కర్ణాటక: మహమూద్ గవాన్ మదరసాలో కుంకుమ చల్లి పూజలు చేసిన నలుగురి అరెస్ట్... అసలేం జరిగింది?

మదరాసాలోకి బలవంతంగా ప్రవేశించి పూజలు చేస్తున్న వ్యక్తులు

ఫొటో సోర్స్, TWITTER/ASADOWAISI

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉన్న మహమూద్ గవాన్ మదరసా తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించి పూజలు నిర్వహించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఇది పురావస్తు శాఖ సంరక్షిస్తున్న కట్టడం.

ఈ సంఘటన బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

అదే సమయంలో కొంత మంది హిందూ దేవత విగ్రహాన్ని నిమజ్జనం కోసం తీసుకుని వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

అయితే, ఈ కట్టడంలో ఉన్న చెట్టును ఏడాదికి రెండు సార్లు పూజిస్తూ ఉంటారని కొంత మంది చెబుతున్నారు.

"గతంలో మదరసా ప్రాంగణంలో ఉన్న ఒక చెట్టును పూజించడం సంప్రదాయంగా ఉండేదని కర్ణాటక అడిషినల్ డిప్యూటీ జనరల్ పోలీస్ అలోక్ కుమార్ బీబీసీకి చెప్పారు. అయితే, ఆ చెట్టు కూలిపోవడంతో గోపురం పక్కనే పూజను నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కేసుతో సంబంధం ఉన్నవారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. శాంతి భద్రతలను కాపాడేందుకు మదరసాలో ఉన్న మసీదులో శుక్రవారం ప్రార్ధనల సమయంలో అల్లర్లు జరగకుండా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను చేసినట్లు చెప్పారు.

మహమూద్ గవాన్ మదరసా

ఫొటో సోర్స్, KARNATAKA TOURISM

చరిత్రాత్మక కట్టడం

ఈ మదరసాను 600 ఏళ్ల క్రితం ఇరాన్ వ్యాపారవేత్త మహమూద్ గవాన్ నిర్మించారు.

ఆయన తుర్క్ మెనిస్తాన్, మంగోలియా నుంచి ఎదురవుతున్న దాడులను తప్పించుకుంటూ బహమనీ పాలనలో భారతదేశానికి విచ్చేసారు. భారతదేశం విద్యకు కేంద్రంగా ఉండేది.

"ఈ మదరసాలో ఆధ్యాత్మిక విద్యను మాత్రమే కాకుండా రసాయన, భూగర్భ శాస్త్రం, తత్వశాస్త్రం కూడా బోధించినట్లు కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అబ్దుల్ మాజిద్ మణియార్ చెప్పారు. దీంతో పాటు వివిధ నైపుణ్యాల్లో కూడా శిక్షణ ఇచ్చేవారని తెలిపారు.

ఈ భవన నిర్మాణం భారతీయ, ఇస్లామిక్ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. ఈ మదరసాలో ఉన్న 100 అడుగుల ఎత్తయిన గోపురం ఒక ముఖ్యమైన కట్టడం. ఈ గోపురం పై ఉండే మెరిసే టైల్స్ వల్ల దీనిని గ్లాస్ పిల్లర్ (అద్దాల స్థంభం) అని పిలుస్తారు.

2005లో పురావస్తు శాఖ ఈ కట్టడాన్ని సంరక్షక కట్టడంగా గుర్తించి దానిని తమ ఆధీనంలోకి తీసుకుంది. కానీ, ఈ కట్టడం పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేయలేదని స్థానికులు అంటారు.

ఈ మదరసా, మసీదు 1424 - 1427 వరకు దక్కన్ ప్రాంతాన్ని పాలించిన బహమనీ రాజ్య పాలనకు గుర్తుగా నిలుస్తాయి.

వీడియో క్యాప్షన్, గుజరాత్‌లో యోగా చేస్తోన్న ముస్లింలు

మూకలు మదరసా ద్వారం దగ్గరున్న భద్రతా సిబ్బందిని తోసుకుని తాళం పగలగొట్టి మదరసా ప్రాంగణంలోకి అడుగు పెట్టి పూజలు నిర్వహించినట్లు మదరసా బోర్డు సభ్యుడు మొహమ్మద్ షంషుద్దీన్ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

"మూకలు బలవంతంగా మదరసాలోకి అడుగుపెట్టి మసీదు ద్వారం దగ్గరకు కుంకుమను విసిరి నినాదాలు చేసినట్లు షంషుద్దీన్ చెప్పారు. "మొదట్లో కొంత మంది ఇక్కడున్న చెట్టు దగ్గరకు వచ్చి పూజించేవారు" అని తెలిపారు.

చౌబారా ప్రాంగణంలో కొంత మంది విగ్రహాలను, ఫోటోలను పెట్టి నినాదాలు చేయడం ద్వారా నగరంలో శాంతి సామరస్యాలకు విఘాతం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎఫ్ ఐ ఆర్ లో తెలిపారు.

"ఈ మూకలు దేశ వ్యతిరేక నినాదాలు చేస్తూ ఇతర మతస్థులను కూడా అదే విధంగా నినాదాలు చేసే విధంగా రెచ్చగొడుతున్నారు. మదరసా, మసీదులోకి తుక్కును విసిరి పరిసరాలను పాడు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

మదరసా ప్రాంగణంలోకి దూసుకొచ్చిన వారి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసారు. ఐపీసీ లోని సెక్షన్ 143, 147, 153, 295ఏ, 149 ప్రకారం నిందితుల పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)