ఇండోనేషియా: 99 మంది పిల్లలు చనిపోవడంతో దగ్గు మందు సహా అన్ని రకాల సిరప్‌లపై నిషేధం

దగ్గు మందు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫ్రాన్సెస్ మావో
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇండోనేషియాలో సుమారు 100 మంది పిల్లలు చనిపోవడంతో అన్ని రకాల ద్రవ మందులు, సిరప్‌ల అమ్మకాలపై నిషేధం విధించారు.

కొన్ని రోజుల క్రితం గాంబియాలో దాదాపు 70 మంది పిల్లల మరణాలకు భారతదేశంలో తయారైన దగ్గు మందు (కాఫ్ సిరప్) కారణమనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.

ఇండోనేషియాలో అమ్ముతున్న కొన్ని సిరప్‌లలో తీవ్ర కిడ్నీ గాయాలకు (అక్యూట్ కిడ్నీ ఇంజురీస్-ఏకేఐ) దారి తీసే పదార్థాలు ఉన్నాయని, వాటివల్లే 99 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారని ఆ దేశం వెల్లడించింది.

అయితే, ఆ మందులు దిగుమతి చేసుకున్నవా లేక స్థానికంగా తయారయినవా అనేది ఇంకా స్పష్టంగా తెలీదు.

సుమారు 200 ఏకేఐ కేసులను పిల్లల్లో కనుగొన్నారని, వారిలో చాలామంది అయిదేళ్ల లోపు వారేనని ఇండోనేషియా ఆరోగ్య అధికారులు గురువారం తెలిపారు.

నాలుగు కాఫ్ సిరప్‌ల విక్రయాలను నిలిపివేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది

ఫొటో సోర్స్, WHO

ఫొటో క్యాప్షన్, నాలుగు కాఫ్ సిరప్‌ల విక్రయాలను నిలిపివేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది

ఈ నెల ప్రారంభంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), గాంబియాలో 70 మంది పిల్లల మరణాలకు కారణమని భావిస్తున్న నాలుగు దగ్గు మందుల (కాఫ్ సిరప్) విషయంలో అంతర్జాతీయ స్థాయిలో హెచ్చరిక జారీ చేసింది.

ఆ దగ్గు మందులను ఓ భారతీయ కంపెనీ తయారు చేసినట్లు డబ్ల్యూహెచ్‌ఓ గుర్తించింది. వాటిలో మోతాదుకు మించి డైథిలీన్ గ్లైకాల్, ఎథిలీన్ గ్లైకాల్‌లు ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపింది.

ఈ మందులకు, తీవ్ర కిడ్నీ గాయాలకు సంబంధం ఉన్నట్టు డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది.

స్థానికంగా ఉపయోగించే కొన్ని మందులలో ఇవే రసాయనాలు ఉన్నట్లు ఇండోనేషియా ఆరోగ్య మంత్రి గురువారం తెలిపారు.

"ఏకేఐ సోకిన అయిదేళ్ల లోపు పిల్లలు తీసుకున్న సిరప్‌లలో డైథిలీన్ గ్లైకాల్, ఎథిలీన్ గ్లైకాల్‌ ఉన్నట్లు తేలింది. అవి ఉండకూడదు లేదా చాలా తక్కువ మోతాదుల్లో ఉండాలి" అని ఆరోగ్య మంత్రి బుడి గుణది సాదికిన్ అన్నారు.

అయితే, కలుషిత మందులు వాడిన కేసులు మొత్తం ఎన్ని ఉన్నాయో ఆయన చెప్పలేదు.

కాగా, గాంబియాలో వాడిన దగ్గు మందులను తమ దేశంలో విక్రయించలేదని ఇండోనేషియా అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఇండోనేషియాలో చనిపోయిన పిల్లల సంఖ్య, రిపోర్ట్ చేసిన దాని కంటే చాలా ఎక్కువ ఉండవచ్చని ఒక ఎపిడెమియాలజిస్ట్ అన్నారు.

"ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనకు పైపైన ఉన్నది మాత్రమే తెలుస్తుంది. లోతులకు వెళ్లి చూస్తే బాధితుల సంఖ్య చాలా పెద్దదే ఉండవచ్చు" అని గ్రిఫిత్ యూనివర్సిటీకి చెందిన ఎపిడెమియాలజిస్ట్ డిక్కీ బుడిమాన్ బీబీసీతో చెప్పారు.

అయితే, పిల్లల మరణాలకు కారణమైన సిరప్‌ల బ్రాండ్లు, రకాల పేర్లను ఇండోనేషియా అధికారులు ఇప్పటివరకు బహిర్గతం చేయలేదు.

ప్రస్తుతానికి అన్ని రకాల సిరప్ అమ్మకాలను తాత్కాలికంగా నిషేధించారు. వాటిని డాక్టర్లు సూచించకూడదని కూడా ఆదేశాలు జారీ చేశారు.

వీడియో క్యాప్షన్, అఫ్గానిస్తాన్‌లో ప్రాణాలు నిలుపుకునేందుకు పోరాడుతున్న గర్భవతులు, నవజాత శిశువులు...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)