God Father మూవీ రివ్యూ: హీరోయిన్, రొమాన్స్, సాంగ్స్ లేని చిరంజీవి సినిమా ఎలా ఉంది?

ఫొటో సోర్స్, @KonidelaPro
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
రీమేక్‌లు అనగానే కొందరికి చిన్న చూపు. అందులో ఏముందిలే, ఉన్న కథనే మళ్లీ తీయడం, చూసిన సినిమానే మళ్లీ చూడడం.. అనే భావన. కానీ అది కరెక్ట్ కాదు.
ఓ భాషలో ఓ కథ ఆడిందంటే.. అన్ని సరభాషల్లోనూ అదే ఫార్ములా వర్కవుట్ అవుతుందన్న నిబంధన లేదు. పైగా ఓ చోట హిట్ అయిన కథని, మరో భాషలో ఆత్మ చెడగొట్టకుండా, సదరు హీరో ఇమేజ్‌కి తగ్గట్టుగా మార్చడం కూడా ఆషామాషీ కాదు. అందుకే చాలా రీమేక్‌లు చెడిపోయాయి.
చిరంజీవి కెరీర్‌లో రీమేక్‌ల వాటా ఎక్కువే. అందులో విజయాల శాతం కూడా ఎక్కువే. ఓ చోట హిట్టయిన కథని, తన ఇమేజ్‌కి అనుగుణంగా ఎలా మార్చుకోవాలో ఆయనకు బాగా తెలుసు.
`ఘరానా మొగుడు`, `ఠాగూర్` లాంటి రీమేకులైతే.. మాతృక కంటే బాగా ఆడాయి. అందుకే చిరుకి రీమేక్‌లంటే ఇష్టం. తన రీ ఎంట్రీ సినిమా (ఖైదీ నెం.150) కూడా రీమేకే.
ఇప్పుడు `గాడ్ ఫాదర్`గా మనముందుకొచ్చారు. మలయాళంలో సూపర్ హిట్టయిన `లూసిఫర్`కి ఇది రీమేక్. అక్కడ మోహన్ లాల్ చేసిన పాత్రను ఇక్కడ చిరు పోషించారు. మరి మోహన్ లాల్‌లా.. చిరు కూడా మ్యాజిక్ చేయగలిగారా? `లూసిఫర్` `గాడ్ ఫాదర్`గా మారినప్పుడు చిరు ఇమేజ్‌కి తగ్గట్టుగానే మారిందా?

`బ్రహ్మ` రాసిన రాత
ముఖ్యమంత్రి పీకేఆర్ (సర్వదమన్ బెనర్జీ) మరణంతో ఆ సీటు ఖాళీ అవుతుంది. పీకేఆర్ తరవాత సీఎం అవ్వాలని హోంమినిస్టర్ (మురళీ శర్మ) ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు పీకేఆర్ అల్లుడు జయదేవ్ (సత్యదేవ్) కూడా పావులు కదుపుతుంటాడు. అయితే జయదేవ్‌కి కుట్రలు, కుతంత్రాలూ ఎక్కువ. సీఎం సీటు కోసం మాఫియాతో కూడా చేతులు కలుపుతాడు.
పీకేఆర్ కూతురు సత్య (నయనతార) తన భర్త జయదేవ్‌ని గుడ్డిగా నమ్ముతుంది. జయదేవ్ ప్రయత్నాల్ని అడ్డుకొనే ఒకే ఒక్కడు.. బ్రహ్మ (చిరంజీవి).
కింగ్ అవ్వాలని అంతా ఆశ పడుతుంటే.. తను కింగ్ మేకర్‌గా చక్రం ఎలా తిప్పాడు? అనేదే అసలు కథ.
లూసిఫర్‌తో పోలిస్తే కథ విషయంలో దర్శకుడు మోహన్ రాజా ఎలాంటి మార్పులూ చేయలేదు. కాకపోతే ఆ కథా గమనాన్ని మరోలా నడిపాడు. లూసిఫర్‌లో ఉన్న పాత్రలు కొన్ని గాడ్‌ఫాదర్‌లో కనిపించవు. కొత్త పాత్రలు వచ్చాయి. అయితే ప్రతి పాత్రకూ ఓ ప్రారంభం, ముగింపు ఇచ్చుకొంటూ వెళ్లాడు దర్శకుడు.
ఉదాహరణకు పోలీస్ ఆఫీసర్ (సముద్రఖని) పాత్రకు లూసిఫర్‌లో సరైన ఎండింగ్ లేదు. దాన్ని `గాడ్ ఫాదర్`లో సవరించారు. రీమేక్‌లో ఉన్న సౌలభ్యం అదే. మాతృకలోని ప్లస్‌లు హైలైట్ చేస్తూ.. మైనస్‌లను దాచేస్తూ తీర్చిదిద్దడం రీమేక్‌ల ప్లస్ పాయింట్. మోహన్ రాజా అదే చేశాడు.

ఫొటో సోర్స్, @KonidelaPro
పవన్ కల్యాణ్ వల్లే తమ్ముడి పాత్ర తీసేశారా?
లూసిఫర్‌లో తమ్ముడి పాత్ర చాలా కీలకం. కథలో మలుపు రావడానికి ఆ పాత్ర ప్రధాన కారణమవుతుంది. కానీ దాన్ని `గాడ్‌ఫాదర్`లో తీసేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఓ ట్విస్టుని అనవసరంగా వదులుకొన్నారేమో అనిపిస్తుంది. దానికీ ఓ కారణం ఉండొచ్చు.
తమ్ముడ్ని సీఎం చేయడానికి హీరో ఆడిన డ్రామా.. లూసిఫర్.
అదే కథని ఇక్కడ తీస్తే... పవన్ కల్యాణ్ - చిరంజీవి మధ్య పొలిటికల్ వాతావరణానికి ఈ సినిమాని అన్వయించుకొనే అవకాశం ఉంది.
దాంతో సినిమాని జనాలు మరో కోణంలో చూడడం మొదలెడతారు. అందుకే చిరు.. ఆ పాత్రని తీసేసి - ఈ సినిమా రాజకీయ ఉచ్చులో పడకుండా తెలివిగా తప్పించుకొన్నాడనిపిస్తుంది.
చిరు సినిమా కాదే..?!
నిజానికి ఇది చిరంజీవి సినిమా కాదు. ఆయన సినిమాల్లో కనిపించే పాటలు, రొమాన్స్ ఇవేం ఉండవు. ఆఖరికి హీరోయిన్ కూడా. తన పక్కన హీరోయిన్ లేకుండా చిరంజీవి చేసిన సినిమా ఇదే కావొచ్చు. ఈ విషయంలో చిరుని మెచ్చుకోవాలి. తన ఇమేజ్‌కి తగ్గట్టుగా ఈ కథని మార్చకుండా కథకేం కావాలో అది ఇచ్చారు.
సినిమా మొదలైన 20 నిమిషాల వరకూ చిరు ఎంట్రీ ఉండదు. మధ్యలో సత్యదేవ్ పాత్ర రెచ్చిపోతూ ఉంటుంది. చిరు ఎక్కడ? ఇంకా కనిపించలేదేం? తను రాడా? అనే ఆలోచన ప్రేక్షకులకు, చిరు అభిమానులకూ కలిగించకుండా చాలా తెలివిగా ఈ స్క్రీన్ ప్లే రాసుకొన్నాడు దర్శకుడు.

ఫొటో సోర్స్, @KonidelaPro
కీలకమైన సందర్భాల్లో కూడా తను అప్పర్ హ్యాండ్ చూపించాలని చిరు అనుకోలేదు. ఉదాహరణకు.. జైల్లో చిరంజీవి, సత్యదేవ్ మధ్య ఓ సీన్ ఉంది. చిరుని కూర్చోబెట్టి సత్యదేవ్ గంభీరమైన డైలాగులు చెప్పుకొంటూ పోతుంటాడు. అక్కడంతా సత్యదేవ్ వన్ మాన్ షోనే నడుస్తుంది. చిరు నవ్వుతూ సత్యదేవ్‌ని చూస్తుంటాడు.
అయితే చివర్లో ఓ చిన్న కను సైగతో చిరు పాత్ర ఎలివేట్ అవుతుంది. సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. బహుశా ఇది వరకు చిరంజీవి సినిమాల్లో చూడని విషయం ఇది. ఇదొక్కటే కాదు. చాలా చోట్ల - కేవలం కథకు లోబడే బ్రహ్మ పాత్ర ప్రవర్తిస్తూ వెళ్తుంది. అది ఈ సినిమాకి, బ్రహ్మ పాత్రకూ చాలా ప్లస్ అయ్యింది.
ఈ సినిమాలో కొన్ని పాత్రలకు రెండో షేడ్ ఉంటుంది. కథలో కీలకమైన చోట రెండో కోణం వాడుకోవడం బాగుంది. ఇది లూసిఫర్‌లో లేని థీమ్.

ఫొటో సోర్స్, @KonidelaPro
యాక్షన్ పార్ట్‌ని కూడా బాగానే డిజైన్ చేసుకొన్నారు. `నజభజజజర` పాటని ఫైట్‌లో మిక్స్ చేయడం `సిత్తరాల సిరపడు` (అల వైకుంఠపురములో) థీమ్‌ని గుర్తుకు తెస్తుంది.
విడుదలకు ముందు జనాన్ని ఊపేసిన `తార్ మార్` సల్మాన్ ఖాన్‌ని ఇంటర్వెల్ కార్డ్‌లో చూపించి సెకండ్ హాఫ్‌పై ఇంకాస్త ఆసక్తి పెంచారు. సల్మాన్ ఖాన్‌ని ఓ తెలుగు సినిమాలో చూడడం తెలుగు సినిమా అభిమానులకు గుర్తుండిపోయే మూమెంట్ అవుతుంది.
సర్వాంతర్యామి.. బ్రహ్మ
ఈ సినిమా ఇంటర్వ్యూలలో దర్శకుడు మోహన్ రాజా ఓ మాట చెప్పాడు. `చిరు పాత్రని సర్వాంతర్యామిగా తీర్చిదిద్దాను` అని.
నిజమే.. ఈ సినిమాలో బ్రహ్మ ప్రతీ సీన్ లోనూ కనిపించకపోవొచ్చు. కానీ.. ప్రతీ సీన్ లోనూ ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అంతా బ్రహ్మ గురించి మాట్లాడుకొంటారు.
బ్రహ్మ మ్యాజిక్ ప్రతీ సీన్‌లోనూ కనిపిస్తుంటుంది. ఆ పాత్రలో చిరు ఒదిగిపోయారు. ఆయన గెటప్ సూటయ్యింది.

ఫొటో సోర్స్, @KonidelaPro
చిరు ఇమేజ్‌కి భిన్నంగా, అభిమానుల అంచనాలకు భిన్నంగా ఈ పాత్రని ఎంచుకోవడం గ్రేటే. పాటలూ, రొమాన్స్, హీరోయిన్‌ని పక్కన పెట్టాలన్న ఆలోచనని చిరు తీసుకోవడం అభినందనీయం. కాకపోతే.. చిరు స్టెప్పేస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. దశాబ్దాలుగా ఆయన తన అభిమానుల్ని అలానే అలరిస్తున్నారు. కానీ ఈ సినిమాలో పాటలకు, స్టెప్పులకూ స్కోప్ లేదు. చివర్లో తార్ మార్ పాట వచ్చినా అందులోనూ మెరిసిపోయే స్టెప్పులు ఉండవు. జస్ట్ క్యాజువల్ మూమెంట్స్ అంతే.
చిరు తరవాత... అంత పేరు తెచ్చుకొన్న పాత్ర ఏదైనా ఉంది అంటే అది సత్యదేవ్ పాత్రే. చిరుతో పోలిస్తే సత్యదేవ్‌కే స్క్రీన్ టైమ్ ఎక్కువ కనిపిస్తుంది. తనకొచ్చిన అవకాశాన్ని అన్ని రకాలుగానూ సత్యదేవ్ ఉపయోగించుకొన్నాడు. చిరుతో పోటా పోటీగా నటించాడు.
నయనతార పాత్ర హుందాగా ఉంది. మాతృకతో పోలిస్తే తెలుగులో ఆ పాత్రకు ప్రాధాన్యం మరింత పెరిగింది. మురళీ శర్మ తన అనుభవాన్ని చూపించారు.
పూరీ జగన్నాథ్‌ను తెరపై చూడడం ఆయన అభిమానులకు సర్‌ప్రైజింగే. తను కూడా ఈ కథకు కీలకంగా మారారు. తెరపై చాలా పాత్రలు కనిపిస్తుంటాయి. వాటన్నింటికీ తగిన ప్రాధాన్యం ఉంది.
థమన్ ప్రతాపం
బీజీయమ్స్ ఇవ్వడంలో థమన్‌కి సాటి లేరు. ఈ సినిమాలోనూ ఆ మ్యాజిక్ కనిపించింది. చిరంజీవి ఎలివేషన్ల కోసం గాడ్ ఫాదర్ థీమ్ సాంగ్ వాడుకొన్నాడు థమన్. ఐటమ్ సాంగ్ అంత గుర్తు పెట్టుకొనేలా లేదు. మిగిలిన పాటలు కథలో భాగమైపోయాయి.
లక్ష్మీ భూపాల సంభాషణలు కూడా కథలో, పాత్రలతో, సన్నివేశాలతో పాటు ప్రయాణం చేశాయి. పొలిటికల్ స్పీచులు దంచికొట్టొచ్చు అనుకొన్న చోట కూడా ఆయన కలం చాలా ప్రశాంతంగా పనిచేసుకొంటూ వెళ్లింది. పంచ్‌లు, ప్రాసల జోలికి పోకుండా.. సీన్‌కి ఏం కావాలో అది రాశారు.
కెమెరా వర్క్ ఆకట్టుకొంటుంది. కాకపోతే విజువల్ ఎఫెక్ట్స్ నాసిరకంగా అనిపిస్తాయి. సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఫైట్‌లో విజువల్స్ చాలా నాసిరకంగా ఉన్నాయి.
ఓ సూపర్ హిట్ సినిమాలోని ఆత్మని చెడిపోకుండా తీర్చిదిద్దడం అంత ఈజీ కాదు. ఈ విషయంలో మోహన్ రాజాకు పూర్తి మార్కులు పడతాయి. కథని పాడు చేయకుండా, చిరంజీవి ఇమేజ్‌కి దూరంగా వెళ్లకుండా రెండింటినీ బ్యాలెన్స్ చేశారు.
ఆచార్య సినిమాతో చిరంజీవి అభిమానులు డీలా పడిపోయారు. వాళ్లకు కాస్త హుషారు ఇచ్చే సినిమా ఇది. రెగ్యులర్ చిరంజీవి సినిమాల ప్యాట్రన్‌లో `గాడ్‌ఫాదర్` ఉండదు. కాకపోతే.. చిరంజీవిని కొత్తగా చూడాలనుకొనేవాళ్లకు మాత్రం గాడ్ ఫాదర్ మంచి ట్రీటే.
ఇవి కూడా చదవండి:
- భారత రాష్ట్ర సమితి: జాతీయ పార్టీ స్థాపించడానికి అర్హతలేమిటి.? ఒక పార్టీకి జాతీయ హోదా ఎలా వస్తుంది?
- కొల్లాపూర్ మహాలక్ష్మి - అంబాబాయి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
- బల్లి పడితే ఆహారం విషపూరితం అవుతుందా, ఇంట్లో బల్లులు లేకపోతే మనుషులకు ఏం జరుగుతుంది?
- మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
- భారత రాష్ట్ర సమితి పార్టీ లక్ష్యం ఏంటి? కేసీఆర్ 'తెలంగాణ ప్రాంతీయ ఐడెంటిటీ'ని దాటుకుని జాతీయ నాయకుడు కాగలరా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















