పవన్ కల్యాణ్: ఒకట్రెండు కులాలను అడ్డుపెట్టుకుని విజయం సాధించలేం - ప్రెస్ రివ్యూ

పవన్

ఫొటో సోర్స్, Janasena Party

ఒకటి రెండు కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయాల్లో విజయం సాధించలేమని, ఉత్తర్‌ప్రదేశ్‌లో కుల రాజకీయ ప్రయోగాలు విఫలమయ్యాయని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారని ఈనాడు తెలిపింది.

పేరు ప్రఖ్యాతులు, డబ్బుతో మాత్రమే పార్టీలు స్థాపించి, వాటిని విజయవంతం చేయలేమని, బాధ్యత, సమాజం కోసం పనిచేయాలన్న తలంపు, ఓపిక, సాహసం ఉన్నప్పుడే రాజకీయాల్లో రాణించగలమని ఆయన చెప్పారు.

విజయవాడలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల జనసేన నాయకులు, సమన్వయకర్తలు, కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు.

‘‘కులం పేరు చెప్పి వ్యక్తులు లాభపడుతున్నారు తప్ప కులాలు బాగుపడటం లేదు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటైన సందర్భంలోని అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జనసేనను తీర్చిదిద్దుతున్నా. రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిపోదాం అనుకుంటే సాధ్యమయ్యే పనికాదు. నన్ను నమ్మి పార్టీలోకి వచ్చి పనిచేసిన వారికి తప్పకుండా గుర్తింపు ఇస్తా’’ అని పవన్ తెలిపారు.

కేసీఆర్

ఫొటో సోర్స్, kcr/fb

దుబాయ్, యూఏఈల్లో పర్యటించనున్న కేసీఆర్

తెలంగాణలోని వివిధ ప్రాజెక్టులకు పెట్టుబడులు ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 6 నుంచి 13 వరకు వారం పాటు దుబాయ్‌, యూఏఈల్లో పర్యటించనున్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది. ఇందుకు సంబంధించి ప్రోటోకాల్‌ విభాగం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ, ఐఏఎ్‌సలు అర్వింద్‌కుమార్‌, జయేష్‌ రంజన్‌ తదితరులు వెళ్లనున్నారు. కొంత మంది టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు కూడా సీఎం వెంట వెళ్లే అవకాశం ఉంది. ఈ పర్యటనలో భాగంగా, తెలంగాణలో వివిధ రంగాల్లో చేపట్టబోయే ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీల ప్రతినిధులతో చర్చించే అవకాశం ఉంది.

నెలాఖరులోపు మరో 14 ఉద్యోగ ప్రకటనల జారీ: ఏపీపీఎస్‌సీ

ఈ నెలాఖరులోగా మరో 14 ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఉదయ్‌భాస్కర్‌ చెప్పారని 'ఈనాడు' రాసింది.

గత సెప్టెంబరులో ఆర్థికశాఖ జారీచేసిన ఉత్తర్వులు అనుసరించి డిసెంబరు చివరి వరకు 3,255 ఉద్యోగాల భర్తీకి 21 ప్రకటనలు జారీచేసినట్లు తెలిపారు. రెవెన్యూశాఖ నుంచి వివరాలు రానందున 670 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు, అటవీ శాఖకు చెందిన అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ 330, ఇతర శాఖల ఉద్యోగాల భర్తీ ప్రకటనలు కలిపి 14 వరకు ఇవ్వలేకపోయినట్లు చెప్పారు. ఆయా శాఖల నుంచి వివరాలు అందిన వెంటనే వీటిని కూడా జారీ చేస్తామని తెలిపారు. ఇందుకు ఈ నెలాఖరు వరకు సమయం పట్టే అవకాశం ఉందన్నారు.

విజయవాడలోని కమిషన్‌ కార్యాలయంలో సహచర సభ్యులు జింకా రంగజనార్ధన, కె.విజయకుమార్‌, జి.సుజాత, కె.పద్మరాజు, సేవారూప, కార్యదర్శి మౌర్యలతో కలిసి ఉదయ్‌భాస్కర్‌ శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడారు. త్వరితగతిన ఈ ప్రకటనలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయా శాఖల అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.

ప్రకటనల్లో పేర్కొన్న తేదీల్లోనే రాత పరీక్షలు నిర్వహిస్తామని, అనివార్య పరిస్థితులు తలెత్తితే తప్ప వాయిదాలు ఉండవని ఆయన వెల్లడించారు. ప్రకటించాల్సిన రాత పరీక్ష నిర్వహణ తేదీలను తగిన సమయంలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. గ్రూపు-1 ప్రాథమిక పరీక్ష రాసేందుకు తక్కువ వ్యవధి ఉన్నట్లు అభ్యర్థులు పేర్కొంటున్న విషయాన్ని ప్రస్తావించగా, సెప్టెంబరు నుంచి ఉద్యోగ ప్రకటనల జారీ గురించి అభ్యర్థులకు తెలుసునని వ్యాఖ్యానించారు.

రఫేల్

ఫొటో సోర్స్, Getty Images

‘బకాయిలు చెల్లించే వరకు అనిల్ అంబానీని జైల్లో పెట్టండి'

రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ లిమిటెడ్‌ (ఆర్‌కామ్‌) చైర్మన్‌ అనిల్‌ అంబానీపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ ఎరిక్సన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించిందని ఆంధ్రజ్యోతి రాసింది.

రూ.550 కోట్ల బకాయిలను చెల్లించాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లఘించారని పేర్కొంటూ అనిల్‌ అంబానీ సహా మరో ఇద్దరిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని ఈ సంస్థ న్యాయస్థానాన్ని కోరింది. అంతేకాకుండా బకాయిలు చెల్లించేంత వరకు అనిల్‌ అంబానీ, మరో ఇద్దరిని జైలులో ఉంచాలని కోరింది.

2018 అక్టోబరు 23న అత్యున్నత న్యాయస్థానం రూ.550 కోట్లను వడ్డీతో సహా డిసెంబరు 15నాటి కల్లా చెల్లించాలని ఆర్‌కామ్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ, రిలయన్స్‌ టెలికాం లిమిటెడ్‌ చైర్మన్‌ సతీష్‌ సేథ్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ లిమిటెడ్‌ చైర్‌పర్సన్‌ ఛాయా విరానీలను ఆదేశించిందని ఎరిక్సన్‌ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)