నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు ఎవరు... ఈ పురస్కారానికి ఎలా ఎంపిక చేస్తారు, విజేతలకు ఏమిస్తారు?

ఫొటో సోర్స్, TWITTER/NOBEL PRIZE
బెలారస్‌కు చెందిన అలెస్ బియాలియాట్స్కికు నోబెల్ శాంతి పురస్కారం లభించింది.
ఈయనతో పాటు మరో రెండు మానవ హక్కుల సంస్థలకు కూడా శాంతి బహుమతిని ప్రకటించారు.
రష్యాకు చెందిన మానవ హక్కుల సంస్థ మెమోరియల్, యుక్రెయిన్‌కు చెందిన సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్‌కు శాంతి బహుమతి లభించింది.
గత 30 ఏళ్లుగా మెమోరియల్ సంస్థ సోవియెట్ పాలనలో శిక్షించిన, బంధించిన, అణచివేసిన కొన్ని లక్షల మంది ప్రజల జ్ఞాపకశక్తిని పునరుద్ధరించేందుకు కృషి చేసింది.
రష్యా యుక్రెయిన్ పై యుద్ధ ప్రకటన చేయడానికి ముందు మెమోరియల్ పై నిషేధాన్ని విధించారు.
యుక్రెయిన్ సంస్థ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్‌ను 2007లో ప్రారంభించారు. ఈ అవార్డును పొందడం గర్వకారణం అని సంస్థ ట్వీట్ చేసింది.
ఈ సంస్థ ఆక్రమిత క్రిమియాలో యుద్ధ నేరాలు, యుక్రెయిన్ పై రష్యా దాడి తర్వాత చోటు చేసుకున్న రాజకీయ అణచివేతలను పర్యవేక్షించింది.
అలెస్ బియాలియాట్స్కి బెలారస్‌కు చెందిన మానవ హక్కుల ఉద్యమకర్త. ఆయన ఈ సంస్థను నిరసనలను అణచివేస్తున్నందుకు ప్రతిస్పందనగా ప్రారంభించారు.
ఆయన ప్రస్తుతం దర్యాప్తుకు ముందు జైలులో ఉన్నారు.
ఈ అవార్డు తనను భావోద్వేగానికి గురి చేసిందని అలెస్ బియాలియాట్స్కి భార్య అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
శాంతి బహుమతి గ్రహీతలు మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, శాంతియుత సహజీవనం కోసం విలక్షణమైన సేవలు అందించారని శాంతి బహుమతిని ప్రకటించిన బెరిట్ రీస్ ఆండర్సన్ అన్నారు.
నోబెల్ శాంతి బహుమతిని దేశాల మధ్య సౌబ్రాతృత్వాన్ని పెంచిన వారికి, సైన్యాలను నిషేధించడం, లేదా తొలగించిన వారికి, శాంతి స్థాపన చేసినవారికి ఇస్తారు.
2022 లో నోబెల్ బహుమతుల జాబితాలో 300 మందికి పైగా అభ్యర్థులున్నారు. అభ్యర్థుల జాబితాను 50ఏళ్ల పాటు వాల్ట్ లో పెట్టి ఉంచుతారు.
ఈ బహుమతి ఎందుకు ప్రతిష్టాత్మకం? గతంలో ఈ బహుమతి ఎవరికి లభించింది?

ఫొటో సోర్స్, Getty Images
నోబెల్ శాంతి పురస్కారం
నోబెల్ పురస్కారాలను ప్రతి ఏటా ఫిజిక్స్, కెమిస్ట్రీ, వైద్యం, సాహిత్యం, శాంతి రంగాలలో కృషి చేసినవారికి ఇస్తారు.
బహుమతి ప్రధానానికి 12 నెలల ముందు "మానవాళికి మెరుగైన సేవలు" అందించిన వారికి ఈ నోబెల్ శాంతి బహుమతిని ఇస్తారు.
డైనమైట్‌ను కనుగొన్న స్వీడిష్ వ్యాపారవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామాను అనుసరించి ఈ బహుమతిని అందిస్తున్నారు.
ఈ అవార్డుల కోసం ఆయన ఆస్తిలో చాలా భాగాన్ని కేటాయించారు. వీటిని మొదట 1901లో ప్రధానం చేశారు.
1968లో స్వీడన్ సెంట్రల్ బ్యాంకు ఎకనామిక్ సైన్సెస్ బహుమతిని ప్రధానం చేసింది.
1901 నుంచి 2021 మధ్యలో ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్ధం మొత్తం 943 మంది వ్యక్తులకు 25 సంస్థలకు నోబెల్ శాంతి పురస్కారాలు, ఎకనామిక్ సైన్సెస్ లో స్వెరిగెస్ రిక్స్ బ్యాంక్ అవార్డులను ప్రధానం చేశారు.
మహిళలకు ఈ బహుమతిని మొత్తం 58 సార్లు ఇచ్చారు.
ఫ్రెంచ్ రచయత జీన్ పాల్ సార్ట్రే, వియత్నాం నాయకుడు లీ డుక్ థో ఈ అవార్డును తిరస్కరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా ఎంపిక చేస్తారు?
విద్యావేత్తలు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, మాజీ పురస్కార గ్రహీతలు ఈ బహుమతికి నామినేషన్లను సమర్పిస్తారు.
స్వయంగా నామినేట్ చేసుకునేందుకు వీలు లేదు.
ప్రాచీన గ్రీసులో యుద్ధాల్లో విజేతలకు సమర్పించే పుష్పగుచ్చానికి ప్రతీకగా బహుమతి గ్రహీతలను 'లారెట్స్' అంటారు.
ఒకే వ్యక్తికి మూడుసార్లకు మించి బహుమతులను గెలుచుకునేందుకు లేదు. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధ సమయాల్లో ఈ బహుమతులను ఇవ్వలేదు.
నోబెల్ ఫౌండేషన్ నిబంధనల ప్రకారం ఒక విభాగంలో బహుమతి పొందేందుకు అర్హత ఉన్నవారెవరూ లేనప్పుడు ఆ అవార్డును ప్రకటించరు. ఆ బహుమతి నగదును మరుసటి ఏడాది బహుమతి కోసం ఉంచుతారు.
ఎంపిక ఎలా జరుగుతుంది?
ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ, వైద్యం, సాహిత్యం, ఎకనామిక్ సైన్సెస్‌లో నోబెల్ బహుమతులను స్వీడన్ లో స్టాక్‌హాంలో ప్రధానం చేస్తారు.
నోబెల్ శాంతి బహుమతిని నార్వేలో ఎంపిక చేస్తారు. నార్వే పార్లమెంట్ నియమించిన ఐదుగురు సభ్యులు ఎంపిక కమిటీలో ఉంటారు.
ఈ అవార్డును ఆస్లోలో ఇస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
బహుమతి గ్రహీతలకు ఏమిస్తారు?
నోబెల్ బహుమతి గ్రహీతలకు మూడు వస్తువులు లభిస్తాయి.
వినూత్నమైన కళతో కూడిన నోబెల్ డిప్లొమా
రకరకాల డిజైన్లతో కూడిన నోబెల్ పతకం
10 మిలియన్ స్వీడన్ క్రోనా (911,000 డాలర్లు) సుమారు రూ. 7.30 కోట్లు నగదు బహుమతి
బహుమతి గ్రహీతలు ఒకరు కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ నగదును బహుమతి గ్రహీతలందరి మధ్య విభజిస్తారు.
ఈ బహుమతిని పొందేందుకు వాళ్ళు ప్రసంగం చేయాల్సి ఉంటుంది. ఈ బహుమతులను నోబెల్ వర్ధంతి నాడు డిసెంబరు 10న ఇస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రముఖ బహుమతి గ్రహీతలు
అంతర్జాతీయ దౌత్య సంబంధాలు, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు కృషి చేసినందుకు గాను
మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు 2009లో నోబెల్ శాంతి బహుమతి లభించింది.
"ఈ బహుమతి తనకు లభించడం ఆశ్చర్యంగా ఉందని అంటూ దీనిని కార్యాచరణకు పిలుపునిచ్చినట్లుగా భావిస్తున్నాను" అని అన్నారు.
అయితే, ఈ అవార్డు నామినేషన్ డెడ్ లైన్ ముగియడానికి ముందు 12 రోజులు మాత్రమే ఒబామా పదవిలో ఉన్నారని కొంత మంది విమర్శించారు.
మాజీ అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ (2002), యూరోపియన్ యూనియన్ (2012), ఐక్యరాజ్య సమితికి, జనరల్ సెక్రెటరీ కోఫీ అన్నన్‌కు సంయుక్తంగా (2001) సెయింట్ థెరెసాకు (1979)లో లభించింది.
1921 లో ఆల్‌బెర్ట్ ఐన్‌స్టీన్‌కు ఫిజిక్స్‌లో, మేరీ క్యూరీకి, 1903 లో ఫిజిక్స్‌కు 1911లో కెమిస్ట్రీలో లభించాయి.
2014లో బాలల విద్య ఉద్యమకారిణి మలాలా యూసఫ్‌జాయ్‌కి మరొకరితో కలిపి శాంతి బహుమతి లభించింది. ఈమె అత్యంత చిన్న వయసులో బహుమతిని పొందిన వ్యక్తి. జాన్ బీ గుడ్‌ఎనఫ్ బహుమతిని అత్యంత పెద్ద వయసులో తీసుకున్న వ్యక్తి.
ఆయన 98 ఏళ్ల వయసులో 2019లో కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి తీసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫ్రెంచ్ రచయత జీన్ పాల్ సార్ట్రే, వియత్నాం నాయకుడు లీ డుక్ థో ఈ అవార్డును తిరస్కరించారు. మరో నలుగురిని ఆయా దేశాలు బహుమతి తీసుకోవడానికి నిరాకరించాయి.
2016లో సాహిత్యానికి లభించిన అవార్డును బాబ్ డైలాన్ స్వీకరిస్తారో లేదోననే సందేహాలు తలెత్తాయి. కానీ, ఆయన జూన్ 2017లో ప్రసంగించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ బహుమతులతో గ్రహీతలు ఏమి చేశారు?
మేరీ, పియరీ క్యూరీ ఫిజిక్స్‌లో వచ్చిన నగదు బహుమతిని శాస్త్రీయ పరిశోధన కోసం వినియోగించారు.
2006లో ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతి తీసుకున్న జాన్ మాథర్ ఈ నగదు బహుమతిని తన సొంత ఫౌండేషన్ కు విరాళంగా ఇచ్చారు.
1993లో బహుమతిని తీసుకున్న బ్రిటిష్ బయో కెమిస్ట్ రిచర్డ్ రాబర్ట్స్ వైద్యంలో వచ్చిన నగదు బహుమతిని క్రొకెట్ క్రీడా మైదానాన్ని నిర్మించారు.
ఆయనతో పాటు బహుమతిని పొందిన ఫిలిప్ షార్ప్ 100 ఏళ్ల పురాతనమైన ఇంటిని కొనుక్కున్నారు.
2001లో వైద్యంలో బహుమతిని పొందిన సర్ పాల్ నర్స్ ఒక అధునాతన మోటార్ బైక్ కొనుక్కున్నారు.
2006లో సాహిత్యంలో బహుమతిని పొందిన ఒర్హాన్ పాముక్ ఇస్తాన్‌బుల్‌లో ఒక మ్యూజియంను నిర్మించారు.
రష్యన్ ఇండిపెండెంట్ వార్తాపత్రిక నోవాయా గెజెట్ ఎడిటర్ డిమిత్రీ మురాటోవ్‌కు లభించిన శాంతి బహుమతిని $103.5 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.850 కోట్లు) వేలం పాడారు. ఈ సొమ్మును ఆయన యుక్రెయిన్ యుద్ధంలో నిరాశ్రయులైన చిన్నారుల కోసం వినియోగించారు.
ఇవి కూడా చదవండి:
- చైనా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది.. ఈ ‘విధ్వంసానికి’ 5 కారణాలు..
- తెలంగాణ: ‘చూపు పోయింది.. వరంగల్‌లో అడుక్కుని బతకమన్నారు.. 50 ఏళ్లుగా నేను ఏం చేస్తున్నానంటే..’
- జనాభా నియంత్రణ గురించి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు.. టార్గెట్ ముస్లింలు, క్రైస్తవులేనా?
- శ్రీకాకుళం జిల్లా: బట్టలు ఉతకం అన్న రజకులు.. ఇతర కులాల సహాయ నిరాకరణ.. ఏం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మెక్సికోలో అగంతకుల కాల్పులు, మేయర్ సహా 18మంది మృతి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












