Garba: నవరాత్రి వేడుకల్లో ముస్లిం యువకుడిపై దాడి.. గర్బాకు వారు రాకూడదనే చర్చ ఎందుకు?

నవరాత్రి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, భార్గవ్ పరీఖ్
    • హోదా, బీబీసీ గుజరాతీ

గుజరాత్ అహ్మదాబాద్‌లోని ధనికులు ఎక్కువగా జీవించే సింధు భవన్ ప్రాంతంలో నవరాత్రి వేడుకల్లో భాగంగా గర్బ ఆడటానికి వచ్చిన ఓ ముస్లిం యువకుడిని చితకబాదారు. వెంటనే అతడికి అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్ వైరల్ అవుతోంది. దీంతో అహ్మదాబాద్‌లోని సర్‌ఖేజ్ పోలిస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదైంది. మరోవైపు ఆ ముస్లిం యువకుడిపై దాడి చేసింది బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలేనంటూ వార్తలు కూడా వస్తున్నాయి.

ఇది చాలా సున్నితమైన అంశమని, దీనిపై వివరాలు వెల్లడించలేనని సర్‌ఖేజ్ పోలిస్ స్టేషన్ పీఎస్‌వో భరత్ పటేల్ బీబీసీతో చెప్పారు.

సింధు భవన్‌లో ఒక మైనారిటీ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు చితకబాదారని మాత్రమే ఆయన స్పష్టంచేశారు. ఐపీసీలోని సెక్షన్ 323 (గాయపరచడం), 143 (అక్రమంగా గుమిగూడటం), 147 (అల్లర్లు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం), 249 బీ (రెండు మతాల మధ్య వైరం పెంచడం) తదితర ఆరోపణలపై ఈ కేసు నమోదు చేశారు.

ఈ ఘటనలో గాయపడిన వ్యక్తి పేరు సల్మాన్ షేక్. ఆయన జుహాపురాలో ఉంటారు. ఆయననేమీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ ఘటనపై స్పందించాలని బీబీసీ కోరినప్పుడు ఆయన నిరాకరించారు.

పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులోనూ ఓ ముస్లిం యువకుడు, బజ్‌రంగ్ దళ్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగినట్లు పేర్కొన్నారు. దీనిపై వివరణ కోసం పోలీస్ ఇన్‌స్పెక్టర్ వీఏ రాబారీని బీబీసీ సంప్రదించేందుకు ప్రయత్నించింది. కానీ, ఆయన నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. మరోవైపు గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వి కూడా ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించారు.

నవరాత్రి

ఫొటో సోర్స్, Getty Images

రెండేళ్ల తర్వాత మళ్లీ గర్బా..

గుజరాత్‌లోని భిన్న పట్టణాలు, నగరాల్లో నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. వీటిలో భాగంగానే ప్రజలు గర్బా ఆడతారు. అయితే, కోవిడ్-19 వ్యాప్తి నడుమ గత రెండేళ్లు ఎలాంటి వేడుకలు నిర్వహించలేదు.

మరోవైపు ఇటీవల గుజరాత్‌లోని కొన్నిచోట్ల గర్బా ఆడేందుకు ముస్లింలను అనుమతించకూడదని కొన్ని సంస్థలు ప్రత్యేక నిబంధనలు కూడా విధిస్తున్నాయి.

ముఖ్యంగా గర్బా ద్వారా ‘‘లవ్ జిహాద్’’కు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ సంస్థలు చెబుతున్నాయి.

నవరాత్రి

ఫొటో సోర్స్, Getty Images

ఈ అంశంపై గుజరాత్ పోలీస్ విభాగం అధిపతి డీజీపీ అశీష్ భాటియా మాట్లాడుతూ.. గర్బా ఆడకుండా ఎక్కడా ముస్లింలపై ఆంక్షలు విధించలేదని ఆయన చెప్పారు.

‘‘నవరాత్రి వేడుకల్లో ముస్లిం యువత పాల్గొనకుండా ఎక్కడా నిషేధం అనేదే లేదు. అహ్మదాబాద్‌లో ముస్లిం యువకుడిపై దాడి విషయంలో పోలీసులే కేసు నమోదు చేశారు. అలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మరోవైపు షీ టీమ్ కూడా ఇలాంటి ఘటనలపై ప్రత్యేక దృష్టి పెడుతోంది’’అని ఆయన చెప్పారు.

ఈ ఘటనను హిందూ-ముస్లింల మధ్య ఘర్షణగా చూడకూడదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ‘‘ఐడెంటిటీ పాలిటిక్స్’’ వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వారు వివరించారు.

నవరాత్రి

ఫొటో సోర్స్, Getty Images

ఓటు బ్యాంకు కోసం...

ప్రముఖ సోషియాలజిస్టు, రాజకీయ విశ్లేషకుడు విద్యుత్ జోషి ఈ అంశంపై బీబీసీతో మాట్లాడారు. ‘‘దీన్ని హిందూ-ముస్లింల సమస్యగా చూడకూడదు. ఐడెంటిటీ రాజకీయాల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతాయి’’అని ఆయన అన్నారు.

‘‘గుజరాత్‌లో 1990లలోనే ఈ ఐడెంటిటీ రాజకీయాలు మొదలయ్యాయి. తమ మతం, కులం మాత్రమే గొప్పవని చెప్పుకోవడం, ఇతరులను దూషించడం.. ఇలాంటి రాజకీయాలకు బీజం అప్పుడే పడింది’’అని ఆయన వివరించారు.

ఇవి చాలా ప్రమాదకరమైన రాజకీయాలని జోషి హెచ్చరించారు. ‘‘ముఖ్యంగా తమ ఓటు బ్యాంకును పటిష్ఠం చేసుకోవడం కోసం కొందరు ఇతరులను తీవ్రంగా దూషించడానికి కూడా వెనుకాడటం లేదు. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి’’అని ఆయన హెచ్చరించారు.

గుజరాత్ సాంస్కృతిక నేపథ్యం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ నవరాత్రి గర్బా వేడుకల్లో ఉపయోగించే కర్రాలను ముస్లింలే తయారు చేస్తారు. అలంకారాల్లోనూ వారు సాయం చేస్తారు. 1990లకు ముందు గర్బాకు వారిని రానివ్వకూడదనే ప్రశ్నే ఉండేది కాదు. కానీ, నేడు ఐడెంటిటీ పాలిటిక్స్ చాలా ఎక్కువయ్యాయి. ఇక్కడ మతం, కుల రాజకీయాలకే రాజకీయ పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి’’అని ఆయన విశ్లేషించారు.

ఐడెంటిటీ పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘నేడు దళితులు, ఆదివాసీ, ఓబీసీలు ఇలా ఒక్కొక్కరు ఒక్కో వర్గంగా విడిపోయారు. ప్రతి ఒక్కరూ తమ వర్గం నుంచి ఒక సంఘాన్ని ఏర్పాటుచేసుకొని రాజకీయాల్లో ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి మతం కూడా అతీతం కాదు’’అని ఆయన చెప్పారు.

నవరాత్రి

ఫొటో సోర్స్, Getty Images

ఏళ్ల నుంచి ఇదే జరుగుతోంది...

మరో రాజకీయ విశ్లేషకుడు ఘనశ్యామ్ షా మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ ఐడెంటిటీ పాలిటిక్స్ ఏళ్ల నుంచి కొనసాగుతున్నాయి’’అని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు ఇలాంటి మరింత ఎక్కువ అవుతాయని ఆయన వివరించారు.

గర్బాకు ముస్లింలను ఎందుకు రానివ్వడంలేదనే అంశాలను ఆయన వివరిస్తూ.. ‘‘ఇలాంటి కేసులు ఎన్నికల ముందు చాలా ఎక్కువ అవుతాయి. ముస్లింలు మాత్రమే కాదు.. చాలా చోట్ల దళితులను కూడా గర్బాకు రానివ్వరు. గతంలోనూ ఇలాంటి రాజకీయాలు ఉండేవి. కానీ, ఇప్పుడు మరింత ఎక్కువయ్యాయి. ఎందుకంటే వీటి వల్ల కొందరికి చాలా రాజకీయ లబ్ధి జరుగుతోంది’’అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, ఇనుప చువ్వలు, సూదులు గుచ్చుకుంటే వీరికి నొప్పి కలగదా

ఇలాంటి అంశాలతో తాము ఎలాంటి రాజకీయాలు చేయబోమని విశ్వ హిందూ పరిషత్ అధికార ప్రతినిధి దక్ష్ మెహ్తా బీబీసీతో చెప్పారు. ‘‘అయితే కొందరు ముస్లిం యువకులు ఇలాంటి వేడుకలను లవ్ జిహాద్ కోసం ఉపయోగించుకుంటున్నారు. మేం వాటిని ఆపాలని అనుకుంటున్నాం. మేం 1985 నుంచి దీని కోసం ప్రచారాలు చేపడుతున్నాం’’అని ఆయన వివరించారు.

గర్బాలో ముస్లిం యువకుడిపై దాడి చేశారనే వార్తలపై మెహ్తా స్పందిస్తూ.. ‘‘గర్బా ఆడేందుకు వచ్చే వారి మొహాలపై బజరంగ్ దళ్ కార్యకర్తలు తిలకం పెడుతున్నారు. అప్పుడే అమ్మాయిల ఫోటోలను కొందరు రహస్యంగా తీయడం చూశారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అప్పుడు గొడవ జరిగింది. ఆ యువకుల ఫోన్లలో నుంచి ఫోటోలను బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలు డిలీట్ చేశారు. ఆ అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఇక్కడ రాజకీయాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఇది కేవలం లవ్ జిహాద్‌ను ఆపే ప్రయత్నం మాత్రమే’’అని ఆయన చెప్పారు.

మరోవైపు ముస్లింలపై ఆంక్షలు విధించడంతోపాటు ఆ యువకుడిని బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలు కొట్టారనే వార్తలపై సంస్థ అధికార ప్రతినిధి జ్వలిత్ మెహ్తా స్పందించారు. ‘‘మేం ఎలాంటి రాజకీయాలు చేయడం లేదు. మేం లవ్ జిహాద్‌ను మాత్రమే ఆపేందుకు ప్రయత్నించాం. రెండేళ్ల తర్వాత గర్బా జరుగుతోంది. అందుకే లవ్ జిహాద్ చర్యలు జరుగుతాయని మేం ముందే ప్రజలను హెచ్చరించాం. ఇతర మతాల వారిని అసలు రానివ్వొద్దని ముందే సూచించాం’’అని ఆయన అన్నారు.

నవరాత్రి

ఫొటో సోర్స్, Getty Images

ఇక్కడ గుజరాత్ ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్ (అమెండమెంట్) యాక్ట్-2021 గురించి మనం ప్రధానంగా చెప్పుకోవాలి. దీన్నే యాంటీ-లవ్ జిహాద్ యాక్ట్‌గా పిలుస్తున్నారు.

ఈ చట్టంలోని కొన్ని నిబంధనలను వ్యతిరేకిస్తూ ఓ పిటిషన్ హైకోర్టులో దాఖలైంది. చట్టంలోని సెక్షన్ 3లో.. బలవంతపు మతమార్పిడులను నిర్వచించారు. ప్రస్తుతం ఈ నిర్వచనాన్ని కూడా కోర్టులో సవాల్ చేశారు.

మరోవైపు ముస్లిం యువకుడిపై దాడికి సంబంధించిన వీడియోపై జమాతే ఉలేమా అధికార ప్రతినిధి అస్లం ఖురేషి స్పందించారు. ‘‘మేం అన్ని మతాలు సమానమేనని విశ్వసిస్తాం. గర్బా అంటే ఇష్టపడే ముస్లింలపై ఇలా దాడి చేయడం సరికాదు. ఇలాంటి ఘటనలు గుజరాత్ వాతావరణాన్ని దెబ్బ తీస్తాయి. ఇలాంటి వాటిని అడ్డుకోవాలి. చాలా మంది ముస్లిం అమ్మాయిలు కూడా గర్బాకు వెళ్తారు. కేవలం అబ్బాయిలను మాత్రమే అడ్డుకోవడం సరికాదు’’అని ఆయన అన్నారు.

అహ్మదాబాద్‌కు చెందిన షబానా మన్సూరీ ఓ హిందు అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. గర్బాతో తన అనుబంధం గురించి ఆమె బీబీసీతో మాట్లుడూత.. ‘‘నేను పెళ్లి తర్వాత ఇంటి పేరును మార్చుకోలేదు. నా భార్త గర్బా ఆడటానికి వెళ్తారు. మేం కాలేజీలో ఉండేటప్పుడు నేను కూడా గర్బా ఆడేదాన్ని. ఇప్పుడు పెళ్లి అయి మాకు 21ఏళ్లు గడిచాయి. మేం సంతోషంగానే ఉన్నాం’’అని ఆమె చెప్పారు.

కానీ, ఇలాంటి దాడులు, లవ్ జిహాద్ లాంటి పదాలు.. రెండు వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నాయని ఆమె అన్నారు.

వీడియో క్యాప్షన్, గతేడాది జరిగిన దారుణాలను మళ్లీ జరగనివ్వబోమంటున్న స్థానికులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)