‌పీ) కాలర్ పట్టుకున్నారు. దాంతో, గొడవ పెద్దదైపోయింది. పోలీసులు ఆ కార్యకర్తను అరెస్ట్ చేసి, ప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకున్నారన్న ఆరోపణలపై కేసు నమోదు చేశారు.

దాంతో, కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి, ఆ కార్యకర్తను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

"ఈ కేసులో మహకాళ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేశారని, ఇది తప్ప ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తలేదని" పోలీసు సూపరింటెండెంట్‌ సత్యేంద్ర కుమార్‌ శుక్లా తెలిపారు.

రణబీర్ కపూర్, ఆలియా భట్ జంట మంగళవారం రాత్రి ముంబై తిరిగి వెళ్లిపోయారని చెప్పారు.

వీడియో క్యాప్షన్, RRR మూవీ రివ్యూ: ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి సినిమా ఎలా ఉందంటే..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)