Cough Syrup: డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక: ఈ పిల్లల దగ్గు మందులతో జాగ్రత్త.. ఈ లక్షణాలు కనిపిస్తే ప్రమాదం.. గాంబియాలో 66 మంది చిన్నారుల మృతి..

దగ్గు మందు

ఫొటో సోర్స్, Getty Images

పశ్చిమ ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది చిన్నారుల మరణానికి ఓ భారత్ కంపెనీ తయారుచేసిన నాలుగు దగ్గు మందులతో సంబంధం ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ఈ మందులపై ప్రపంచ వ్యాప్తంగా డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు జారీచేసింది.

‘‘ఈ దగ్గు మందుల వల్ల పిల్లల్లో కిడ్నీ సమస్యలు తలెత్తి, వారు చనిపోయి ఉండొచ్చని తెలుస్తోంది’’అని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

ఈ నాలుగు మందులను భారత్‌కు చెందిన ‘‘మైడెన్ ఫార్మాస్యూటికల్స్’’ తయారుచేసింది. అయితే, ఆరోగ్య భద్రత విషయంలో ఈ సంస్థ హామీ ఇవ్వడంలో విఫలమైందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

ఈ విషయంపై స్పందించాలని మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌ను బీబీసీ కోరింది.

అయితే, పిల్లల మరణాలు, దగ్గు మందుల మధ్య సంబంధాన్ని ధ్రువీకరించే ఆధారాలను డబ్ల్యూహెచ్‌వో ఇంకా తమకు ఇవ్వలేదని మైడెన్‌కు చెందిన భారత అధికారులు చెప్పారు.

డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథనమ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథనమ్

ఈ దగ్గు మందులు వాడొద్దు - డబ్ల్యూహెచ్ఓ

ప్రోమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్సమలిన్ బేబీ కఫ్ సిరప్, మెకాఫ్ బేబీ కాఫ్ సిరప్, మ్యాగ్రిప్ ఎన్ కోల్ సిరప్‌లు.. డబ్ల్యూహెచ్‌వో ప్రస్తావించిన దగ్గు మందుల జాబితాలో ఉన్నాయి.

ఈ నాలుగు దగ్గు మందులను గాంబియలో పిల్లలు వాడినట్లు గుర్తించారు. అయితే, ఇవి అనధికార మార్కెట్ల ద్వారా ఇక్కడి ప్రాంతాలకు చేరి ఉండొచ్చని డబ్ల్యూహెచ్‌వో తమ వెబ్‌సైట్లో పేర్కొంది.

వీటిని వాడటం ద్వారా పిల్లల్లో తీవ్రమైన కిడ్నీ సమస్యలు లేదా మరణం కూడా సంభవించొచ్చని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది.

గత జులైలో ఐదేళ్లలోపు వయసున్న పిల్లల్లో కిడ్నీ వ్యాధుల కేసులు పెరిగాయని గాంబియా అధికారులు వెల్లడించారు. అనంతరం డబ్ల్యూహెచ్‌వో ఈ హెచ్చరికలు జారీచేసింది.

జులైలోనే పారాసెటమాల్ సిరప్‌ల వాడకంపై గాంబియా ప్రభుత్వం నిషేధం విధించింది. అందరూ మాత్రలనే ఉపయోగించాలని సూచించింది.

భారత్‌లో తయారైన దగ్గు మందు

ఫొటో సోర్స్, WHO

లక్షణాలు ఏంటంటే..

మరోవైపు దగ్గు మందుల నమూనాలపై ల్యాబ్‌లో చేపట్టిన పరిశోధనలో వీటిలో డైఇథైలీన్ గ్లైకాల్, ఇథైలీన్ గ్లైకాల్ లాంటి కాలుష్యకారకాల స్థాయిలు పరిమితికి మించి ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది.

‘‘ఈ సమ్మేళనాలు విషపూరితమైనవి ’’అని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది.

బీబీసీ రెడ్ లైన్ Red Line

డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక ప్రకారం ఈ మందులు వాడితే పిల్లల్లో ఈ లక్షణాలు కనిపించొచ్చు..

  • కడుపు నొప్పి
  • వాంతులు
  • డయేరియా
  • మూత్రం పోసుకోవడంలో ఇబ్బంది
  • తలనొప్పి
  • మానసిక సమస్యలు
  • కిడ్నీ వ్యాధులు
  • ప్రాణాలు కూడా పోవచ్చు
బీబీసీ రెడ్ లైన్ Red Line

మరోవైపు గత నెలలో డజన్ల కొద్దీ పిల్లలు ఇక్కడ చనిపోయారని గాంబియా ఆరోగ్య అధికారులు చెప్పారు. సరిగ్గా ఎంత మంది చనిపోయారో వారు సంఖ్య వెల్లడించలేదు.

ఈ అంశంపై జెనీవాలో డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథనమ్ బుధవారం మాట్లాడుతూ.. ‘‘ఈ చిన్న పిల్లల మరణాలు వారి కుటుంబ సభ్యులకు తీరని వ్యథ మిగులుస్తాయి’’అని అన్నారు.

ఈ కలుషితమైన దగ్గు మందులను కేవలం గాంబియాకు మాత్రమే సరఫరా చేసి ఉండొచ్చని భారత్‌లోని ఔషధ ప్రాధికార సంస్థ తెలిపినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

అయితే, ఈ కలుషితమైన సమ్మేళనాలను ఇతర ఉత్పత్తుల్లోనూ ఉపయోగించి ఉండొచ్చని, వీటిని దేశీయంగా అందుబాటులో ఉంచడంతోపాటు ఎగుమతి కూడా చేసి ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది.

వీడియో క్యాప్షన్, ఇరాక్: చమురు మంటలతో క్యాన్సర్ బారిన పడుతున్న చిన్నారులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)