RSS: మహిళలపై సంఘ్ పరివార్ వైఖరి మారుతోందా... లేక బీజేపీకి ఓట్ల కోసమే అలా చేస్తున్నారా?

ఫొటో సోర్స్, RSS
- రచయిత, ఫైజల్ మహమ్మద్ అలీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్టును రెండుసార్లు అధిరోహించిన భారత మహిళ సంతోష్ యాదవ్‌ను తమ వ్యవస్థాపక దినోత్సవానికి ఆహ్వానించి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఒక కొత్త చర్చకు తెరతీసింది. అసలు మహిళలపై ఆరెస్సెస్ వైఖరి మారుతోందా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది.
సంఘ్ పరివార్ నిబంధనల ప్రకారం, కేవలం ‘‘హిందూ పురుషులు’’లు మాత్రమే ఆరెస్సెస్‌లో సభ్యులు కాగలరు. మహిళలకు ఇక్కడ ప్రత్యేక విభాగం ఉంది.
అయితే, దసరా రోజు ప్రసంగానికి ముందుగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ దుర్గాదేవి పూజ చేశారు. ఆరెస్సెస్‌లో ఉదయం నిర్వహించే ‘‘శాఖ’’ మినహా.. మిగతా పనులన్నింటిలోనూ పురుషుల్లానే మహిళలు కూడా పాలుపంచుకుంటారని ఆ ఆరోజు ఆయన చెప్పారు.
ఇప్పుడు తాజాగా సంతోష్ యాదవ్‌తో ఆయన వేదిక పంచుకొని మహిళలపై తమ వైఖరి మారుతోందని చెప్పే చర్చను మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు. అంతేకాదు.. అంతటా శాంతి, పవిత్రతలు నెలకొనేలా చూడటంలో స్త్రీ శక్తికి ప్రాధాన్యం ఇవ్వడం అనివార్యం’’అని కూడా ఆయన అన్నారు.
మహిళల గురించి చర్చ వచ్చిన ప్రతిసారీ ‘‘రాష్ట్ర సేవిక సమితి’’ పేరును ఆరెస్సెస్ ముందుకు తీసుకొస్తుంది. సంఘ్‌లో ఇది మహిళల విభాగం. అయితే, దీని పేరు పెద్దగా వినిపించదు.
నిజానికి సేవిక సమితిని కూడా ఆరెస్సెస్ అనే పిలుస్తారు. దీన్ని కూడా ప్రధాన ఆరెస్సెస్‌లానే విజయ దశమి రోజు కేశవ్ బలిరామ్ హేగ్డేవార్ మొదలుపెట్టారు.
సంఘ్‌లో పురుషాధిపత్యంపై చాలా చర్చ జరుగుతుంటోంది. ఈ వైఖరిని మార్చే ప్రయత్నాల్లో భాగంగానే ప్రస్తుతం సంతోష్ యాదవ్‌ను ఆహ్వానించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదివరకు కూడా కాంగ్రెస్ నాయకురాలు రాజ్‌కుమారి అమృత్ కౌర్, మాజీ ఎంపీ అనుసూయ బాయి కాలే ఇలా మరికొంత మంది ప్రముఖులను కూడా ఇదివరకు ఆరెస్సెస్ ఇలా ఆహ్వానించింది.

ఫొటో సోర్స్, RSS
‘‘ఎందుకిలా...’’
భారత సంప్రదాయంలో స్త్రీ, పురుషులను ఒకరికొకరు తోడు-నీడగా మోహన్ భాగవత్ చెబుతుంటారు. ‘‘విదేశీ దండయాత్రల వల్ల ఈ సంప్రదాయం పూర్తిగా దెబ్బతింది. అయితే, పూజించడం లేదంటే రెండో తరగతి పౌరులుగా వంటగదికే పరిమితం చేయడం లాంటివి ఎక్కువయ్యాయి. నేడు మళ్లీ మాతృశక్తికి సాధికారత కల్పించాలి. ఉద్యోగం, కుటుంబం, ప్రజాజీవనం ఇలా అన్నింటిలోనూ వారికి సగ భాగం ఇవ్వాలి’’అని ఆయన చెప్పారు.
ఇటీవల సమాజంలోని భిన్న వర్గాలకు చెందిన ప్రతినిధులతో ఆరెస్సెస్ చర్చలు మొదలుపెట్టింది. సామాజిక సమస్యలు, కుల వివక్ష లాంటి అంశాలపై ఇమామ్ షాహిబ్‌తో మాట్లాడేందుకు మోహన్ భాగవత్ ముస్లింల ప్రార్థనా స్థలానికి కూడా వెళ్లారు. దీంతో ఆరెస్సెస్ వైఖరిలో మార్పు వస్తోందనే చర్చ ఎక్కువైంది.
సమాజంలో తమపై పడిన ముద్రను చెరిపేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు నేడు సంఘ్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని రాజకీయ విమర్శకులు అంటున్నారు. అయితే, మహిళల విషయంలో గత మూడు దశాబ్దాలుగా ఆరెస్సెస్ వైఖరి మారుతూ వస్తోందని సంఘ్ మద్దతుదారులు అంటున్నారు.
‘‘మీరు ప్రసంగంలో భాగవత్ వాడిన పదాలను జాగ్రత్తగా గమనించండి. దానిలో పురుషాధిక్య పదజాలం చాలా కనిపిస్తుంది. అసలు సంప్రదాయ కుటుంబ వ్యవస్థకు వెలుపల మహిళలు జీవించలేరనే ధోరణిలో ఆయన మాట్లాడారు. మహిళలకు వారి శరీరాలపై వారికి హక్కులు ఇచ్చేందుకు సంఘ్ సిద్ధంగా లేదు’’అని దిల్లీ జవహర్‌లాల్ యూనివర్సిటీలోని సోషియాలజీ ప్రొఫెసర్ హరీశ్ వాంఖడే అన్నారు.
మోహన్ భాగవత్ తన ప్రసంగంలో మహిళల గురించి మాట్లాడేటప్పుడు పదేపదే ‘‘మాతృ-శక్తి’’ అనే పదాన్ని ఉపయోగిస్తూ కనిపించారు. ముఖ్యంగా మహిళల జీవితంలో ‘‘మాతృత్వం’’ అనే అంశానికి ఆరెస్సెస్ ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తుంటుంది.
నాగ్‌పుర్‌కు చెందిన మరాఠీ రచయిత అరుణ సబానే ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘‘తల్లి అనే పదం వారికి ఒక లక్ష్మణ రేఖ లాంటిది. మహిళలు ఈ గీత దాటి ముందుకు రాకూడదని వారు భావిస్తారు’’అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, RSS
కుటుంబాన్ని ఎలా చూస్తారు?
ఆయిచా బాయ్‌ఫ్రెండ్ (అమ్మ బాయ్‌ఫ్రెండ్) పేరుతో అరుణ సబానే ఒక నవల రాశారు. ఈ నవల అప్పట్లో చాలా వివాదాస్పదమైంది. దీనిలో మధ్య వయసుండే ఒక వితంతువు ఓ పురుషుడితో స్నేహం చేస్తుంటారు. దీనిపై సమాజంలో చాలామంది చెడుగా మాట్లాడుకుంటుంటారు.
‘‘తండ్రికి మహిళా స్నేహితులు ఉండొచ్చు. కానీ, తల్లికి మాత్రం మగ స్నేహితులు ఉండకూడదా? అసలు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌ల గురించి మాట్లాడేందుకు కూడా వారు ఇష్టపడరు’’అని అరుణ అన్నారు.
అయితే, 1987 నుంచీ సంఘ్‌లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం క్రమంగా పెరుగుతూ వస్తోందని ఏళ్ల నుంచీ ఆరెస్సెస్‌లో పనిచేస్తున్న దిలీప్ దేవధర్ అన్నారు. ‘‘ఇక్కడ సంఘ్‌లో ఒక కుటుంబ సభ్యుడు చేరితే, ఆ కుటుంబం మొత్తం దానిలో చేరినట్లే. ఇక్కడ పురుషులతోపాటు మహిళలు కూడా సంఘ్‌లో చేరినట్లుగానే భావించాలి’’అని ఆయన వివరించారు.
అయితే, సంఘ్‌లో మహిళల ప్రాతినిథ్యం చాలా తక్కువగా ఉందనే విషయాన్ని దిలీప్ అంగీకరించారు. ‘‘సమాజంలో మహిళల సంఖ్యతో పోలిస్తే, వారికి సముచిత స్థానం లభించడంలేదు’’అని ఆయన అన్నారు.
ఎనిమిదేళ్ల విరామం తర్వాత, నేను మళ్లీ సంఘ్ విజయదశమి కార్యక్రమానికి మళ్లీ హాజరయ్యాను. ఇక్కడ ముఖ్య అతిథుల్లో చాలా మంది కనిపించారు. అయితే, ‘‘పార్థ్ సంచాలన్’’ సహా కొన్ని కార్యక్రమాల్లో మహిళలు కనిపించలేదు.
ఈ విషయంపై అక్కడ వాలంటీర్లతో మాట్లాడినప్పుడు.. ‘‘కొన్ని కార్యక్రమాల్లో మహిళలు పాల్గొనని మాట వాస్తవమే. దీని బట్టి సంఘ్‌లో మహిళలే లేరని అనుకోకూడదు. ఆరెస్సెస్‌లో చాలా మంది మహిళలు సేవలు అందిస్తున్నారు. సంఘ్‌లో వారి పాత్ర క్రమంగా పెరుగుతోంది’’అని అక్కడున్న వారు చెప్పారు.
మరో వాలంటీర్ మాతో మాట్లాడుతూ.. ‘‘సంఘ్‌లో మొత్తంగా 36 సంస్థలు ఉన్నాయి. వీటిలో రాష్ట్ర సేవిక సమితి కూడా ఒకటి. ఇక్కడ అన్ని సంస్థలూ కలిసి పనిచేస్తాయి. అంతేకానీ, మహిళల విషయంలో ఎలాంటి వివక్షా ఉండకూడదు’’అని అన్నారు.
సేవిక సమితిని ఆరెస్సెస్‌తో సమానమని సంఘ్ పరివార్ చెబుతుంటుంది. దేశ పునర్నిర్మాణంలో సంఘ్‌లోనే ఇది కూడా పనిచేస్తోందని వివరిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
అసలు ఎందుకు ఏర్పాటుచేశారు?
వ్యవస్థాపక దినోత్సవానికి రాష్ట్ర సేవికా సమితి అధిపతి శాంత కుమారి కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆమె మాతో మాట్లాడుతూ.. ‘‘అసలు సమితి గురించి మీకు ఎంతవరకు తెలుసు?’’అని ఆమె ప్రశ్నించారు. అయితే, అంత ఎక్కువ సమాచారం తెలియదని నేను చెప్పాను. దీంతో వార్ధాకు చెందిన లక్ష్మీ బాయి కేల్కర్ కథను ఆమె చెప్పడం మొదలుపెట్టారు. ‘‘ఆమెను అందరూ మౌసీ పిలిచేవారు. ఆమె కుమారులు సంఘ్‌లో చేరడంతో వారిలో చాలా సానుకూల ప్రభావాలను ఆమె గమనించారు. దీంతో మహిళలకు కూడా ఇలాంటి శిక్షణ అవసరమని ఆమె భావించారు’’అని శాంత కుమారి చెప్పారు.
‘‘1936 అక్టోబరు 25న ఆమె ఈ విషయంపై హెగ్డేవార్‌తో మాట్లాడారు. అలా వార్ధాలో సేవిక సమితికి పునాదులు పడ్డాయి’’అని శాంత కుమారి వివరించారు.
రాష్ట్ర సేవికా సమితి తమ వెబ్‌సైట్‌లో పటిష్ఠమైన మైన హిందూ దేశాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని పేర్కొంది.
ప్రస్తుతం రాష్ట్ర సేవికా సమితిలో దాదాపు 55,000 మంది సేవికలు ఉన్నారు. దేశ వ్యాప్తంగా దీనికి 2700 శాఖలు ఉన్నాయి. మాతృత్వం, నాయకత్వం లాంటి అంశాలపై యోగా, స్పోర్ట్స్, మ్యూజిక్, ప్రసంగాలు లాంటి మాధ్యమాల ద్వారా వీరు అవగాహన కల్పిస్తుంటారు.
మా మధ్య మాటల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019లో విడుదల చేసిన ‘‘స్టాటస్ ఆఫ్ విమెన్ ఇన్ ఇండియా’’ పేరుతో విడుదల చేసిన రిపోర్టు గురించి ప్రస్తావన వచ్చింది. ఈ రిపోర్టును సిద్ధం చేయడంలో రాష్ట్ర సేవిక సమితి కూడా ప్రధాన పాత్ర పోషించింది.
ఈ ఏడాది ప్రసంగంలో మోహన్ భాగవత్ కూడా ఆ నివేదిక గురించి ప్రస్తావించారు. మహిళల సాధికారత, వారికి అవగాహన కల్పించడం, గృహిణుల్లో అన్ని అంశాల్లో క్రియాశీలంగా పాలుపంచుకోవడం తదితర సూచనలను ఈ నివేదిక చేసింది.
‘‘వివాహితలు సంతోషంగా’’
ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ‘‘దృష్టి స్త్రీ అధ్యయన్ ప్రబోధన్ కేంద్రం’’ నిర్వహించిన ఒక అధ్యయనం గురించి రాజకీయ విశ్లేషకుడు నిలంజన్ ముఖోపాధ్యాయ్ మాట్లాడుతూ.. ‘‘ఆ సర్వేలో కూడా మహిళలను కుటుంబ బంధాలకే వారు పరిమితం చేశారు. తల్లి, భార్య, కుమార్తె ఇలా ఒక పురుషుడి బంధాలతోనే వారిని గుర్తిస్తూ విడిగా వారికి గుర్తింపు లేకుండా చేస్తున్నారు’’అని అన్నారు.
ఆ సర్వే ఫలితాలపై వివాదం రాజుకొంది. ఎందుకంటే లివ్-ఇన్‌లతో పోల్చినప్పుడు వివాహితల్లో సంతోషం స్థాయిలు ఎక్కువగా ఉంటాయని దీనిలో పేర్కొన్నారు.
మరోవైపు శాంత కుమారి కూడా ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘‘సమాజం ముందుకు వెళ్లడానికి అవసరమైన సంతాన శక్తిని మహిళలకు ప్రకృతి ప్రసాదించింది. కానీ, మహిళలు నాలుగు గోడలకే పరిమితం కావాలని మేం ఎప్పుడూ చెప్పలేదు. ఇక్కడ మనం కుటుంబ ప్రాధాన్యాన్ని గుర్తించాలి. అదే సమయంలో కెరియర్‌కూ వారు ప్రాధాన్యం ఇవ్వాలి’’అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Nidhi Tripathi
‘‘ఇందులో తప్పేముంది?’’
ఆరెస్సెస్ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రధాన కార్యదర్శి నిధి త్రిపాఠి కూడా ఈ విషయంపై మాట్లాడారు. ‘‘మాతృత్వాన్ని ప్రతికూల కోణంలో ఎప్పుడూ చూడకూడదు. మహిళలకు భిన్న రకాల శక్తి సామర్థ్యాలు ఉంటాయి. లక్ష్మీ బాయిని తీసుకోండి. ఆమె రాణి, యోధురాలు, మంచి తల్లి. ఎన్నో బాధ్యతలను ఆమె విజయవంతంగా నిర్వర్తించారు’’అని ఆమె అన్నారు.
అయితే, మహిళల శక్తి సామర్థ్యాల విషయంలో కుటుంబ బంధాలకు అతీతంగా ఆరెస్సెస్ ఆలోచించాలని హరీశ్ వాంఖడే అన్నారు. అత్యాచారాలు, మతపరమైన పెళ్లిళ్లు లాంటి సంస్థ తమ వైఖరిని కూడా స్పష్టం చేయాల్సి ఉందని ఆయన వివరించారు.
‘‘అసలు మహిళలు ఎవరిని పెళ్లి చేసుకోవాలో వారు ఎలా నిర్ణయిస్తారు? ఆమె ఏ మతానికి చెందిన వ్యక్తిని ఎంచుకుంటే ఏముంది?’’అని వాంఖడే అన్నారు. హిందూ యువతులు వేరే మతాలకు చెందిన అబ్బాయిలను పెళ్లి చేసుకోవడంపై బీజేపీ, పార్టీకి చెందిన అగ్రనాయకులు తమ వ్యాఖ్యలతో తరచూ వివాదాలు సృష్టించే సంగతి తెలిసిందే.
మార్పు ఏ స్థాయిలో
నేడు సంఘ్‌లోకి సంప్రదాయవాదులు, ఆధునిక విధానాలను అనుసరించే వారి మధ్య ఒకరకమైన ఘర్షణ కనిపిస్తోందని సోషియాలజిస్టు బద్రి నారాయణ్ వివరించారు. ‘‘ప్రస్తుతం కొన్ని అంశాల్లో మార్పు కనిపిస్తోంది. కానీ, సంస్కరణలు కనిపించేందుకు సమయం పడుతుంది’’అని ఆయన అన్నారు.
అయితే, ఇది కేవలం బీజేపీకి పరిస్థితిని అనుకూలంగా మార్చడానికి చేసే ప్రయత్నంగానే చూడాలని వాంఖడే అంటున్నారు.
కానీ, మహిళలకు సమానత్వం కల్పించే విషయంలో ఆరెస్సెస్ అధిపతి చాలా సీరియస్‌గా ఉన్నారని సంఘ్ వాలంటీర్లు చెబుతున్నారు.
దిలీప్ దేవధర్ కూడా మహిళా రిజర్వేషన్లకు సంఘ్ కట్టుబడి ఉందని అన్నారు. ‘‘2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే, బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకురావాలని చూస్తోంది. ఇదొక చరిత్రాత్మక నిర్ణయం అవుతుంది’’అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- లంపీ స్కిన్ వ్యాధి సోకిన పశువుల పాలు తాగొచ్చా? ఈ వైరస్ మనుషులకూ సోకుతోందా? దేశంలో ఎందుకిన్ని వదంతులు?
- పాకిస్తాన్లో క్రికెట్‌ను భారత్ వ్యాపార సంస్థలే నడిపిస్తున్నాయా? బీసీసీఐ నిధులు ఇవ్వకపోతే పాక్ క్రికెట్ బోర్డు కూలిపోతుందా?
- దీపావళి టపాసులు అమ్మితే మూడేళ్లు జైలుశిక్ష, టపాసులు కాల్చితే 6 నెలలు జైలు శిక్ష
- లిజ్ ట్రస్: ప్రధాని అయిన 45 రోజులకే ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది, బ్రిటన్ తాజా రాజకీయాలపై తెలుసుకోవాల్సిన 8 పాయింట్లు
- ఇండియా మోస్ట్ వాంటెడ్ పాక్ తీవ్రవాదులను చైనా ఎలా రక్షించిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














