యూనిలీవర్: ఫెయిర్ అండ్ లవ్లీపై వివాదం.. పేరు మారుస్తామన్న సంస్థ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లోరా జోన్స్
- హోదా, బీబీసీ వాణిజ్య వ్యవహారాల ప్రతినిధి
శరీర వర్ణంపై ఒకరకమైన వివక్షను ప్రోత్సహిస్తోందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న యూనిలీవర్ సంస్థ.. చర్మాన్ని తెల్లగా మార్చే ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ పేరును మార్చబోతోంది.
ఆసియాలో విక్రయించే క్రీమ్‌లపై వైటెనింగ్ లేదా లైటెనింగ్ అనే పదాలను పూర్తిగా తొలగించనుంది.
ఒక రకమైన వర్ణంతో మేలిమి సౌందర్యం సొంతం అనే అర్థం వచ్చేలా తమ ఉత్పత్తులపై రాసినట్లు సంస్థ అంగీకరించింది.
ఫెయిర్ అండ్ లవ్లీ ఉత్పత్తిని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్న రెండు వేర్వేరు పిటిషన్లపై ఆన్‌లైన్‌లో 18,000 మందికిపైగా నెటిజన్లు సంతకం చేశారు.
"ఈ క్రీమ్ వర్ణ వివక్షను ప్రోత్సహిస్తోంది. నల్ల రంగు మేని ఛాయగల వ్యక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రకటనలు ఇస్తోంది" అని ఓ పిటిషన్‌లో పేర్కొన్నారు.
"మా రంగులో ఏమైనా తప్పు ఉందా చెప్పండి. అందంగా, మంచి మనుషుల్లా కనిపించాలంటే మేం తెల్లగా అవ్వాల్సిందేనా?" అని మరో పిటిషన్‌లో వ్యాఖ్యానించారు.
‘నిబద్ధతతో ఉన్నాం’
"ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల వర్ణాలకూ సముచిత గౌరవాన్ని ఇచ్చేందుకు మేం కట్టుబడి ఉన్నాం. అందంలో భిన్నత్వాన్ని మేం గౌరవిస్తున్నాం." అని యూనిలీవర్‌లోని బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ విభాగం అధిపతి సన్నీ జైన్ తెలిపారు.
"ఫెయిర్, వైట్, లైట్ అనే పదాలు ఒకేరమైన వర్ణం అందాన్ని ఇస్తుందనే భావన కలుగుతున్నట్లు గుర్తించాం. ఇది సరికాదని మేం భావిస్తున్నాం. తగిన చర్యలు తీసుకుంటాం."

ఫొటో సోర్స్, L'OREAL
క్రీమ్ వాడక ముందు, వాడిన తర్వాత.. అంటూ ఫెయిర్ అండ్ లవ్లీపై చేసే పోలికలనూ 2019 నుంచి తొలగించినట్లు సంస్థ తెలిపింది. భారత్‌తోపాటు ఇండోనేసియా, థాయ్‌లాండ్, పాకిస్తాన్‌లలో ఈ క్రీమ్‌ను విక్రయిస్తున్నారు.
అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మరణానంతరం మొదలైన బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా సౌందర్య ఉత్పత్తులు తమ వ్యూహాలు, ప్రకటనల్లో మార్పు చేస్తున్న తరుణంలో యూనిలీవర్ స్పందించింది.
మినెయాపోలిస్‌లో తొమ్మిది నిమిషాలపాటు ఓ వైట్ పోలీస్ తన మెడపై మోకాలు పెట్టి అదిమి ఉంచడంతో ఫ్లాయిడ్ మరణించారు.
ఆయన చివరి క్షణాలను పరిసరాల్లోనివారు ఫోన్లలో రికార్డ్ చేశారు. ఘటనకు సంబంధించి నలుగురు అధికారులపై చర్యలు తీసుకున్నారు. వారిపై హత్య అభియోగాలను మోపారు.
"చాలా అసంతృప్తికి గురయ్యాం"
యూనిలీవర్ ప్రకటన చూసి తీవ్ర అసంతృప్తికి గురయ్యామని రచయిత, సామాజిక కార్యకర్త పూర్ణ బెల్ వ్యాఖ్యానించారు.
"వర్ణ వివక్షతో ఎదుర్కొంటున్న మనో, భావోద్వేగ గాయాలను మాన్పేందుకు ఈ చర్యలు సరిపోవు. నల్ల రంగు మేని ఛాయ గల వ్యక్తులకు ఒక్కోసారి అదే జాతికి చెందిన వారి నుంచి కూడా వివక్ష ఎదురవుతోంది."
"పేరు మార్చడంతో పెద్దగా ప్రయోజనం ఉండదు. వేరే పేరుతో మళ్లీ వర్ణ వివక్ష ఎదురవుతుంది.."
నల్లని మచ్చలను తగ్గించే క్రీమ్‌ల పేరుతో ఆసియాలో విక్రయిస్తున్న కొన్ని క్రీమ్‌లను నిలిపివేస్తూ జాన్సన్ అండ్ జాన్సన్ తీసుకున్న చర్యల తరహాలో యూనిలీవర్ కూడా స్పందించాలని ఆమె సూచించారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
"మహిళలు, నల్ల జాతీయులే లక్ష్యం"
మహిళలు, నల్ల జాతీయులు, ఆసియా ప్రజలను దృష్టిలో పెట్టుకొని శరీరాన్ని తెల్లగా మార్చే క్రీమ్‌లను తయారుచేస్తారని స్కిన్ లైటెనింగ్‌పై అధ్యయనం చేస్తున్న సోషియాలజిస్ట్ డాక్టర్ స్టీవ్ గార్నెర్ వివరించారు.
"వర్ణ వివక్షకు మేం వ్యతిరేకం. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం."అని నివెయా మాతృ సంస్థ బీర్స్‌డార్ఫ్ తెలిపింది.
నివెయా నేచురల్ ఫెయిర్‌నెస్ లైన్ క్రీమ్.. భారత్‌తోపాటు నైజీరియా, మధ్యప్రాచ్య దేశాల్లోనూ విక్రయిస్తున్నారు.

ఈ క్రీమ్ శరీర వర్ణం నల్లగా మారకుండా అడ్డుకుంటుందని సంస్థకు చెందిన మధ్యప్రాచ్య విభాగం వెబ్‌సైట్‌లో రాసుకొచ్చారు.
క్రీమ్ గురించి రాసిన విశ్లేషణలో ఏమైనా మార్పులు చేస్తారా? అని బీబీసీ ప్రశ్నించగా.. "ఆ క్రీమ్‌లో ఎస్‌పీఎఫ్-15 ఉంటుంది. ఎండ వల్ల కలిగే దుష్ప్రభావాలపై అది పనిచేస్తుంది. ఏ రంగు శరీరమైనా దాన్ని వాడొచ్చు" అని సంస్థ వివరించింది.
"ప్రస్తుతం అన్ని ఉత్పత్తులపై ఉన్న వివరణ, విశ్లేషణలను సమీక్షిస్తున్నాం. ఏదైనా తప్పుడు లేదా వివక్ష పూరిత సమాచారం కనిపిస్తే మార్పులు చేస్తాం"
గార్నియర్ వైట్ కంప్లీట్ రేంజ్‌పై అడిగిన ప్రశ్నలకు లారియల్ సంస్థ స్పందించలేదు.
తమ ఉత్పత్తులు శరీర వర్ణాన్ని తెల్లగా చేస్తాయంటూ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ప్రకటనలో సంస్థ పేర్కొంది. శరీరం ఎలా తెల్లగా మారుతుందో వివరించే మహిళల కార్టూన్లు ఈ ప్రకటనలో ఉన్నాయి.
"ఈ ఉత్పత్తులపై వివరణలు తెల్ల రంగుకు ప్రాధాన్యం ఇస్తాయి. తెలుపు రంగు మేలైనదనే కోణంలో రాసుకొస్తాయి" అని బ్యూటీ బ్రాండ్ ఏ కాంప్లెక్షన్ కంపెనీ వ్యవస్థాపకురాలు నొమ్‌షాడో మైషెల్ వివరించారు.
"ఈ ఉత్పత్తుల గురించి రాసేవాళ్లు, మార్కెట్‌లో విక్రయించేందుకు సిద్ధంచేసే పైస్థాయి సిబ్బంది దాదాపుగా తెల్లవారే ఉంటారు. నల్లజాతి మహిళలందరూ తెల్లగా మారిపోవాలని కోరుకుంటారనే భావనలో వారుంటారు."
మరోవైపు నేడు చర్చలు ముఖం రంగు నుంచి శరీర వర్ణంవైపు మళ్లుతున్నాయని ఆమె అన్నారు.

ఉత్పత్తులపై నిషేధం
హైడ్రోక్వినోన్, స్టెరాయిడ్స్ లేదా మెర్క్యురీలతో తయారుచేసే క్రీమ్‌లను బ్రిటన్‌లో డాక్టర్ సూచిస్తేనే ఇస్తారు. ఎందుకంటే వీటివల్ల దుష్ప్రభావాలు చుట్టుముట్టే అవకాశముంది.
పెయింట్ వదిలించే లేపనాల్లా పనిచేసే ఈ క్రీమ్‌లను ఉపయోగించొద్దని వినియోగదారులకు స్థానిక సంస్థలు ఎప్పటికప్పుడే హెచ్చరిస్తుంటాయి.
బ్రిటన్‌లోని ఈబే ఆన్‌లైన్ మార్కెట్‌లో హైడ్రోక్వినోన్‌తో చేసిన క్రీమ్‌లు విక్రయించడాన్ని బీబీసీ న్యూస్ గుర్తించింది.
అయితే చట్టాలు అనుమతించిన వస్తువులను మాత్రమే ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నామని బీబీసీకి ఈబే అధికార ప్రతినిధి చెప్పారు. హైడ్రోక్వినోన్, స్టెరాయిడ్స్, మెర్క్యురీ కలిగిన ఉత్పత్తులపై నిషేధం విధించినట్లు వివరించారు.
"ఇలాంటి మూలకాలతో తయారుచేసిన ఉత్పత్తులు ఏమైనా ఉంటే ఇప్పుడే తొలగిస్తాం. వీటిని విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటాం. మా వినియోగదారులంతా సురక్షితంగా ఉండేలా చూసేందుకు మేం అధికారిక యంత్రాంగంతో కలిసి పనిచేస్తున్నాం."
బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం నడుమ ఇటీవల తాము చట్ట వ్యతిరేక ఉత్పత్తుల విధానాన్ని ఆధునికీకరించామని పేర్కొన్నారు.
హానికర, వర్ణ వివక్ష చూపే ఉత్పత్తులపై ఇలాంటి చర్యలను సంస్థలు ఎప్పుడో తీసుకొని ఉండాల్సిందని డాక్టర్ స్టీవ్ గార్నెర్ వివరించారు.
అయితే ప్రపంచ వ్యాప్తంగా విక్రయాలు జరుపుతున్న సంస్థలపై వీటి ప్రభావం పెద్దగా ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: అన్ని వైరస్లు ఒకేసారి అంతమైపోతే ఏం జరుగుతుంది? మానవులు సుఖంగా బతకగలరా?
- కరోనావైరస్: డెక్సామెథాసోన్ ఏంటి? ఈ మందు ఎలా పనిచేస్తుంది? దీని ధర ఎంత?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- కరోనావైరస్: 36 రోజులు వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడి, బతికి బయటపడిన వ్యక్తి ఇతను
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- పామాయిల్: మీ వంటనూనె, సౌందర్య సాధనాలు అడవి జంతువుల్ని ఎలా చంపేస్తున్నాయంటే..
- చర్మ సౌందర్యానికి క్రీములు వాడితే ఏమవుతుందో తెలుసా?
- మేకప్ వీడియోలు: మనం కనిపించే తీరును సోషల్ మీడియా మార్చేస్తోందా?
- అక్కినేని అమల: హుందాగా వయసును ఆహ్వానిద్దాం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








