చైనా: కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్‌ నుంచి మాజీ అధ్యక్షుడిని బలవంతంగా బయటకు పంపించారు... కలకలం రేపుతున్న వీడియో

వీడియో క్యాప్షన్, కమ్యూనిస్టు పార్టీ సమావేశాలో మాజీ అధ్యక్షుడిని బలవంతంగా బయటకు పంపేశారు

చైనాలో కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ ముగింపు కార్యక్రమం జరుగుతోంది. అదే సమావేశంలో పాల్గొంటున్న చైనా మాజీ అధ్యక్షుడు హు జింటావోను సభ నుంచి బలవంతంగా బయటకు తీసుకెళుతున్న దృశ్యాలు సంచలనంగా మారాయి.

79ఏళ్ల వృద్ధాప్యంలో ఉన్న హు జింటావో, ప్రస్తుత అధ్యక్షుడు, మరోసారి కూడా ఆ పదవిని చేపట్టబోతున్న షీ జిన్ పింగ్‌కు పక్కనే కూర్చున్నారు. ఇంతలో ఇద్దరు అధికారులు వచ్చి ఆయన్ను బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

హు జింటావో 2003-2013 మధ్య కాలంలో చైనా అధినేతగా బాధ్యతలు నిర్వహించారు.

కమ్యూనిస్టు పార్టీ సమావేశం ప్రతి 5 సంవత్సరాలకొకసారి జరుగుతాయి. తాజాగా, వారం రోజులుగా సాగుతున్న ఈ సమావేశాలలో 69 ఏళ్ల షి జిన్‌పింగ్‌ను మూడోసారి అధ్యక్షుడిగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

ఈ సమావేశాలలో ఏం జరిగింది?

కమ్యూనిస్టు పార్టీ సమావేశంలో కూర్చున్న హు జింటావో దగ్గరకు ఇద్దరు అధికారులు వచ్చారు. అదే సమయంలో పక్కనే ఉన్న అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఏదో చెప్పాలని హు జింటావో ప్రయత్నించారు. దానికి ఆయన తల ఊపుతూ కనిపించారు.

ఆ తర్వాత, సమావేశం జరుగుతున్న గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్ నుంచి హు జింటావో ను బయటకు తీసుకుపోయారు.

line
బీబీసీ విశ్లేషణ

హు జింటావోను బయటకు తీసుకెళ్తున్న దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే, అదేమంత పెద్ద విషయం కాదని పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. దీనిపై చాలామంది అడుగుతున్న ప్రశ్నలకు చైనా ప్రభుత్వం నుంచి మాత్రం సమాధానం వినిపించడం లేదు.

హు జింటావో గతంలో అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన్ను అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా, ఆయన అందుకు నిరాకరించారు. అసలు వాళ్లు ఆయనను ఎందుకు బలవంతంగా తీసుకెళ్లాలనుకున్నారు? షీ జిన్‌పింగ్‌తో ఆయన ఏదో చెప్పడానికి ప్రయత్నించారు. ఆయన ఏదో చెబుతుండగానే అక్కడున్న అధికారి ఆయన్ను భుజాలు పట్టుకుని ఎందుకు తీసుకెళ్లారు?;

హుజింటావోను బయటకు పంపడానికి రెండు కారణాలున్నట్లు ఊహించవచ్చు. మొదటిది చైనా అధికార రాజకీయాలలో అది తన బల ప్రదర్శనలో భాగం కావచ్చు. గతంలో ఇదే పదవికి ప్రాతినిధ్యం వహించిన నాయకుడిని ప్రతీకాత్మకంగా తొలగించడం కావచ్చు. రెండోది, హు జింటావోకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉండటం వల్ల ఆయన్ను బయటకు తీసుకెళ్లి ఉండొచ్చు.

ఒకవేళ ఆయనకు నిజంగానే ఆరోగ్య సమస్యలుంటే, అంత హఠాత్తుగా తీసుకెళ్లడం, అది కూడా కెమేరాల ముందు అలా ప్రవర్తించడం విచిత్రమే. అంత ఎమర్జెన్సీ పరిస్థితులు అక్కడ కనిపించడం లేదు కదా?

కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాలు సాధారణంగా చాలా పకడ్బందీగా, స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంటాయి. అలాంటి సమావేశాలలో హు జింటావోను బయటకు తీసుకెళ్లడం యాక్సిడెంటల్ గా జరిగిన పరిణామం కాకపోవచ్చు అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

పార్టీ సమావేశాల చివరి రోజున అంతర్గతంగా జరిగే సెషన్‌కు కూడా జింటావో హాజరయ్యారు. ఈ సమావేశం చివరలో మాత్రమే కెమెరాలను అనుమతించారు. కెమెరాలు పెట్టిన తర్వాతనే అధికారులు హు జింటావో దగ్గరకు వెళ్లి ఆయనను బయటకు తీసుకెళ్లారు.

షీ జిన్‌పింగ్‌తో పోలిస్తే, హు జింటావో చాలా భిన్నమైన చైనా రాజకీయాలకు ప్రాతినిధ్యం వహించారు. వ్యక్తిగా కంటే, సామూహికంగా నాయకత్వ బాధ్యతలను ఆయన ఎక్కువ ఇష్టపడేవారు. పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీలో ప్రాతినిధ్యం వహించే వివిధ వర్గాలను ఆయన సమతుల్యం చేసేవారు. చైనాను బయటి ప్రపంచానికి పరిచయం చేసిన, కొత్త ఆలోచనల పట్ల సహనాన్ని ప్రదర్శించిన కాలంగా హు జింటావో పాలనా కాలాన్ని చెబుతారు.

ఇక పార్టీ జనరల్ సెక్రటరీగా షి జిన్‌పింగ్ చైనాను కొత్త మార్గంలో తీసుకెళ్లారు. తనను ప్రశ్నించే వారు లేకుండా చేసుకున్నారు.

తాజాగా ఏర్పడిన సెంట్రల్ కమిటీలో లి కెపియాంగ్ గానీ, వాంగ్ యాంగ్ కానీ కనిపించలేదు. వీరిద్దరినీ ఆర్ధిక ఉదారవాదులుగా చెబుతారు. వీరు గతంలోని ప్రభుత్వాలతో కలిసి పని చేశారు. ప్రస్తుతం పొలిట్ బ్యూరోలో షి జిన్ పింగ్ అనుచరులకే పెద్ద పీట వేసినట్లు చెబుతారు.

line

తిరుగులేని నాయకుడు

శనివారం నాడు కమ్యూనిస్టు పార్టీ 205మంది సభ్యులతో సెంట్రల్ కమిటీని ఎన్నుకుంది. అందులో పాల్గొన్నవారంతా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రతిపాదించిన పార్టీ రాజ్యాంగ సవరణలన్నింటినీ ఎలాంటి ప్రశ్నలు లేకుండా ఆమోదం తెలిపారు.

హాంకాంగ్ లో జరుగుతున్న ప్రజాస్వామిక ఆందోళనలను అణచివేస్తామని గత ఆదివారం చేసిన ప్రసంగంలో షి జిన్‌పింగ్ స్పష్టం చేశారు. తైవాన్ పై అవసరమైతే బలప్రయోగం చేస్తామని కూడా చెప్పారు.

ప్రస్తుతం షీ జిన్ పింగ్ పార్టీ జనరల్ సెక్రటరీగా, దేశాధ్యక్షుడిగా, సాయుధ బలగాల అధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనను సుప్రీం లీడర్ అని కూడా పిలుస్తున్నారు.

ఆయనను మూడోసారి అధ్యక్షుడిగా అక్టోబర్ 23న ప్రకటించబోతున్నారని కూడా చెబుతున్నారు.

ఒక వ్యక్తి అధ్యక్షుడిగా రెండుసార్లు మాత్రమే కొనసాగాలన్న నిబంధనను ఆయన 2018లో తొలగించారు. తద్వారా తాను శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.

వీడియో క్యాప్షన్, అవి చైనా నిర్మించిన కృత్రిమ దీవులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)