Annuity plans: నెల జీతంలాగా స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే మార్గమిది, ఎవరు చేరొచ్చు, తెలుసుకోవాల్సిన విషయాలేంటి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఐవీబీ కార్తికేయ
- హోదా, బీబీసీ కోసం
ఆర్థిక స్వావలంబనకు అనేక అర్థాలు ఉన్నాయి. ఒక పెద్ద మొత్తం, అంటే కనీసం పదేళ్ళ పాటూ మన ఖర్చులను భరించగలిగే మొత్తాన్ని ఏర్పాటు చేసుకుంటే అప్పుడు ఆర్థిక స్వావలంబన సాధించినట్టని కొందరు పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు అంటారు.
ఇంకొందరు మన భవిష్యత్తులో వచ్చే ప్రతీ ఖర్చుకి తగిన మదుపు చేసి సిద్దంగా ఉండటం ఆర్థిక స్వావలంబన అంటారు. మన జీవిత కాలపు ఖర్చులను భరించగలిగే స్థిరమైన ఆదాయ మార్గాలను ప్రస్తుతం మనం చేసే మదుపు ద్వారా నిర్మించుకోవడమే ఆర్థిక స్వావలంబన అని సూత్రీకరిస్తారు మరికొందరు.
వీటిలో ఏది సరైనది, ఏది కాదు అని స్థిరంగా నిర్ణయించలేం. ఎందుకంటే ప్రతి మనిషి ఆలోచనలు, అవసరాలు వేరు వేరుగా ఉంటాయి. నిజానికి పైన చెప్పిన మూడు రకాల ఆర్థిక స్వావలంబన సాధించడానికి అనువైన మదుపు మార్గాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
భవిష్యత్తులో నెల జీతం లేకపోయినా ఒక స్థిరమైన ఆదాయమార్గం కావాలనుకుంటే దానికి ఆన్యుటీ పథకాలు బాగా ఉపయోగపడతాయి. ఆన్యుటీ పథకాల గురించి మరింత వివరంగా తెలుసుకునే ముందు అసలు ఈ పథకాలు ఎందుకు అమలులోకి వచ్చాయో అర్థం చేసుకుందాం.
మ్యూచువల్ ఫండ్స్, టర్మ్ పాలసీల లాగే ఆన్యుటీ పథకాలు కూడా ఇటీవల కాలంలో వచ్చినవే. అయితే, కొన్ని కుటుంబాల జరుగుబాటుకు ప్రభుత్వ ఖజానా నుంచి ఏడాదికి కొంత నిర్దేశించిన మొత్తం ఇవ్వడం అనే సంప్రదాయం రోమన్ చక్రవర్తుల కాలంలోనే ఉండేది.
జీవిత బీమా పేరుతో ఎండోమెంట్ పాలసీలు మాత్రమే అందుబాటులో ఉన్న కాలంలో, వినియోగదారుల అవసరాలకు తగిన మదుపు మార్గం ఇవ్వాలన్న ఆలోచన నుంచి పుట్టినదే ఆన్యుటీ పథకం. పెన్షన్ లేని ఉద్యోగుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటం వల్ల ఆన్యుటీ పథకాలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.
ప్రభుత్వం కూడా నేషనల్ పెన్షన్ స్కీం పేరుతో ఆన్యుటీ పథకాన్ని ఆదాయ పన్ను రాయితీ ఇచ్చి మరీ ప్రోత్సహిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆన్యుటీ పథకం పనితీరు
సాధారణంగా ఆన్యుటీ పథకాలలో ఒక పెద్ద మొత్తం చెల్లించి, ఆ తర్వాత ప్రతీ నెల/త్రైమాసికం/వార్షిక పద్దతిలో వారి జీవిత చరమాంకం వరకూ ఒక నిర్దేశించిన మొత్తాన్ని పొందుతారు. స్థూలంగా ఇదీ ఈ పథకాల పనితీరు.
ఇందులో కొన్ని చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. మనం పెద్ద మొత్తం చెల్లించిన కొన్ని సంవత్సరాల తర్వాత మనకు ఆదాయం మొదలయ్యేలా చూసుకోవచ్చు. ఇంకొన్ని పథకాలలో ప్రతి 3-5 సంవత్సరాలకు వచ్చే ఆదాయం పెరిగేలా చూసుకోవచ్చు. ఇలాంటి పథకాలలో వచ్చే ఆదాయం కొంత ఎక్కువగా ఉంటుంది. మరోవైపు ఒకేసారి పెద్ద మొత్తం కాకుండా ఈఎంఐ తరహాలో కొన్నేళ్ళ పాటూ చెల్లించి, ఆ తర్వాత మనం వెనక్కు తీసుకునే మొత్తం మొదలవుతుంది.
ఫిక్సడ్ డిపాజిట్ vs ఆన్యుటీ పథకం
సాధారణంగా ఆన్యుటీ పథాకలాలో వచ్చే వడ్డీ ఐదేళ్ళ ఫిక్సడ్ డిపాజిట్ మీద వచ్చే వడ్డీకి అటు ఇటుగా ఉంటుంది. కాబట్టి ఈ రెండు మార్గాలలో ఏది మంచిది అనే ప్రశ్న సహజంగా మదుపరులకు వస్తుంది.
ఆన్యుటీ మార్గం ద్వారా మన జీవిత చరమాంకం వరకూ ఆదాయం వస్తుంది. కానీ, ఐదేళ్ళ తర్వాత ఫిక్సడ్ డిపాజిట్ వడ్డీ తగ్గిపోవచ్చు లేదా పెరగవచ్చు. ఆన్యుటీ పథకంలో ఎంతో కొంత జీవిత బీమా కూడా ఉంటుంది. ఆ రకంగా చూస్తే ఆన్యుటీ పథకం పాలసీదారుడికి అదనపు విలువను ఇస్తుంది.
ఇక ద్రవ్యోల్బణం విషయానికి వస్తే అటు ఫిక్సడ్ డిపాజిట్, ఇటు ఆన్యుటీ రెండూ కూడా అంత మంచి పనితీరును చూపించవు. కానీ ప్రతి మూడేళ్ళకు లేదా ఐదేళ్ళకు మనకు వచ్చే ఆన్యుటీ పెరిగే పథకంలో చేరడం ద్వారా ద్రవ్యోల్బణం నుంచి కొంత వరకూ ఉపశమనం పొందవచ్చు. ఫిక్సడ్ డిపాజిట్లో ఆ అవకాశం లేదు.
అలాగే ఆదాయపు పన్ను విషయంలో కూడా ఫిక్సడ్ డిపాజిట్, ఆన్యుటీ పథకాలకు పెద్ద తేడా లేదు. రెండు పథకాలలో వచ్చే ఆదాయం.. ఆదాయపు పన్ను నియమాలకు లోబడే ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆన్యుటీ పథకాల వల్ల ఉపయోగాలు
1. పెన్షన్కు తగిన ప్రత్యామ్నాయం
పెన్షన్ సదుపాయం లేని వారికి అలాంటి అవకాశం కల్పించడం ఆన్యుటీ ప్రధాన ఉద్దేశ్యం. భారతీయ స్టేట్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లాంటి సంస్థల నుంచి ఆన్యుటీ పథకం తీసుకుంటే మనకు వచ్చే ఆదాయానికి ఎలాంటి ఢోకా ఉండదన్న భరోసా ఉంటుంది.
2. ఎలాంటి రిస్క్ లేని ఆదాయం
రిటైర్మెంట్ జీవనానికి సంబంధించిన ఆర్థిక లక్ష్యాలలో ఎలాంటి రిస్క్ ఉండకూడదు. ఎందుకంటే ఆ సమయంలో అటు పని చేసే అవకాశం, ఏదైనా లోన్ తీసుకునే సౌలభ్యం రెండూ తక్కువగానే ఉంటాయి. కాబట్టి ఎలాంటి రిస్క్ లేని ఆన్యుటీ పథకం రిటైర్మెంట్ లక్ష్యాలకు సరిగ్గా సరిపోతుంది.
3. మదుపు పరిమితి
రిటైమెంట్ సమయంలో వాడే పోస్ట్ ఆఫీస్ నెలవారి ఆదాయ పథకం, వయోజన మదుపు పథకాలకు మదుపు పరిమితి ఉంది. పోస్ట్ ఆఫీస్ నెలవారి ఆదాయ పథకంలో కేవలం నాలగున్నర లక్షలు మాత్రమే మదుపు చేయగలం. అలాగే, వయోజన మదుపు పథకంలో పదిహేను లక్షలు మాత్రమే మదుపు చేయగలం.
ఆన్యుటీ పథకాలలో ఎలాంటి పరిమితీ లేదు. అంటే ఎంత పెద్ద మొత్తమైనా ఆన్యుటీ పథకాలలో మదుపు చేయవచ్చు.
4. వయసు పరిమితి
చాలా రిటైర్మెంట్ పథకాలలో వయసు పరిమితి కొంత తక్కువగానే ఉంటుంది. కానీ ఆన్యుటీ పథకాలలో డెబ్బై ఐదు సంవత్సరాల దాకా పాల్గొనే అవకాశం ఉంది. ఆన్యుటీ పథకాలు ప్రాచుర్యం పొందటానికి ఇది కూడా ఒక కారణం.
పైన చెప్పిన అవకాశాలు ఉన్నా, ఆన్యుటీలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అవేమిటో ఒకసారి చూద్దాం.
ఆన్యుటీ పథకాల పరిమితులు
1. ఎమెర్జెన్సీ అవసరాలు
ఒక పెద్ద మొత్తాన్ని ఆన్యుటీ కోసం ఇవ్వడం ద్వారా ఏదైనా అనుకోని అత్యవసర పరిస్థితి వస్తే, అప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే తగినంత ఆరోగ్య బీమా, జీవిత బీమా ఉన్నవారు మాత్రమే ఆన్యుటీ పథకాలలో మదుపు చేయడం మంచిదని చెప్పవచ్చు.
2. వార్షిక వడ్డీ
ఆన్యుటీ పథకాలలో వడ్డీ వార్షిక వడ్డీ మాత్రమే. కానీ వయోజన మదుపు పథకం లాంటి పథకాలలో ప్రతి త్రైమాసికానికి వడ్డీ చెల్లిస్తారు. ఇది చిన్న విషయం లాగానే అనిపించినా, ఒక ఇరవైయేళ్ళ కాలవ్యవధిలో చాలా పెద్ద వ్యత్యాసం అవుతుంది.
3. మధ్యలో వైదొలిగే అవకాశం
ఆన్యుటీ పథకాలలో మధ్యలో వైదొలిగడం చాలా కష్టం. ఇతర పథకాలలో ఎంతో కొంత పెనాల్టీ కట్టడం ద్వారా పాలసీ నుంచీ బయటకు రావచ్చు కానీ, ఆన్యుటీ పథకాలలో ఆ అవకాశం లేదు.
ఆన్యుటీ పథకాలు - రిటైర్మెంట్ ప్లాన్
ఇప్పుడు ఆన్యుటీ ఆధారిత రిటైర్మెంట్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం.
1. తగినంత ఆరోగ్య బీమా, జీవిత బీమా ఉండాలి.
2. తగినంత అత్యవసర నిధి ఉండేలా చూసుకోవాలి. అత్యవసర నిధి ఎంత ఉండాలి అనే ప్రశ్నకు సమాధానంగా ఎన్నో సూత్రాలు ఉన్నాయి. కానీ కనీసం మూడేళ్ళ ఖర్చులకు తగినంత ఉండాలనేది అందరు ఆమోదించే సూత్రం.
3. ఆన్యుటీ పథకంలో వచ్చే ఆదాయానికి పన్ను కట్టాలనే విషయం మర్చిపోకూడదు. అందుబాటులో ఉన్న అంత మొత్తం ఆన్యుటిలో మదుపు చేయకుండా, సెక్షన్ 80సీ ద్వారా లభించే ఆదాయపు పన్ను మినహాయింపు కోసం ఉపయోగించుకోవాలి.
4. అలాగే ఆదాయపు పన్ను మినహాయింపు ఉన్న ఎన్.పి.ఎస్. ద్వారా మదుపు చేసే అవకాశం ఉందేమో చూసుకోవాలి.
ఇవి కూడా చదవండి:
- సదర్: తెలంగాణకు విశిష్టమైన 'దున్నపోతుల పండుగ' ప్రత్యేకత ఏంటి, ఇందులో 'నాన్-లోకల్' దున్నపోతులపై వివాదం ఎందుకు
- కిమ్ జోంగ్ ఉన్: దీపావళి టపాకాయల్లా మిసైళ్లను పేలుస్తున్న ఉత్తరకొరియా అధినేత, అసలు లక్ష్యం ఏంటి?
- పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భారతీయుల ప్రాణాలు హరిస్తున్నాయా, లాన్సెట్ నివేదికలో ఏముంది?
- ఎవరు కొంటున్నారో, ఎవరు అమ్ముడుపోతున్నారో-తెలంగాణ ఫిరాయింపుల్లో మునుగోడు చాప్టర్
- రిషి సునక్‌ను అభినందించడం, సోనియా గాంధీని వ్యతిరేకించడం.. బీజేపీ ద్వంద్వ వైఖరి కాదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














