పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భారతీయుల ప్రాణాలు హరిస్తున్నాయా, లాన్సెట్ నివేదికలో ఏముంది?

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో 2000-2004, 2017-2021 సంవత్సరాల మధ్య కాలంలో విపరీతమైన వేడి ఉష్ణోగ్రతల కారణంగా మరణాలు 55 శాతం పెరిగాయని ది లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన తాజా అధ్యయనం చెప్తోంది.
వేడికి గురికావటం వల్ల 2021లో భారతీయులు 16,720 కోట్ల పని గంటలు కోల్పోయినట్లు కూడా ఆ అధ్యయనం పేర్కొంది.
దీనివల్ల దేశ జీడీపీలో 5.4 శాతం మొత్తానికి సమానమైన ఆదాయాలను ప్రజలు కల్పోయినట్లు లెక్కగట్టింది.
భారతదేశంలో ఇటీవలి సంవత్సరాల్లో వడగాడ్పుల తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది.
దేశంలోని చాలా ప్రాంతాల్లో వేసవి కాలంలో తరచుగా వడగాడ్పులు వస్తుంటాయి. అయితే ఈ వడగాడ్పులు అంతకంతకూ మరింత తీవ్రమవుతున్నాయని, ఇంకా తరచుగా వస్తున్నాయని, ఇంకా ఎక్కువ కాలం కొనసాగుతున్నాయని నిపుణులు చెప్తున్నారు.
మొత్తం 103 దేశాలను పరిశీలించి రూపొందించిన వార్షిక లాన్సెట్ కౌంట్‌డౌన్ రిపోర్ట్‌ను మంగళవారం ప్రచురించారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల మధ్య భారత్, పాకిస్తాన్‌లను తాకిన వడగాలి కారణంగా వాతావరణం మార్పులకు గురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు.
''అత్యధిక వేడికి గురికావటం ఆరోగ్యం మీద నేరుగా ప్రభావం చూపుతుంది. అంతర్లీనంగా ఉన్న గుండె, శ్వాస సంబంధిత జబ్బులు మరింత తీవ్రమవుతాయి. వడదెబ్బ తగులుతుంది. గర్భధారణ మీద కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. నిద్ర క్రమం దెబ్బతిట్టుంది. మానసిక ఆరోగ్యం పాడవుతుంది. గాయాల వల్ల మరణాలు పెరుగుతాయి'' అని ఆ అధ్యయనం వివరించింది. బలహీన వర్గాల ప్రజలకు ఎక్కువ ప్రమాదం ఉంటుందని పేర్కొంది.
ఈ ఏడాది ఆరంభంలో బ్రిటన్ వాతావరణ కార్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనంలో కూడా.. వాయువ్య భారతదేశం, పాకిస్తాన్‌లలో రికార్డులు బద్దలుకొట్టిన వడగాలులకు కారణం వాతావరణ మార్పులే కావటానికి 100 రెట్లు ఎక్కువ అవకాశం ఉందని వెల్లడైంది.
వాతావరణ మార్పు లేకపోతే.. అంతటి తీవ్ర ఉష్ణోగ్రతలు 312 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఏర్పడతాయని చెప్పింది.
ప్రపంచవ్యాప్తంగా కూడా అధిక ఉష్ణోగ్రతల వల్ల మరణాల సంఖ్య గత రెండు దశాబ్దాల్లో మూడింట రెండు వంతులు పెరిగాయని లాన్సెట్ నివేదిక పేర్కొంది.
శిలాజ ఇంధనాలతో సమస్యలు
అలాగే 2021 సంవత్సరంలో శిలాజ ఇంధనాలు మండించటం వల్ల ఉత్పత్తి అయ్యే సూక్ష్మ కాలుష్య కణాలు పార్టిక్యులేట్ మేటర్ వల్ల దేశంలో 3,30,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కూడా ఈ అధ్యయనం అంచనా వేసింది. ఈ సూక్ష్మ కాలుష్యాలు ఊపిరితిత్తులకు అడ్డుపడి ప్రాణాలు తీయగలవు.
చమురు, సహజ వాయువు, బయోమాస్ వంటి ఇంధనాల మీద ఆధారపడటం వల్ల.. ఇళ్లలో పార్టిక్యులేట్ మేటర్ సాంద్రత సగటు ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసిన దానికన్నా భారతదేశంలో 27 రెట్లకు మించి అధికంగా ఉందని ఆ నివేదిక తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఏడాది నవంబరులో ఈజిప్టులో జరగనున్న కాప్27 వాతావరణ సదస్సు నేపథ్యంలో ఈ నివేదిక విడుదలైంది.
ఈ నివేదికలోని అంశాలపై స్పందిస్తూ.. ''వాతావరణ సంక్షోభం మనల్ని చంపేస్తోంది'' అని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ వ్యాఖ్యానించారు.
''అది కేవలం మన భూగోళపు ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. అన్నిచోట్లా ప్రజల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తోంది. విషపూరిత వాయు కాలుష్యం, క్షీణిస్తున్న ఆహార భద్రత, అంటువ్యాధులు విస్ఫోటనం చెందే ప్రమాదాలు అధికమవటం, రికార్డు స్థాయి అధిక ఉష్ణోగ్రతలు, కరవు, వరదలు ఇంకా ఎన్నో రకాలుగా ప్రభావం చూపుతోంది'' అని ఆందోళన వ్యక్తంచేశారు.
ఇవి కూడా చదవండి:
- ఒక సామాన్య మధ్యతరగతి ఇల్లాలిపై ధరల పెరుగుదల ప్రభావం ఎలా ఉంటుంది?
- ఈ దేశంలో వంట నూనె కూడా ‘డ్రగ్స్‌లాగా రహస్యంగా దాచిపెట్టి’ అమ్ముతున్నారు.. ఎందుకంటే..
- ‘ఒక్కసారి నాటితే 60 ఏళ్ల వరకు దిగుబడులు’ - ఖర్జూరం పండిస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతులు
- 50 ఏళ్లుగా స్నానం చేయని మనిషి - స్నానం చేయించిన కొన్నాళ్లకే జబ్బు పడి మృతి
- గ్రహణం సమయంలో ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు? నమ్మకాలేంటి, వాటి శాస్త్రీయత ఎంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















