INDvsPAK: ‘కోహ్లీ మెదడులో ఓ కంప్యూటర్ ఉంటుంది, అది చేజింగ్‌ను ప్లాన్ చేస్తుంది’ -అభిప్రాయం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సి.వెంకటేశ్
- హోదా, బీబీసీ కోసం
టెక్నిక్ పరంగానే కాదు, క్రికెట్‌లోని అన్ని విషయాలలో 'టైమింగ్ ' చాలా ముఖ్యం. విరాట్ కోహ్లీ కెరీర్లో కూడా అలాంటి టైమింగ్ బాగా కుదిరింది. టీ20 ప్రపంచ కప్ సమీపిస్తున్నదనగా ఇటీవలి ఆసియా కప్‌లో మళ్ళీ ఫామ్ అందుకున్నాడు.
అయితే మనకు మునుపటి 'కింగ్ కోహ్లీ' దొరికినట్టేనా అని ఎవరికైనా సందేహాలుంటే అవన్నీ పాకిస్తాన్‌తో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌తో పటాపంచలై పోయాయి. ఈ మ్యాచ్‌లో అతను ఆడినది మామూలు ఇన్నింగ్స్ కాదు, భారత క్రికెట్ చరిత్రలో కపిల్ దేవ్ 175 నాటౌట్ లాంటి కొన్ని మరపురాని ఇన్నింగ్స్ ఉంటాయి, వాటి సరసన ఇది కూడా చేరుతుంది.
కోహ్లీ ఫినిష్ అయిపోయాడు అన్నవాళ్ళకి, ఈ ప్రపంచ కప్ తర్వాత అతన్ని టీ20 ఫార్మాట్ నుంచి తప్పిస్తారని ప్రచారం చేసిన వారికి తన బ్యాట్ తోనే అతను దీటైన సమాధానం చెప్పాడు.
మన బౌలర్లు, ముఖ్యంగా కొత్త కుర్రాడు అర్షదీప్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చెరి మూడు వికెట్లతో పాకిస్తాన్ స్కోరును 159 పరుగులకే కట్టడి చేసి మంచి ఆరంభమే అందించారు. కానీ ఆ ఆనందం ఎక్కువ సేపు నిలబడ లేదు. పాకిస్తాన్ పేసర్ల ధాటికి 31 పరుగులకే మన టీమ్ నాలుగు వికెట్లు పోగొట్టుకుంది. ఆ దశలో చాలా మంది టీవీలు కట్టేసి ఉంటారు. పది ఓవర్లు పూర్తయ్యేసరికి కూడా మన స్కోరు 45 మాత్రమే. మిగతా పది ఓవర్లలో 115 పరుగులు చేస్తేనే గెలుపు సాధ్యమవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆ దశలో విరాట్ కోహ్లీ తప్ప ఇంకెవరూ ఆ లక్ష్యం ఛేదిస్తామని నమ్మి ఉండరు. కానీ ఛేజింగ్ విషయంలో కోహ్లీని మించిన మొనగాడు ప్రపంచ క్రికెట్‌లో మరెవ్వరూ లేరు. రవి శాస్త్రి చెప్పినట్టు కోహ్లీ మెదడులో ఓ కంప్యూటర్ ఉంటుంది. అది ఛేజ్‌ని ప్లాన్ చేస్తుంది. అలాగే సరైన సమయంలో తగిన షాట్లు అతని బ్యాట్ నుంచి జాలువారాయి.
ఇన్నింగ్స్ పన్నెండో ఓవర్లో హార్దిక్ పాండ్యా, కోహ్లీ కలిసి మూడు సిక్సులు కొట్టి మ్యాచ్‌ని మలుపు తిప్పారు. అయినా అప్పటికింకా మిగతా 8 ఓవర్లలో 86 పరుగులు కావాలి. పన్నెండో ఓవర్ తర్వాత పాండ్యాకు టైమింగ్ కుదరలేదు. అతని బ్యాట్ నుంచి ఒక్క బౌండరీ కూడా రాలేదు. స్కోరు వేగం పెంచాల్సిన భారం పూర్తిగా విరాట్ పైనే పడింది.
16, 17 ఓవర్లలో 12 రన్స్ మాత్రమే వచ్చాయి. కానీ కోహ్లీ 18వ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టడంతో 17 రన్స్ వచ్చాయి. అయితే మ్యాచ్ మొత్తనికీ హైలైట్ 19వ ఓవర్లో కోహ్లీ కొట్టిన రెండు సిక్సులు. ఆ ఓవర్ మొదలయ్యే సరికి విజానికి ఇంకా 31 రన్స్ కావాలి. కానీ రవుఫ్ తన మొదటి నాలుగు బంతుల్లో 3 పరుగులే ఇచ్చాడు.
ఇక మ్యాచ్ పోయినట్టేనని అభిమానులు ఉసూరుమన్నారు. కానీ కొహ్లీ బ్యాట్ ఒక మంత్రదండం లాగ మారి ఆఖరి రెండు బాల్స్‌కి రెండు సిక్సులు వచ్చాయి. అది ప్యూర్ మ్యాజిక్! కోహ్లీ తాలూకు కనికట్టు!

ఫొటో సోర్స్, Getty Images
ఇకా ఆఖరి ఓవర్ అమిత నాటకీయంగా సాగింది. మొదటి బాల్‌కి పాండ్యా ఔటయ్యాడు. ఓవర్ నాలుగో బాల్‌కి కొహ్లీ మరో సిక్స్ కొట్టాడు. ఆ ఫుల్‌టాస్ బంతి నడుము కన్నా ఎక్కువ ఎత్తులో రావడంతో నో బాల్‌గా అంపైర్ ప్రకటించాడు.
ఎక్స్‌ట్రాల రూపంలో ఇంకో నాలుగు రన్స్ వచ్చాయి. ఇంకా రెండే రెండు రన్స్ అవసరమైన సమయంలో దినేశ్ కార్తీక్ ఔటయ్యాడు. కానీ చివరి బంతికి అశ్విన్ కూల్‌గా మ్యాచ్ ఫినిష్ చేయగలిగాడు.
మొత్తం మీద వర్షార్పణం అవుతుందనుకున్న ఈ మ్యాచ్, ఓ లాస్ట్ బాల్ థ్రిల్లర్‌గా స్టేడియంలో కూర్చున్న లక్ష మందికి, టీవీలో చూసిన కోట్లాది మందికి ఓ మరపురాని అనుభూతిని మిగిల్చింది.
ఇప్పటికే ప్రపంచ క్రికెట్‌లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌ను మించిన మెగా ఈవెంట్ మరొకటి లేకుండా ఉంది. మరి, ఈ మ్యాచ్ తర్వాత ఆ గ్లామర్ రెట్టింపు అయ్యేలాగుంది.
(రచయిత అభిప్రాయాలు వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- మహిళలపై ఆర్ఎస్ఎస్ వైఖరి మారుతోందా... బీజేపీకి ఓట్ల కోసమే అలా చేస్తున్నారా?
- లంపీ స్కిన్ వ్యాధి సోకిన పశువుల పాలు తాగొచ్చా? ఈ వైరస్ మనుషులకూ సోకుతోందా? దేశంలో ఎందుకిన్ని వదంతులు?
- పాకిస్తాన్లో క్రికెట్‌ను భారత్ వ్యాపార సంస్థలే నడిపిస్తున్నాయా? బీసీసీఐ నిధులు ఇవ్వకపోతే పాక్ క్రికెట్ బోర్డు కూలిపోతుందా?
- దీపావళి టపాసులు అమ్మితే మూడేళ్లు జైలుశిక్ష, టపాసులు కాల్చితే 6 నెలలు జైలు శిక్ష
- లిజ్ ట్రస్: ప్రధాని అయిన 45 రోజులకే ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది, బ్రిటన్ తాజా రాజకీయాలపై తెలుసుకోవాల్సిన 8 పాయింట్లు
- ఇండియా మోస్ట్ వాంటెడ్ పాక్ తీవ్రవాదులను చైనా ఎలా రక్షించిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














