చర్చిలో స్నేహం చేసింది.. ఆస్తి కోసం ఆమెను చంపి తల, మొండెం వేరుచేసి దూరంగా పడేసింది

ఫొటో సోర్స్, MET POLICE
- రచయిత, హెలెనా విల్కిన్‌సన్, జెరెమీ బ్రిటన్
- హోదా, బీబీసీ న్యూస్
ఒక మహిళ తన స్నేహితురాలిని చంపి, ఆమె తలను కోసేసి, సూట్‌కేస్‌లో ఆ మృతదేహాన్ని పెట్టి రెండు వారాల తరువాత ఎక్కడో 300 కిలొమీటర్ల దూరంలోని అటవీప్రాంతంలో ఎందుకు పడేయాల్సి వచ్చింది.
కారణం... దురాశ.
అవును, జెమ్మా మిషెల్‌కు దురాశ విపరీతంగా పెరగడమే ఈ దారుణానికి కారణం. ఈ దురాశే చివరికి ఆమెను హంతకురాలిని చేసింది, 34 ఏళ్ల జైలు శిక్ష పడేలా చేసింది.
''మిషెల్ ఏమాత్రం కనికరం లేని హంతకురాలు. డబ్బు కోసం ఆమె తన స్నేహితురాలిని దారుణంగా చంపడానికి తెగించింది. ఈ కేసులోని కఠోర నిజాలు వింటే ఆశ్చర్యం కలిగిస్తాయి' అని లండన్ మెట్రోపాలిటిన్ పోలీస్ విభాగానికి చెందిన ఇన్‌స్పెక్టర్ జిమ్ ఈస్ట్‌వుడ్ చెప్పారు.
ఒక చర్చిలో ఇద్దరి మధ్య మొదలైన స్నేహం చివరికి అందులో ఒకరు దారుణంగా చనిపోవడం, ఇంకొకరు కటాకటాల వెనక్కు వెళ్లడంతో ముగిసింది.

ఫొటో సోర్స్, Chong family
బ్రిటన్‌లోని డెవాన్‌లో ఉన్న సాగర తీర పట్టణం సాల్కంబ్‌లో దట్టమైన చెట్ల మధ్య తలలేని మొండెం కనిపించింది.
మలేసియాలో జన్మించిన 'మీ కుయెన్ చెంగ్' అనే మహిళ అప్పటికి 16 రోజులుగా కనిపించడం లేదు. ఆమెను డెబోరా అని కూడా పిలుస్తారు.
సాల్కంబ్‌లో కనిపించిన మెండెం 67 ఏళ్ల డెబోరాదే.

ఫొటో సోర్స్, Chong family
డెబోరా మొండెం దొరికిన ప్రాంతం వాయువ్య లండన్‌లోని ఆమె ఇంటికి 300 కిలోమీటర్ల దూరంలో ఉంది.
అక్కడికి కొన్ని రోజుల తరువాత ఆమె తల కూడా అక్కడికి సమీపంలోనే దోరికింది.
ఏడాది తరువాత ఓల్డ్ బెయిలీలోని కోర్టులో ఓ హత్య కేసు విచారణలో భయంకరమైన నిజాలు వెలుగుచూశాయి.
12 నంబర్ కోర్టు గదిలో క్రిమినల్ లాయర్ డీనా హీర్ ఈ వివరాలు వెల్లడించారు.
''డెబోరాపై జెమ్మా మిషెల్ దాడి చేసి చంపి.. మృతదేహాన్ని పెద్ద నీలంరంగు సూట్ కేసులో పెట్టి సాల్కంబ్‌కు తరలించింది. అక్కడ ఆమె దాన్ని పడేసి వచ్చేందుకు ప్రయత్నించారు'' అని డీనా హీర్ తెలిపారు.
రెండు వారాల పాటు సాగిన ఈ విచారణను మిషెల్ కోర్టు గదిలోని గ్లాస్ డాక్ నుంచి వినగా... డెబోరా కుటుంబసభ్యులు మలేసియా నుంచి వీడియో లింక్‌లో చూశారు.
'డబ్బుపై ఆశతోనే మ జెమ్మా మిషెల్ ఈ హత్య చేసినట్లు స్పష్టమవుతోంది' అని హీర్ తన వాదన వినిపించారు.

ఫొటో సోర్స్, Julia Quenzler
జెమ్మా మిషెల్‌ది సంపన్న నేపథ్యం. ఆమెదంతా ప్రైవేట్ విద్యాభ్యాసమే. విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయంలో ఆమె తల్లి పనిచేసేవారు.
మిషెల్‌కు తాను జన్మించిన ఆస్ట్రేలియాలో సొంత ఆస్తులుండడంతో పాటు లండన్‌లోనూ సొంతిల్లు ఉంది.
మిషెల్ ఇంటి విలువ 40 లక్షల పౌండ్ల(సుమారు రూ. 40 కోట్లు) విలువ చేస్తుందని డెబోరా భావించారు. డెబోరా నుంచి మిషెల్ మధ్య మెసేజ్‌లను బట్టి ఈ విషయం అర్థమవుతోంది.
అయితే, మిషెల్ ఇంటికి చాలా మరమ్మతులు అవసరం.
అందుకోసం ఆమెకు 2 లక్షల పౌండ్లు (సుమారు రూ. 2 కోట్లు) ఇవ్వడానికి డెబోరా ముందుకొచ్చారు. కానీ, అంతలోనే ఎందుకో మళ్లీ వెనక్కుతగ్గారు.
ఆ తరువాత డెబోరా కనిపించకుండాపోయారు.
ఈ ఇద్దరు మహిళలూ క్రైస్తవమతాన్ని బాగా విశ్వసిస్తామని చెబుతుంటారు. 2020 ఆగస్ట్ ప్రాంతంలో వీరిద్దరికి ఒక చర్చిలో పరిచయమైంది.
జెమ్మా మిషెల్ 'క్రిస్టియన్ కనెక్షన్స్' అనే డేటింగ్ సైట్ వాడుతుండేవారు. డెబోరా కూడా నిత్యం ఆన్‌లైన్‌లో ఉంటూ ప్రార్థనాసందేశాలు పోస్ట్ చేస్తుండేవారు.

ఫొటో సోర్స్, Jonathan Goldberg
డెబోరా మానసిక సమస్యలతో బాధపడుతుండే బలహీనమైన మహిళ కాగా జెమ్మా మిషెల్‌కు ఆస్టియోపతీలో డిగ్రీ ఉంది. ఆస్టియోపతీ అంటే కండరాళ్లు, కీళ్లను కదుపుతూ ఆరోగ్య సమస్యలు పరిష్కరించే ఒక విధానం.
డెబోరాకు ఆరోగ్య సలహాలు ఇవ్వడంతో పాటు ఆధ్యాత్మిక మార్గాలలో ఉపశమనం కలిగించే ప్రయత్నాలు చేస్తుండేవారు జెమ్మా.
డెబోరాది చాలా ఉదార స్వభావం. అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం ఆమె నైజం.
ఇలా జెమ్మా, డెబోరా మధ్య స్నేహం కుదిరింది.

ఫొటో సోర్స్, PA Media
అయితే, డెబోరా కనిపించకుండాపోవడం, ఆమె మొండెం, తల దొరకడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. సీసీ టీవీ కెమేరాల ఫుటేజ్ పరిశీలించారు. దాంతో ఒక్కో విషయం బయటపడడం మొదలైంది.
డెబోరా హత్యలో జెమ్మా హస్తం ఉన్నట్లు తొలుత ఆధారాలు దొరికాయని ఇన్‌స్పెక్టర్ ఈస్ట్‌వుడ్ చెప్పారు.
డెబోరా కనిపించకుండా పోయిన రోజున ఆమె ఇంటికి జెమ్మా వచ్చి వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజ్ దొరికింది.
అంతేకాదు, ఆ తరువాత డెబోరా మృతదేహం దొరికిన పట్టణానికీ జెమ్మా వెళ్లినట్లు ఆధారాలు దొరికాయని ఈస్ట్‌వుడ్ చెప్పారు.
అనంతరం మృతదేహాన్ని తరలించిన నీలం రంగు సూట్‌కేసునూ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
అలాగే డెబోరా మృతదేహాన్ని తరలించే సమయంలో జెమ్మా తన ఫోన్‌ను ఇంట్లోనే ఉంచేసి గతంలో మరణించిన తన పొరుగింటివారి ఫోన్‌ను యాక్టివేట్ చేసి తనతో తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

ఫొటో సోర్స్, PA Media
డెబోరాను జెమ్మా ఎందుకు చంపినట్లు?
'డెబోరా ఎస్టేట్‌లో తనకూ వాటా రాసినట్లు జెమ్మా సృష్టించిన వీలునామాలను మేం గుర్తించాం'' అని ఈస్ట్ వుడ్ చెప్పారు.
అలాగే, జూన్ 11న డెబోరా ఇంటి నుంచి ఆమె ఆస్తులకు సంబంధించిన మరికొన్ని పత్రాలనూ జెమ్మా తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
వీటన్నిటి ఆధారంగా... డెబోరా ఆస్తిని అక్రమంగా తనపరం చేసుకోవానికి జెమ్మా పన్నాగం పన్నినట్లు జ్యూరీ ఎదుట లాయర్ హీర్ వాదించారు.
మరోవైపు పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఈస్ట్‌వుడ్ కూడా కేసు ఛేదించిన విధానాన్ని మరింత విపులంగా వెల్లడించారు.
నీలంరంగులోని భారీ సూట్‌కేస్‌ను జెమ్మా ఈడ్చుకుంటూ డెబోరా ఇంటికి తీసుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించడంతో దాని ఆధారంగా దర్యాప్తు చేసినట్లు చెప్పారు.
డెబోరాను చంపి అందులో ఆమెను కుక్కేయాలనే ప్లాన్‌తోనే జెమ్మా ఆ సూట్‌కేసును అక్కడికి తీసుకెళ్లారని లాయర్ అన్నారు.
డెబోరా ఇంటి నుంచి జెమ్మా తిరిగి వస్తున్నప్పుడు ఆమె చేతిలోని సూట్‌కేసు బరువుగా ఉన్నట్లు కనిపించిందని, ఆమె దాన్ని భారంగా ఈడ్చుకొచ్చినట్లు కనిపించిందని పోలీసులు, లాయర్ కోర్టు ఎదుట చెప్పారు.

ఫొటో సోర్స్, PA Media
''అక్కడికి రెండు వారాల తరువాత తమ పొరుగింటివారి ఫోన్ నంబరును తప్పుడు పేరుతో రీయాక్టివేట్ చేశారు జెమ్మా. ఒక కారు అద్దెకు తీసుకుని అందులో నీలంరంగు సూట్‌కేసు పెట్టి తానే డ్రైవ్ చేసుకుంటూ సాల్కంబ్ వెళ్లారు.
డెబోరా ఇంటికి సూట్‌కేస్ తీసుకెళ్లడం నుంచి ... చనిపోయిన పొరుగింటివారి ఫోన్ నంబర్ తప్పుడు పేరుతో రీయాక్టివేట్ చేసుకోవడం వరకు జెమ్మా అంతా కుట్రపూరితంగా ప్రణాళిక ప్రకారం చేశారు'' అని ఈస్ట్‌వుడ్ చెప్పారు.
అయితే, సాల్కంబ్ వెళ్లే దారిలో కారు టైర్ పేలిపోయింది. టైర్ బాగుచేసిన మెకానిక్ కారు నుంచి ఏదో దుర్వాసన వస్తున్నట్లు గుర్తించడంతో పాటు జెమ్మా ప్రవర్తన కూడా కంగారుగా ఉన్నట్లు గమనించారు.
పాడైన చక్రాన్ని లగేజ్ స్పేస్‌లో ఉంచేందుకు ప్రయత్నించగా జెమ్మా కంగారుపడి దాన్ని వెనుక సీట్లో ఉంచాలని సూచించడం కూడా మెకానిక్‌ను ఆశ్చర్యపరిచింది.
2021 జులై 6నే అరెస్టైనా జెమ్మా ఈ కేసు విచారణలో ఏమాత్రం నోరు విప్పలేదు. ఆధారలివ్వడానికి అంగీకరించలేదు.
ఈ హత్య కేసులో జెమ్మాను దోషిగా తేల్చిన కోర్టు అక్టోబరు 28న శిక్ష ఖరారు చేసింది.
34 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
ఇవి కూడా చదవండి:
- అయోధ్యలో రామ మందిరం నిర్మాణం, ధన్నీపూర్‌లో మసీదు నిర్మాణం ఎంతవరకు వచ్చాయంటే... గ్రౌండ్ రిపోర్ట్
- ముస్లింలు మెజారిటీగా ఉన్న ఈ దేశంలో కరెన్సీ నోట్ల మీద వినాయకుని బొమ్మ ఎందుకు ఉంది?
- అశ్లీల చాటింగ్‌ల వెనుక రహస్య సంధానకర్తలు..‘మీతో మాట్లాడేది మోడలా, మూడో మనిషా?’
- పరోటాకు, రోటీకి, వేర్వేరు జీఎస్టీ ఎందుకు, పార్లర్ ఐస్‌క్రీమ్‌కు, హోటల్ ఐస్‌క్రీమ్‌కు తేడా ఏంటి?
- కరెన్సీ నోట్ల మీద లక్ష్మీ దేవి, వినాయకుడి బొమ్మలు ముద్రించడం సాధ్యమేనా, కేజ్రీవాల్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఏమంటున్నారు
- ‘‘నేను గర్భవతిని, వానొస్తే గుడిసెలోకి నీళ్లొస్తాయి. పాములు తేళ్లు కూడా లోపలికి వస్తుంటాయి.''-బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














