ఆకుపచ్చ రంగులో పుట్టిన అరుదైన పప్పీ - BBC NewsReel

కుక్కపిల్ల

ఫొటో సోర్స్, Reuters

ఇటలీకి చెందిన ఒక రైతు ఇంట్లో పెంపుడు కుక్క.. ఆకుపచ్చ రంగులో ఉన్న ఓ కుక్క పిల్లకు జన్మనిచ్చింది.

మధ్యధరా సముద్రంలోని సార్డీనియా దీవిలో నివసించే క్రిస్టియన్ మల్లోచ్చీ అనే ఆ రైతుకు చెందిన స్పెలాచ్చియా అనే కుక్కకు ఇటీవల ఐదు పిల్లలు పుట్టాయి. అందులో ఒకటి లేత ఆకుపచ్చ రంగులో ఉండటం చూసి అందరూ అబ్బురపడ్డారు.

ఆ పప్పీకి వెంటనే పిస్తాచియో అని పేరు కూడా పెట్టారు. పిస్తాచియోతో పాటు పుట్టిన మిగతా నాలుగు కుక్కపిల్లలకి వాటి తల్లి రంగైన తెల్లటి బొచ్చే వచ్చింది.

కుక్కపిల్లలు

ఫొటో సోర్స్, Reuters

ఆకుపచ్చ రంగుతో కుక్కలు పుట్టటం చాలా అరుదు. పిస్తాచియో తల్లి కుక్క కడుపులో ఉన్నపుడు బిలివెర్డిన్ అనే ఆకుపచ్చ పిగ్మెంట్‌ తాకటం వల్ల దానికి ఈ రంగు వచ్చినట్లు భావిస్తున్నారు.

అయితే.. పిస్తాచియో రంగు అప్పుడే వెలిసిపోవటం కూడా మొదలవటం చూసి చాలా మంది విచారిస్తున్నారు.

పిస్తాచియో సహా కుక్కపిల్లలన్నిటినీ.. తన పొలంలో గొర్రెలు కాసే వారికి ఇచ్చేయాలని మల్లోచ్చీ నిర్ణయించుకున్నారు.

అఫ్గానిస్తాన్: మదర్సా మీద వైమానిక దాడిలో 11 మంది చిన్నారులు మృతి

అఫ్ఘానిస్తాన్ బాంబుదాడి

ఫొటో సోర్స్, Getty Images

అఫ్గానిస్తాన్‌లో ఒక మత పాఠశాల మీద జరిగిన వైమానిక దాడిలో 12 మంది పౌరులు చనిపోయారని.. మృతుల్లో 11 మంది చిన్నారులేనని అధికారులు తెలిపారు.

ఉత్తర అఫ్గాన్‌లో టాఖార్ ప్రావిన్స్‌లో గల హజారా ఖుర్లాఖ్ అనే గ్రామంలోని ఒక మదర్సా మీద ఈ వైమానిక దాడి జరిగిందని చెప్పారు. అందులో ఉన్న 11 మంది చిన్నారులు, వారి బోధకుడు చనిపోయారని తెలిపారు.

అయితే.. అఫ్ఘాన్ ప్రభుత్వం మాత్రం ఆ గ్రామంలో తాము చేసిన దాడిలో 12 మంది తాలిబన్ ఫైటర్లు చనిపోయారని చెప్తోంది.

ఈ దాడిలో మరో 14 మంది గాయపడ్డారని కూడా స్థానిక అధికారులు తెలిపారు. దాడి జరిగినపుడు తాను, పిల్లలు మాత్రమే మసీదులో ఉన్నామని.. మదర్సాకు ఆనుకుని ఉన్న మసీదు ఇమామ్ అద్దుల్ అవాల్ బీబీసీతో చెప్పారు. దాడిలో గాయపడిన ఆయనను ఆస్పత్రిలో చేర్చారు.

దాడి బాధితులుగా తమ ఆస్పత్రికి తీసుకువచ్చిన వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారని రాష్ట్ర రాజధాని తలోఖాన్‌లో గల ఆస్పత్రి వైద్యులు చెప్పారు.

అయితే.. ఈ వార్తలు అబద్ధమని అఫ్గాన్ ప్రభుత్వ అధికారులు కొట్టివేస్తున్నారు. దాడిలో పౌరులు చనిపోయారనే ఆరోపణల మీద దర్యాప్తు చేయటానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అఫ్గానిస్తాన్‌లో ఇటీవలి వారాల్లో ప్రభుత్వ బలగాలు, తాలిబన్ దళాలకు మధ్య హింస తీవ్రమైంది. ఇరుపక్షాల మధ్య జరుగుతున్న శాంతిచర్చలకు ఈ హింస ముప్పుగా పరిణమించింది.

మహబూబాబాద్ కిడ్నాప్: 'తొమ్మిదేళ్ల బాలుడిని గొంతు నులిమి చంపేశారు'

మహబూబాబాద్ కిడ్నాప్

తమ బిడ్డను కిడ్నాప్ చేసిన వారికి అడిగినంత డబ్బు ఇవ్వడానికి ఆ తల్లితండ్రులు సిద్ధపడ్డారు. వాళ్లు రమ్మన్న చోటుకు వెళ్లారు. కానీ, డబ్బు తీసుకునేందుకు కిడ్నాపర్లు రాలేదు. ఆదివారం నుంచి తమ కుమారుడి కోసం ఎదురు చూస్తున్న ఆ తల్లితండ్రులకు చివరకు విషాదమే మిగిలింది.

మహబూబాద్ లోని కృష్ణ కాలనీలో నివాసం ఉంటున్నరంజిత్ రెడ్డి వసంతల కుమారుడు తొమ్మిదేళ్ళ దీక్షిత్ రెడ్డి ఆదివారం కిడ్నాప్‌కు గురయ్యాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దీక్షిత్‌ను ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో వారి ఇంటి బయట నుండి కిడ్నాప్ చేశారు."కిడ్నాపర్ బైక్ పై వచ్చాడు. పరిచయం ఉన్న వ్యక్తి కావడంతో దిక్షిత్ అతనితో బైక్‌పై వెళ్లాడు" అని మహబూబాబాద్ పోలీస్ సూపరింటెండెంట్ ఎన్ కోటిరెడ్డి విలేఖరుల సమావేశంలో తెలిపారు.

మహబూబాబాద్ కిడ్నాప్
ఫొటో క్యాప్షన్, దీక్షిత్ హత్య గురించి ప్రెస్ మీట్‌లో వివరిస్తున్న మహబూబాబాద్ ఎస్పీ ఎన్. కోటిరెడ్డి

రూ. 45 లక్షల ఇస్తే బాబుని విడిచిపెడతామని దీక్షిత్ తల్లి వసంతకు ఆదివారం రాత్రి కాల్ వచ్చింది. దాంతో, తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కాల్స్ ట్రేస్ చేయడానికి వీలు లేకుండా ఇంటర్నెట్ కాల్స్ చేశారు కిడ్నాపర్లు. దాదాపు 14 కాల్స్ దాకా చేశారని సమాచారం.

అయితే, ఆదివారం సాయంత్రమే వారు ఆ బాలుడిని నిందితుడు మందసాగర్ గొంతు నులిమి చంపారని, ఆ తరువాత మృతదేహం ఆనవాలు తెలియకుండా ఉండేందుకు తగులబెట్టాడని ఎస్పీ సంఘటన క్రమాన్ని వివరించారు.

నిందితుడు అంతకుముందు దీక్షిత్ తల్లితండ్రులను బుధవారం నాడు డబ్బు తీసుకుని టౌన్ సెంటర్‌కు రావాలని డిమాండ్ చేశాడు. దీక్షిత్ తండ్రి రంజిత్ డబ్బు తీసుకుని ఆ సమయంలో అక్కడికి వెళ్లారు. కానీ, రాత్రి ఎనిమిదన్నర వరకు ఎదురు చూసినా డబ్బు తీసుకోవడానికి ఎవరూ రాలేదు.కిడ్నాపర్లు మళ్శీ ఫోన్ చేసి వేరే దగ్గరకు రావాలని చెప్పడంతో అక్కడికి వెళ్ళారు. అక్కడికి కూడా ఎవరూ రాలేదు.

పోలీసులు గురువారం ఉదయం బాలుడి మృతదేహాన్ని గుర్తించి తల్లితండ్రులకు సమాచారం ఇచ్చారు. బిడ్డ మృతదేహాన్న చూసి ఆ తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

"ఒక కుటుంబాన్ని మానసికంగా క్షోభ పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ నేరం చేసినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి విచారణ జరపాల్సి ఉంది. అసలు కిడ్నాప్ చేయడం వెనుక ఇంకా వేరే ఎవరి హస్తమైనా ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. ప్రాథమిక సమాచారం ప్రకారం కిడ్నాప్ చేసింది, హత్య చేసింది తానే అని మందసాగర్ ఒప్పుకున్నాడు" అని ఎస్పీ తెలిపారు.

కోవిడ్-19 వ్యాక్సీన్ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న వలంటీర్ మృతి

కోవిడ్-19

ఫొటో సోర్స్, YEGOR ALEYEV

కోవిడ్-19 క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న ఓ వలంటీర్ మరణించారని బ్రెజిల్ ఆరోగ్య శాఖ బుధవారం తెలిపింది. అయితే, క్లినికల్ ట్రయల్స్ మాత్రం కొనసాగుతున్నాయని స్పష్టీకరించింది.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేసిన ఈ వ్యాక్సీన్‌ను బ్రెజీల్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. ఈ టీకాను అస్ట్రాజెనెకా భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తోంది.

''క్లినికల్ ట్రయల్స్ గురించి ఎలాంటి భయమూ పడాల్సిన అవసరంలేదు''అని ప్రకటన విడుదల చేస్తూ క్లినికల్ ట్రయల్స్‌ను ఆక్స్‌ఫర్డ్ కొనసాగిస్తోందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

మరోవైపు ఈ విషయాన్ని ఆస్ట్రాజెనెకా ధ్రువీకరించలేదు.

''వలంటీర్‌కు కోవిడ్-19 వ్యాక్సీన్ ఇచ్చుంటే క్లినికల్ ట్రయల్స్‌ను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చేది. అయితే సదరు వ్యక్తికి మెనింజైటిస్ వ్యాక్సీన్ ఇచ్చాం''అని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన అధికారులు చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది.

కోవిడ్-19

ఫొటో సోర్స్, OXFORD UNIVERSITY

విచారణకు స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేశామని, ట్రయల్స్‌ను కొనసాగించాలని కమిటీ సూచించిందని ద ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ సవ్ పాలో తెలిపింది.

మరణించి వ్యక్తి బ్రెజిల్ పౌరుడేనని యూనివర్సిటీ తెలిపింది.

మృతుడి వయసు 28ఏళ్లని, అతడు రియోడీ జెనీరోలో ఉండేవారని, కోవిడ్-19 వల్లే అతడు మరణించాడని సీఎన్‌ఎన్ బ్రెజిల్ పేర్కొంది.

క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా దేశంలోని ఆరు నగరాల్లోని దాదాపు 8,000 మందికి తొలి డోసు టీకాను ఇప్పటికే ఇచ్చామని యూనివర్సిటీ అధికార ప్రతినిధి తెలిపారు. కొందరికి రెండో డోసు కూడా ఇచ్చామని వివరించారు.

రియోడీ జెనీరోలోని ఫియోక్రూజ్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్‌లో భారీగా ఉత్పత్తి చేస్తున్న ఈ వ్యాక్సీన్‌ను కొనుగోలు చేయనున్నట్లు బ్రెజిల్ ప్రభుత్వం తెలిపింది.

చైనా సంస్థ సైనోవాక్ బయోటిక్ చేసిన వ్యాక్సీన్‌ను కూడా బ్రెజిల్‌లో పరీక్షిస్తున్నారు. అయితే దీన్ని కొనుగోలు చేసేందుకు ఎలాంటి ప్రతిపాదనా తమ దగ్గరలేదని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్‌సొనారో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)