విజయవాడ: ప్రేమించలేదని యువతిని సజీవ దహనం చేసిన యువకుడు: ప్రెస్ రివ్యూ

విజయవాడలో ఒక యువకుడు తనను ప్రేమించలేదని ఒక యువతిని సజీవ దహనం చేశాడని ఈనాడు కథనం ప్రచురించింది.
ప్రేమిస్తున్నానని వెంటపడి వేధిస్తున్న యువకుడిపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను మళ్లీ ఆమె జోలికిరానని యువకుడు రాజీకి రావడంతో ఆమె కేసు వాపసు తీసున్నారు.
తన ప్రేమను కాదనడమే కాకుండా.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ యువకుడు మాటువేసి ఆమెపై దాడి చేశాడు. పెట్రోల్ పోసి సజీవదహనం చేశాడు.
ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే చనిపోయింది. నిప్పంటుకుని తీవ్రంగా గాయపడిన యువకుణ్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన చిన్నారి అనే యువతి విజయవాడలోని ఓ కొవిడ్‌కేర్ సెంటర్‌లో నర్సుగా పనిచేస్తున్నారు.
స్నేహితురాళ్లతో కలసి ఆసుపత్రికి సమీపంలోనే ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన నాగభూషణం అనే వ్యక్తి చిన్నారిని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని కథనంలో రాశారు.
దీనిపై ఆమె నాలుగు రోజుల కిందట గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు, పోలీసులు ఆ యువకుణ్ని పిలిచి హెచ్చరించడంతో ఆమెను ఏమీ చేయనని రాసిచ్చినట్లు సమాచారం. దీంతో ఫిర్యాదును చిన్నారి వెనక్కి తీసుకున్నట్టు తెలిసింది.
రోజూలానే సోమవారం విధులకు హాజరైన చిన్నారి రాత్రి 9 గంటలకు విధులను ముగించుకుని ఒంటరిగా ఇంటికి వెళుతుండగా, మాటు వేసిన నాగభూషణం ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించాడు.
ఈ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో నాగభూషణం ముందుగానే తనతో తెచ్చుకున్న పెట్రోల్‌ను చిన్నారిపై పోసి నిప్పంటించాడని పత్రికలో పేర్కొన్నారు.
ఈ సమయంలో అతనికీ మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే చనిపోగా... తీవ్రగాయాలైన నాగభూషణాన్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించినట్టు సమాచారం.
సంఘటనా స్థలాన్ని ఏసీపీ రమేష్, సూర్యారావుపేట సీఐ సూర్యనారాయణ పరిశీలించారు. ఘటనపై గవర్నర్‌పేట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైందని ఈనాడు వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
యముడికి ఆదేశాలు ఇచ్చాారా-తెలంగాణ హైకోర్టు
తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య తగ్గడంపై హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.
‘కరోనా పరీక్షలు ఆకస్మికంగా సగానికి ఎందుకు పడిపోయాయో చెప్పాలని కోరితే పొంతన లేని సమాధానం ఇచ్చారు.
45 రోజులుగా కొవిడ్ మరణాలపై ప్రభుత్వ బులెటిన్లు నమ్మశక్యంగా లేవు. సెప్టెంబరు బులెటిన్లను పరిశీలిస్తే.. 20వ తేదీన 1,219, 27వ తేదీన 1,378, 30వ తేదీన 1,127 కేసులు నమోదైనట్లు చూపారు.
ఆయా తేదీల్లో మరణాల సంఖ్యను 9, 7, 13గా పేర్కొన్నారు. అక్టోబరులో రోజుకు 10 మంది మరణిస్తున్నట్లు చూపుతున్నారు?
ఈ రాష్ట్రంలో రోజుకు 10కి మించి కరోనా రోగులను తీసుకెళ్లవద్దని యముడికి ఆదేశాలు ఇచ్చారా?’ అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందని పత్రిక రాసింది.
రాష్ట్రంలో కరోనా పరీక్షలు, వైద్య సిబ్బందికి సౌకర్యాల కల్పన, మృతదేహాలకూ పరీక్షలు చేయాలంటూ దాఖలైన 23 ప్రజాహిత వ్యాజ్యాలను హైకోర్టు ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది.
దీనికి సమాధానంగా ప్రభుత్వ చర్యలను వివరిస్తూ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు సమర్పించిన నివేదికను ధర్మాసనం తప్పుపట్టింది. ‘ప్రభుత్వ లెక్కలు షాక్ కలిగిస్తున్నాయి.
ప్రజలకు కచ్చితమైన వివరాలు అందించాలి. మరణాలు పదికి మించి చూపడంలేదు. కొవిడ్ ఆస్పత్రులు కేవలం 62 ఉన్నాయి. పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఇవి చాలా తక్కువ. సుమారు 10శాతం జనాభాకే పరీక్షలు చేశారు’ అని పేర్కొంది.
నవంబరు 16లోగా పూర్తి వివరాలతో మరో నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబరు 19వ తేదీకి వాయిదా వేసిందని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఫొటో సోర్స్, http://hc.ap.nic.in/
సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై పోస్టుల కేసు సీబీఐకి
సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై పోస్టుల కేసులను హైకోర్టు సీబీఐకి అప్పగించిందని సాక్షి కథనం రాసింది.
సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై పోస్టులకు సంబంధించిన వ్యవహారంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
దీనికి సంబంధించి సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు ప్రకటించిన న్యాయస్థానం తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించినట్లు పత్రిక రాసింది.
ఆధారాలన్నీ సీబీఐకి అందచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఏదైనా కాగ్నిజబుల్ నేరం ఉందని భావిస్తే మరిన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి దర్యాప్తును ఓ తార్కిక ముగింపునకు తీసుకురావాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.
ఒకవేళ ఈ పోస్టుల వెనుక భారీ కుట్ర ఉన్నట్లు గమనిస్తే హోదా, స్థాయితో నిమిత్తం లేకుండా నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సాక్షి తెలిపింది.
న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో పోస్టులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని, ఆ యూజర్లను బ్లాక్ చేయాలని సీబీఐకి సూచించినట్లు పత్రిక చెప్పింది.
తీర్పు కాపీ అందుకున్న నాటి నుంచి ఎనిమిది వారాల్లోపు దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్‌లో తమ ముందుంచాలని ఆదేశించింది.
సీబీఐ కోరితే పూర్తి సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి సూచిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసిందని సాక్షి వివరించింది.

ఫొటో సోర్స్, FB/JANGAONDEPOT
టీఎస్ఆర్టీసీ రూట్లు ప్రైవేటుకు రెడ్ కార్పెట్
తెలంగాణ ఆర్టీసీ రూట్లను ప్రైవేటు పరం చేస్తున్నారంటూ వెలుగు పత్రిక కథనం ప్రచురించింది.
ఏపీ మధ్య ఇంటర్ స్టేట్ బస్సుల లొల్లి ప్రైవేటు ట్రావెల్స్‌కు రెడ్‌కార్పెట్ పరుస్తోంది.
ఏపీ ఎక్కువగా తిప్పుతున్న బస్సు సర్వీసులను తగ్గించుకోవాలంటూ తెలంగాణ పట్టుపట్టడం, టీఎస్ ఆర్టీసీ సర్వీసుల్నే పెంచుకోవాలని ఏపీ సూచించినా పట్టించుకోకపోవడం ‘ప్రైవేటు’కు రూట్ వేస్తోంది.
రెండు రాష్ట్రాలు కలిపి నాలుగు లక్షల కిలోమీటర్లు బస్సులు తిప్పాల్సి ఉండగా.. మూడు లక్షల కిలోమీటర్లకే పరిమితం కానున్నాయి.
మిగతా లక్ష కిలోమీటర్లు ప్రైవేటు ట్రావెల్స్చేతిలోకి వెళ్లిపోనున్నాయి.
అసలు ప్రైవేటుకు మేలుచేసేందుకే, లోపాయికారీ ఒప్పందాలతోనే తెలంగాణ సర్కారు మొండిగా వ్యవహరిస్తోందని ఆర్టీసీ యూనియన్లు ఆరోపిస్తున్నాయని పత్రిక చెప్పింది.
లాభాలొచ్చే ఈ రూట్లలో టీఎస్ ఆర్టీసీ సర్వీసులను పెంచుకుంటే.. ఆదాయం పెరిగి, సంస్థ నష్టాలు తగ్గిపోయేవని అంటున్నాయి. మరోవైపు ఆర్టీసీ సర్వీసులు తగ్గిపోవడం ప్రయాణికులకు తిప్పలు తేనుంది.
ఇప్పటికే అడ్డగోలుగా వసూలు చేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్.. ఇక అందినకాడికి దోచుకుంటాయన్న ఆందోళన వ్యక్తమవుతోందని కథనంలో తెలిపారు.
కరోనాతో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి తెలంగాణ, ఏపీ మధ్య ఏడు నెలలుగా బస్సులు నడవడం లేదు. అన్‌లాక్‌లో భాగంగా ఇంటర్ స్టేట్సర్వీసులకు కేంద్రం సడలింపులు ఇచ్చినా సర్వీసులు స్టార్ట్ చేయలేదు.
ఇంటర్‌స్టేట్ అగ్రిమెంట్ లేదంటూ రాష్ట్ర సర్కారు బస్సులు ఆపేసింది. వాస్తవానికి తెలంగాణ ఏర్పాటై ఆరేండ్లు గడుస్తున్నా.. ఏపీతో ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ జరగలేదు.
కరోనాతో బస్సులు ఆగిపోవడంతో.. ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకోవాలని మన సర్కారు భావించింది. దీనిపై సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారని పత్రిక వివరించింది.
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందా?
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- పుండ్లలోని చీముతో ప్రమాదకరంగా ఆ వ్యాక్సీన్ ఎక్కించేవారు, అది లక్షల మంది ప్రాణాలు కాపాడింది
- కరోనావైరస్: వ్యాక్సీనా, హెర్డ్ ఇమ్యూనిటీనా... ఏది వస్తే మేలు?
- అర్మేనియా - అజర్బైజాన్ యుద్ధ రంగంలో పరిస్థితి ఏమిటి... బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








