కిమ్ జోంగ్ ఉన్: దీపావళి టపాకాయల్లా మిసైళ్లను పేలుస్తున్న ఉత్తరకొరియా అధినేత, అసలు లక్ష్యం ఏంటి?

ఫొటో సోర్స్, KCNA
- రచయిత, జీన్ మెకంజీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
కొరియా ద్వీపకల్పంలో ప్రస్తుతం పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది.
ఈ ప్రాంతంలో అనిశ్చితి ఏర్పడి అయిదేళ్లు అవుతోంది. పరిస్థితులు మరింత దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పోయిన నెల జపాన్ మీదుగా మిసైల్‌ను ప్రయోగించింది ఉత్తర కొరియా. దాంతో జపాన్‌లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. అది ఒక రకంగా రెచ్చగొట్టే చర్య.
ఎన్నో బాలిస్టిక్ మిసైల్స్‌ను ఉత్తర కొరియా ప్రయోగించింది. దక్షిణ కొరియా సరిహద్దుల్లో యుద్ధవిమానాలను తిప్పింది. 2018లో శాంతి కోసం ఏర్పాటు చేసుకున్న మిలిటరీ బఫర్ జోన్‌లో కూడా ఉత్తర కొరియా పేల్చిన ఫిరంగి తూటాలు పడ్డాయి.
సాంకేతికంగా చూస్తే ఇప్పటికీ దక్షిణ, ఉత్తర కొరియాలు ఇంకా యుద్ధంలోనే ఉన్నాయి.
సోమవారం ఉత్తర కొరియాకు చెందిన వాణిజ్య నౌక ఒకటి దక్షిణ కొరియా సముద్ర జలాల్లోకి వచ్చింది. దాంతో దక్షిణ కొరియాతో పాటు అటు నుంచి కూడా హెచ్చరికగా కాల్పులు జరిపారు. కానీ కావాలనే తమ జలాల్లోకి నౌక వచ్చిందని దక్షిణ కొరియా అంటోంది.
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, మిసైల్స్ లాంచ్ చేయడం వెనుక కొన్ని ప్రధాన కారణాలున్నాయి.
మిసైల్ టెక్నాలజీని పరీక్షించడం, దాన్ని అభివృద్ధి చేయడం ఒక కారణమైతే, ప్రపంచానికి ముఖ్యంగా అమెరికాకు తమ శక్తి ఏమిటో చాటి చెప్పడం మరొక కారణం.
ఇక తమ దేశ ప్రజలను ఆకట్టుకుని, వారు కిమ్‌కు విధేయులుగా ఉండేలా చూసుకోవడం కూడా ఇందులో భాగమే.

ఫొటో సోర్స్, Reuters
ఈ సారి గమనించాల్సిన విషయం ఏంటంటే ఉత్తర కొరియా బాహటంగానే చెప్పుకుంటోంది. జపాన్, అమెరికా, దక్షిణ కొరియాల ఉమ్మడి సైనిక విన్యాసాలకు వ్యతిరేకంగా ఇటీవల చాలా సార్లు మిసైల్స్‌ను లాంచ్ చేసినట్లు ఉత్తర కొరియా ప్రభుత్వ టీవీ చానెల్ రిపోర్ట్ చేసింది.
అనవసరంగా తమను రెచ్చగొట్టి ఉద్రిక్తతలు పెంచుతున్నారంటూ ఉత్తర కొరియా ఆరోపించింది. అందుకు బదులుగానే మిసైల్స్ లాంచ్ చేసినట్లు చెబుతోంది.
గత రెండు నెలలుగా అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ ఉమ్మడిగా విడివిడిగా సైనిక విన్యాసాలు చేపడుతున్నాయి. ఉత్తర కొరియా అణుదాడికి పాల్పడితే ఎదుర్కోవడానికి తాము సిద్ధంగానే ఉన్నామనేందుకు ఈ సైనిక విన్యాసాలు.
సైనిక విన్యాసాలను తమ దేశం మీదకు దాడిగా చూసే కిమ్... అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ చర్యలను మరింత అనుమానంగా చూస్తున్నారు. ఇతర దేశాల దాడులను ఎదుర్కొనే ప్రధాన కారణంతోనే అణ్వాయుధాలను కిమ్ అభివృద్ధి చేస్తున్నారు.
అయితే ఇప్పుడు మరింత దూకుడు చర్యకు కిమ్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అణ్వాయుధాలను పేల్చడం లేదా దక్షిణ కొరియా మీద చిన్నపాటి దాడి చేయడం వంటివి చేస్తారని కొందరు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, KCNA
తాము కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఆయుధాల కోసం 5 సంవత్సరాల ప్రణాళికను పోయిన ఏడాది కిమ్ ప్రకటించారు. చిన్నపాటి అణు బాంబులు, షార్ట్ రేంజ్ మిసైల్స్ వంటివి వాటిలో ఉన్నాయి. ఇటీవల చోటు చేసుకుంటున్న ఆయుధాల పరీక్షలను చూస్తే, ఆయుధాల తయారీలో కిమ్ ముందుకు వెళ్లడమే కాదు వాటిని ఎలా వాడాలో సైనికులకు శిక్షణ కూడా ఇస్తున్నట్లు కనపడుతోంది.
ఇటీవల చేపట్టిన పరీక్షల్లో దక్షిణ కొరియా మీద వర్చువల్ అణుదాడి చేసినట్లు కూడా కిమ్ ప్రకటించారు.
ప్రపంచం తన వైపు చూడాలని కిమ్ కోరుకుంటున్నారు. తాను సాధించిన ప్రగతిని వారు చూడాలని, తద్వారా ఏదో ఒక రోజు తమ మీద విధించిన కఠిన ఆర్థిక ఆంక్షలను తొలగి పోతాయని భావిస్తున్నారు. ఆర్థిక ఆంక్షలు ఉన్నప్పటికీ ఆయుధాలను తయారు చేయడంలో ఉత్తర కొరియా ఏ మాత్రం తగ్గలేదు. కానీ ఇది ఆ దేశ ఆర్థికవ్యవస్థను దెబ్బతీస్తోంది.
యుక్రెయిన్, రష్యా యుద్ధంతో ఉత్తర కొరియా మీద ఆర్థిక ఆంక్షలు తొలగించేందుకు ఉద్దేశించిన చర్చలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ప్రపంచమంతా యుక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం, పెరుగుతున్న చైనా ఆధిపత్యం మీదనే దృష్టి కేంద్రీకరించింది.
అణ్వాయుధాలు మొత్తం ధ్వంసం చేసేందుకు అంగీకరిస్తేనే ఉత్తర కొరియా మీద ఆంక్షలు సడలిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంటున్నారు.
ఇదే సమయంలో సైనిక విన్యాసాల ద్వారా కొరియా ద్వీపకల్పంలో తమ రక్షణను మరింత పెంచుకునేందుకు దక్షిణ కొరియా, అమెరికా కలిసి పని చేస్తున్నాయి. దీన్ని ఉత్తర కొరియా ఇష్టపడటం లేదు. ప్రతీకారంగా మిసైల్స్ ప్రయోగిస్తోంది. ఇటీవల ఉత్తర కొరియా మిసైల్స్ లాంచ్ చేయడానికి సమాధానంగా యుద్ధ విమానాలను పంపింది దక్షిణ కొరియా.

ఫొటో సోర్స్, Reuters
ప్రస్తుతం ఉత్తర కొరియా వ్యవహరిస్తున్న తీరు మీద దక్షిణ కొరియా రక్షణ శాఖలో పని చేసిన మాజీ సలహాదారు కిమ్ జోంగ్ డే ఆందోళన వ్యక్తం చేశారు.
'‘గతంలో అమెరికా సైనిక విన్యాసాలు పూర్తి అయ్యే వరకు ఆగి, ఆ తరువాత ఉత్తర కొరియా ఆయుధాలు ప్రయోగించేది. కానీ ఇప్పుడు అమెరికా సైనిక విన్యాసాలు జరుగుతున్నప్పుడే అది ఆయుధాలు ప్రయోగిస్తోంది.
గతంలో ఇంత దూకుడు కనిపించేది కాదు. కానీ ఇప్పుడు అంతా భిన్నంగా ఉంది. అణ్వాయుధాలు ఉన్న దేశంగా అది ప్రవర్తిస్తోంది’’ అని ఆయన అన్నారు.
ఏడో అణ్వాయుధ పరీక్ష కోసం ఉత్తర కొరియా అంతా సిద్ధం చేసిందని అమెరికా, దక్షిణ కొరియా భావిస్తున్నాయి. అయితే పరీక్ష చేపట్టడానికి సరైన సమయం కోసం అది ఎదురు చూస్తోంది. చైనాలో కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు ముగిశాయి. అమెరికాలో మిడ్ టర్మ్ ఎన్నికలు వస్తున్నాయి. బహుశా ఇది ఉత్తర కొరియాకు సరైన సమయం కావొచ్చు.
ఇవి కూడా చదవండి:
- మునుగోడు: మద్యం, డబ్బు ఏరులై పారుతోన్న ఈ నియోజకవర్గంలో... ఏళ్లుగా నీళ్లు రావడం లేదెందుకు?
- పరోటాకు, రోటీకి, వేర్వేరు జీఎస్టీ ఎందుకు, పార్లర్ ఐస్‌క్రీమ్‌కు, హోటల్ ఐస్‌క్రీమ్‌కు తేడా ఏంటి?
- ‘‘నేను గర్భవతిని, వానొస్తే గుడిసెలోకి నీళ్లొస్తాయి. పాములు తేళ్లు కూడా లోపలికి వస్తుంటాయి.''-బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి? దీపావళి సమయంలో దీనికి ఎందుకు గిరాకీ పెరుగుతుంది?
- వీర్యం శరీరంపై పడితే అలర్జీ వస్తుందా, ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













