Travel Mystery: ప్రకృతి రహస్యమా? మానవ కల్పితమా? 150 ఏళ్లుగా ఎవరూ కనుక్కోలేని ఈ మిస్టరీ కాంతి ఏంటి?

ఫొటో సోర్స్, trekandshoot/Getty Images
- రచయిత, అమీ బిజారీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
నారింజ రంగులో వెలుగులు విరజిమ్మే ఓ బంతిలాంటి ఆకారం గాలిలో ఎగురుతూ కనిపించి మాయమవుతుంది. అమెరికాలో చాలా ప్రసిద్ధి చెందిన ఆ రహదారి మీద అది తరచూ జరుగుతుంటుంది.
గత 150 సంవత్సరాలు ఈ మిస్టరీ ఇప్పటికీ వీడకుండా ఆ రోడ్డు మీద ప్రయాణించే వారిని ఆశ్చర్యపరుస్తూనే ఉంది.
హార్నెట్ స్పూక్ లైట్ అని పిలుచుకునే ఈ బంతి ఆకారపు వెలుగు నిజమేనా లేక భ్రమా అన్నదానిపై అనేక వాదోపవాదాలు జరిగాయి.
చాలామంది ఇది నిజమే అని నమ్ముతుండగా, కొంతమంది ఈ వెలుగుకు కారణమేంటో వివరించే ప్రయత్నం చేశారు.
ఎక్కడ ఈ కాంతి?
సుమారు 6 కిలోమీటర్ల పొడవుండే ఈ రోడ్డును స్థానికులు డెవిల్స్ ప్రామినేడ్ (దెయ్యాల షికారు) అని పిలుస్తుంటారు. జగత్ ప్రసిద్ధమైన హైవే ‘రూట్ 66’కు పక్కనే, ఒక్లహామాకు ఈశాన్యంలో ఉంటుందీ రహదారి.
ఇక్కడ గత 150 ఏళ్లుగా ది హార్నెస్ట్ స్పూక్ లైట్ అని పిలుచుకునే ఒక బాస్కెట్ బాల్ సైజు వెలుగులు, అతీత శక్తుల గురించి ఆలోచించే వారికి ఒక మిస్టరీగా మిగిలాయి.
హార్నెట్ అనే పట్టణం పేరే ఈ మిస్టీరియస్ కాంతి పుంజానికి పెట్టారు. రాత్రిపూట ఈ రోడ్డు మీద వెళ్లేవారికి, దూరంగా ఆకాశంలో ఈ వెలుగు కనిపిస్తుంటుంది. 1881 నుంచి ఇది జరుగుతోంది.
ఈ బంతి ఆకారంలో వెలుగు ఎందుకు వస్తుందో, ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. చివరికి ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజినీరింగ్ బృందం కూడా దీన్ని గుర్తు తెలియని ప్రాంతం నుంచి వచ్చే అంతుపట్టని రహస్య కాంతిగా తేల్చింది.
ఒక భూతం చేతిలో లాంతరులాగా ఈ వెలుగు అటూ ఇటూ, పైకి కిందికీ కదులుతూ కనిపిస్తుంది. ఒక్లహామా సరిహద్దుల నుంచి పశ్చిమంవైపు చూసినప్పుడు ఈ కాంతి పుంజం దర్శనమిస్తుంది.
"ఈ రోడ్డు మార్గంలో జోప్లిన్, గలెనా, బాక్స్టర్ స్ప్రింగ్స్ గుండా దక్షిణాన క్వాపా వరకు ఈ వెలుగు కనిపిస్తుంది. మిస్సౌరీ, కాన్సాస్, ఒక్లహామా, ఈ మూడు రాష్ట్రాల సరిహద్దులు ఇక్కడ కలుస్తాయి. అందువల్ల ఈ వింత కాంతి మీద అనేక కథలు ప్రచారంలోకి వచ్చాయి" అని చెరిల్ ఐషర్ జెట్ అన్నారు.
ఆమె రూట్ 66 చరిత్రకారిణి. రూట్ 66 ఇన్ కాన్సాస్ అనే పుస్తకం రాశారు. మైల్స్ ఆఫ్ పాసిబిలిటీ రూట్ 66 కాన్ఫరెన్స్ వ్యవస్థాపకురాలు.

ఫొటో సోర్స్, Ed Craig Collection at Dobson Museum and Home Arch
అర్ధరాత్రి కాంతి పుంజం
ఈ మిస్టరీ గురించి తెలుసుకోవాలని ప్రయత్నించే చాలామందిలాగానే నేను కూడా ఒక చంద్రుడు లేని చీకటి రాత్రిలో ఆ రోడ్డు పక్కన నా కారును పార్క్ చేశారు. ఆ చీకటిలో ఒక గంటకు పైగా వేచి చూశాను.
అందరూ చెబుతున్నట్లుగా మొదట నాకు ఆ ఎగురుతున్న వెలుగుల బంతి కనిపించలేదు. అయితే దీని గురించి నేను చదివిన కథలు నాలో ఆసక్తిని పెంచాయి. అలాగే వేచి చూశాను.
కాసేపటికి, ఒక జత హెడ్‌లైట్‌లాంటి కాంతి మాత్రం అలా కనిపించి వెళ్లింది. అది కూడా ఒక్క సెకనే. అది నన్ను భయపెట్టింది కూడా.
1947లో తనకు ఎదురైన అనుభవాన్ని స్థానికుడైన వాన్స్ రాండోల్ఫ్ తన టోమ్ ఓజార్క్ మ్యాజిక్ అండ్ ఫోక్లోర్‌లో అనే పుస్తకంలో రాసుకొచ్చారు. "నేను ఈ కాంతిని మూడుసార్లు చూశాను "అని ఆయన రాశారు.
"ఇది మొదట గుడ్డు పరిమాణంలో కనిపించింది. కానీ కొన్నిసార్లు అది వాష్‌టబ్‌లా పెద్దదిగా కనిపించే వరకు మారుతూ ఉంటుంది. నేను ఒకే కాంతి గోళాన్ని చూశాను. కానీ చాలామంది తమకు అనేక కాంతి గోళాలుగా కనిపించినట్లు చెప్పారు. అది పసుపు రంగులో ఉన్నట్లు అనిపించింది. కొందరు మాత్రం అది ఎరుపు, ఆకుపచ్చ, నీలం లేదా ఊదా రంగులలో కూడా ఉన్నట్లు చెప్పారు. ఒక వ్యక్తి తాను దాని దగ్గరగా వెళ్లినట్లు, ఆ కాంతి వేడిని అనుభవించినట్లు కూడా చెప్పారు. ఆ కాంతి గోళం బుడగలాగా పగిలిపోయి, మెరుపులు అన్ని దిశలకు వెదజల్లినట్లు పడిపోవడం తాను చూశానని ఒక మహిళ చెప్పారు'' అని ఆయన రాసుకొచ్చారు.

ఫొటో సోర్స్, Courtesy Joplin Historical & Mineral Museum
ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారు
ఎనిమిదేళ్ల వయసులో తాను అనేకసార్లు స్పూక్ లైట్‌ను చూసినట్లు కాన్సాస్‌లోని బాక్స్‌టర్ స్ప్రింగ్స్‌కు చెందిన డీన్ వాకర్ గుర్తుచేసుకున్నారు.
రూట్ 66-నేపథ్యంగా సాగే కార్స్ ఫిల్మ్ ఫ్రాంచైజీలో టో-మేటర్ పాత్రకు డీన్ వాకరే ప్రేరణ. కాన్సాస్ రూట్ 66 విజిటర్స్ సెంటర్‌లో ఆయన వలంటీర్‌గా పనిచేశారు.
"హార్నెట్ స్పూక్ లైట్‌ని చూడటానికి మా నాన్న, అమ్మ, మామయ్య, అప్పుడప్పుడు నా కజిన్‌లను, నన్ను బయటకు తీసుకువెళ్లేవారు" అని డీన్ వాకర్ చెప్పారు.
"ఒకసారి, అది మా కారు ముందు విండ్‌షీల్డ్‌లో మీదుగా వెళ్లింది. నేను, వెనక సీటులో ఉన్న నా కజిన్స్ భయంతో దాక్కున్నాం. తర్వాత అది మాయమైంది. మేమంతా చాలా భయపడ్డాం. ఇంటికి తిరిగి వచ్చే వరకు ఎవరూ మాట్లాడలేకపోయాం'' అన్నారాయన.
క్వాపా నేషన్ అనే సంస్థకు చెందిన గ్రేస్ గుడీగల్ కూడా ఇలాంటి అనుభవాన్నే చెప్పారు.
''అప్పుడు నాకు 10 సంవత్సరాలు ఉంటాయి. ఒక రోజు రాత్రి నేను నా అంకుల్, నా బ్రదర్స్ అందరం దీన్ని చూడటానికి వెళ్లాము. అక్కడికి వెళ్లిన కాసేపటి తర్వాత దూరంగా, చెట్ల మధ్య మాకు ఒక వెలుగు కనిపించింది. అయినా మేం దానికి భయపడలేదు'' అని గుడీగల్ చెప్పారు.
స్థానికులు చాలామంది తాము ఆ వెలుగు గోళాన్ని చూశామని చెబుతుండగా, కొందరు అలాంటి వెలుగు కనిపించడానికి గల కారణాలను వివరించే ప్రయత్నాలు చేశారు.
నమ్మకాలు-నిజాలు
ఈ ప్రాంతంతో హత్యకు గురైన నేటివ్ అమెరికన్ ట్రైబ్ నాయకుడి ఆత్మ ఇక్కడ తిరుగుతోందని వాన్స్ రాండోల్ఫ్ తన పుస్తకంలో రాశారు.
క్వాపాకు చెందిన ఒక కన్య, తన ప్రియుడు యుద్ధంలో మరణించడంతో నదిలో మునిగి ప్రాణత్యాగం చేసిందని, ఆమె ఆత్మే ఈ వెలుగని మరికొంతమంది నమ్ముతారు.
అయితే, గూడీగల్ ఈ కథలను కొట్టిపారేస్తున్నారు. "ఇక్కడి వారంతా స్థానికులు కాదని గుర్తుంచుకోవాలి'' అని ఆమె అన్నారు.
"ఇండియన్ రిమూవల్ యాక్ట్ అమలులోకి వచ్చిన తర్వాత, 1830లో మిసిసిపీ లోయలోని మా పూర్వీకుల ప్రాంతం నుంచి క్వాపా ప్రజలను బలవంతంగా పంపించి వేశారు. ఈ ప్రాంతాన్ని 'ఇండియన్ స్పిరిట్స్'' వెంటాడుతున్నాయన్న కథలు కేవలం కథలు మాత్రమే. వెలుగు అనేది ప్రకృతి నుంచి వస్తుంది. ఇందులో మంచి చెడులాంటివి ఏమీ లేవు'' అని గుడీగల్ అన్నారు.
1936 జనవరిలో కాన్సాస్ సిటీ స్టార్ రిపోర్టర్ అయిన ఏబీ మెక్‌డొనాల్డ్, హార్నెట్ స్పూక్ లైట్‌పై మొట్టమొదటిసారిగా పరిశోధనను చేపట్టారు. రూట్ 66 లో తూర్పు వైపునకు వెళ్లే కార్ల హెడ్‌లైట్లే ఈ రహస్యమైన కాంతి పుంజాలకు కారణమని నిర్ధరించారు.
1965లో పాపులర్ మెకానిక్స్ మేగజైన్‌కు రాసిన ఒక ఆర్టికల్‌లో రచయిత రాబర్ట్ గానన్ కూడా ఇదే మాట చెప్పారు. అతను ఒక నిర్దిష్ట సమయంలో ప్రక్కనే ఉన్న హైవేపై తన హెడ్‌లైట్‌లను వెలిగించారు. అదే సమయంలో డెవిల్స్ ప్రొమెనేడ్‌లో ఉన్న అతని సహాయకుడు, హార్నెట్ స్పూక్ లైట్ తనకు కనిపించిందని చెప్పారు.
అయితే,'' అవి కార్ల హెడ్ లైట్లు అంటే నేను నమ్మలేను'' అని గుడీగల్ అన్నారు. ''ఆ కాంతి ఎగురుకుంటూ మా అంకుల్ ట్రక్ వైపు వచ్చింది. చూడటానికి అది కార్లు లేదా వాహనాల హెడ్‌లైట్‌లాగా అనిపించ లేదు'' అని గుడీగల్ అన్నారు.

ఫొటో సోర్స్, Oklahoma Historical Society
సైన్స్‌లో సమాధానం ఉందా?
"చిత్తడి నేలల నుంచి వెలువడే వాయువు వల్ల ఇలాంటి కాంతి పుంజాలు వస్తాయని కొందరు స్థానికులు భావిస్తున్నారు" అని ఆమె అన్నారు.
కాన్సాస్‌లోని పిట్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో జీవశాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ ఆండ్రూ జార్జ్ దీనిని అంగీకరించలేదు.
"హార్నెట్ స్పూక్ లైట్ చుట్టూ ఉన్న ప్రాంతంలో ఇలాంటి కాంతులను వెదజల్లే వాయువులు ఉత్పత్తి అయ్యే అవకాశం లేదు. ఇలాంటిది మరెక్కడా జరగలేదు" అని ఆయన వివరించారు.
తాను స్వయంగా పరీక్షించనప్పటికీ, హెడ్‌లైట్ల కారణంగా ఈ కాంతి పుంజం ఏర్పడుతోందన్న వాదనను జార్జ్ సమర్థించారు. "హార్నెట్ స్పూక్ లైట్ పశ్చిమాన కొన్ని మైళ్ల దూరంలో ఉన్న పెద్ద రోడ్లపై వాహనాల హెడ్‌లైట్ల వల్ల ఏర్పడుతుంది" అని ఆయన అన్నారు.
"ఆ కాంతి అసాధారణ రూపం, కదలికలు బహుశా స్ప్రింగ్ నది, దాని చుట్టుపక్కల ఉన్న అడవులు, పొలాల పైనుంచి వచ్చే గాలి సాంద్రతలలో మార్పుల వలన జరుగుతుండవచ్చు. చల్లని, వెచ్చని గాలుల గుండా వెళుతున్నప్పుడు కాంతి వక్రీభవనం చెందుతుంది" అని ఆయన అన్నారు.
అయితే, డీన్ వాకర్, మరికొంతమంది స్థానికులు మాత్రం ఈ వాదనను ఒప్పుకోవడం లేదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో అది వాహనాల హెడ్ లైట్ వెలుగు కాదని వారు వాదిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- చైనా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది.. ఈ ‘విధ్వంసానికి’ 5 కారణాలు..
- తెలంగాణ: ‘చూపు పోయింది.. వరంగల్‌లో అడుక్కుని బతకమన్నారు.. 50 ఏళ్లుగా నేను ఏం చేస్తున్నానంటే..’
- జనాభా నియంత్రణ గురించి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు.. టార్గెట్ ముస్లింలు, క్రైస్తవులేనా?
- శ్రీకాకుళం జిల్లా: బట్టలు ఉతకం అన్న రజకులు.. ఇతర కులాల సహాయ నిరాకరణ.. ఏం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మెక్సికోలో అగంతకుల కాల్పులు, మేయర్ సహా 18మంది మృతి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













