పశువులకు సోకుతున్న లంపీ స్కిన్ వైరస్‌పై ప్రచారం అవుతున్న వదంతులు ఏంటి? వాస్తవాలు ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మేధావి అరోరా
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్ డిసిన్ఫర్మేషన్ టీమ్
భారత్‌లో పశువులకు సోకుతున్న ఓ వ్యాధి విషయంలో తప్పుడు సమాచారం పెద్ద ఎత్తున ప్రచారమవుతోంది.
ప్రభుత్వం వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం లంపీ స్కిన్ వ్యాధి ఇప్పటివరకు దేశంలోని 24 లక్షల పశువులకు సోకింది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు 1,10,000 పశువులు ప్రాణాలు కోల్పోయాయి.
ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పశుసంపద ఉన్నది, అత్యధిక మొత్తంలో పాలు ఉత్పత్తి చేస్తున్నది భారతదేశమే.
కానీ, ఇప్పుడు లంపీ స్కిన్ వ్యాధి పాడి రైతుల జీవనోపాధికి ముప్పుగా పరిణమిస్తోంది.
లంపీస్కిన్ వ్యాధి విషయంలో దేశంలో తప్పుడు ప్రచారం కూడా పెద్దఎత్తున సాగుతుండడంతో చాలామంది పాలు తాగేందుకు భయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో లంపీ స్కిన్ వ్యాధికి సంబంధించి మూడు అపోహలను మేం ఇక్కడ తొలగించి వాస్తవాలు చెప్తాం.

ఫొటో సోర్స్, Twitter
లంపీ స్కిన్ వ్యాధి సోకిన పశువుల పాలు తాగొచ్చా?
లంపీస్కిన్ వైరస్ పశువులకు సోకుతుండడంతో వాటి పాలు తాగడం ఏమాత్రం ఆరోగ్యకరం కాదంటూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు కనిపిస్తున్నాయి.
ఈ వ్యాధి సోకిన పశువుల పాలు తాగితే మనుషులకూ వ్యాధి సంక్రమిస్తుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
దద్దుర్లు, బొబ్బలతో బాధపడుతున్నవారి ఫొటోలు ఇలాంటి పోస్టులకు జత చేసి ప్రజలను భయపెడుతున్నారు.
'పాడి పరిశ్రమకు సంబంధించిన సోషల్ మీడియా గ్రూపులలో ఇలాంటి పోస్టులను చాలా చూశాను నేను. ఇవి సర్క్యులేట్ చేస్తున్నవారికి దీంతో ఎలాంటి సంబంధం ఉండదు, తమకు చేరిన పోస్టులను వారు వచ్చింది వచ్చినట్లుగా షేర్ చేస్తారంతే'' అన్నారు హరియాణాలో 6 వేల మంది పాడి రైతులు ఉన్న ఓ సంఘం జనరల్ సెక్రటరీ పోరస్ మెహ్లా.
బీబీసీతో మాట్లాడిన ఆయన.. ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల పాడి రైతులు నష్టపోతున్నారన్నారు.
రాజస్థాన్‌కు చెందిన పాడి రైతు మానవ్ వ్యాస్ బీబీసీతో మాట్లాడుతూ.. ''ఇలాంటి ప్రచారం నేనూ చూశాను. ఇదంతా నమ్మి కొందరు పాలను పారబోస్తున్నారనీ తెలిసింది'' అని చెప్పారు. ''ఇప్పటికే లంపీ స్కిన్ వ్యాధి కారణంగా పశువులను పోగొట్టుకుని రైతులు నష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు అనవసర భయాలతో ప్రజలు పాలను కొనడం మానేస్తే పాడిరైతుల కష్టాలు మరింత పెరుగుతాయి'' అన్నారాయన.
'లంపీ స్కిన్ వ్యాధి సోకిన పశువుల పాలు తాగొచ్చా?' అని గూగుల్‌లో వెతికేవారి సంఖ్య గత 30 రోజుల్లో 5,000 శాతం పెరిగిందని గూగుల్ ట్రెండ్స్ గణాంకాలు చెబుతున్నాయి.
వాస్తవానికి లంపీ స్కిన్ వ్యాధి పశువుల నుంచి మనుషులకు సోకే రకం కాదు.
లంపీ స్కిన్ వ్యాధి మనుషులపై ప్రభావం చూపదని ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ) 2017 నాటి తన నివేదికలో వెల్లడించింది.
ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కూడా ఇదే విషయం చెబుతోంది. 'ఇంతవరకు పశువుల నుంచి మనుషులకు ఈ వ్యాధి సోకిన ఉదంతం ఒక్కటి కూడా లేదు'' అని ఈ ఇనిస్టిట్యూట్ జాయింట్ డైరెక్టర్ కేపీ సింగ్ 'బీబీసీ'తో చెప్పారు.
అయితే, 'వ్యాధి సోకిన పశువు పాలను తాగితే దూడకు వ్యాధి సంక్రమించే ప్రమాదం ఉంది' అని చెప్పారాయన.
మనుషులకు లంపీ స్కిన్ వ్యాధి సోకినట్లుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్న తప్పుడు పోస్టులపై కేపీ సింగ్ మాట్లాడుతూ శరీరంపై దద్దర్లు, పొక్కులు వంటి కొన్ని ఇతర చర్మ వ్యాధులలోనూ ఉంటాయని... ఇలా కనిపించినంతమాత్రాన అదంతా లంపీ స్కిన్ వ్యాధి కాదని.. ఇలాంటివి ఎవరికైనా చర్మంపై వస్తే ప్రయోగశాలలో పరీక్షిస్తే కారణమేంటనేది తెలుస్తుందని అన్నారు.

ఫొటో సోర్స్, Twitter
లంపీ స్కిన్ వ్యాధి పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చిందా?
లంపీ స్కిన్ వ్యాధి 1929 తొలిసారి జాంబియాలో బయటపడింది. చాలాకాలం పాటు ఇది సబ్ సహారన్ ఆఫ్రికా దేశాలకు మాత్రమే పరిమితమైన వ్యాధి. ఆ తరువాత అది ఉత్తర ఆఫ్రికా, మధ్యఆసియా, యూరప్, ఆసియా దేశాలకూ వ్యాపించింది.
ఆసియాలో ఈ వ్యాధి మొట్టమొదట 2019లో బంగ్లాదేశ్, చైనా, భారత్‌లలో గుర్తించారు.
అప్పటికి ఈ వ్యాధి పాకిస్తాన్‌లో లేదని 2020లో ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ) విడుదల చేసిన ఓ నివేదిక వెల్లడించింది.
కాబట్టి ఇది పాకిస్తాన్‌లో బయటపడడానికి ముందే భారత్‌లో సోకిందని చెప్పొచ్చు.
ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కేపీ సింగ్ ఈ వ్యాధి బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి సంక్రమించిందని తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి సరిహద్దుల మీదుగా కొన్ని ప్రాంతాలలో పశువులు తిరుగుతాయని.. ఆ క్రమంలో బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి వ్యాధి వచ్చిందని చెప్పారు.
రెండు దేశాలలోనూ 2019లోనే ఈ కేసులు వెలుగుచూసినప్పటికీ భారత్ కంటే ముందు బంగ్లాదేశ్‌లో కేసులు కనిపించాయని... భారత్‌లోనూ ఈ కేసులు కనిపించిన కొన్నాళ్ల తరువాత పాకిస్తాన్‌లో గుర్తించారని 'బీబీసీ'తో ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Twitter
వ్యాక్సీన్ వేస్తే పశువులు చనిపోతున్నాయా?
లంపీ స్కిన్ వ్యాధి సోకకుండా పశువులకు వ్యాక్సీన్ వేస్తుంటే అవి చనిపోతున్నాయంటూ సోషల్ మీడియా పోస్టులతో దుష్ప్రచారం సాగుతోంది.
పెద్దసంఖ్యలో పశువుల కళేబారులున్న ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. గుజరాత్‌లో భారత ప్రభుత్వం పశువులకు వ్యాక్సీన్ వేసిన తరువాత వేల సంఖ్యలో చనిపోయాయంటూ ఆ వీడియోలకు వివరం రాసి షేర్ చేస్తున్నారు.
ఈ వీడియోలో పెద్ద సంఖ్యలో పశువుల కళేబరాలు ఉండడం వాస్తవమే అయినప్పటికీ అవి వ్యాక్సినేషన్ వల్ల చనిపోయిన పశువులు కావు. లంపీ స్కిన్ సహా ఏ వ్యాధి నివారణకైనా సామూహికంగా వ్యాక్సీన్లు వేయడం అనేది ఫలితమిచ్చే పద్ధతి.
భారత్‌లోని అనేక రాష్ట్రాలలో ప్రస్తుతం లంపీస్కిన్ నివారణకు పశువులకు వ్యాక్సీన్లు వేస్తున్నారు. 'గోట్ పాక్స్' వ్యాక్సీన్‌ను దీనికోసం వినియోగిస్తున్నారు.
ఇండియాలోని శాస్త్రవేత్తలు లంపీ స్కిన్ వ్యాక్సీన్ కూడా అభివృద్ధి చేసినప్పటికీ వాణిజ్యపరంగా ఇంకా అందుబాటులోకి రాలేదు.
మరోవైపు ఇప్పటికే లక్షలాది పశువులకు గోట్ పాక్స్ వ్యాక్సీన్ వేయడంతో చాలావరకు కోలుకున్నాయి. ''ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరిష్కారం గోట్ పాక్స్ వ్యాక్సీన్ మాత్రమే. ఇది లంపీ స్కిన్ వైరస్ నుంచి 80 శాతం రక్షణ ఇస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు కూడా. దీని ప్రభావాన్ని ఇప్పటికే పరిశీలిస్తున్నాం.. మంచి ఫలితాలు వస్తున్నట్లు గుర్తించాం'' అని కేపీ సింగ్ బీబీసీతో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్‌లో క్రికెట్‌ను భారత్ వ్యాపార సంస్థలే నడిపిస్తున్నాయా? బీసీసీఐ నిధులు ఇవ్వకపోతే పాక్ క్రికెట్ బోర్డు కూలిపోతుందా?
- దీపావళి టపాసులు అమ్మితే మూడేళ్లు జైలుశిక్ష, టపాసులు కాల్చితే 6 నెలలు జైలు శిక్ష
- ఇండోనేషియా: 99 మంది పిల్లలు చనిపోవడంతో దగ్గు మందు సహా అన్ని రకాల సిరప్‌లపై నిషేధం
- లిజ్ ట్రస్: ప్రధాని అయిన 45 రోజులకే ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది, బ్రిటన్ తాజా రాజకీయాలపై తెలుసుకోవాల్సిన 8 పాయింట్లు
- ఇండియా మోస్ట్ వాంటెడ్ పాక్ తీవ్రవాదులను చైనా ఎలా రక్షించిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















