Life Insurance: పాలసీ తీసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ తరహా పాలసీ మంచిదో నిర్ణయించుకోవడం ఎలా?

లైఫ్ ఇన్సూరెన్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఐవీబీ కార్తికేయ
    • హోదా, బీబీసీ కోసం

జీవిత బీమా అనేది ఒక అవసరం. ఆర్థిక స్వావలంబన సాధించడంలో జీవిత బీమా ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఫైనాన్షియల్ ప్లానింగ్ సూత్రం ప్రకారం మన ఆదాయంలో గరిష్ఠంగా 6% మాత్రమే జీవిత బీమా వార్షిక ప్రీమియం రూపంలో చెల్లించాలి.

అంతకంటే ఎక్కువ అయితే ఆ బీమా మార్గం మనకు సరిపోదని అర్థం చేసుకోవాలి. అలాగే బీమా కాలపరిమితి కూడా మన జీవిత కాలమంతా ఉండేలా చూసుకోవాలి.

జీవిత బీమా తీసుకోవడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ మార్గాలేమిటో వాటిలో అత్యంత లాభదాయకమైనది ఏదో చూద్దాం. బీమా విషయంలో తప్పు చేస్తే అది మనకు ఆర్థిక భారంగా మారే ప్రమాదం ఉంది.

ఎల్ఐసీ

ఫొటో సోర్స్, Getty Images

ఎండొమెంట్ పాలసీ X టర్మ్ పాలసీ X యూలిప్

1991 ఆర్థిక సంస్కరణలకు ముందు బీమా అంటే కేవలం ఎల్‌ఐసీ మాత్రమే. పాలసీ అంటే ఎండోమెంట్ పాలసీ మాత్రమే.

ఈ ఎండోమెంట్ పాలసీ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఎండోమెంట్ పాలసీ అంటే ఒక నిర్ధిష్ట కాలపరిమితికి పాలసీదారులు ప్రీమియం చెల్లిస్తారు. పాలసీ కాలపరిమితి దాటిన తరువాత ఒక పెద్ద మొత్తం పాలసీదారులకు దక్కుతుంది. పాలసీ కాలంలో సదరు వ్యక్తి జీవితానికి బీమా వర్తిస్తుంది.

ఏదైనా దురదృష్టకరమైన సంఘటన జరిగితే ఆ వ్యక్తి కుటుంబానికి పాలసీ నిబంధనల ప్రకారం తగిన మొత్తం అందుతుంది. ఈ పాలసీ.. ప్రాచుర్యం పొందటానికి రెండు ముఖ్య కారణాలు. ఒకటి పెద్ద మొత్తం వచ్చే అవకాశం ఉండటం, రెండు ఈ పాలసీని ఒక పొదుపు మార్గంలాగా మార్కెటింగ్ చేయడం.

ఏజెంట్ల ద్వారా విస్తరించిన ఈ నెట్‌వర్క్ చాలామంది ఉద్యోగులను ప్రభావితం చేసి ఎల్‌ఐసీ పాలసీదారులుగా మార్చింది. ప్రస్తుతం ఎల్ఐసీ మాత్రమే కాకుండా అనేక కంపెనీలు ఎండోమెంట్ పాలసీలు కొద్ది మార్పులతో అమ్ముతున్నాయి.

జీవిత బీమా

ఎండోమెంట్ పాలసీ:

  • వ్యక్తి వయసు: 25 సంవత్సరాలు
  • పాలసీ కాలం: 15 సంవత్సరాలు
  • వార్షిక ప్రీమియం: 36,000
  • బీమా మొత్తం: 5,00,000

పాలసీ చివర వచ్చే మొత్తం: గరిష్ఠంగా 12,00,000. (బీమా మొత్తం+ వార్షిక బోనస్+ టర్మినేషన్ బోనస్)

ఈ ఉదాహరణలో మొత్తానికి వచ్చిన వార్షిక వడ్డి: 8.2%

జీవిత బీమా

ఫొటో సోర్స్, Getty Images

టర్మ్ పాలసీ అనేది గత దశాబ్దంలో ప్రాచుర్యం పొందిన కొత్త పాలసీ. ఈ పాలసీ తీసుకున్న పాలసీదారుడికి తన జీవితకాలంలో ఈ పాలసీ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.

కేవలం తన కుటుంబానికి ఆసరా ఇవ్వడమే టర్మ్ పాలసీ ప్రధాన ఉద్దేశం. స్థూలంగా చూస్తే ఈ టర్మ్ పాలసీ కంటే ఎండోమెంట్ పాలసీ మేలనిపిస్తుంది. కానీ టర్మ్ పాలసీ ద్వారా వచ్చే మొత్తం ఎండోమెంట్ పాలసీ ద్వారా వచ్చే మొత్తానికంటే చాలా ఎక్కువ. ఇదే విషయంగా ఒక ఉదాహరణ చూద్దాం:

టర్మ్ పాలసీ:

  • వ్యక్తి వయసు: 25 సంవత్సరాలు
  • పాలసీ కాలం: 40 సంవత్సరాలు
  • వార్షిక ప్రీమియం: 17,000
  • బీమా మొత్తం: కోటి రూపాయలు

ఈ ఉదాహరణలో మొత్తానికి వచ్చిన వార్షిక వడ్డి: 10.3%.

జీవిత బీమా

ఫొటో సోర్స్, Getty Images

మరోవైపు యూలిప్ అంటే యూనిట్ లింక్ ఇన్సూరెన్స్ పాలసీ. దీని ద్వారా పాలసీదారుడు చెల్లించే ప్రీమియం మొత్తాన్ని ఒక ఫండ్ మేనేజర్.. మార్కెట్లో మదుపు చేసి తద్వారా వచ్చిన మొత్తాన్ని పాలసీ కాలపరిమితి దాటాక పాలసీదారులకు చెల్లిస్తారు.

పాలసీ అమలులో ఉన్న కాలంలో పాలసీదారుడికి జీవితానికి బీమా వర్తిస్తుంది. 2021 నుంచీ ఈ పాలసీ ద్వారా మొత్తం కూడా పది శాతం ఎల్‌టీసీజీ టాక్స్ పరిధిలోకి వస్తుంది. యూలిప్ ఫండ్ నిర్వహణ చార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి.

చాలా కంపెనీలలో మొదటి మూడేళ్లు దాదాపు 25% దాకా ఉంటాయి ఆ తర్వాత కూడా 6%-8% దాకా ఉంటాయి. అంటే మొదటి మూడేళ్లు 75% ఆ తర్వాత గరిష్ఠంగా 94% ప్రీమియం మాత్రమే యూనిట్ల కొనుగోలుకు ఉపయోగిస్తారు. పైగా మార్కెట్లో సహజంగా ఉండే రిస్క్ దీనికి అదనం. యూలిప్ గురించి ఒక ఉదాహరణ చూద్దాం

యూలిప్:

  • వ్యక్తి వయసు: 25 సంవత్సరాలు
  • పాలసీ కాలం: 20 సంవత్సరాలు
  • వార్షిక ప్రీమియం: 50,000
  • బీమా మొత్తం: 10,00,000

పాలసీ చివర వచ్చే మొత్తం: మార్కెట్ ఆధారిత మొత్తం - 10% ఎల్.టి.సి.జి.

పైన చెప్పిన మూడు రకాల బీమా మార్గాలలో టర్మ్ పాలసీ ఉత్తమమైనది. టర్మ్ పాలసీ ద్వారా మన కుటుంబానికి వచ్చే ఆదాయం అధికంగా ఉండటమే కాకుండా క్రిటికల్ సిక్‌నెస్ అడ్వాన్స్ లాంటి రైడర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఫైనాన్షియల్ ప్లానింగ్ సూత్రాల ప్రకారం కూడా మన బీమా మొత్తం మన వార్షిక ప్రీమియం కంటే కనీసం నలభై రెట్లు ఉండాలి. అంత ఎక్కువ మొత్తం ఎండోమెంట్ పాలసీ లేదా యూలిప్ ద్వారా వచ్చే అవకాశం లేదు.

టర్మ్ పాలసీకి వ్యతిరేకంగా ఉన్న ఒకే ఒక వాదన మన పాలసీదారుల జీవితకాలంలో దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదనేది మాత్రమే. పాలసీ ప్రకారం అది నిజమే అయినా.. ఒక ఎండోమెంట్ పాలసీ లేదా యూలిప్ ప్రీమియం మొత్తానికి ఒక టర్మ్ పాలసీ మాత్రమే కాకుండా ఏదైనా ఇండెక్స్ ఫండ్ ద్వారా మదుపు చేస్తే ఆ వచ్చే ఆదాయం ఎండోమెంట్ పాలసీ ఆదాయానికి దగ్గరగా ఉంటుంది.

వీడియో క్యాప్షన్, మ్యూచువల్ ఫండ్స్ డబ్బుతో ఇల్లు కొనడం మంచిదేనా?

పొరపాటుగా మన అవసరాలకు సరిపోని బీమా కొని ఉంటే ఏం చేయాలి?

ప్రీమియం ఎక్కువగా ఉండి బీమా మొత్తం అందుకు తగిన విధంగా లేకుంటే ఆ పాలసీ నుంచీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటపడాలి.

సహజంగా ఇలాంటి సమస్య ఎండోమెంట్ పాలసీకి ఎక్కువగా వస్తుంది. పాలసీ నుంచీ బయటకు వస్తే మనకు నష్టం కలుగుతుందనే భయంతో చాలామంది పాలసీలో కొనసాగుతుంటారు. ఇది సరైన ఆలోచనా విధానం కాదు. ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో ఎలాంటి భావోద్వేగాలకూ చోటివ్వకూడదు. పాలసీ నుండీ బయటపడే మార్గాలేమిటో ఒకసారి చూద్దాం.

1. పాలసీ వెనక్కు ఇచ్చేయడం:

పాలసీ సరెండర్ చేసే అవకాశం పరిశీలించాలి. ప్రతి పాలసీలో సరెండర్ చేస్తే వచ్చే మొత్తం గురించిన వివరాలు ఉంటాయి. మునుపు పాలసీ సరెండర్ చేస్తే నష్టం ఎక్కువగా ఉండేది. కానీ ఇటీవల మారిన ఐఆర్‌డీఏ నిబంధనల ప్రకారం పాలసీదారులకు కలిగే నష్టం బాగా తగ్గింది.

వీడియో క్యాప్షన్, హోమ్ లోన్ ఈఎంఐ కట్టలేకపోతే ఏం చేయాలి?

2. పెయిడ్ అప్ పాలసీ:

పాలసీ సరెండర్ చేయకుండా ప్రీమియం చెల్లించడం ఆపేస్తే దాన్ని పెయిడ్ అప్ అంటారు. ఇలా చేయడం ద్వారా ప్రీమియం ఖర్చు తప్పడమే కాక పాలసీ కాలం ముగిశాక మనం చెల్లించిన సంవత్సరాలకు గానూ రావల్సిన బోనస్ వస్తుంది. అంతే కాక మనం చెల్లించిన ప్రీమియం నిష్పత్తిలో బీమా కూడా వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక పదేళ్ల పాలసీ బీమా మొత్తం ఐదు లక్షల రూపాయలైతే మనం రెండేళ్ల పాటూ ప్రీమియం చెల్లించి ఆపేస్తే అప్పుడు మనకు లక్ష రూపాయల బీమా వర్తిస్తుంది.

3. పాలసీ పూర్తి కావడానికి ఐదేళ్ల కంటే తక్కువ సమయం ఉంటే ఆ పాలసీ చివర దాకా కొనసాగించడం మేలు. ఎందుకంటే అంతకు ముందుగానే క్లోజ్ చేస్తే, పాలసీ కాలం పూర్తి అయ్యాక వచ్చే వన్ టైం బోనస్ లేదా టర్మినేషన్ బోనస్ సదుపాయాన్ని కోల్పోతారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)