Kerala stray dogs: వీధి కుక్కలను చంపిన వారికి ఇక్కడ బహుమతులు ఇచ్చారు, కేరళలో పరిస్థితి ఎందుకంత తీవ్రంగా మారింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మెరిల్ సెబాస్టియన్
- హోదా, బీబీసీ న్యూస్
కేరళ రాష్ట్రంలోని సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ఒక వీడియో చక్కర్లు కొడుతోంది.
ఆ వీడియోలో ఒక వ్యక్తి, రన్నింగ్ షూస్ వేసుకొని పరుగులు పెడుతున్నారు. పార్క్‌లోని బెంచ్‌ల మీదుగా దూకుతున్నారు. గోడలు దూకుతూ, ట్రాఫిక్ కోన్స్ మధ్య నుంచి పరుగెడుతున్నారు. మరోవైపు ఆయన స్నేహితుడు, ఆయనను ఉత్సాహపరుస్తున్నారు.
''ఆర్మీలో చేరడం కోసం ఆయన శిక్షణ పొందుతున్నారా? అని ఆ ఇద్దరిని గమనించిన ఒక మహిళ అడిగారు.
''లేదు. ఆయన వీధి కుక్కల నుంచి తప్పించుకోవడం కోసం ఇలా చేస్తున్నారు'' అని ఆయన స్నేహితుడు సమాధానం చెప్పారు.
ఈ వ్యంగ్యమైన వీడియోను ఒక యాడ్ ఏజెన్సీ రూపొందించింది.
కేరళలో గత కొన్ని వారాలుగా వేలాది మంది ప్రజలు, వీధి కుక్కల మీద తమ కోపాన్ని వ్యక్తం చేస్తూ ఇలాంటి వీడియోలు, మీమ్స్‌ను షేర్ చేస్తున్నారు.
కుక్క కాటుకు సంబంధించి ఇటీవల వచ్చిన నివేదికలతో ప్రజలు ఈ విధంగా స్పందిస్తున్నారు. ఇలా దాడి చేసిన వాటిలో వీధికుక్కలతో పాటు పెంపుడు కుక్కలు కూడా ఉన్నాయి.
కేరళలోని ఎక్కువ మంది ప్రజలు, కుక్కలతో స్నేహపూర్వకంగా వ్యవహరించరని, వాటిని దూరంగా పెడతారని జంతు సంరక్షణ కార్యకర్తలు, పశువైద్యులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
''ఇక్కడ ఆఖరికి పెంపుడు కుక్కలను కూడా రోజంతా బోనులోనే ఉంచుతారు. ఎక్కువ సమయం వాటిని కెన్నెల్స్‌కే పరిమితం చేస్తారు. చాలా అరుదుగా వాటిని ఇళ్లలోకి రానిస్తుంటారు'' అని జంతు సంరక్షణ న్యాయవాది సాలీ వర్మ అన్నారు.
''రోడ్డుమీద నిద్రపోతున్న ఒక వీధికుక్కను చూసినప్పుడు ప్రజలు, దాన్నొక మతిలేని కుక్కలా భావిస్తారు'' అని ఆమె చెప్పారు.
దేశంలో అత్యధిక సంఖ్యలో వీధి కుక్కలు ఉన్న టాప్-10 రాష్ట్రాల జాబితాలో కేరళ లేదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, కేరళలో 2,90,000 వీధికుక్కలు ఉన్నాయి.
కానీ, కుక్కకాటు ఘటనల ప్రకారం చూసుకుంటే ఈ ఏడాది కేరళ ఆరో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది తొలి 7 నెలల్లోనే దాదాపు లక్ష కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇవి రెట్టింపు కేసులు.
ఈ సమస్య కొత్తది కాదు. ఈ మధ్యే ఇది తలెత్తలేదు. వ్యర్థాల మేనేజ్‌మెట్ సరిగా లేకపోవడం, పెంపుడు జంతువులను వీధుల్లో వదిలేయడం, మరీ ముఖ్యంగా కుక్కలకు సరైన టీకాలను ఇవ్వకపోవడం వంటివి రాష్ట్రాన్ని పట్టిపీడిస్తోన్న ఈ సమస్యకు ప్రధాన కారణాలు అని నిపుణులు అంటున్నారు.
రేబిస్ కారణంగా ఈ ఏడాది 21 మంది చనిపోయారు. ఇందులో 12 ఏళ్ల బాలిక కూడా ఉంది. ఆమె మూడు వ్యాక్సిన్లు తీసుకున్నప్పటికీ చనిపోవడంతో టీకాల సమర్థతపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. టీకాల నాణ్యతను పరీక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం వాటి శాంపుల్స్‌ను పరీక్షా కేంద్రాలకు పంపించింది.
ఇలాంటి ఘటనలు కేరళలో భయాందోళనలకు కారణం అయ్యాయి. 2015-16లో కూడా ఇలాగే కుక్కకాటు ఘటనలు పెరిగిపోవడంతో బహిరంగంగా వీధికుక్కలను చంపడం మొదలుపెట్టారు. కొంతమంది ప్రజలు, ప్రముఖ వ్యాపారవేత్తలు దీన్ని ప్రోత్సహిస్తూ వీధికుక్కలను చంపిన వారికి బహుమతులు ఇచ్చారు. ఈ చర్య జాతీయవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైంది.

ఫొటో సోర్స్, Getty Images
మరణించిన వీధికుక్కల సమాధి ఫొటోలు అంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. ఇందులో కొన్ని నకిలీ ఫొటోలుగా తేలాయి. దీంతో కేరళను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ప్రతీ ఏటా లక్షల మంది పర్యాటకులు కేరళను సందర్శిస్తారు.
ఆ సమయంలో తాము కూడా ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని వీధికుక్కలను సంరక్షించే కార్యకర్తలు చెప్పారు.
ఆరేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అవే పరిస్థితులు తలెత్తినట్లు అనిపిస్తోంది.
12 ఏళ్ల బాలిక మరణించినప్పటి నుంచి వార్తా పత్రికలు, టీవీ చానెళ్లు కేరళలో కుక్కకాటు ఘటనలను ప్రముఖంగా ప్రచురించాయి. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో కుక్క కాటు వార్తల గురించి కొన్ని చానెళ్లు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాయి.
''ఈ కుక్క కాటు కేసుల్లో ప్రతీ కేసు పిచ్చి కుక్కల వల్లే సంభవించిందో లేదో సరిగ్గా మాకు తెలియదు'' అని 'దయ' ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అంబిలి పురాకల్ అన్నారు. కేరళలో చాలాకాలంగా జంతు సంరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థల్లో 'దయ' ఫౌండేషన్ ఒకటి.
వీధికుక్కలపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను కొన్ని బ్రాండ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. కుక్కల నుంచి తప్పించుకొని పారిపోయే శక్తి కోసం తమ బ్రాండ్ పిండిని ఉపయోగించండి అనే ట్యాగ్‌లైన్‌తో స్థానిక బ్రాండ్ ఒక అడ్వర్టైజ్‌మెంట్ తయారు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
వీధి కుక్కలపై వెలువడే వార్తా కథనాలు కూడా భయం గొలిపే ఫొటోలతో ఉంటాయి.
''నోటి నుంచి నురగ కారుతున్న జర్మన్ షెఫర్డ్ ఫొటోలు వారి వద్ద కుప్పలుగా ఉంటాయి'' అని వర్మ అన్నారు.
కుక్కలు అంటే ఏర్పడిన భయంతో ప్రజలు విపరీతమైన పనులు చేస్తున్నారు. పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లే సమయంలో కుక్కల కోసం రక్షణగా ఎయిర్‌గన్‌ను వాడిన వ్యక్తిపై సెప్టెంబర్ ప్రారంభంలో పోలీసులు కేసు నమోదు చేశారు.
కేరళలోని కొన్ని ప్రాంతాల్లో వీధికుక్కలను చంపుతున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే, హింస పరిష్కారం కాదని జంతు సంరక్షణ కార్యకర్తలు అంటున్నారు.
''వీధికుక్కలు ఎదురుపడినప్పుడు సాధారణంగా ప్రజలు కర్రలు లేదా రాళ్లతో స్పందిస్తారు. ఇలా చేయడం వల్ల అవి కరిచే అవకాశం పెరుగుతుంది'' అని పురాకల్ అన్నారు.
కుక్కకాటు కేసులు పెరుగుతుండటంతో ఒత్తిడిలో రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దూకుడుగా వ్యవహరించే మతిలేని వీధి కుక్కలను చంపేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోరింది.
''సామూహిక హత్యల వల్ల ఎలాంటి పరిష్కారం ఉండదు. సమస్యకు మూల కారణం తెలుసుకోకపోతే ఇలాంటివి పునరావృతం అవుతూనే ఉంటాయి'' అని వర్మ చెప్పారు.
కనీసం అయిదేళ్ల పాటు నిరంతరంగా జంతువుల జనన నియంత్రణ కార్యక్రమాలను చేపట్టడం, గాయపడిన లేదా అనారోగ్యం పాలైన జంతువుల కోసం షెల్టర్లను ఏర్పాటు చేయడం, టీకాలు వేయడం, వీధి కుక్కలకు బాధ్యతగా ఆహారం అందించే వ్యవస్థను ఏర్పాటు చేయడం, జంతు సంరక్షణ గ్రూపులతో కలిసి పనిచేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చని జంతు సంరక్షణ నిపుణులు అంటున్నారు.
జంతువులకు, మనుషులకు మధ్య విశ్వాసాన్ని పునర్నిర్మించడం కూడా చాలా కీలకమని వారు చెప్పారు.
''ప్రజలు చెడ్డవారు కాదు. ప్రజల భద్రత విషయంలో చాలా విషయాలు అస్పష్టంగా, ఆందోళన రేకెత్తించేలా ఉన్నాయి'' అని వర్మ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- షింజో అబే అంత్యక్రియలకు హాజరైన మోదీ.. అధికారికంగా అంత్యక్రియలను జపాన్ ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
- గుజరాత్: ఆవులను ప్రభుత్వ కార్యాలయాల్లోకి తోలుతున్నారు.. వాటి మూత్రం, పేడను ఆఫీసుల్లో వేస్తున్నారు.. ఎందుకు?
- ఎడ్వర్డ్ స్నోడెన్: అమెరికా నిఘా రహస్యాలు బయటపెట్టిన సీఐఏ మాజీ ఉద్యోగికి రష్యా పౌరసత్వం – ఎవరీ స్నోడెన్?
- మన జీవితం వేరొకరి గేమ్‌లో భాగమా, ఆ గేమ్‌ను మనం ఎప్పటికీ ఆపలేమా?
- మ్యూచువల్ ఫండ్స్: ఎలాంటి ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












