డిజిహబ్: మొబైల్‌కు సిగ్నల్స్ దొరక్క ఇబ్బంది పడుతున్నారా... ఇలా చేస్తే సరి

సెల్‌ఫోన్ చూస్తున్న అమ్మాయి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పూర్ణిమ తమ్మిరెడ్డి
    • హోదా, బీబీసీ కోసం

ఒక్కోసారి మొబైల్ నెట్‍వర్క్ సిగ్నల్ బలం చాలా తక్కువగా ఉంటుంది.

అలాంటప్పుడు కాల్స్ కలవవు, కలిసినా మాట సరిగ్గా వినిపించదు. మెసేజీలు వెళ్లనే వెళ్లవు. అతి ముఖ్యమైన పనుల్లో ఉండగా ఇలాంటి ఇబ్బంది కలిగితే మహా చిరాగ్గా ఉంటుంది.

ఇలా జరగడానికి ముఖ్యంగా మొబైల్ నెట్‍వర్కులే కారణం. అయితే కొన్నిసార్లు మన ఫోన్లలో ఉన్న సమస్యల వల్ల కూడా సిగ్నల్ బలహీనపడచ్చు.

ఈ సమస్యను అధిగమించడానికి పాటించాల్సిన కొన్ని చిట్కాలను చూద్దాం.

మొబైల్ సిగ్నల్ టవర్

ఫొటో సోర్స్, Getty Images

ఏర్‌ప్లేన్ మోడ్ టాగిల్ చేయడం/ఫోన్ రీబూట్ చేయడం

ఫోన్లు ప్రతి క్షణమూ మొబైల్ నెట్‍వర్క్ కోసం వెతుకుతూ ఉండలేవు. బ్యాటరీ సమస్యలు వస్తాయి. అందుకని ఒక్కోసారి అవి మొదట కనెక్ట్ అయిన నెట్‍వర్క్‌నుంచి దూరంగా వచ్చేసినా దానికే కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల సిగ్నల్ వీక్ అవుతుంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు ఈ ఇబ్బంది తలెత్తుంది.

అందుకని ఏర్‍ప్లేన్ మోడ్ ఆఫ్ చేసి, ఒక 10 సెకన్లు ఆగి ఆన్ చేస్తే, మళ్లీ కొత్తగా నెట్‍వర్క్ వెతుక్కునే ప్రయత్నం చేస్తుంది.

అప్పుడు దగ్గరున్నదానికి కనెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ. ఏర్‍ప్లేన్ మోడ్ మార్చడం వల్ల ఫలితం కనిపించకపోతే, ఫోన్‍ను మొత్తంగా రీబూట్ చేయచ్చు.

ముఖ్యంగా ఒక నెట్‍వర్క్ జోన్ నుంచి ఇంకోదానికి మారేటప్పుడు రీబూట్ అవసరం పడుతుంది.

వైఫై కాలింగ్

ఫొటో సోర్స్, Getty Images

వై-ఫై కాలింగ్ వాడటం

సిగ్నల్ ఎటూ తక్కువ బలంతో ఉండే ఏరియాల్లో వై-ఫై కాలింగ్ వాడుకోవచ్చు. సెల్యూలార్ నెట్‍వర్క్ నుంచి చేసే కాల్స్ కూడా ఇప్పుడు వై-ఫై సిగ్నల్ వాడుకునే వెసులుబాటు ఉంది.

ఈ సెట్టింగ్ ఎనేబుల్ చేసుకుంటే, వై-ఫై బలంగా ఉండే ఆఫీసు/భవనాలు/ఇళ్ల నుంచి చేసే కాల్స్ క్వాలిటీ అధికంగా ఉంటుంది.

సాఫ్ట్‌వేర్ అప్‍డేట్ చేయడం

ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్‍డేట్ చేయమని ఎప్పటికప్పుడు అప్‍డేట్స్ వస్తుంటాయి. వాటిని అలక్ష్యం చేయకుండా అప్‍డేట్ చేసుకోవాలి.

ఆ అప్‍డేట్స్‌లో కారియర్ సాఫ్ట్‌వేర్‌కు(మన ఫోన్ నెట్‍వర్క్‌కి ఎలా కనెక్ట్ అవ్వాలో చెప్పే కోడ్) మరీ పాతది ఉండిపోతే నెట్‍వర్క్‌కి సరిగ్గా కనెక్ట్ అవ్వదు.

దానికి తోడు సెక్యూరిటీ సమస్యలు కూడా రావచ్చు.

అందుకని అప్‍డేట్స్‌ను అలక్ష్యం చేయకూడదు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి చెక్ చేస్తే కొత్తగా అప్‍డేట్స్ ఏమన్నా ఉన్నాయేమో చూపెడుతుంది.

సెల్‌ఫోన్ టవర్

ఫొటో సోర్స్, Getty Images

వాడని సర్వీసులని ఆఫ్ చేయడం

మొబైల్‍లో నెట్‍వర్క్‌కి సంబంధించి అనేక సర్వీసులు ఉంటాయి. ఉదా: వై-ఫై, బ్లూటూత్, ఎన్.ఎఫ్.సి (Near-Field Communication) వగైరా.

ఇవన్నీ ఆన్‌లో ఉంటే ఒకదానికి మరొకటి అడ్డు పడి కాల్స్/డేటా చేసేటప్పుడు ఇబ్బంది పెట్టచ్చు.

ఉదా: వై-ఫై ఆన్ ఉంది, కానీ మీరు వై-ఫై రౌటర్ దగ్గర్లో లేరు. మీరు ఇప్పుడు వాట్సాప్ కాల్ చేస్తే అది వై-ఫై నెట్‍వర్క్ కోసం వెతుకుతూనే ఉండి, మొబైల్ నెట్‍వర్క్ అందుబాటులో ఉన్నా వాడుకోదు.

అదే వై-ఫై ఆఫ్ చేస్తే, ఉన్న ఒక్క నెట్‍వర్కే ప్రయత్నిస్తుంది. సిగ్నల్ కూడా మెరుగుపడుతుంది.

మొబైల్ సిమ్ కార్డు

ఫొటో సోర్స్, Getty Images

SIM శుభ్రపరచుకోవడం

ఒకసారి సిమ్ మొబైల్‍లో వేసేశాక మనం మళ్లీ దాని జోలికి పోము, మామూలుగా. తీసే అవసరం ఉండదు కాబట్టి. కానీ ఇలా ఏళ్ల తరబడి ఉండడం వల్ల సన్నని దుమ్ము పేరుకుపోయి, సిగ్నల్ కనెక్షన్ సరిగ్గా పనిజేయకపోవచ్చు.

అందుకని ఒక నెట్‍వర్క్ సిగ్నల్ తక్కిన ఫోనుల్లో బాగానే వచ్చి, ఈ ఒక్కదాంట్లోనే సమస్య అయితే సిమ్ బయటకు తీసి ఆ ప్రదేశాన్ని మొత్తం శుభ్రపరుచుకోవాలి.

సిమ్ మరీ పాతదైపోయి అరిగిపోయిందనిపిస్తే దాన్ని మార్చుకోవడం బెటర్. కొత్త సిమ్‍తో సిగ్నల్ కూడా బెటర్ అవుతుంది.

మొబైల్ చెక్ చేసి, రిపేర్‍కు ఇవ్వండి

ఒకవేళ ఫలానా నెట్‍వర్క్ సిగ్నల్ ఇతర ఫోనుల్లో బాగా వస్తూ కేవలం ఒక ఫోనులోనే సమస్యగా ఉంటే ఆ ఫోనుని చెక్ చేయించి, రిపేర్ చేయించాలి.

ఒక్కోసారి ఫోనులు రావడమే డిఫెక్ట్స్‌తో వస్తాయి. ఇంకొన్నిసార్లు కిందపడిపోవడం వల్ల, నీళ్లు వెళ్లిపోవడం వల్ల కొన్ని హార్డ్‌వేర్ మోడ్యూల్స్ పాడవొచ్చు.

అప్పుడు సిగ్నల్ బలంగా రాదు. అలాంటప్పుడు రిపేర్ చేయిస్తే ఫలితం ఉంటుంది. రిపేర్ చేయించినా ఫలితం లేకపోతే కొత్త ఫోన్‍ కొనడానికి వేళ అయ్యిందన్న మాట.

మొబైల్ ఫోనుతో అమ్మాయి

ఫొటో సోర్స్, Getty Images

వాయిస్/డేటా సెట్టింగ్స్ మార్చడం

ఒక్కోసారి ప్రస్తుతం సెట్ చేసి ఉన్న నెట్‍వర్క్ మీద ఎక్కువ లోడ్ ఉండడం వల్ల, తక్కువ సిగ్నల్ బలముండే నెట్‍వర్క్ మెరుగ్గా పనిచేసే అవకాశాలు ఉంటాయి.

అలాంటప్పుడు వాటిని సెట్టింగ్స్‌లో మార్చుకోవడం వల్ల కాల్స్/మెసేజెస్ మెరుగ్గా పనిజేస్తాయి.

సెల్‌ఫోన్ చూస్తున్న అబ్బాయి

ఫొటో సోర్స్, Getty Images

సెల్యులార్ బూస్టర్లు వాడటం

ఏ కారణాల చేత అయినా మొబైల్ సిగ్నల్ బలం తక్కువగా ఉండే ప్రదేశాల్లో సెల్యూలార్ బూస్టర్లు వాడొచ్చు. ఇది ఖర్చుతో కూడుకున్న పని. అయితే, వీటిని ఉపయోగించాక సిగ్నల్ బలం చాలా మెరుగుపడుతుంది. అందులో అనుమానమే లేదు.

మాన్యువల్‌గా నెట్‍వర్క్ రీ-సెలక్ట్ చేయడం

ఇది ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే పనిచేసే చిట్కా. Settings > Find Mobile Networks > Network operatorsకి వెళ్లి అక్కడ నెట్‍వర్క్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దగ్గర్లో ఉన్న నెట్‍వర్క్స్ అన్నీ అది స్కాన్ చేస్తుంది.

నెట్‍వర్క్ రీసెట్ చేయడం

దీన్ని చివరి ఆప్షన్‌గా పరిగణించాలి. ఇలా రీసెట్ చేసినప్పుడు అప్పటి వరకూ సేవ్ చేసుకుని ఉంచుకున్న నెట్‍వర్క్ వివరాలు, పాస్‍వర్డ్‌లు అన్నీ చెరిగిపోతాయి. అందుకని ఆలోచించి ఈ ఆప్షన్ ఎన్నుకోవాలి.

వీడియో క్యాప్షన్, 5జీ సిగ్నళ్లతో విమాన ప్రమాదాలు జరుగుతాయా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)