Sudden Heart Attack: ఒక్కసారిగా గుండెపోటు, కుప్పకూలి ప్రాణాలు వదిలేస్తున్నారు.. ఇంత సడెన్‌గా చనిపోవడానికి కారణాలేంటి?

ఫొటో సోర్స్, iStock
- రచయిత, జెర్మో లోపెజ్
- హోదా, పరిశోధకులు
ఏడాది కాలంలో హృద్రోగాలతో భారత్‌లో చాలా మంది మరణించారు. డ్యాన్స్ వేస్తూ, వ్యాయామం చేస్తూ, అలా కూర్చుని చనిపోయిన వీడియోలు ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అయ్యాయి.
సాధారణంగా కనిపిస్తున్న ప్రజలకు ఒక్కసారిగా గుండెపోటు రావడం, వెంటనే కుప్పకూలడం, ఆ తర్వాత మరణించడం.. ఇలా అన్నీ నిమిషాల్లోనే జరిగిపోతున్నాయి.

అలా వెలుగులోకి వచ్చిన కొన్ని కేసులు ఇవీ..
- 46ఏళ్ల కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్ గుండె పోటు వల్ల మరణించారు.
- 41ఏళ్ల టీవీ నటుడు సిద్ధార్థ్ శుక్లా కూడా గుండెపోటుతో కన్నుమూశారు.
- 59ఏళ్ల హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ జిమ్‌లో వ్యాయామం చేస్తూనే కన్నుమూశారు.
- జమ్మూకశ్మీర్‌లో 21ఏళ్ల యువకుడు డ్యాన్స్ చేస్తూనే స్టేజ్‌పై కుప్పకూలాడు. ఆయన కూడా గుండెపోటుతో మరణించారు.
- ముంబయిలో 35ఏళ్ల వ్యక్తి గర్బా ఆడుతూ గుండె పోటుతో మరణించారు.
- గత వారం 33ఏళ్ల జిమ్ ట్రైనర్ కూర్చున్నప్పుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత గుండె పోటుతో ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.


ఫొటో సోర్స్, Getty Images
ఈ మరణాలకు కోవిడ్-19తో సంబంధం ఉన్నట్లు ధ్రువీకరించే ఆధారాలేవీ లేవు. అయితే వీటిని కోవిడ్-19 ఇన్ఫెక్షన్ దుష్ప్రభావాల్లో ఒకటిగా చూడాలని కొందరు అంటున్నారు.
ప్రస్తుతం భారత్‌లో కరోనావైరస్ కేసులు దాదాపుగా తగ్గాయి. అయితే, గతంలో ఈ వైరస్ బారిన పడటం వల్ల మన ఆరోగ్యంపై పడిన ప్రభావం చాలా కాలంపాటు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
ఇలాంటి సమయంలో అసలు కరోనావైరస్ ఇన్ఫెక్షన్‌కు హృద్రోగాలకు మధ్య సంబంధం ఏమిటి? అనేది తెలుసుకోవాలి.
కోవిడ్-19 వల్ల శ్వాసకోశ వ్యాధులతోపాటు గుండె పోటు లాంటి ముప్పులు కూడా పెరుగుతాయని ఇదివరకటి అధ్యయనాలు చెబుతున్నాయి.
అయితే, ఇదివరకటి మహమ్మారుల వ్యాప్తికి సంబంధించిన అధ్యయనాలను పరిశీలించినప్పుడు అకాల మరణ ముప్పు, జీవిత కాలం తగ్గిపోవడం లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశముందని తేలింది.

ఫొటో సోర్స్, SONU MEHTA/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
స్పానిష్ ఫ్లూ ఏం చెబుతోంది?
1918లో స్పానిష్ ఫ్లూ వ్యాప్తి తర్వాత, కొందరిలో బ్రెయిన్ ఫాగ్, నీరసం లాంటి లక్షణాలు సుదీర్ఘ కాలంపాటు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.
బ్రెయిన్ ఫాగ్ అంటే ఆలోచనా విధానం నెమ్మదించడం. ఒక్కోసారి ఏదైనా అంశంపై ఏకాగ్రత పెట్టడం కూడా కష్టం కావడం. అయితే, ఈ రెండు లక్షణాలు కోవిడ్-19 వ్యాప్తి తర్వాత చాలా మందిలో కనిపించాయి.
ఇలాంటి సాధారణ లక్షణాలతోపాటు స్పానిష్ ఫ్లూ తర్వాత, కొన్ని తీవ్రమైన దుష్ప్రభావాలు కూడా కనిపించాయి. వరుసగా గుండె పోటు కేసులు కూడా పెరుగుతూ వెళ్లాయి. 1940 నుంచి 1959 మధ్య ఒక్కసారిగా ఈ కేసుల్లో పెరుగుదల కనిపించింది.
అలా ఒక్కసారిగా గుండె పోటు కేసులు పెరగడం కాస్త ఆశ్చర్యంగా వైద్యులకు అనిపించేది. అసలు దీనికి వెనుక కారణాలను వివరించడం కూడా వారికి కష్టమయ్యేది. అయితే, ఫ్లూ మహమ్మారే దీనికి కారణమని ఆ తర్వాత పరిశోధనల్లో తేలింది.
మరో విధంగా చెప్పాలంటే వైరస్ సోకిన తర్వాత ఆ బాధితుల్లో ఒక ‘‘టైమ్ బాంబు’’ను ఇన్ఫెక్షన్ వదిలివెళ్లింది. అంటే వారు పూర్తిగా కోలుకోవడం అనేదే జరగలేదు.
ముఖ్యంగా పురుషుల్లో ఎక్కువగా ఈ గుండెపోటు కేసులు కనిపించాయి. నేడు కోవిడ్-19 వ్యాప్తి తర్వాత కూడా గుండెపోటు కేసులు ఎక్కువగా మగవారిలోనే వెలుగుచూస్తున్నాయి.
1918లో స్పానిష్ ఫ్లూ తర్వాత 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న పురుషుల్లో హృద్రోగాల కేసులు పెరగడానికి వారిలో అసాధారణ రోగ నిరోధక స్పందనలే కారణమని వైద్యులు తేల్చారు.
మరోవైపు పుట్టకముందే అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడే స్పానిస్ ఫ్లూ వైరస్ బారినపడితే, 60 ఏళ్ల తర్వాత కూడా వారిని హృద్రోగాల ముప్పు వెంటాడే అవకాశముందని వెలుగులోకి వచ్చింది.
ఈ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల రక్త నాళాల్లో ఆర్థెరోస్క్లెరోసిస్ ప్లాక్‌లు పేరుకుంటున్నాయని పరిశోధనల్లో తేలింది. ఇవి రక్త సరఫరాను నియంత్రిస్తూ రక్త నాళాలపై ఒత్తిడిని పెంచుతాయి. దీని వల్ల గుండె పోటు వచ్చే ముప్పుంటుంది.
కరోనావైరస్‌తో సంబంధం ఏమిటి?
కోవిడ్-19 వ్యాప్తి మొదలైనప్పుడు నిర్వహించిన పరిశోధనల సమాచారం ప్రకారం, కరోనావైరస్ ఇన్ఫెక్షన్‌తో గుండె పోటు ముప్పు కూడా పెరుగుతుంది.
దీని వల్ల గుండె ఆగిపోవడం, మయోకార్డియల్ డామేజ్, అరిథమియా, ఎక్యూట్ కరోనరీ సిండ్రోమ్ లాంటి సమస్యల ముప్పు కూడా ఎక్కువ అవుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.

కరోనావైరస్ ఇన్ఫెక్షన్ వల్ల గుండె వ్యాధుల ముప్పు పెరగడం వెనుక రెండు కారణాలు ఉండొచ్చు..
- ఒక కొత్త వైరస్‌పై రోగ నిరోధక వ్యవస్థ పోరాటం మొదలుపెట్టినప్పుడు.. ఒక్కోసారి గుండెలోని రక్తనాళాలు కూడా దెబ్బతినే ముప్పు ఉంటుంది.
- ముఖ్యంగా రక్త నాళాలు కుంచించుకుపోతాయి. ఫలితంగా వాటిలో రక్తం సాఫీగా ప్రసరించేందుకు వీలుపడదు. దీన్నే వ్యాస్కులర్ ఇన్‌ఫ్లమేషన్‌గా పిలుస్తారు.
- అప్పటికే హృద్రోగాలతో బాధపడేవారికి గుండె సమస్యలు వచ్చే ముప్పు మరింత ఎక్కువవుతుంది.
- ఏసీఈ2 ప్రోటీన్ సాయంతో మన శరీరంలోకి కరోనావైరస్ ప్రవేశిస్తుంది. రక్త నాళాల లోపలి గోడల్లో ఈ ప్రోటీన్ ఉటుంది.
- గుండె పనితీరు సవ్యంగా ఉండటం, రక్తపోటు నియంత్రణ, దెబ్బతిన్న రక్త నాళాలను మళ్లీ పూర్వస్థితికి తీసుకురావడంలో కూడా ఈ ప్రోటీన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

గర్భస్రావాల పెరుగుదల..
రక్త నాళాల లోపలి గోడల్లో భాగమైన ఎండోథెలియమ్‌పై కోవిడ్-19 ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా ఒక్కోసారి మహిళల్లో ప్లాసెంటా కూడా దెబ్బతింటుంది. ఇదే గర్భస్రావాలకు కారణం అవుతుంది.
రక్తపోటు వల్ల గర్భిణుల్లో రక్తనాళాలు దెబ్బతిని గర్భస్రావం అయినట్టే కోవిడ్-19 కూడా గర్భిణుల్లోని రక్త నాళాలపై ప్రభావం చూపుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
వ్యాక్సీన్ల పరిస్థితి ఏమిటి?
రక్తనాళాలు దెబ్బతినడానికి ఎండోథెలియమ్‌లో కనిపించే ప్రోటీన్ ఎస్ కారణమని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఎంఆర్ఎన్-ఏ ఆధారిత వ్యాక్సీన్లతో దీనికి సంబంధం ఉంటుందని వివరిస్తున్నారు.
ఆ వ్యాక్సీన్లలోని ఎంఆర్ఎన్-ఏ.. ప్రోటీన్ ఎస్‌ను ఉత్పత్తి చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ దీన్ని గుర్తించిన వెంటనే క్రియాశీలం అవుతుంది. అయితే, ఇక్కడ రక్తనాళాలు దెబ్బతింటాయని చెప్పే బలమైన ఆధారాలు ఏమీలేవు.
వ్యాక్సీన్ల వల్ల రక్త నాళాలు దెబ్బతింటాయని కొందరు చెప్పేటప్పటికీ, దీన్ని నిరూపించే శాస్త్రీయ ఆధారాలేమీ లేవు.
ఎందుకంటే వ్యాక్సినేషన్ తర్వాత రక్తంలోని ప్రోటీన్-ఎస్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయని, ఎండోథెలియమ్‌పై దీని ప్రభావం కొన్ని రోజుల్లోనే తగ్గిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
రక్త నాళాలు దెబ్బతినకుండా వ్యాక్సీన్లతో రక్షణ
ఇదివరకటి మహమ్మారుల డేటాను పరిశీలించినప్పుడు.. ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌లతో పోలిస్తే కోవిడ్-19 వల్ల గుండె పోటు, అకాల మరణ ముప్పు ఎక్కువగా ఉంటోందని తెలుస్తోంది. ముఖ్యంగా రక్తనాళాలు దెబ్బతినడమే దీనికి కారణం. దీని వల్ల నెలలు లేదా సంవత్సరాల తర్వాత కూడా హృద్రోగాలు వచ్చే ముప్పుంటుంది.
అయితే, ఈ దుష్ప్రభావాల నుంచి పోరాడటంలో వ్యాక్సీన్లు మెరుగ్గా పనిచేస్తాయి.
ఎందుకంటే అసలు వైరస్ వల్ల మనకు తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకకపోతే, గుండెపై ఇది ఎలా ప్రబావం చూపించగలదు?
అందుకే వ్యాక్సీన్లు మన ప్రాణాలు కాపాడతాయనేది నిజం. ఏళ్ల వరకు ఈ వ్యాక్సీన్లు మనకు రక్షణ కల్పించగలవు.
(రచయిత స్పెయిన్‌లోని పబ్లోడే ఒలవిడా యూనివర్సిటీలో ప్రొఫెసర్)
ఇవి కూడా చదవండి:
- లంపీ స్కిన్ వ్యాధి సోకిన పశువుల పాలు తాగొచ్చా? ఈ వైరస్ మనుషులకూ సోకుతోందా? దేశంలో ఎందుకిన్ని వదంతులు?
- పాకిస్తాన్లో క్రికెట్‌ను భారత్ వ్యాపార సంస్థలే నడిపిస్తున్నాయా? బీసీసీఐ నిధులు ఇవ్వకపోతే పాక్ క్రికెట్ బోర్డు కూలిపోతుందా?
- దీపావళి టపాసులు అమ్మితే మూడేళ్లు జైలుశిక్ష, టపాసులు కాల్చితే 6 నెలలు జైలు శిక్ష
- లిజ్ ట్రస్: ప్రధాని అయిన 45 రోజులకే ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది, బ్రిటన్ తాజా రాజకీయాలపై తెలుసుకోవాల్సిన 8 పాయింట్లు
- ఇండియా మోస్ట్ వాంటెడ్ పాక్ తీవ్రవాదులను చైనా ఎలా రక్షించిందంటే...
- కోవిడ్-19ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- కరోనావైరస్: కోవిడ్-19 నుంచి కోలుకునేందుకు ఎన్నాళ్లు పడుతుంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















