పొన్నియన్ సెల్వన్ 1 రివ్యూ: మణిరత్నం సినిమా క్లాసిక్ అవుతుందా? కన్ఫ్యూజ్ చేస్తుందా?

ఫొటో సోర్స్, @LycaProductions
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
రాజుల కథలు, రాజ్యాల గాథలు, సింహాసనం కోసం వేసే ఎత్తుగడలు, వాటి కోసం పన్నేకుట్రలు, వెన్ను పోట్లు, యుద్ధ నీతి.. ఇవన్నీ చందమామ కథల్లోనే కాదు, చరిత్రలోనూ ఉన్నాయి. వాటిని పట్టుకోవడం తెలియాలంతే. ఇదివరకటి మాటేమో గానీ, ఇప్పుడు ఎలాంటి కథనైనా చెప్పే స్థాయి మన 'సినిమా'కి దక్కింది. బడ్జెట్ పరిధులు లేవు. ఎలాంటి విజువల్ అయినా తెరపైకి తీసుకుని రావొచ్చు.
అందుకే తన చిరకాల స్వప్నాన్ని ఇప్పుడు నెరవేర్చుకోవడానికి నడుం బిగించాడు మణిరత్నం. 'పొన్నియన్ సెల్వన్' మణిరత్నం కలల ప్రాజెక్ట్. ఇన్నాళ్లకి తెరపైకొచ్చింది. కార్తి, విక్రమ్, జయం రవి, ఐశ్వర్య, త్రిష.. ఇలా హేమాహేమీలను రంగంలోకి దించాడు మణిరత్నం.
ఓ వైపు మణిరత్నం సినిమా. మరోవైపు 'పొన్నియన్ సెల్వన్' అనే క్లాసిక్ నవల. వాటికి మించి స్టార్ తారాగణం. మరి, మణి కలల సినిమా ఎలా ఉంది? ఓ క్లాసిక్ నవలను, చరిత్రలోని కొందరు వ్యక్తులను తీసుకుని రాసిన కల్పిత కథను ప్రేక్షకులకు నచ్చేలా, మెచ్చేలా తెరకెక్కించాడా?

ఫొటో సోర్స్, @LycaProductions
చరిత్రలోకి ప్రయాణం
సుందర చోళుడు (ప్రకాష్ రాజ్) చోళ సామ్రాజ్య చక్రవర్తి. తన తదుపరి వారసుడిగా ఆదిత్య కరికాళుడు (విక్రమ్)ని ప్రకటిస్తాడు. సుందర చోళుడి సోదరుడి కుమారుడు మధురాంతకుడు (రెహమాన్) సింహాసనంపై కన్ను వేస్తాడు. తనకి సామంతరాజులంతా వంత పాడతారు. వీళ్లందరినీ పళు వెట్టరాయర్ (శరత్ కుమార్) ఏకం చేస్తాడు.
ఈ కుట్ర ఎందుకు జరుగుతుందో? వెనుక ఎవరున్నారో తెలుసుకునే బాధ్యతని ఆదిత్య కరికాళుడు తన మిత్రుడైన వందియ దేవుడు (కార్తి)కి అప్పగిస్తాడు. ఓ వేగులా ఈ కార్యాన్ని నెత్తిమీద వేసుకొన్న వందియ దేవుడు తన బాధ్యతని ఎలా నెరవేర్చాడు? అసలు చోళ సామ్రాజ్యంలో ఏం జరుగుతోంది? ఎవరు ఎలాంటి కుట్రలు పన్నారు? ఈ కుట్రల్లో నందిని దేవి (ఐశ్వర్యరాయ్), కుందైవి (త్రిష)ల భాగమేమిటి? అనేది వెండి తెరపై చూడాలి.
ఇది చరిత్ర ఆధారంగా రాసిన కల్పిత కథ. అందుకే చరిత్రలో చూసిన కొన్ని పాత్రలు తెరపై కదులుతాయి. కల్కి రాసిన 'పొన్నియన్ సెల్వన్' నవలకు తమిళ సాహిత్యంలో ప్రముఖ స్థానం ఉంది. ఆ నవలలో కాల్పనిక చరిత్ర ఉంది. దానికి ఇంకొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకొన్న మణిరత్నం ఆ కథను దృశ్య రూపంలోకి తీసుకొచ్చాడు.
చోళుల చరిత్రేమిటి? పాండ్యులతో వైరం ఏమిటి? అనే విషయాన్ని చిరంజీవి వాయిస్ ఓవర్‌తో రెండు ముక్కల్లో వినిపించేశాడు మణిరత్నం. ఆ తరవాత ఓ భారీ యుద్ధ సన్నివేశం మొదలవుతుంది. కథలోకి వెళ్లడానికి మణి ఎక్కువ సమయం తీసుకోలేదు. కాకపోతే ఇది కాస్త వివరంగా చెప్పాల్సిన కథ. వాయిస్ ఓవర్ ద్వారా ఫటాఫట్ లాగించేస్తే అర్థం కాదు. చిరు చెప్పిన కథకూ కాస్త విజువలైజేషన్ జోడించాల్సింది.
చోళులూ, పాండ్యులూ, వారి చరిత్రను తమిళులు అర్థం చేసుకొన్నంతగా తెలుగు వారికి తెలీదు. అందుకే కథలోని పాత్రలకు అంత త్వరగా కనెక్ట్ అవ్వరు. ఓ చందమామ కథ అనుకొంటే మాత్రం ఈజీగా ఫాలో అయిపోవొచ్చు. ఇంత కథలో జరిగిందేమిటంటే.. సింహాసనం కోసం రెండు వర్గాల కుమ్ములాట. వాటి కోసం ఎత్తుకు పై ఎత్తులు వేసుకోవడం.
చాలా పాత్రల్లో రెండు పార్శ్వాలుంటాయి. ఉదాహరణకు.. ఐశ్వర్యరాయ్ పోషించిన నందిని దేవి పాత్ర తీసుకొంటే.. ఆ పాత్ర స్వభావం చాలా క్లిష్టంగా అనిపిస్తుంది. తను పాజిటివ్ మైండ్‌తో ఉందా? నెగెటివ్‌గా ఆలోచిస్తోందా? అనేది అంత త్వరగా అర్థం చేసుకోలేం. బహుశా, నవలలోని ఇలాంటి పాత్రలు మణిరత్నంని బాగా ఆకర్షించి ఉంటాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మణిరత్నం మైండ్ గేమ్
చారిత్రక నవల అంటే భారీ సెట్స్, యుద్ధాలు.. ఇవన్నీ ఊహిస్తాం. కానీ, మణి వాటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదనిపిస్తుంది. ఈ సినిమాలో మూడు యాక్షన్ ఘట్టాలు కీలకం. ఒకటి.. సినిమా ప్రారంభంలో చూపించే యుద్ధ సన్నివేశం. ఈ సినిమా విజువల్‌గా ఏ స్థాయిలో ఉండబోతోంది? అనేది ఆ వార్ సీన్ చూస్తే తెలిసిపోతుంది.
బాహుబలిలో యుద్ధ సన్నివేశాల్ని చూసిన వాళ్లకు మణిరత్నం యుద్ధం పెద్దగా ఆనకపోవచ్చు. పైగా క్యారెక్టర్లని రిజిస్టర్ చేయకుండా నేరుగా వార్ సీక్వెన్స్‌లోకి వెళ్లిపోయాడు మణిరత్నం. దాంతో యుద్ధం ఎందుకు జరుగుతోందో? ఎవరు ఎవరిపై యుద్ధం చేస్తున్నారో? ఎందుకు చేస్తున్నారో తెలీదు. దాంతో తెరపై అంత భారీ యాక్షన్ హంగామా నడుస్తున్నా ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వడు.
ఇంట్రవెల్ తరవాత మరో భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. అక్కడ కథలోని కీలక పాత్రధారి అయిన అరుళ్ మౌళి (జయం రవి) పాత్రని పరిచయం చేశాడు. ఆ యాక్షన్ సీన్ తాలుకూ అవసరం, దానివల్ల కథకి ఒరిగిన ప్రయోజనం మణి చెప్పలేకపోయాడు. ఇది కల్పిత చరిత్ర కాబట్టి, యుద్ధాలు కూడా చూపించాలి కాబట్టి చూపించినట్టు అనిపిస్తుందంతే. వేలాది మంది సైన్యంతో.. ఓ విజువల్ వండర్‌గా మార్చాల్సిన యుద్ధ సన్నివేశం అది. దాన్ని కూడా పైపైనే తీర్చిదిద్దాడనిపిస్తుంది.

ఫొటో సోర్స్, @LycaProductions
క్లైమాక్స్‌లో ఓడపై పోరాటం. అది మాత్రం కాస్త బాగా డిజైన్ చేశారు. నిజానికి విజువల్ వండర్‌గా ఈ కథ చెప్పాలి అని మణిరత్నం అనుకోలేదు. పొన్నియన్ సెల్వన్‌లోని పాత్రలు, వాటి స్వభావాల్ని తెరకు పరిచయం చేద్దామనుకొన్నాడు. వాళ్ల మైండ్ గేమ్‌ని చెప్పాలనుకొన్నాడు. అందులో కొంతమేర సఫలీకృతం అయ్యాడు కూడా.
కాకపోతే, ఎంతైనా ఇది చరిత్ర పాఠం లాంటి కథ. అంత ఠక్కున బుర్రకు ఎక్కదు. విడమరచి చెప్పాల్సిన చోట కూడా.. మణిరత్నం మైండ్ గేమ్ ఆడడం వల్ల - కొన్ని సన్నివేశాలు, కొన్ని పాత్రల స్వభావాలూ ఏమాత్రం అర్థం కాకుండా పోతాయి.
ఇది కాల్పనిక చరిత్ర కాబట్టి ప్రేక్షకుల దృష్టి కోణంలోంచి తీయాలి. వాళ్లకు తెలిసిన చరిత్ర చెబుతున్నా, 'వావ్' అనుకొనే మూమెంట్స్ క్రియేట్ చేయాలి. ఆ విషయంలో మణిరత్నం ఫెయిల్ అయ్యాడనిపిస్తుంది. తొలి సన్నివేశం నుంచి ఈ కథ నిదానంగా నడుస్తుంది తప్ప, ఉలిక్కి పడే సన్నివేశాలేం కనిపించవు.
బహుశా, ఈ కథను ఉన్నదున్నట్టుగానే చెప్పాలి అనేది మణిరత్నం ఉద్దేశం కావొచ్చు. కానీ సినిమా అనేది థియేటరికల్ ఎక్స్‌పీరియన్స్. చరిత్రలోని ఓ పాత్రను కళ్ల ముందు తీసుకొచ్చినప్పుడు మనసులో ప్రతిష్టించుకొనేలా తీర్చిదిద్దాలి. అది పొన్నియన్ సెల్వన్‌లో కుదరలేదు.
ఈ సినిమాని రెండు భాగాలుగా తీసుకొస్తున్నామని చిత్రబృందం ముందే చెప్పేసింది. రెండో భాగం చూడాలన్న కుతూహలం, క్లైమాక్స్‌లో కలిగించే ప్రయత్నం చేసింది. చివరి షాట్, కచ్చితంగా క్యూరియాసిటీ పెంచేదే. అక్కడ్నుంచి కథ మరో మలుపు తిరుగుతుందన్న భరోసాని మాత్రం మణి కల్పించాడు.

ఫొటో సోర్స్, @LycaProductions
కథని నడిపిన కార్తి
ఈ సినిమా నిండా స్టార్లే. ఎంత మంది స్టార్లున్నా కథని నడిపించేది మాత్రం ఒక్కడే అవుతాడు. ఈ సినిమాలో ఆ బాధ్యతని కార్తి తీసుకొన్నాడు. యువరాజుకు నమ్మిన బంటు వందీయ దేవుడు పాత్రలో కార్తి ఒదిగిపోయాడు. తన అమాయకత్వం, వీరత్వం, చిలిపిదనం ఇవన్నీ ఈ పాత్రలో కనిపిస్తాయి.
కార్తి - ఐశ్వర్యరాయ్, కార్తి, త్రిషల మధ్య సంభాషణలను కూడా బాగా రాశారు. ఈ రెండు చోట్లా కార్తి పాత్రని ప్రేక్షకులు ఓన్ చేసుకొంటారు. కథ ప్రకారం చూస్తే.. పొన్నియన్ సెల్వన్ హీరో విక్రమ్. కానీ విక్రమ్ పాత్రని అక్కడక్కడ మాత్రమే ఎలివేట్ చేశారు. బహుశా.. పార్ట్ 2లో అతని కోసం కొన్ని సన్నివేశాలు దాచి ఉంటారు.
జయం రవి కూడా కీలకమైన పాత్రే పోషించాడు. అతని భాగం సెకండాఫ్‌కి పరిమితమైంది.
ఐశ్వర్యరాయ్ క్యారెక్టర్‌లో రెండు షేడ్స్ ఉన్నాయి. చాలా బలమైన పాత్ర అది. అందులో ఐష్ హుందాగా ఇమిడిపోయింది. త్రిష తెరపై మెరిసింది. ఆమె పాత్ర కూడా లోతైనదే. త్రిష - ఐశ్వర్య పాత్రల్ని బలంగా తీర్చిదిద్ది.. మహిళా పాత్రలపై తన ప్రేమని మరోసారి చాటుకొన్నాడు మణిరత్నం.
శరత్ కుమార్, ప్రకాష్ రాజ్ ఇలా హేమాహేమీలైన నటీనటులు ఉండడం వల్ల ఆయా పాత్రలకు మరింత మైలేజీ వచ్చింది.

ఫొటో సోర్స్, @LycaProductions
మెరిసిన మాటలు
తెలుగు వెర్షన్‌కి తనికెళ్ల భరణి సంభాషణలు అందిచారు. ఆయన నేర్పు కొన్ని చోట్ల బాగా కనిపించింది. 'మీ ప్రాణం మీద బహుమతి ఉంది.. తల భద్రం' అని త్రిష అంటే.. 'ప్రాణం మీదే కదా' అని కార్తి శ్లేషతో సమాధానం ఇవ్వడం బాగుంది. ప్రాణం మీదే అనే అర్థం, ప్రాణంపైనే అనే శ్లేష ఈ సంభాషణలో కనిపిస్తుంది. 'మట్టికి తలవంచిన వాడు, ఆకాశానికి ఎదుగుతాడు' లాంటి డైలాగులు అక్కడక్కడ మెరిశాయి.
భారీ బడ్జెట్‌తో తీసిన సినిమా ఇది. మణిరత్నం కెరీర్‌లోనే ఇంత ఖర్చు పెట్టిన సినిమా ఇదే. దానికి తగ్గట్టుగానే విజువల్స్ కుదిరాయి. రెహమాన్ నేపథ్య సంగీతం అంత గొప్పగా ఏం అనిపించదు. పాటలూ అంతే. తోట తరణి కళా నైపుణ్యం అడుగడుగునా కనిపిస్తుంది. పతాక సన్నివేశాల్ని (నౌక పై పోరాటం) బాగా తీర్చిదిద్దారు.
మొత్తంగా చెప్పాలంటే ఇదో కాల్పనిక చరిత్ర. అంత త్వరగా బుర్రకెక్కదు. విడమర్చి చెప్పాల్సిన కథని మణిరత్నం ఇంకాస్త గజిబిజిగా మలిచాడనిపిస్తుంది. తెరపై ఇన్ని పాత్రలున్నా, ఇంత మంది స్టార్లున్నా ఏ పాత్రనీ హీరో గానో, విలన్ గానో చూపించకుండా అన్ని పాత్రలకూ సమానమైన న్యాయం చేయడంలో మణిరత్నం నేర్పరితనం కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- ‘పస్తులైనా ఉందాం ఆ పనికి మాత్రం వెళ్లొద్దని కాళ్ల మీద పడ్డాం.. ఇప్పుడు మాకెవరు దిక్కు’
- ‘ఒక్కసారి నాటితే 60 ఏళ్ల వరకు దిగుబడులు’ - ఖర్జూరం పండిస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతులు
- లీటర్ రూ. 200.. బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు తాగుతున్న ఈ నీటి ప్రత్యేకత ఏంటి?
- చికెన్‌ను స్కిన్‌తో పాటు తినడం మంచిదేనా?
- మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
- Gas flaring: చమురు వెలికితీసే సంస్థలు గ్యాస్‌కు మంట పెడుతున్నాయి ఎందుకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














