న్యూజీలాండ్: కన్నబిడ్డలను చంపి సూట్ కేసులో పెట్టి, ఐదేళ్లు తప్పించుకు తిరిగి చివరికిలా...

వారాల పాటు గాలించిన తర్వాత దక్షిణ కొరియాలోని ఉల్సన్ నగరంలో మహిళను అరెస్ట్ చేశారు

ఫొటో సోర్స్, YONHAP/EPA

ఫొటో క్యాప్షన్, వారాల పాటు గాలించిన తర్వాత దక్షిణ కొరియాలోని ఉల్సన్ నగరంలో మహిళను అరెస్ట్ చేశారు
    • రచయిత, ఫ్రాన్సెస్ మావో
    • హోదా, బీబీసీ న్యూస్

న్యూజీలాండ్‌లో సూట్‌కేసుల్లో విగతజీవులుగా దొరికిన ఇద్దరు చిన్నారుల హత్య కేసులో ఒక మహిళను అరెస్ట్ చేసినట్లు దక్షిణ కొరియా పోలీసులు చెప్పారు. కన్నబిడ్డలనే హత్య చేశారనే ఆరోపణలతో ఆమెను అరెస్ట్ చేశారు.

న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్‌లో గత నెలలో సూట్ కేసుల్లో ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యం అయ్యాయి.

ఆక్లాండ్‌కు చెందిన ఒక కుటుంబం, ఒక స్టోరేజ్ యూనిట్‌లోని సూట్‌కేసులను వేలంలో కొనుగోలు చేసింది. వాటిని తెరిచి చూడగా అందులో మానవ అవశేషాలు ఉన్నట్లు ఆ కుటుంబం కనుగొంది. ఈ కేసు, న్యూజీలాండ్‌లో సంచలనం సృష్టించింది.

కొన్నేళ్లుగా ఆ మృతదేహాలు సూట్‌కేసుల్లోనే ఉన్నట్లుగా భావిస్తున్నారు.

అందులో ఒకరి వయస్సు 7 ఏళ్లు, మరొకరి వయస్సు 10 ఏళ్లు ఉండొచ్చని కొరియన్ పోలీసులు చెప్పారు.

ఆ మహిళను తమకు అప్పగించాలని కోరుతూ దక్షిణ కొరియాకు, న్యూజీలాండ్ దరఖాస్తు చేసింది.

ఆక్లాండ్‌లో గత నెలలో పిల్లల మృతదేహాలు లభ్యమైన ఇంటి బయట ఫోరెన్సిక్ నిపుణులు

ఫొటో సోర్స్, TVNZ/REUTERS

ఫొటో క్యాప్షన్, ఆక్లాండ్‌లో గత నెలలో పిల్లల మృతదేహాలు లభ్యమైన ఇంటి బయట ఫోరెన్సిక్ నిపుణులు

నిందితురాలు దక్షిణ కొరియాలో ఉన్నట్లు గత నెలలోనే తమకు తెలిసిందని, అప్పటి నుంచి దక్షిణ కొరియా పోలీసు అధికారులతో కలిసి ఆమె కోసం గాలింపు చేపట్టినట్లు ఆక్లాండ్ పోలీసులు తెలిపారు.

పిల్లల మరణాల తర్వాత 2018లో ఆమె పారిపోయి దక్షిణ కొరియాకు వచ్చినట్లు దక్షిణ కొరియా పోలీసులు వెల్లడించారు. ఆమె వయస్సు 42 ఏళ్లు ఉంటుందని తెలిపారు. కొరియా సంతతికి చెందిన న్యూజీలాండ్ జాతీయురాలు అని వారు చెప్పారు.

ఆమె అరెస్ట్ కోసం గ్లోబల్ ఇంటర్‌పోల్ వారెంట్ జారీ చేశారు.

సూట్‌కేసులు (ఫైల్ ఫొటో)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సూట్‌కేసులు (ఫైల్ ఫొటో)

ఉల్సన్ నగరంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో అధికారులు, గురువారం అర్ధరాత్రి సోదాలు చేసి ఆమెను అరెస్ట్ చేశారు.

ఆమె ఆచూకీకి సంబంధించిన సమాచారం అందడంతో పక్కా ప్రణాళికతో ఆమెను పట్టుకున్నట్లు సియోల్ నేషనల్ పోలీస్ ఏజెన్సీ చెప్పింది.

మృతి చెందిన చిన్నారుల వివరాలను తెలుసుకున్నామని, నిందితురాలి కోసం వెదుకుతున్నామని గత నెలలో న్యూజీలాండ్ పోలీసులు తెలిపారు. ఆ పిల్లల పేర్లను వారు బయట పెట్టలేదు.

వీడియో క్యాప్షన్, ముంబయి: కిడ్నాప్ అయిన పూజ 9 ఏళ్ళ తరువాత ఎలా తిరిగి వచ్చిందంటే...

''ఇంత తక్కువ సమయంలోనే విదేశాల్లో ఉన్న ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకోవడం అనేది కొరియన్ అధికారుల సహాయం, న్యూజీలాండ్ పోలీస్ ఇంటర్‌పోల్ సిబ్బంది సమన్వయంతోనే సాధ్యమైంది'' అని గురువారం, న్యూజీలాండ్ పోలీస్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ టొఫిలావ్ ఫామనుయా వాలెవా చెప్పారు.

న్యూజీలాండ్‌కు అప్పగించడానికి ముందే నిందితురాలికి బెయిల్‌ను తిరస్కరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. న్యూజీలాండ్‌లో ఆమెపై హత్యకు సంబంధించిన అభియోగాలను మోపనున్నారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ పిల్లల కుటుంబం ఆక్లాండ్‌లో కొన్నేళ్ల పాటు నివసించింది. ఈ పిల్లల మరణానికి కొంతకాలం ముందే వారి తండ్రి క్యాన్సర్ కారణంగా చనిపోయారు. వారి గ్రాండ్ పేరేంట్స్ ఇంకా న్యూజీలాండ్‌లోనే జీవిస్తున్నట్లు ఈ కథనాల ద్వారా తెలుస్తుంది.

సూట్‌కేస్‌లను కొనుగోలు చేసిన కుటుంబానికి, ఈ మరణాలకు ఎలాంటి సంబంధం లేదని పోలీసు అధికారులు చెప్పారు. పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాక ఆ కుటుంబం చాలా వేదనను అనుభవించిందని అన్నారు.

అసలేం జరిగింది

ఆగస్టు నెల ప్రారంభంలో సూట్‌కేసుల్లో పిల్లల మృతదేహాలు బయటపడ్డాయి. ఆన్‌లైన్ వేదికగా జరిగిన ఒక వేలంలో న్యూజీలాండ్‌కు చెందిన ఒక కుటుంబం ఈ సూట్‌కేస్‌లను కొనుగోలు చేసింది.

తాము కొనుగోలు చేసిన స్టోర్ రూమ్ ను ఓపెన్ చేసిన ఆ కుటుంబానికి అందులో అనేక వస్తువులతోపాటు సూట్ కేసులు కనిపించాయి.

వాటిని ఇంటికి తీసుకు వచ్చి తెరిచి చూడగా వాటిలో మానవ అవశేషాలు కనిపించాయి.

ఈ వ్యవహారంపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ అవశేషాలు ఎవరివి అన్న కోణంలో విచారణ జరిపారు.

అయితే, ఈ కుటుంబానికి, ఈ హత్యలకు సంబంధం ఉండకపోవచ్చని అప్పట్లోనే అక్కడి పోలీసు అధికారులు భావించారు.

సూట్‌కేసుల్లో ఒకటి కంటే ఎక్కువమంది మనుషుల అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు.

వీడియో క్యాప్షన్, కోపంతో బైకును ఢీకొట్టి, పారిపోయిన స్కార్పియో డ్రైవర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)