కాకినాడ: ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి చేసి చంపేసిన యువకుడు

ఫొటో సోర్స్, UGC
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో ఓ యువతి హత్యకు గురైంది. రోడ్డు మీద వెళుతుండగా మధ్యలో ఆమెపై ఓ యువకుడు దాడి చేసి ప్రాణం తీశాడు. కాకినాడ జిల్లాలో ఈ ఘటన జరిగింది. జిల్లా కేంద్రానికి సమీపంలోని కూరాడ, కాండ్రేగుల గ్రామాల మధ్యలో ఈ ఘటన జరిగింది.
కాకినాడ డీఎస్పీ అందించిన సమాచారం ప్రకారం కూరాడ గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన గుబ్బ వెంకట సూర్యనారాయణ అనే యువకుడు చాలాకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. పలుమార్లు అతనిపై గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు. పెద్దలు అతడిని హెచ్చరించారు.
"అయినా గానీ తన వేధింపులు మాత్రం ఆపలేదు. ఎన్నిసార్లు ప్రేమించమని అడిగినా అంగీకరించకపోవడంతో ఆదివారం ఉదయం కరప నుంచి తిరిగి తన స్వగ్రామానికి వస్తున్న ఆ యువతిని వెంబడించి ప్రేమను అంగీకరించాలని ఒత్తిడి తెచ్చాడు".
"కానీ, ఆమె మాత్రం అందుకు అంగీకరించకపోవడంతో స్కూటీపై వెళుతున్న ఆమెను రోడ్డు మీద అడ్డగించి కత్తితో దాడికి పాల్పడ్డాడు".
"తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న బాధితురాలిని కాపాడేందుకు స్థానికులు కొందరు ప్రయత్నించారు".
పోలీసులకు సమాచారం అందగానే 108 సహాయంతో కొన ఊపిరితో ఉన్న ఆమెను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ప్రాణాలు మాత్రం రక్షించలేకపోయారు. కాకినాడలోని జీజీహెచ్ కి తరలించే సరికి ఆమె ప్రాణాలు కోల్పోయిందని డీఎస్పీ చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
నిందితుడిని చెట్టుకి కట్టేసిన స్థానికులు
కూరాడ వెళ్లే మార్గంలో ఈ దాడి జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఆమె ప్రాణాలు రక్షించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో నిందితుడు వెంకట సూర్యనారాయణను పట్టుకుని చెట్టుకి కట్టేశారు. అతనిపై దాడికి యత్నించారు.
పెదపూడి పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మృతురాలు కాదా దేవిక (22) డిగ్రీ చదువుకుని గ్రామంలో ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ అపార్ట్ మెంట్లో పనిచేస్తుంటారని, అమ్మమ్మతో కలిసి స్వగ్రామంలో ఆమె ఉంటోందని తెలిపారు.
నిందితుడు కూడా గ్రామంలో ఖాళీగా ఉంటున్నారని, ప్రేమ పేరుతో ఆమె వెంట చాలాకాలంగా తిరుగుతున్నారని అదే గ్రామానికి చెందిన ఎస్ రాము అనే యువకుడు బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
నిందితుడిని శిక్షించాలి
హంతకుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా సంఘాల కార్యకర్తలు కొందరు కాకినాడ జీజీహెచ్ వద్ద ఆందోళన కి దిగారు. ప్రేమ పేరుతో వేధింపులు పెరిగిపోయి, యువతులు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఐద్వా నాయకురాలు సీహెచ్ రమణి మాట్లాడుతూ, "మహిళల మీద దాడులు పెరిగాయి. ప్రేమ పేరుతో వేధింపులు యధేచ్ఛగా సాగుతున్నాయి. పట్టపగలు, నడి రోడ్డు మీద స్కూటీ ఆపి మరీ హత్యకు పాల్పడడం చూస్తే ఎంతగా రెచ్చిపోతున్నారో అర్థమవుతుంది. ఇలాంటి అరాచకాలను అడ్డుకోవాలి. నిందితుడికి కఠిన శిక్షలు విధించాలి. బాధితుల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి. అది జరగకపోవడం వల్లనే ఇలా రెచ్చిపోతున్నారు." అంటూ అభిప్రాయపడ్డారు.
బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.

ఫొటో సోర్స్, UGC
మేము మాట్లాడలేకపోతున్నాం..
మృతురాలి కుటుంబాన్ని బీబీసీ సంప్రదించింది. "మాకు ఇప్పుడే తెలిసింది. షాక్ లో ఉన్నాం. ఆస్పత్రి దగ్గరకు బయలుదేరాం. ఇలా జరుగుతుందని అనుకోలేదు. మేము కష్టపడుతున్నాం, పిల్ల చదువుకుని మంచి స్థితికి చేరుకుంటుందని ఆశించాము. కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. ఏం మాట్లాడాలో తెలియడం లేదు." అంటూ మృతురాలి తల్లి సత్యవతి అన్నారు.
ఇలాంటి స్థితి ఎవరికి ఎదురుకాకూడదని కోరుకుంటున్నామంటూ కన్నీరుపెట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- చైనా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది.. ఈ ‘విధ్వంసానికి’ 5 కారణాలు..
- తెలంగాణ: ‘చూపు పోయింది.. వరంగల్లో అడుక్కుని బతకమన్నారు.. 50 ఏళ్లుగా నేను ఏం చేస్తున్నానంటే..’
- జనాభా నియంత్రణ గురించి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు.. టార్గెట్ ముస్లింలు, క్రైస్తవులేనా?
- శ్రీకాకుళం జిల్లా: బట్టలు ఉతకం అన్న రజకులు.. ఇతర కులాల సహాయ నిరాకరణ.. ఏం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మెక్సికోలో అగంతకుల కాల్పులు, మేయర్ సహా 18మంది మృతి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













