పవన్ కళ్యాణ్: ‘కాపు, ఒంటరి, తెలగ, బలిజలు ముందుకు వస్తే తప్ప ఏపీ రాజకీయాల్లో మార్పు రాదు’

పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, JANASENA PARTY

ఫొటో క్యాప్షన్, రాజమహేంద్రవరం చేరుకున్న పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు సక్రమంగా లేవంటూ జనసేన నిరసనలకు పూనుకుంది. గాంధీ జయంతి సందర్భంగా శ్రమదానం చేయాలని పిలుపునిచ్చిన ఆపార్టీ అధినేత పవన్ కళ్యాణ్... శనివారం హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి చేరుకున్నారు.

పవన్‌కు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు.

పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకునే దారులన్నీ మూసివేశారు. సభకు ఇరు వైపులా సుమారు 5 కిలోమీటర్ల పరిధిలో ఈ ఆంక్షలు కొనసాగాయి. రాజమండ్రి వైపు వచ్చే వాహనాలను నిలిపివేశారు.

కాలినడకన కూడా కార్యకర్తలను సభా ప్రాంగణం వైపు వెళ్లనివ్వ లేదు. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి వాహనాలను సైతం లోనికి అనుమతించ లేదు. ఇప్పటికే వేలాది మంది జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ముగ్గురు, నలుగురు కలసి ఒక చోట ఉన్నా, నడిచి వెళ్తున్నా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

పోలీసుల తీరుపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

'కాపు, ఒంటరి, తెలగలు, బలిజలు ముందుకు వస్తే తప్ప రాజకీయాల్లో మార్పు రాదు'

కమ్మ సామాజికవర్గానికి తాను వ్యతిరేకం కాదని చెప్పడానికే గతంలో టీడీపీతో కలిసి పోటీచేశానని పవన్ కళ్యాణ్ వివరించారు.

‘‘కాపు, తెలగ, ఒంటరి, బలిజ అందరూ బయటకు రావాలి. తోటి కులానికి కష్టం వస్తే అండగా నిలవాలి. నవ సమాజ స్థాపనకు నడుం బిగించాలి. మార్పు రావాలి. కులాల మధ్య అంతరాలు సృష్టించి రాజ్యాధికారం లాక్కోవడానికి కుట్రలు జరుగుతున్నాయి. జనసేన కుల,మత భేదాలకు అతీతంగా పనిచేస్తుంది’’ అని ఆయన అన్నారు.

ఈ నాలుగు కులాలు పెద్దన్న పాత్ర పోషిస్తే తప్ప మిగిలిన కులాలకు సాధికారిత రాదని చెప్పారు. రాష్ట్ర రాజకీయాలు రెండిళ్ల మధ్య జరిగితే కుదరదని, ఒక కులాన్ని వర్గ శత్రువుగా చేసుకుని వైసీపీ రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఆరోపించారు.

'పవర్ వచ్చాకే పవర్‌ స్టార్ అని పిలవండి.. అప్పటి వరకూ పిలవొద్దు'

ఈ సందర్భంగా రాజమహేంద్రవరం హుకుంపేటలో పవన్ మాట్లాడుతూ.. ‘‘మీరిలా అరిచి.. నన్ను కూడా గెలిపించలేదు, ప్రయోజనమేంటీ? వద్దు, అరవొద్దు. వాస్తవాలు మాట్లాడుకుందాం. పవర్ లేనికాడికి పవర్ స్టార్ కూడా వేస్ట్. ఎందుకని తీసేశారు. పవర్ వచ్చినప్పుడే పవర్ స్టార్ అని పిలవండి. అప్పటిదాకా పిలవకండి. సీఎం అయితే సీఎం అని పిలవండి. అప్పటిదాకా నన్నేమీ పిలవకండి. జనసేనానిగా పిలవండి ఒప్పుకుంటాను’’ అని పవన్ అన్నారు.

తనపై చాలా మానసిక అత్యాచారాలు జరిగాయని, అయితే, ఇప్పటివరకూ వాటిని సహించానని, ఇకపై సహించబోనని తెలిపారు.

కనీసం రెండు దశాబ్దాలు కలిసి ప్రయాణం చేయగలిగే వ్యక్తులే జనసేన పార్టీలోకి రావాలని అన్నారు.

పవన్ కల్యాణ్‌

ఫొటో సోర్స్, JANASENA PARTY

ఫొటో క్యాప్షన్, పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలుకుతున్న అభిమానులు

హుకుంపేట సభాస్థలం వద్ద ఉద్రిక్తత

నిరసన కార్యక్రమంలో భాగంగా పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరం, అనంతపురంలో శ్రమదాన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే జనసేన కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.

అనేక చోట్ల ఆపార్టీ కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. శ్రమదానం చేపట్టే ప్రయత్నం చేస్తున్న వారిని నిలువరిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ స్వయంగా పాల్గొనబోతున్న కార్యక్రమానికి అనుమతిలేదంటూ రాజమహేంద్రవరంలోని హుకుంపేట సభాస్థలం వద్ద కూడా జనసేన కార్యకర్తలను అడ్డుకుంటున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.

తొలుత ధవళేశ్వరం అని తర్వాత మార్చారు

గడిచిన వారం రోజులుగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సినిమా టికెట్ల నుంచి రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితి వరకూ అన్నింటిపైనా జగన్ ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారు.

అదే సమయంలో కొంతకాలంగా ప్రత్యక్ష కార్యక్రమాలకు దూరంగా ఉన్న పవన్ స్వయంగా ఏపీలో రాజకీయ కార్యాచరణకు పూనుకున్నారు. శ్రమదానం పేరుతో రోడ్లు సరి చేసేందుకు సిద్ధమయ్యారు.

ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ మీద శ్రమదానం చేస్తామని తొలుత జనసేన ప్రకటించింది. అయితే ఇరిగేషన్ అధికారులు అనుమతి నిరాకరించారు. టెక్నికల్ గా చేయాల్సిన పనిని రాజకీయ కార్యక్రమాల పేరుతో చేస్తే సమస్య అవుతుందని అధికారులు ప్రకటించారు.

దాంతో జనసేన తన నిర్ణయాన్ని మార్చుకుంది. ధవళేశ్వరం నుంచి రాజమహేంద్రవరం హకుంపేటకు వేదికను మార్చుకుంది. అక్కడ బాలాజీపేటలో సభ నిర్వహించి, అనంతరం శ్రమదానం చేసేందుకు పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్ ప్రకటించింది.

రాజమహేంద్రవరంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, JANASENA PARTY

అనుమతిలేదంటున్న పోలీసులు

పవన్ కళ్యాణ్ తొలుత రాజమహేంద్రవరంలో, తర్వాత అనంతపురంలో కూడా శ్రమదానం చేస్తారని జనసేన ప్రకటించింది. ఆయనతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు శ్రమదానం చేపట్టాలని పిలుపునిచ్చింది.

పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి గానీ, జనసేన కార్యక్రమాలకు గానీ అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. సభ వద్దకు వస్తున్న కార్యకర్తలను అడ్డుకుంటున్నారు. హకుంపేట బాలాజీపేట సమీపంలో ఎవరూ రావద్దని హెచ్చరిస్తున్నారు.

కార్యక్రమం జరిపి తీరుతాం

''శ్రమదానం చేసి రోడ్లు బాగు చేస్తామంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. అయినా మా కార్యక్రమం ఆగదు. రాష్ట్రంలో రోడ్ల సమస్య పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం మాత్రం అర్ధరాత్రి మరమ్మతులు చేస్తూ సమస్యను పక్కదారి పట్టించే పని చేస్తోంది'' అని జనసేన తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ తెలిపారు.

''మా పార్టీ అధినేత రంగంలో దిగారు. సమస్య పరిష్కరించేవరకూ మా ఆందోళన సాగుతుంది. పవన్ సభను అడ్డుకోవాలని చూస్తే సహించం. అనుమతి లేదనే పేరుతో అడ్డంకులు సృష్టించకుండా సభ సజావుగా సాగేందుకు సహకరించాలి అని'' బీబీసీతో అన్నారు.

పవన్ కల్యాణ్‌

ఫొటో సోర్స్, JANASENA PARTY

శ్రమదానం కార్యక్రమానికి జనసేన అనుమతి కోరలేదు: పోలీసులు

శ్రమదానం కార్యక్రమాలకు జనసేన అనుమతి కోరలేదని రాజమహేంద్రవరం ఈస్ట్‌జోన్ డీఎస్పీ లతా మాధురి అన్నారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకే నోటీసులు ఇచ్చామని ఆమె బీబీసీకి తెలిపారు

''బాలాజీపేట సెంటర్‌లో బహిరంగ సభకు జనసేన పార్టీ నేతలు అనుమతి అడిగారు. సుమారు 20 వేల మంది సభకు తరలివచ్చే అవకాశం ఉంది. కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. బాలాజీపేట ప్రాంతంలో అంతమందితో సభ నిర్వహించడం వల్ల ఇబ్బందులు వస్తాయి. సభా వేదిక మార్చుకోవాలని జనసేన పార్టీ ప్రతినిధులకు సూచించాం. వారి నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. బాలాజీపేటలో సభకు అనుమతి ఇవ్వలేదు. అనుమతి లేకుండా సభ, శ్రమదానం జరగనివ్వం'' అని ఆమె వివరించారు.

వెంకటాపురంలో గుంతలు పూడ్చిన కార్యకర్తలు

పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గోపాలపట్నం వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ వద్ద జేనసేన కార్యకర్తలు రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టారు.

వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయినప్పటికీ జనసేన కార్యకర్తలు రోడ్లు మరమ్మతులు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు.

పవన్‌ ఏం నిరూపించాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు - ప్రభుత్వ సలహాదారు సజ్జల

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఏం నిరూపించాలని అనుకుంటున్నారో అర్థంకావట్లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

పవన్ శ్రమదానం కార్యక్రమంపై ఆయన స్పందించారు.

రాష్ట్రంలో కొవిడ్‌ ఆంక్షలు కొనసాగుతుంటే వేలమందితో సభ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. కొవిడ్‌ దృష్ట్యా ప్రజల ఆరోగ్యం కోసమే అందరికీ ఆంక్షలు విధించామని, ముఖ్యమంత్రి జగన్ కార్యక్రమానికి ఎంతమందిని అనుమతించామో అంతా చూసే ఉంటారని ఆయన అన్నారు.

రహదారుల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ. 2,200కోట్లు కేటాయించిందని, నవంబర్‌ నుంచి మరమ్మతు పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)