డ్రై షాంపూల్లో క్యాన్సర్ కారకాలు.. డ్రై షాంపూలకు, మామూలు షాంపులకు తేడా ఏంటి?

షాంపులు

ఫొటో సోర్స్, unileverusa.com

    • రచయిత, గౌతమి ఖాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

క్యాన్సర్ కారకాలు ఉన్నాయంటూ కొన్ని డ్రై షాంపూ బ్రాండులను అమెరికా మార్కెట్ నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ యూనిలీవర్ తాజాగా ప్రకటించింది.

మార్కెట్‌లో ఆ ఉత్పత్తుల అమ్మకాలను తక్షణం నిలిపివేయడంతోపాటు వాటిని షాపుల్లో షెల్ఫ్‌ల నుంచి తీసేయాలని రిటైలర్లను సంస్థ కోరింది.

భారత్‌లోని ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీల్లో హిందుస్తాన్ యూనిలీవర్ ఒకటి. ఈ కంపెనీ మాతృసంస్థ యూనిలీవర్. సబ్బులు, షాంపూల నుంచి రకరకాల బ్యూటీ, పర్సనల్ కేర్ ఉత్పత్తుల్ని తయారు చేసే అతి పెద్ద కంపెనీ ఇది.

డవ్ డ్రై షాంపూ

ఫొటో సోర్స్, dove.com

భారత్‌లో ప్రభావం ఉంటుందా?

క్యాన్సర్ కారకాలు ఉన్నాయంటూ యూనిలీవర్ నిలిపివేసిన డ్రై షాంపుల్లో డవ్, ట్రెసిమే, నెక్సెస్ లాంటి పాపులర్ బ్రాండ్లు ఉన్నాయి. క్యాన్సర్ కారకమైన బెంజీన్ ఈ డ్రై షాంపూలలో ఉన్నట్లు సంస్థ తెలిపింది.

భారత్‌లో ఆ బ్రాండ్ డ్రై షాంపూల ఉత్పత్తి కానీ అమ్మకాలు కానీ లేవు కాబట్టి ఇక్కడ కస్టమర్లపై పడే ప్రభావం ఏమీ లేదని హిందుస్తాన్ యూనిలీవర్ ఒక ప్రకటనలో తెలిపింది. కానీ ఇవి అమెజాన్ వంటి ఆన్‌లైన్ పోర్టల్స్‌లో అందుబాటులో ఉన్నాయని బిజినెస్ ఇండియా ఓ కథనంలో తెలిపింది. డవ్ డ్రై షాంపూ, ఫ్రెష్ కోకొనట్, డవ్ డ్రై షాంపూ స్ప్రే, ఫ్రెష్ అండ్ ఫ్లోరల్ వంటివి అమెజాన్‌లో అమ్మకానికి ఉన్నాయని అది వెల్లడించింది.

బెంగళూరులోని యునైటెడ్ డిస్ట్రిబ్యూటర్స్ అనే కంపెనీ అమెరికా నుంచి వాటిని దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది.

యూనిలీవర్

ఫొటో సోర్స్, unileverusa.com

డ్రై షాంపూ అంటే ఏంటి?

మనం రెగ్యులర్‌గా వాడే షాంపూలకు, డ్రై షాంపూలకు తేడా ఉంది. మామూలుగా అయితే మనం తడి తల మీద షాంపు రుద్దుకుంటాం. కానీ తలను తడపకుండానే జుట్టు ఫ్రెష్‌గా కనిపించడానికి డ్రై షాంపూలను ఉపయోగిస్తారు.

ముఖ్యంగా వ్యాయామం తర్వాత తడిగా మారిన తలను పొడిగా చేయడానికి, జుట్టు బౌన్సీగా ఒత్తుగా కనపడేందుకు కూడా వాటిని వాడతారు. అమెరికా, యూరప్ దేశాలలో వీటి వినియోగం చాలా ఎక్కువ. భారత్‌లో కూడా డ్రై షాంపూ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది.

ప్లాస్టిక్ స్ట్రాలు

ఫొటో సోర్స్, Reuters

బెంజీన్‌తో ముప్పేంటి?

బెంజీన్ అనేది ఒక రసాయనం. దీనికి రంగు ఉండదు. కానీ వాసన ఉంటుంది. రకరకాల సాధారణంగా మనం రోజూ వాడే ప్లాస్టిక్, రబ్బర్లు, హెయిర్ డై, డిటర్జెంట్లు, మందులు, రసాయనాల తయారీలో బెంజీన్ ఉపయోగిస్తారు.

డ్రై షాంపూలను జుట్టు పై స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఆ స్ప్రే నుంచి వెలువడే తుంపర్లు శ్వాస ద్వారా లోపలకు పోతాయి. డ్రై షాంపూలో బెంజీన్ ఉంటే అది హాని చేస్తుంది. దీని వలన శరీరంలోని ఎర్ర రక్త కణాలు తగ్గిపోతాయి. శరీరంలో బెంజీన్ ఎక్కువగా చేరితే లుకేమియా, బ్లడ్ కాన్సర్, బోన్ మారో కాన్సర్ వంటివి రావచ్చు. మరెన్నో ఇతర దీర్ఘకాల వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతోంది సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్.

డ్రై షాంపూల్లో, ఇతర సౌందర్య ఉత్పత్తులలో బెంజీన్‌ను అధిక మోతాదులో వినియోగించడం దురదృష్టకరమని మరిన్ని ప్రోడక్టులను కూడా పరిశీలిస్తామని అమెరికాలోని వాలిష్యుర్ లేబోరేటరీ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవిడ్ అన్నారు.

యునిలీవర్‌కు చెందిన కొన్ని డ్రై షాంపుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని వాలిష్యుర్ లేబోరేటరీ పరిశోధనలో తేలింది.

జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్

ఫొటో సోర్స్, Reuters

గతంలో కూడా

బ్యూటీ, పర్సనల్ కేర్ ప్రోడక్ట్‌లను కంపెనీలు వెనక్కి తీసుకోవడం కొత్త విషయమేమీ కాదు. జాన్సన్ అండ్ జాన్సన్ కూడా 2023 నుంచి ప్రపంచవ్యాప్తంగా తమ టాల్కం పౌడర్ అమ్మకాలు నిలిపివేస్తున్నానంటూ గత ఆగస్టు నెలలో ప్రకటించింది. అమెరికా, కెనడాలలో 2020 నుంచే అమ్మకాలు ఆపేసింది. దీనికి కారణం కూడా ఆ పౌడర్‌లో కాన్సర్ కారకాలుండటమే.

గతేడాది పీ అండ్ జీ కంపెనీ కూడా ఇవే కారణాలతో 30కి పైగా పర్సనల్ కేర్ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేసింది. వీటిలో డియోడ్రెంట్లు, షాంపూలు, కండిషనర్లు, సన్ స్క్రీన్ లోషన్లు ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, తెలంగాణ: ఆదివాసీల దండారీ పండగ, గుస్సాడీ నృత్యాల ప్రత్యేకతలు ఏంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)