డయేరియాతో బాధ పడుతున్నప్పుడు ఏం తినాలి, ఏం తినకూడదు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రెడేషియన్
- హోదా, బీబీసీ ముండో
ఏ ఆహారం మంచిది, ఏ ఆహారం ప్రమాదకరం? మందులు వేసుకోవాలా, ఆపేయాలా? ఇలాంటి ప్రశ్నలు డయేరియా వచ్చినప్పుడు మనల్ని వెంటాడుతుంటాయి. తీవ్రమైన వ్యాధుల నుంచి ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు డయేరియాకు కారణం అవుతాయి.
ఇక్కడ ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. భిన్నమైన ఆహారాలకు ప్రజల శరీరాలు కూడా భిన్నంగా స్పందిస్తుంటాయి.
డయేరియా వచ్చినప్పుడు తగిన మొత్తంలో పానీయాలు తీసుకోవాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. పిల్లలు, వృద్ధులకు మరింత ఎక్కువగా పానీయాలు అవసరం అవుతాయి.
‘‘డయేరియా చికిత్సలో హైడ్రేషన్, న్యూట్రిషన్ అనేవి మూల స్తంభాలు. ముఖ్యంగా నవజాత శిశువులు, పిల్లల విషయంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాలి’’అని బ్రెజిలియన్ మెడికల్ అసోసియేషన్ (ఏఎంబీ) వైస్ ప్రెసిడెంట్, బహియా ఫెడరల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లూసియానా రోడ్రిగ్స్ సిల్వా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంతకీ డయేరియా వచ్చినప్పుడు ఏం తినాలి, ఏం తినకూడదు?
సాధారణంగా కొన్ని ఆహారాలు ఎవరైనా తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తుంటారు. కానీ ఆహారం అనేది సదరు వ్యక్తి శరీరతత్వం, ఆరోగ్య చరిత్ర, డయేరియా తీవ్రతపై ఆధారపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయని వైద్యురాలు క్రిస్టియానే మార్టిన్ చెప్పారు.
కానీ, కొన్ని ఆహారాలు మాత్రం డయేరియాను తీవ్రం చేస్తుంటాయి, అలాంటి ఆహార పదార్థాలను అసలు తీసుకోకూడదని వైద్యులు సూచిస్తుంటారు.
కొవ్వు ఎక్కువగా ఉండేవి, కారంగా ఉండేవి, బాగా నూనెలో వేయించినవి, పళ్ల రసాలు, ఆల్కహాలిక్ పానీయాలు, బీన్స్, హోల్ వీట్ లాంటివి పరిస్థితి తీవ్రం చేస్తుంటాయి.
డయేరియాకు చాలా కారణాలు ఉంటాయి. కడుపులో ఇన్ఫెక్షన్, ఇన్‌ఫ్లమేషన్, ఫుడ్ పాయిజనింగ్, ఫుడ్ అలర్జీలు, అసమతౌల్య ఆహారం, కోవిడ్-19, కొన్ని ఔషధాల దుష్ప్రభావాలు, క్యాన్సర్ లాంటి వ్యాధులు, బోవెల్ సిండ్రోమ్ ఇలా చాలా కారణాల వల్ల డయేరియా చుట్టుముడుతుంది.
డయేరియా సాధారణంగానే అనిపించొచ్చు. కానీ, తగిన సమయంలో చికిత్స చేయకపోతే, సదరు రోగి ప్రాణాలు కూడా కోల్పోవచ్చు.
వారం రోజుల కంటే డయేరియా ఎక్కువ ఉంటే అత్యవసర వైద్య సాయం అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మలంలో రక్తం, చీము, వాంతులు తగ్గకపోవడం, తీవ్రమైన కడుపునొప్పి, బరువు తగ్గిపోవడం, ఒంటిలో నీటి శాతం పడిపోవడం, మలం రంగు మారడం, విరేచనాలు ఇలా ఏ లక్షాలున్నా వెంటనే అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
డయేరియా అపేందుకు ఏం చేయాలి?
డయేరియాను ఆపేందుకు మొదట్లో ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు. సదరు బ్యాక్టీరియాతో పోరాడేందుకు మన శరీర రోగ నిరోధక వ్యవస్థ పనిచేస్తుందని, మనం తీసుకునే చర్యలు రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తాయని అంటున్నారు. కానీ, పరిస్థితి సద్దుమణగకపోతే, వైద్యుల సాయం తీసుకోవాలని సూచిస్తున్నారు.
అయితే, యాపిల్స్, క్యారట్స్, కొవ్వు తక్కువగా ఉండే చేపలు, అన్నం లాంటివి తీసుకోవాలని సాధారణంగా వైద్యులు సూచిస్తుంటారు. ఇవి డయేరియా లక్షణాలు పెంచవు.
వీటిని కానిస్టేపెడ్ ఫుడ్స్ అంటారు. ఇవి పేగుల్లో నుంచి బయటకు విడుదల కావడానికి కాస్త సమయం పడుతుంది. వీటివల్ల డీహైడ్రేషన్, బరువు తగ్గిపోవడం లాంటి సమస్యలను నియంత్రించొచ్చని ట్రియాంగులో మినీరో ఫెడరల్ యూనివర్సిటీ పరిశోధన పత్రం చెబుతోంది.
కడుపులో ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమయ్యే క్రాన్స్ డిసీజ్ లాంటి వ్యాధులతో బాధపడేవారు తాము ఏం తింటున్నామో, అవి తమపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో నోట్ చేసుకోవాలి. దీంతో తమకు ఏ ఆహార పదార్థాలు పడతాయో, ఏం పడవో తెలుసుకోవచ్చు.
డయేరియాను అరికట్టడంలో మంచి ఆహారాన్ని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో.. ఆహారాన్ని ఎలా వండుతున్నారు? ఎలా సర్వ్ చేస్తున్నారు? ఎలా నిల్వ చేస్తున్నారో కూడా అంతే ముఖ్యం.

ఫొటో సోర్స్, Getty Images
ఏం తినకూడదు?
మొదట చెప్పిన విషయాన్నే ఇక్కడ మరోసారి చెబుతున్నాను. ఒక్కో వ్యక్తి ఒక్కో ఆహారానికి ఒక్కోలా స్పందిస్తుంటారు.
అయితే, సాధారణంగా డయేరియా బాధితులు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. కొన్నింటిని అసలు తీసుకోవద్దని చెబుతారు.
అసలు తీసుకోకూడదని సూచించే ఆహార పదార్థాలు ఇవీ..
- ఆల్కహాల్, కాఫీ, కార్బొనేటెడ్ పానీయాలు
- బాగా వేయించిన ఆహార పదార్థాలు
- తీపి పదార్థాలు
- పప్పులు
- ఆలివ్ ఆయిల్, ఆయిల్
- పెప్పర్
- స్వీట్లు, చాక్లెట్లు
- ఫైబర్
- సాసేజ్‌లు
- వాల్‌నట్లు
- తొక్కతో ఉండే పళ్లు
- ఆవొకాడో
- విత్తనాలు, గింజలు
- చీజ్
- బార్లీ
- ప్రాసెస్డ్ ఫూడ్స్
- కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు (సాల్మన్ కూడా)
- ఫ్రక్టోస్ ఎక్కువగా ఉండే పళ్ల రసాలు
- డెయిరీ ఉత్పత్తులు
‘‘డెయిరీ ఉత్పత్తులు పేగుల్లో ఇన్ఫెక్షన్‌ను తీవ్రం చేస్తాయి’’అని బ్రెజీలియన్ అసోసియేషన్ ఆఫ్ న్యూట్రాలజీ ప్రెసిడెంట్, న్యూట్రిషనిస్ట్ ద్రువల్ రిబాస్ అన్నారు.
‘‘మరోవైపు గుడ్లు, పాలు, సోయా లాంటి ఆహార పదార్థాలు కూడా రియాక్షన్లకు కారణం అవుతాయి. తల తిరగడం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు, పెదవులు, చర్మం ఎర్రగా మారడం లాంటి రియాక్షన్లకు కారణం అవుతాయి’’అని రిబాస్ వివరించారు.
ఇవి కూడా చదవండి:
- డేటింగ్ సైట్లలో అందమైన అమ్మాయిల పేరుతో నకిలీ ప్రొఫైల్స్‌ను ఎలా నడిపిస్తారు?
- టీవీ చానెళ్లలో చర్చలే దేశంలో విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నాయా, యాంకర్లు ఏం చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది ?
- డిజిటల్ రేప్‌కు పాల్పడిన 75 ఏళ్ల వ్యక్తికి జీవిత ఖైదు, అసలేమిటీ కేసు?
- OSCAR: అమెరికన్ సినిమాల అవార్డులకు ఇంత క్రేజ్ ఎలా వచ్చింది? ఆస్కార్‌లో విదేశీ చిత్రాల ఎంట్రీకి నిబంధనలు ఏమిటి?
- ఇస్లాం నుంచి హిందూమతంలోకి మారిన ఒక కుటుంబం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది?- గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












