Body pains at night: రాత్రయ్యేసరికి నొప్పులు ఎందుకు ఎక్కువ అవుతాయి, పక్కమీదకు చేరగానే మన శరీరంలో వచ్చే మార్పులేంటి

నొప్పి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రోసియో డీలా వేగాడీ కరాంజా
    • హోదా, పరిశోధకులు

కొన్ని రాత్రుళ్లు గడవడం మనకు చాలా కష్టంగా అనిపిస్తుంది. మంచంపై అటూఇటూ దొర్లడం, సీలింగ్‌వైపే అలా చూడటం ఇలా ఎన్నిచేసినా ఆ రాత్రి అంత తేలిగ్గా వదిలిపెట్టదు.

పంటి నొప్పి, చెవి నొప్పి, కాళ్ల నొప్పి, వెన్ను నొప్పి.. ఇలా ఏదో ఒకటి ఒక్కోసారి మనకు అసలు కంటిపై కునుకు అనేదే లేకుండా చేస్తుంది.

ఆ నొప్పి రోజంతా కూడా ఉంటుంది. కానీ, రాత్రి వచ్చేసరికి అసలు మనకు మనశ్శాంతి అనేదే లేకుండా చేస్తుంటుంది.

అసలు నిజంగానే మనకు రాత్రిపూట ఈ నొప్పులు ఎక్కువ అవుతాయా? సైన్స్ ఏం చెబుతోంది?

నొప్పి

ఫొటో సోర్స్, Getty Images

అసలు నొప్పి అంటే ఏమిటి?

మన అందరికీ ఏదో ఒక సమయంలో దెబ్బలు తగిలే ఉంటాయి. అప్పుడు నొప్పి వచ్చే ఉంటుంది. ఇందులో కొత్తమీ ఉండదు. అయితే, అసలు నొప్పి అంటే ఏమిటి? అని ఎవరైనా అడిగితే, అప్పుడు అసలైన నొప్పి మొదలవుతుంది. ఎందుకంటే దీన్ని నిర్వచించడం కొంచెం కష్టమే.

అసలు నొప్పి అనే నిర్వచనం ఏళ్లుగా మారిపోతూ వచ్చింది. చివరగా 2020లో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ద స్టడీ ఆఫ్ పెయిన్ (ఐఏఎస్‌పీ) దీనిని నిర్వచిస్తూ.. ‘‘కండరాలు దెబ్బతిన్నప్పుడు లేదా దెబ్బ తినే అవకాశం ఉన్నప్పుడు లేదా అలా జరుగుతుందని భావించినప్పుడు కలిగే ఒకరమైన సెన్సరీ, ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్’’అని వివరించింది.

అంటే మొత్తంగా దీన్ని మన జ్ఞానేంద్రయాలకు సంబంధించిన అనుభూతిగా చెప్పుకోవచ్చు. అయితే, ప్రతికూల భావోద్వేగాలతోనూ దీనికి సంబంధం ఉంటుంది. శరారీనికి దెబ్బ తగిలినప్పుడు వెంటనే అనిపించే ఫీలింగ్‌గా దీన్ని చెప్పుకోవచ్చు.

నొప్పి

ఫొటో సోర్స్, Getty Images

ఎందుకు ఇలా?

నిజానికి నొప్పిని మనం ఒక నెగిటివ్ ఫీలింగ్‌గా భావిస్తాం. దీని నిర్వచనంలోనూ ‘‘అన్‌ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్స్’’అనే పదం ఉంది.

అయితే, మన శరీరం చాలా సంక్లిష్టమైనది. ఇదొక భారీ యంత్రం లాంటిది. దీని విధులను, సంకేతాలను పూర్తిగా అర్థం చేసుకోవడం కాస్త కష్టమైన పని.

కానీ, నొప్పి అనేది ఏదో ‘‘తప్పు’’ జరుగుతోందని చెప్పడానికి ఒక సంకేతం లేదా హెచ్చరిక లాంటిది. పరిణామక్రమంలో భాగంగా ఇలాంటి నొప్పి కలిగించే పనులు, ముప్పుల నుంచి మనం దూరంగా జరుగుతూ వచ్చాం.

సాధారణ పరిభాషలో చెప్పాలంటే, ఇదొక ‘‘అలారమ్’’లా మనకు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ సంకేతాలు మనకు మెదడు నుంచి వస్తాయి. ఏ ప్రాంతం ముప్పులో ఉంది? మనం సురక్షితంగా ఉండటానికి ఏం చేయాలి? లాంటివి కూడా సూచిస్తుంది. ఇదొక నెగెటివ్ ఫీలింగ్ కాబట్టి, దీని నుంచి దూరంగా ఉండటానికి శరీరం ప్రయత్నిస్తుంటుంది.

నొప్పి

ఫొటో సోర్స్, Getty Images

అయితే, ఏదైనా చర్యకు వచ్చే స్పందనను నొప్పిగా భావించకూడదు. ప్రాచీన కాలంలో నొప్పి అనే దానిలో ఇది భాగంగా ఉండేది. ఉదాహరణకు మంటకు దగ్గరగా పెడితే చేయి కాలి నొప్పి వస్తుందని, వెంటనే మనం చేయిని వెనక్కి తీసుకుంటాం. ఈ స్పందనను కూడా మొదట్లో నొప్పి కిందే పరిగణించేవారు. అయితే, దీన్ని స్పందనగా చూడాలని ఆధునిక సైన్స్ చెబుతోంది.

ఆధునిక సైన్స్ ప్రకారం.. నొప్పి అనేది మెదడుకు సంబంధించిన చర్య. అసలు ఎక్కడ, ఎంత మొత్తంలో నొప్పి వస్తోంది? ఇది ఎలా ప్రభావితం చేస్తోంది? అని మెదడు మనకు హెచ్చరికలు జారీచేస్తుంది.

మంటకు దగ్గరగా చేయి పెట్టడంతో కలిగే వేడితో వచ్చే స్పందనలు కూడా నరాల గుండా కూడా మెదడుకే వెళ్తాయి. అయితే, అక్కడ ప్రాసెస్ అయ్యే విధానం భిన్నంగా ఉంటుంది. దీన్ని నాసిసెప్షన్‌గా పిలుస్తారు. ఇది నొప్పిలో ఒక భాగం మాత్రమే. ఎందుకంటే ఇక్కడ నొప్పి అనేది భావోద్వేగాలతో కూడా ముడిపడి ఉంటుంది.

సాధారణ పరిభాషలో చెప్పాలంటే.. నొప్పికి అన్నిసార్లు బాధపెట్టే ప్రతి స్పందనలు అవసరం లేదు. అసలు ఎలాంటి ప్రతిస్పందన లేదా ప్రతిచర్యలు లేకుండా నొప్పి మొదలుకావొచ్చు. దీనికి ఉదాహరణగా ఫాంటమ్ లింబ్ సిండ్రోమ్‌ను చెప్పుకోవచ్చు. ఈ సిండ్రోమ్‌లో అసలు మన శరీరం లేని భాగంలో తీవ్రమైన నొప్పి వస్తున్నట్లుగా మెదడు సంకేతాలు పంపిస్తుంటుంది.

నొప్పి

ఫొటో సోర్స్, Thinkstock

ఏమిటీ నొప్పి సిద్ధాంతం?

నిజంగానే మనకు రాత్రి పూట నొప్పి పెరుగుతుందా? మనం పడుకోవడానికి మంచం మీదకు వెళ్లినప్పుడు అసలు ఏం జరుగుతుంది?

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే అసలు మన మెదడు సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తుందో తెలుసుకోవాలి. దీని కోసం 1960లలో పరిశోధకులు రోలాండ్ మెల్‌జక్, ప్యాట్రిక్ వాల్.. ‘‘గేట్ కంట్రోల్ సిద్ధాంతం’’ను ప్రతిపాదించారు.

ఈ సిద్ధాంతం ప్రకారం, మన వెన్నుపాములో ఒక గేట్ ఉంటుంది. నొప్పి సంకేతాలు మెదడుకు చేరుకోవాలా వద్దా అనేది ఈ గేట్ నిర్ణయిస్తుందని వీరు ప్రతిపాదించారు.

మరోలా చెప్పాలంటే.. ఈ వెన్నుపాములోని ద్వారం మూసుకున్నప్పుడు మనం కాస్త నొప్పి తక్కువగా ఉన్నట్లు ఫీల్ అవుతాం. ఈ గేట్ తెరచుకున్నప్పుడు నొప్పి కాస్త ఎక్కువ అయినట్లు అనిపిస్తుంది. కొన్ని చర్యల వల్ల ఈ ద్వారం మూసుకుంటే, కొన్నింటి వల్ల ఇది తెరచుకుంటుంది.

ఇక్కడ మనం ఒక ఉదాహరణను చెప్పుకోవచ్చు. దెబ్బ తగిలిన వెంటనే మనం చర్మంపై గట్టిగా రద్దడం ద్వారా ఒకరమైన ఒత్తిడి పేరుకొని.. ఇది నొప్పితో పోటీ పడుతుంది. ఫలితంగా కాస్త నొప్పి తక్కువగా ఉందనే భావన కలుగుతుంది.

కానీ, రాత్రిపూట అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రతి చిన్న శబ్దమూ మనకు స్పష్టంగా వినిపిస్తుంది. అలానే ఆ రోజులో మనం ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులను వరుసగా గుర్తుకు వస్తాయి.

చీకటిలో ఒంటరిగా ఉండేటప్పుడు మన ఆలోచనలు పక్కదారి పట్టే అవకాశం తక్కువగా ఉంటాయి. మన మొత్తం ఆలోచనలు ఆ నొప్పి చుట్టూ తిరుగుతుంటాయి. దీంతో వెన్నుపాములోని ఆ డోర్‌ను మూయడం కష్టం అవుతుందని రోలాండ్, ప్యాట్రిక్ ప్రతిపాదించారు.

నొప్పి

ఫొటో సోర్స్, Getty Images

ఉదయం నాలుగు గంటలకు అత్యంత దారుణం

1960ల నుంచి నొప్పిపై చాలా అధ్యయనాలు జరిగాయి. దీన్ని అవగాహన చేసుకునేందుకు కొత్త టెక్నిక్‌లు అందుబాటులోకి వచ్చాయి.

రాత్రిపూట నొప్పి ఎక్కువ కావడంలో శరీరంలోని జీవగడియారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని గత సెప్టెంబరులో బ్రెయిన్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది.

తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో నొప్పి పతాక స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుందని ఫ్రాన్స్‌లోని యూనివర్సిటీ క్లాడ్ బెర్నార్ డీ లియోన్‌కు చెందిన ఐనెస్ డాగ్యూట్ నేతృత్వంలో చేపట్టిన ఈ అధ్యయనం వివరించింది.

వీడియో క్యాప్షన్, ‘నిద్ర పట్టదు, చనిపోవాలని అనిపిస్తుంటుంది’

సరిగా నిద్ర పట్టకపోవడం దీనికి ఒక కారణం అయ్యుండొచ్చని ఆ పరిశోధన పేర్కొంది. అయితే, నొప్పి ఎక్కువ కావడంలో జీవ గడియారం ప్రధాన పాత్ర పోషిస్తుందని ఐనెన్ తన పరిశోధన పత్రంలో వివరించారు.

జీవ గడియారంలో మార్పుల వల్ల రోగ నిరోధక స్పందనలు, ఇన్‌ఫ్లమేషన్‌లలో ప్రధాన పాత్ర పోషించే కార్టిజాల్ లాంటి రసాయనాల స్థాయిల్లో హెచ్చుతగ్గులు వస్తున్నాయని, మొత్తంగా ఇవి నొప్పిపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు.

అయితే, ఇదొక ల్యాబొరేటరీ పరిశోధన. అంటే దీనిలో పాల్గొన్నవారు తమ సొంత ఇళ్లలో తమ మంచాలపై పడుకొని లేరు. వీరికి నొప్పికి కారణమయ్యే స్పందనలు కృత్రిమంగా కలిగించారు.

వీడియో క్యాప్షన్, మీరు ఎన్నిరోజులకు ఒకసారి బెడ్‌షీట్లను మారుస్తారు/ఉతుకుతారు?

హెచ్చరికలు..

మరోవైపు దీని వెనుక పరిణామక్రమ అంశాలు కూడా ఉన్నాయని హడాస్ నమన్ అవెర్‌బచ్, క్రిస్టోఫర్ డీ కింగ్ ఒక పరిశోధన పత్రంలో వెల్లడించారు. ‘‘రాత్రిపూట నిద్రపోయే సమయంలో మనపై దాడి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడు పొంచివున్న ముప్పులు గుర్తించేందుకు చిన్న స్పందన ఎదురైనా చాలు. అలా మన శరీరం పరిణామ క్రమం చెందింది’’అని వారు వివరించారు.

అసలు రాత్రిపూట నొప్పి ఎందుకు ఎక్కువ అవుతుంది? అనే అంశంపై మరింత లోతైన పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది.

అయితే, రాత్రిపూట ముప్పుల నుంచి మనల్ని రక్షించేందుకు మన మెదడు మరింత అప్రమత్తంగా ఉండటంతోపాటు మన ఆలోచనలు ఈ నొప్పికి కారణం అవుతాయని ప్రస్తుత పరిశోధనలు చెబుతున్నాయి.

(రచయిత స్పెయిన్‌లోని మలగ యూనివర్సిటీలో సైకాలజీ రీసెర్చర్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)