బ్రిటన్: లిజ్ ట్రస్ స్థానంలో ప్రధాని రేసులో ఎవరెవరున్నారు?

బోరిస్ జాన్సన్, పెన్నీ మార్డంట్, రిషి సునక్
ఫొటో క్యాప్షన్, బోరిస్ జాన్సన్, పెన్నీ మార్డంట్, రిషి సునక్
    • రచయిత, కేట్ వానెల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లిజ్ ట్రస్ బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి ప్రధానమంత్రి అవుతారు.వచ్చే వారం లోగా ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు.

ఎన్నికల బరిలోకి దిగడానికి అభ్యర్థులకు కనీసం 100 మంది టోరీ ఎంపీల మద్దతు అవసరం. బ్రిటన్ పార్లమెంటులో మొత్తం 357 టోరీ ఎంపీలు ఉన్నారు. అభ్యర్థులకు 100 చొప్పున నామినేషన్లు రావాలంటే ముగ్గురి కన్నా ఎక్కువమంది ఎన్నికల్లో నిల్చునే అవకాశం లేదు. ఇద్దరు లేదా ఒక్కరే నిల్చునే అవకాశం కూడా ఉంది. ఒక్కరే అయితే ఓటింగ్ అవసరమే ఉండదు.

అయితే, ఇప్పటివరకూ ఏ ఒక్క అభ్యర్థీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించలేదు.

కానీ, కొంతమంది అభ్యర్థుల గురించి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో నిల్చునే అవకాశం ఉన్న అభ్యర్థులెవరో చూద్దాం.

రిషి సునక్

ఫొటో సోర్స్, Rex Features

రిషి సునక్

ఈ ఏడాది జూలైలో బోరిస్ జాన్సన్ బ్రిటన్ ప్రధాని పదవిని రాజీనామా చేసిన తరువాత జరిగిన ఎన్నికల్లో రిషి సునక్ పోటీ చేశారు. లిజ్ ట్రస్‌తో పాటు ఫైనల్ రౌండ్‌కు చేరుకున్నారు. కన్జర్వేటివ్ ఎంపీల నుంచి ఆయనకు అత్యధిక మద్దతు లభించింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా, ప్రత్యర్థి లిజ్ ట్రస్ హామీలిస్తున్న పన్నుల ప్రణాళికలు ఆర్థికవ్యవస్థను దెబ్బతీస్తాయని హెచ్చరించారు రిషి సునక్. కానీ, ఆయన వాదన పార్టీ సభ్యులను ఒప్పించలేకపోయింది. 21,000 ఓట్లతో రిషి సునక్ ఓడిపోయారు.

రిషి సునక్ 2015లో రిచ్‌మండ్‌లోని నార్త్ యార్క్‌షైర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2020 ఫిబ్రవరి నాటికి ట్రెజరీ చాన్సలర్ అయ్యారు.

కరోనావైరస్ మహమ్మారితో పోరాటం, లాక్‌డౌన్‌లో ఆర్థికవ్యవస్థ కుదేలైపోకుందా ఉండేందుకు భారీ స్థాయిలో ప్రభుత్వ వ్యయం మొదలైన చర్యలు చేపట్టారు. దీనివలన ఆయనకు ప్రజల్లో పాపులారిటీ పెరిగింది.

అయితే, ఆయన భార్య పన్ను వ్యవహారాలు వివాదంగా మారడం, లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనకు జరిమానా విధించడంతో ఆయనకు వచ్చిన ప్రజాదరణ కొంత దెబ్బతింది.

తాజా పరిణాల తరువాత, కన్జర్వేటివ్ ఎంపీ ఏంజెలా రిచర్డ్‌సన్ ఇప్పటికే రిషి సునక్‌కు తన మద్దతును ప్రకటించారు.

"గతానికి, ఇప్పటికీ రిషి సునక్‌పై నా అభిప్రాయాలు మారలేదు. గత ఆరువారాల్లో ఆయన నాయకత్వంపై విశ్వాసం మరింత పెరిగింది" అంటూ ఆమె తన మద్దతు తెలిపారు.

పెన్నీ మార్డంట్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పెన్నీ మార్డంట్

పెన్నీ మార్డంట్

పెన్నీ మార్డంట్‌ ఇప్పటికే ప్రధానిమంత్రి పదవిని కాస్త రుచి చూశారు. ఈ వారం ప్రారంభంలో పార్లమెంటులో ఒక అత్యవసర ప్రశ్నోత్తరాల సెషన్‌లో లిజ్ ట్రస్‌కు బదులు పెన్నీ మార్డంట్ పాల్గొన్నారు.

ఆమె కనబరచిన ఆత్మవిశ్వాసానికి మంచి ప్రశంసలు అందుకున్నారు. టోరీ నాయకత్వ పోటీల్లో ఆమె కొత్త ట్విస్ట్ తీసుకురావచ్చు.

గత ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేశారు. ఎంపీల నుంచి ఆమెకు గట్టి మద్దతే లభించింది. కానీ, ఫైనల్‌కు చేరుకోలేకపోయారు.

ఫైనల్ పోటీలో మార్డంట్‌, లిజ్ ట్రస్‌కు మద్దతు ప్రకటించారు. లిజ్ ట్రస్ ప్రధాని అయ్యాక మార్డంట్‌‌ను హౌస్ ఆఫ్ కామన్స్ నాయకురాలిగా, ప్రివీ కౌన్సిల్ లార్డ్ ప్రెసిడెంట్‌గా నియమించారు.

2019లో పెన్నీ మార్డెంట్ తొలి మహిళా డిఫెన్స్ సెక్రటరీగా రికార్డ్ సృష్టించారు. అంతకు ముందు డేవిడ్ కామెరాన్ బ్రిటన్ ప్రధానిగా ఉన్నప్పుడు సాయుధ దళాల మంత్రిగా పనిచేశారు.

పెన్నీ మార్డంట్‌కు ఇప్పటికే ఎంపీలు జాన్ లామోంట్, మరియా మిల్లర్, బాబ్ సీలీ, డామియన్ కాలిన్స్ మద్దతు ప్రకటించారు.

బోరిస్ జాన్సన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బోరిస్ జాన్సన్

బోరిస్ జాన్సన్

మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉంది.

ఈ ఏడాది జూలైలో బోరిస్ జాన్సన్‌పై అధిక సంఖ్యలో మంత్రులు, ఎంపీలు తిరుగుబాటు చేయడంతో ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

బోరిస్ జాన్సన్‌పై అనేక విమర్శలు, వివాదాలు వచ్చాయి. డౌనింగ్ స్ట్రీట్ లాక్‌డౌన్ పార్టీలు, డిప్యుటీ చీఫ్ విప్‌గా క్రిస్ పించర్ నియామకంపై వివాదాలు రాజుకున్నాయి. క్రిస్ పించర్ "అనుచిత ప్రవర్తవ"పై అధికారిక ఫిర్యాదులు వచ్చినా, ఆయన్ని చీఫ్ విప్‌గా నియమించారని విమర్శలు వచ్చాయి.

అయినప్పటికీ, బోరిస్ జాన్సన్‌కు పార్లమెంటులో, పార్టీ సభ్యుల్లో సన్నిహితులు ఉన్నారు. దీర్ఘకాలంగా జాన్సన్‌కు మద్దతు ఇస్తున్న నాడిన్ డోరీస్ ఆయన తిరిగి ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఎంపీలు పాల్ బ్రిస్టో, బ్రెండన్ క్లార్క్-స్మిత్, ఆండ్రియా జెంకిన్స్, మైకేల్ ఫ్యాబ్రికెంట్ కూడా బోరిస్ జాన్సన్‌కు మద్దతిస్తున్నారు.

బెన్ వాలెస్

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, బెన్ వాలెస్

బెన్ వాలెస్

డిఫెన్స్ సెక్రటరీ బెన్ వాలెస్ ప్రధాని పదవికి తగిన అభ్యర్థి అని పలువురు ఎంపీలు భావిస్తున్నారు.

రష్యా-యుక్రెయిన్ యుద్ధం విషయంలో బెన్ వాలెస్ ప్రజల దృష్టిని ఆకర్షించారు. యుక్రెయిన్‌కు ఆయుధాలు, శిక్షణ వంటి అంశాల్లో మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్న తొలి దేశాల్లో బ్రిటన్ ఒకటి. ఈ నిర్ణయంలో బెన్ వాలెస్ ప్రధాన పాత్ర పోషించారు.

బెన్ వాలెస్ బ్రెగ్జిట్‌ను వ్యతిరేకించినప్పటికీ, బోరిస్ జాన్సన్‌కు కీలక మద్దతుదారుగా వ్యవహరించారు. దాంతో, 2019లో ఆయనకు క్యాబినెట్ పోస్ట్ దక్కింది.

రాజకీయ నాయకుడు కావడానికి ముందు బెన్ వాలెస్ జర్మనీ, సైప్రస్, బెలిజ్ ఉత్తర ఐర్లాండ్‌లలో సైనికుడిగా పనిచేశారు. ఐర్లాండ్‌లో పనిచేస్తున్నప్పుడు, బ్రిటిష్ సైనికులపై IRA బాంబు దాండి ప్రయత్నాలను అడ్డుకున్నారు.

బోరిస్ జాన్సన్ పదవి నుంచి తప్పుకున్నాక బెన్ వాలెస్ ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించారు. కానీ, ఆయన లిజ్ ట్రస్‌కు మద్దతు ఇచ్చారు.

కెమీ బాడెనాక్

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, కెమీ బాడెనాక్

కెమీ బాడెనాక్

గత ఎన్నికల్లో కెమీ బాడెనాక్ పోటీ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె గెలకపోయినా, పోటీలో నిలబడడంతో పలువురి దృష్టిని ఆకర్షించారు.

మంత్రిగా ఆమెకు అనుభవం తక్కువ ఉన్నా, సీనియర్ కన్జర్వేటివ్ నాయకుడు మైఖేల్ గోవ్ ఆమెకు మద్దతు ఇచ్చారు. "వోక్" కల్చర్‌పై ఆమె దాడులు కూడా చాలామంది దృష్టిని ఆకర్షించాయి.

దక్షిణ లండన్‌లోని వింబుల్డన్‌లో జన్మించిన బెన్ వాలెస్ అమెరికాలో, నైజీరియాలో పెరిగారు.

సాఫ్రన్ వాల్దెన్ నుంచి ఎంపీగా బ్రిటన్ పార్లమెంటులో అడుగుపెట్టే ముందు ఆమె ప్రైవేట్ బ్యాంక్ కౌట్స్‌లో, ది స్పెక్టేటర్ మ్యాగజైన్‌లో పనిచేశారు.

బెన్ వాలెస్ బ్రిటన్ అంతర్జాతీయ వాణిజ్య విభాగానికి హెడ్‌గా వ్యవహరించారు. ఇప్పటివరకు ప్రభుత్వంలో ఆమె పోషించిన ఉన్నతస్థాయి పాత్ర ఇదే.

సుయెల్లా బ్రవర్‌మాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సుయెల్లా బ్రవర్‌మాన్

సుయెల్లా బ్రవర్‌మాన్

హోం సెక్రటరీగా సుయెల్లా బ్రవర్‌మాన్ రాజీనామా చేసిన తరువాత లిజ్ ట్రస్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. ఆమె రాజీనామా ఇచ్చిన 24 గంటల్లో లిజ్ ట్రస్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

డేటా ఉల్లంఘనకు సంబంధించిన విషయంలో బ్రవర్‌మాన్ రాజీనామా చేశారని వార్తలు వచ్చినప్పటికీ, ఆమె ఇచ్చిన రాజీనామా లేఖలో ఆగ్రహంతో ఇమ్మిగ్రేషన్‌ (వలస) విధానంపై అసమ్మతిని తెలియజేసినట్టు సమాచారం.

వలసదారులను రువాండాకు పంపించడం "తన కల" అని చెబుతూ, తన పార్టీలోని రైట్ వింగ్ సభ్యులు సామాజిక సమస్యలపై దృష్టి సారించేట్లు చేశారు. అలాగే, "టోఫూ తినే వోకరాటి"పై విమర్శలు గుప్పించారు.

సుయెల్లా బ్రవర్‌మాన్ గతంలో న్యాయవాదిగా వ్యవహరించారు. బ్రెగ్జిట్‌కు మద్దతిచ్చారు. బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో అటార్నీ జనరల్‌గా వ్యవహరించారు. గత ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేశారు. కానీ, రెండవ రౌండ్‌లోనే వైదొలిగారు.

1960లలో సుయెల్లా తల్లిదండ్రులు కెన్యా, మారిషస్ నుంచి బ్రిటన్‌కు వలసవెళ్లారు. వారిద్దరూ కూడా స్థానిక రాజకీయాల్లో పాలుపంచుకున్నారు. ఆమె తల్లి కౌన్సిలర్్‌గా 16 సంవత్సరాలు పనిచేశారు.

క్యాబినెట్ మంత్రులు ప్రసూతి సెలవు (మెటర్నిటీ లీవ్) తీసుకోవచ్చన్న చట్టం అమలులోకి వచ్చిన తరువాత ఆ సెలవు తీసుకున్న మొదటి క్యాబినెట్ మంత్రి సుయెల్లా బ్రవర్‌మాన్.

వీడియో క్యాప్షన్, బోరిస్ జాన్సన్: హీరో నుంచి జీరో ఎలా అయ్యారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)