సదర్: హైదరాబాద్‌లో 'దున్నపోతుల పండుగ' ఎందుకు చేస్తారు? 'నాన్-లోకల్' దున్నపోతులపై వివాదం ఎందుకు?

ఫొటో సోర్స్, @airnews_hyd
- రచయిత, పృథ్వీరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో బతుకమ్మ పండుగ వంటి మరో విశిష్టమైన పండుగ సదర్ ఉత్సవం. సదర్ సమ్మేళన్‌గా పిలిచే ఈ పండుగ తెలంగాణకు.. ముఖ్యంగా సికంద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలకు విశిష్టమైన పండుగ. దీపావళి తర్వాతి రోజు, ఆ మరుసటి రోజు యాదవులు ఈ సదర్ పండుగ నిర్వహిస్తారు.
ముఖ్యంగా మూషీరాబాద్‌లో నిర్వహించే 'పెద్ద సదర్' చాలా ప్రఖ్యాతి చెందింది. బలమైన, అందమైన దున్నపోతులను ఈ పండుగలో ప్రదర్శిస్తారు. దున్నపోతులకు పూలదండలు, ముత్యాల మాలలు, పసుపు, కుంకుమలు, పట్టు పరదాలతో అలంకరిస్తారు.
యాదవ సమాజంలోని కుటుంబాలు తమ వద్ద గల దున్నపోతుల్లో మేలైన వాటిని ఈ సదర్ పండుగలో ప్రదర్శనకు తీసుకువస్తారు. ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా యాదవులకు ప్రత్యేకమైన 'దనక్-దన్‌కీ-దన్' అనే డప్పుల దరువుతో దున్నపోతుల చుట్టూ స్టెప్పులు వేస్తూ సంబరాలు చేసుకుంటారు.
దున్నపోతులతో కుస్తీ పడుతూ విన్యాసాలు చేస్తారు. వాటితో వందనం చేయిస్తారు. నాట్యం కూడా చేయిస్తారు. ఇది అతి పెద్ద ఆకర్షణ. ఈ దున్నపోతుల పండుగను వీక్షించటానికి జనం పెద్ద ఎత్తున తరలివస్తారు. వీటి ఠీవిని చూసి, వీటి విన్యాసాలను చూసి అచ్చెరువు చెందుతూ ఆస్వాదిస్తారు.
యాదవ కుల పెద్ద ఉత్తమ దున్నపోతును ఎంపిక చేసి, బహుమతి ప్రకటిస్తారు.

ఫొటో సోర్స్, Deepawalli Yadav Sadar Samelana/FB
సదర్ సమ్మేళన్ చరిత్ర ఏమిటి?
యాదవులను సంఘటితం చేయటానికి న్యాయం చౌదరి సలంద్రి మల్లయ్య యాదవ్ 1956లో ఈ సదర్ ఉత్సవాలకు శ్రీకారం చుట్టినట్లు చెప్తారు. అప్పటి నుంచీ సికింద్రాబాద్‌లోని నారాయణగూడ వైఎంసీఏ చౌరస్తాలో 66 ఏళ్లుగా ప్రతి ఏటా ఈ సదర్ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. చౌదరి సలంద్రి మల్లయ్య యాదవ్ కుటుంబ వారసులు ఈ ఉత్సవంలో ప్రధాన పోషిస్తూనే ఉన్నారు.
అనంతర కాలంలో జంట నగరాల్లోని చాలా ప్రాంతాలకు సదర్ పండుగ విస్తరించింది. ఇప్పుడు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా సదర్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
అయితే నారాయణగూడ, ముషీరాబాద్‌లో నిర్వహించే 'పెద్ద సదర్' అన్నిటికన్నా ప్రముఖమైన సదర్ ఉత్సవంగా సాగుతోంది.
జంట నగరాల్లో నిజాం పాలనా కాలం నుంచీ సదర్ ఉత్సవాలు జరుగుతున్నాయని అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చిట్టబోయిన నందకిషోర్ యాదవ్ చెప్పారు. 1956కు ముందు వరకూ బేగం బజార్‌లో ఉత్తర భారతదేశానికి చెందిన ఆహిర్ యాదవులు ఈ ఉత్సవాన్ని నిర్వహించేవారని, ఆ తర్వాత స్థానికులైన యాదవులు సొంతంగా నారాయణగూడలో సదర్ ఉత్సవాన్ని ప్రారంభించారని ఆయన బీబీసీ ప్రతినిధితో మాట్లాడుతూ వివరించారు.
1956లో తన తండ్రి 'యాదవరత్న' వీరప్ప యాదవ్‌తో పాటు.. నర్సయ్య యాదవ్ తదితర యాదవ పెద్దలు కలిసి న్యాయం చౌదరి సలంద్రి మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో తొలిసారి సదర్ ఉత్సవాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, Suresh Reddy Yenugu/FB
యముడు, కృష్ణుడి పురాణ గాథలు...
'దున్నపోతుల పండుగ' అని కూడా పిలిచే సదర్ సమ్మేళన్‌కు సంబంధించి కొన్ని పురాణ కథలు కూడా ఉన్నాయి. నందకిషోర్ యాదవ్ చెప్పిన త్రేతాయుగ పురాణ గాథ ఇలా ఉంది:
యమధర్మరాజు చెల్లెలు యాయాదేవి. పెళ్లి చేసుకుని అత్తగారి ఇంటికి వెళ్లిన యాయాదేవి, తన ఇంటికి రావాలని అన్న యమధర్మరాజును ఆహ్వానిస్తుంది. కానీ యమలోక నిర్వహణలో తీరికలేని యమధర్మరాజు చెల్లి ఇంటికి వెళ్లలేకపోతాడు.
అయితే.. దీపావళి మరుసటి రోజు వచ్చే యమ ద్వితీయ తిథి రోజున యముడికి విరామం ఉంటుంది. ఆ రోజున యమధర్మరాజు తన చెల్లెలి ఇంటికి వెళతాడు. యముడు తన వాహనమైన దున్నపోతు మీద చెల్లెలి ఇంటికి చేరుకుంటాడు.
యాయాదేవి తన అన్నను ఆహ్వానిస్తూ ముందుగా అతడి వాహనం దున్నపోతుకు పూజలు చేస్తుంది. పసుపు, కుంకుమలతో బొట్టుపెట్టి, పూలు, పట్టు వస్త్రాలతో అలంకరిస్తుంది. అన్నకు పిండివంటలతో భోజనం పెడుతుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
చెల్లెలి ఆతిథ్యానికి సంతృప్తి చెందిన యముడు.. ఆమెను ఏదైనా వరం కోరుకోవాలని చెప్తాడు. అందుకు ఆమె దీపావళి తర్వాతి రోజు అక్కచెల్లెళ్ల ఇళ్లకు వెళ్లే అన్నదమ్ములకు దీర్ఘాయుష్షు ప్రసాదించాలని కోరుకుంటుంది.
ఆ విధంగా దీపావళి తర్వాతి రేజు యాదవులు తమ దున్నపోతులను అలంకరించుకుని మేలతాళాలతో ఊరేగింపుగా అక్కచెల్లెళ్లు, ఆడపడుచుల ఇళ్లకు వెళ్లటం పండుగగా మారింది.
అలాగే శ్రీకృష్ణుడితో ముడిపడిన మరో పురాణ గాథ కూడా చెప్తారు. ఆ కథ ఏమిటంటే:
ద్వాపర యుగంలో ద్వారక ప్రజలు ఇంద్రుడిని పూజించేవారు. కానీ ద్వారకకు శ్రీకృష్ణుడు రావటంతో జనం ఆయనను పూజించటం మొదలుపెట్టారు. ఇది ఓర్వలేని ఇంద్రుడు ప్రకృతి విపత్తులు సృష్టించటంతో ప్రజలు, పశువులు అల్లాడిపోయాయి.
ఆ సమయంలో కృష్ణుడు తన చిటికెన వేలుతో గోవర్ధనగిరిని ఎత్తి దానికింద అందరికీ రక్షణ కల్పించి కాపాడుతాడు. ఆ సందర్భాన్ని ప్రజలు పండుగగా చేసుకుంటారు. యాదవులు తమ జీవనాధారమైన పశువులను పూజిస్తూ ఈ పండుగ చేసుకుంటారు.

ఫొటో సోర్స్, Mandumula Parmeshwar reddy/FB
సదర్ పండుగ ఎలా జరుగుతుంది?
హైదరాబాద్‌కు, తెలంగాణకు ప్రత్యేకమైన సదర్ ఉత్సవాన్ని వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర పండుగగా ప్రకటించటానికి మంత్రి కె.తారక రామారావు అంగీకరించారని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఇటీవల మీడియాకు తెలిపారు.
కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా సదర్ ఉత్సవాలు చిన్నబోయాయి. దీంతో ఈ సంవత్సరం భారీగా నిర్వహిస్తున్నారు. దీపావళి మరుసటి రోజున అంటే.. అక్టోబర్ 26వ తేదీన హైదరబాద్ సహా, తెలంగాణలోని పలు జిల్లాల్లో సదర్ ఉత్సవాలు మొదలయ్యాయి. అక్టోబర్ 27వ తేదీన నారాయణగూడ వైఎంసీఏ దగ్గర పెద్ద సదర్ జరిగింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
పండుగ రోజు తొలుత గోవర్ధన పూజ నిర్వహిస్తారు. అనంతరం.. యాదవ కుటుంబాలు తమ పశువుల్లోని ఉత్తమ దున్నపోతును అలంకరించుకుని డప్పుల దరువుతో ఊరేగింపు తమ ఆడపడుచుల ఇళ్లకు వెళతారు.
''ఆడపడుచులు ఆ దున్నపోతులను పసుపు, కుంకుమలు, పూలు, శాలువాలతో పూజించి...అన్నదమ్ములకు పండుగ భోజనాలు పెట్టి, తోచినంత కట్నకానుకలు ఇస్తారు'' అని నందకిషోర్ యాదవ్ వివరించారు.
ఆ తర్వాత సాయంత్రానికి యాదవ కుటుంబాలు తాము అలంకరించిన దున్నపోతులను ఊరేగింపుగా కులపెద్ద వద్దకు తీసుకు వెళతారు. ఈ సందర్భంగా తమ తమ దున్నపోతుల ప్రత్యేకతలను ప్రదర్శిస్తారు. వాటితో కుస్తీ పట్టటం, సలాం చేయించటం, డప్పుల దరువుకు అనుగుణంగా స్టెప్పులు వేయించటం వంటి విన్యాసాలూ చేయిస్తారు. ఆయన వాటిని పరిశీలించి ఉత్తమ దున్నపోతును నిర్ణయించి, దానికి బహుమతి ప్రకటిస్తారు.

ఫొటో సోర్స్, Yedla Haribabu Yadav
'నాన్-లోకల్' దున్నలపై అసంతృప్తి...
సదర్ సమ్మేళనంలో ఈ ఏడాది దాదాపు 700 నుంచి 800 వరకూ దున్నపోతులను ప్రదర్శనకు వస్తాయని అంచనా. హరియాణా, పంజాబ్ వంటి ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి దున్నపోతులను కూడా ఈ పండుగ కోసం ప్రత్యేకంగా తీసుకురావటం కొన్నేళ్లుగా జరుగుతోంది.
ఇలా 'నాన్-లోకల్' దున్నపోతులకు ప్రాధాన్యం ఇవ్వటం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చే దున్నపోతుల వల్ల 'లోకల్' దున్నపోతలను చిన్నచూపు చూస్తున్నట్లు అవుతోందని నవయువ యాదవ సంఘం ప్రతినిధులు విమర్శించారు.
''సదర్ ఉత్సవాల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవాలని నాన్-లోకల్ దున్నపోతులను తీసుకువచ్చి, వాటి ధర కోట్ల రూపాయలు ఉంటుందని అతిగా ప్రచారం చేస్తున్నారు. ఆ చిత్రమేమిటో చూడాలనే క్రేజ్ జనంలో పెరుగుతోంది. దీనివల్ల లోకల్ దున్నలకు ప్రాధాన్యం క్రమంగా తగ్గిపోతోంది'' అని ఆ సంఘం వ్యాఖ్యానించింది.
ఆధునికీకరణ, అభివృద్ధి కారణంగా హైదరాబాద్ నగరంలో పశువుల పెంపకం, గేదెలు, దున్నలను సాకటం గణనీయంగా తగ్గిపోయిందని, అందువల్ల కొంతమంది ఇతర ప్రాంతాల నుంచి దున్నపోతులను తెచ్చి ప్రదర్శిస్తుంటారని నందకిషోర్ యాదవ్ పేర్కొన్నారు. అయితే అలా ప్రదర్శించే ఇతర ప్రాంతాల గేదెలు ఒకటి, రెండు శాతం మాత్రమే ఉంటాయని చెప్పారు.

ఫొటో సోర్స్, C. Nanda Kishore Yadav
హరియాణా, పంజాబ్ రాష్ట్రాల నుంచి మేలు జాతి ముర్రా గేదెలు, దున్నపోతులను సదర్ ఉత్సవాల్లో ప్రదర్శించటం వల్ల పండుగకు ఆకర్షణతో పాటు.. పశుపోషకులు, రైతుల్లో అవగాహన కూడా పెరుగుతుందని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ బీబీసీతో చెప్పారు.
ఆయన గత కొన్నేళ్లుగా సదర్ ఉత్సవంలో ప్రదర్శిస్తున్న ముర్రాజాతి దున్నలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వాటిలో కొన్ని 'దున్నరాజు'లను హరియాణా నుంచి తెప్పించినట్లు హరిబాబు యాదవ్ తెలిపారు.
''స్థానిక గేదెలు రోజుకు ఒకటిన్నర, రెండు లీటర్ల పాలు ఇస్తాయి. అదే ముర్రా జాతి గేదెలు ఆరు లీటర్లకు పైనే పాలు ఇస్తాయి. ఈ జాతిని ఇక్కడ బ్రీడ్ చేసి పెంపొందించటం వల్ల పాడి పరిశ్రమకు, రైతులకు మేలు జరుగుతుంది. అంతే కానీ స్థానిక దున్నపోతులను తక్కువ చేస్తున్నదేమీ లేదు'' అని ఆయన పేర్కొన్నారు.
ఆధునిక కాలంలో సదర్ ఉత్సవానికి ఆదరణ తగ్గిపోతున్న దశలో తాను తొలుత తెలుగు రాష్ట్రాల్లో మేలైన, ఉత్తమ దున్నపోతులను వెతికి లక్షల రూపాయలు ఖర్చు చేసి కొనితెచ్చి ఈ ఉత్సవంలో ప్రదర్శించేవాడినని ఆయన తెలిపారు. ఆ తర్వాత దేశంలో ఉత్తమ దున్నపోతుల కోసం అన్వేషిస్తూ హరియాణా నుంచి ముర్రా జాతికి చెందిన చాంపియన్ దున్నపోతు 'యువరాజు'ను తెప్పించామని, అది సెన్సేషన్ అయిందని వివరించారు.
''అవి ఏనుగు లాగా బలిష్టంగా లావుగా ఎత్తుగా దృఢంగా ఉంటాయి. వాటి ప్రదర్శనతో సదర్ ఉత్సవం పట్ల క్రేజ్ విపరీతంగా పెరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంకా చాలా మంది కూడా ముర్రా జాతి దున్నపోతులపై ఆసక్తి కనబరచటం మొదలుపెట్టారు. వీటిని చూడటానికి, సదర్ ఉత్సవాలను వీక్షించటానికి వచ్చే జనం వేల నుంచి లక్షలకు పెరిగారు. సదర్ ఉత్సవాలు కూడా హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలూ, మండలాలకూ విస్తరించాయి. అలా మేలే జరిగింది కానీ కీడు జరిగిందేమీ లేదు'' అని హరిబాబు యాదవ్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, @chmallareddyMLA
సదర్ ఫెస్టివల్‌లో క్రేజీ బుల్స్...
ఈసారి సదర్ ఉత్సవాల్లో హరిబాబు యాదవ్ ప్రదర్శిస్తున్న 'శ్రీకృష్ణ' అనే దున్నపోతు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. హరియాణా నుంచి తెచ్చిన ఈ బుల్ 1,800 కిలోల బరువు ఉందని, 7 అడుగుల ఎత్తు, ముక్కు నుంచి తోక వరకు 18 అడుగుల పొడవు ఉందని ఆయన తెలిపారు. ఇది జాతీయ పశుప్రదర్శనల్లో పాతిక సార్లు చాంపియన్‌గా నిలిచినట్లు చెప్పారు. అలాగే పంజాబ్ నుంచి తెప్పించిన కింగ్, ఇంకా భీమ్ వంటి దున్నపోతులను కూడా హరిబాబు ప్రదర్శిస్తున్నారు.
నంద కిషోర్ యాదవ్ ప్రదర్శిస్తున్న 'బాహుబలి' దున్నపోతు ఈసారి సదర్ ఉత్సవంలో మరో ప్రత్యేక ఆకర్షణ. ఈ దున్నపోతును హరియాణా నుంచి తీసుకువచ్చినట్లు చెప్పారు. దీని ధర ఎంత అని అడిగినపుడు.. ''ఈ దున్నపోతును కొనుక్కుంటాం అని అడిగితే దీని యజమాని 'లక్షలు కాదు, కోట్లు ఇచ్చినా దీనిని అమ్మను. నా కొడుకు లాగా సాకుకున్నాను’’ అని చెప్పారు. కొంతమంది ఈ దున్నపోతుల ధర 25 కోట్లు, 30 కోట్లు ఉంటుందని చెప్తున్నారు. అదంతా హైప్ కోసం చెప్తున్న మాటలే. బర్రెలు, దున్నల రేట్లు ఎంత ఉంటాయో అందరికీ తెలుసు'' అని ఆయన బదులిచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఈ దున్నపోతుల నిర్వహణకు రోజుకు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకూ ఖర్చవుతుందని చెప్తున్నారు.
నంద కిశోర్ యాదవ్, హరిబాబు యాదవ్‌లు బీబీసీకి వివరించిన దాని ప్రకారం.. ఈ ప్రత్యేకమైన దున్నపోతులు ఒక్కోదానికి రెండు పూట్ల 5 లీటర్ల చొప్పున పాలు తాగిస్తారు. బాదం, పిస్తా, కాజు, యాపిల్స్, అరటి పండ్లు, ఖర్జూరం, నెయ్యి, బెల్లం ఆహారంగా పెడతారు. రోజూ రెండు లీటర్ల ఆవనూనెతో మసాజ్ చేస్తారు. వాకింగ్ చేయిస్తారు. షాంపూతో స్నానం చేయిస్తారు.
వీటి కోసం ప్రత్యేకమైన గది, పడుకోవటానికి మ్యాట్, గదిలో ఫ్యాన్ వంటి ఏర్పాట్లు కూడా చేస్తారు. ఇంకొందరు కోడిగుడ్లు, వారం వారం ఒక లీటరు మద్యం కూడా ఆహారంలో భాగంగా అందిస్తున్నట్లు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఒక సామాన్య మధ్యతరగతి ఇల్లాలిపై ధరల పెరుగుదల ప్రభావం ఎలా ఉంటుంది?
- విడాకుల సమయంలో భరణం తర్వాత మెయింటెనెన్స్ కూడా చెల్లించాలా? హిందూ వివాహ చట్టం ఏం చెబుతోంది?
- సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుతో అబార్షన్లు, మారిటల్ రేప్‌కు సంబంధించి మహిళల హక్కుల్లో వచ్చిన మార్పులు ఏంటి?
- మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
- ఈ దేశంలో వంట నూనె కూడా ‘డ్రగ్స్‌లాగా రహస్యంగా దాచిపెట్టి’ అమ్ముతున్నారు.. ఎందుకంటే..
- ‘ఒక్కసారి నాటితే 60 ఏళ్ల వరకు దిగుబడులు’ - ఖర్జూరం పండిస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














