Made in India iPhone 14: భారత్ ‘ప్రపంచ ఫ్యాక్టరీ’ అవుతుందా? చైనా స్థానాన్ని భర్తీ చేస్తుందా?

ఫొటో సోర్స్, Apple
- రచయిత, నిఖిల్ ఇనామ్‌దార్
- హోదా, బీబీసీ న్యూస్
తమ తాజా మోడల్ ఐఫోన్-14 ఫోన్లను భారత్‌లో తయారుచేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు గతవారం యాపిల్ వెల్లడించింది. చైనాకు వెలుపల ఫోన్ల తయారీ పరిశ్రమలను పెంచాలని యాపిల్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగానే తాజా నిర్ణయం తీసుకొంది.
మొత్తంగా ఈ ఏడాది ఐఫోన్-14 ఉత్పత్తుల్లో ఐదు శాతాన్ని భారత్‌లో తయారుచేసే అవకాశముంది. విశ్లేషకులు అంచనాల కంటే చాలా వేగంగా యాపిల్ చర్యలు తీసుకుంటోంది.
2025నాటికి మొత్తం ఐఫోన్లలో నాలుగో వంతును భారత్‌లోనే తయారుచేసే అవకాశముందని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు జేపీ మోర్గాన్‌లోని ఒక నిపుణుడు అంచనా వేశారు.
దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో 2017 నుంచి ఐఫోన్లను యాపిల్ తయారుచేస్తోంది. అయితే, కొత్త మోడల్‌ను భారత్‌లో తయారుచేయాలని తాజాగా తీసుకున్న చర్యను ఒక మైలుగాయిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా, చైనాల మధ్య వాణిజ్యపరమైన విభేదాలు తీవ్రం అవుతున్న తరుణంలో తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
మరోవైపు చైనా ‘‘జీరో-కోవిడ్’’ విధానాల వల్ల ప్రపంచ సప్లయి చైన్లకు కూడా అవరోధాలు ఎదురవుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
‘‘చైనా ప్లస్ వన్’’
కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చైనా కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా పరిశ్రమలపై కఠినమైన ఆంక్షలు విధిస్తోంది. ఫలితంగా సప్లయి చైన్లకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఒక వస్తువు విడి భాగాలు భిన్న దేశాల్లో తయారు కావడాన్ని ఆ వస్తువు సప్లయి చైన్‌గా పిలుస్తారు.
చైనా చర్యల వల్ల ప్రపంచ కంపెనీలు ‘‘ప్లస్ వన్’’ వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. అంటే కేవలం చైనాలో మాత్రమే పెట్టుబడులు పెట్టకుండా తమ పరిశ్రమలను భిన్న దేశాలకు విస్తరిస్తున్నాయి.
‘‘ఇదివరకటిలా చైనా ఎలాంటి విధానాలు తీసుకొస్తుందా? అని కంపెనీలు ఎదురుచూస్తూ కూర్చొనే రోజులు పోయాయి. ఇప్పుడు తమ పరిధిని భిన్న దేశాలకు విస్తరిస్తున్నాయి’’అని లాజిస్టిక్స్ కంపెనీ డీహెచ్ఎల్ సప్లయి చైన్ బిజినెస్ సీఈవో ఆస్కార్ డీబాక్ వ్యాఖ్యానించారు.
‘‘ముఖ్యంగా వారి ముందు రెండు, మూడు ప్రత్యామ్నాయాలు ఉండేలా చూసుకుంటున్నారు’’అని డీబాక్ అన్నారు. చైనా, వియత్నాం, మెక్సికో లాంటి దేశాల్లో కొత్త పరిశ్రమలు పెట్టే ట్రెండ్ ఇటీవల కాలంలో ఎక్కువైందని వివరించారు.
డీహెచ్‌ఎల్ వేర్‌హౌసింగ్ సామర్థ్యాన్ని రెండింతలు చేయడమే లక్ష్యంగా 500 మిలియన్ యూరోలు (రూ.4048 కోట్లు) పెట్టుబడులపై ప్రకటన చేసేందుకు భారత్ వాణిజ్య రాజధాని ముంబయికి డీబాక్ వచ్చారు.
భారత్‌ను ‘‘ప్రొడక్షన్ హబ్’’గా మార్చే లక్ష్యం కోసం కృషి చేస్తున్న కంపెనీలకు ఇక్కడి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సహకాలను, రాయితీలను అందిస్తోంది. ముఖ్యంగా వస్తువుల తయారీ, ఎలక్ట్రానిక్స్ లాంటి రంగాల్లో విదేశీ పెట్టుబడుల ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా డీహెచ్ఎల్ ఇక్కడ తమ వ్యాపారాలను విస్తరిస్తోంది.
దేశాన్ని ‘‘ప్రొడక్షన్ హబ్’’గా మార్చే దిశగా ప్రొడక్షన్ లింకెడ్ ఇన్సెంటివ్స్ (పీఎల్ఐ) పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని కిందే ఒక ‘‘సెమీకండక్టర్ ప్లాంట్’’ను భారత్‌లో ఏర్పాటు చేయాలని వేదాంత రిసోర్సెస్ భావిస్తోంది. 20 బిలియన్ డాలర్లు (రూ.1.63 లక్షల కోట్లు) విలువైన ఈ పరిశ్రమ కోసం తైవాన్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌తో సంస్థ కలిసి పనిచేస్తోంది.
ప్రపంచ దేశాలు ‘‘చైనా ప్లస్ వన్’’ వ్యూహం వైపు చూస్తున్నాయని, వారికి భారత్ మెరుగైన గమ్యస్థానంగా కనిపిస్తోందని వేదాంత రిసోర్సెస్ చైర్మన్ అనిల్ అగర్వాల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ ఎందుకు మేలు?
ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్.. వస్తువుల తయారీ, ఎగుమతుల హబ్‌గా దేశాన్ని మార్చే దిశగా వరుస చర్యలు తీసుకుంటోంది.
ఇక్కడ దేశీయ మార్కెట్ చాలా పెద్దది. మరోవైపు కార్మిక శక్తి కూడా తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది.
భారత్ వృద్ధి రేటు 6 నుంచి 7 శాతం మధ్య ఉంటుందని అంచనాలు ఉన్నాయి. మిగతా దేశాలతో పోలిస్తే, ఇక్కడ ద్రవ్యోల్బణం కూడా మరీ అంత ఎక్కువేమీ లేదు. ఈ ఏడాది మెరుగైన ఫలితాలు కనబరిచిన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఒకటి. భారత్ ఎగుమతులు మొత్తంగా గతేడాది 400 బిలియన్ డాలర్లు (రూ.32.74 లక్షల కోట్లు) దాటాయి. గత దశాబ్దంలో ఇవి 300 బిలియన్ డాలర్లు (24.55 లక్షల కోట్లు)కు అటూఇటూగా ఉండేవి.
ఆర్థిక పరమైన ప్రోత్సాహకాలతోపాటు మోదీ ప్రభుత్వం ద్వైపాక్షిక ఒప్పందాలను కూడా కుదుర్చుకుంటోంది. ముఖ్యంగా ప్రపంచ సప్లయి చైన్లలో భారత్‌ను భాగం చేసేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు ఒప్పందాల్లో భారత్ నత్తనడకన వ్యవహరిస్తుందనే భావనను తొలగించే దిశగా చర్యలు తీసుకుంటోంది.
ఈ చర్యలను వ్యాపార సంస్థలు, పరిశ్రమలు స్వాగతిస్తున్నాయి.
అయితే, వాణిజ్య సరళీకరణ దిశగా భారత్ తీసుకునే చర్యలు ఒక అడుగు ముందుకు, మూడు అడుగులు వెనక్కి అనే చందంగా ఉన్నాయని కొందరు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మార్కెట్‌లో క్రియాశీల పాత్ర పోషించేందుకు ఒకవైపు భారత్ ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. అదే సమయంలో ఆత్మనిర్భరత పేరుతో దాదాపు 3000 వస్తువుల దిగుమతిపై భారీగా సుంకాలు విధిస్తోంది. వస్తువుల తయారీ ప్రక్రియల్లో క్రియాశీల పాత్ర పోషించే కొన్ని వస్తువుల దిగుమతిపైనా ప్రస్తుతం సుంకాలు విధిస్తున్నారు.
మార్కెట్లో అందరికీ ఒకేలాంటి నిబంధనలు లేవని కొన్ని విదేశీ కంపెనీలు పదేపదే చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ, దేశీయ సంస్థలకు మేలు చేసేలా ప్రభుత్వం చూస్తోందని ఆరోపిస్తున్నాయి.
చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటివి. అయితే, ప్రభుత్వ అధికారిక ప్రక్రియలు, కార్యకలాపాల్లో ఈ సంస్థల విషయంలో జాప్యం జరుగుతోంది. భూసేకరణకు తీసుకొచ్చిన సంస్కరణలు, త్వరితగతిన లైసెన్సులు లాంటివి ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోతున్నాయని నిపుణులు అంటున్నారు. మౌలిక సదుపాయాలు అనేవి ఇక్కడ ప్రధాన అడ్డుగోడలా మారుతున్నాయి.
‘‘యాపిల్ పరిశ్రమను విజయంగా చెప్పుకోవచ్చు. కానీ, భారత్‌ను తయారీ హబ్‌గా మార్చాలంటే కేవలం పెద్దపెద్ద సంస్థలను ఆకర్షిస్తే సరిపోదు. చిన్న మధ్యస్థ పరిశ్రమలు కూడా మనుగడ సాగించేలా పరిస్థితులు ఉండాలి’’అని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్) డైరెక్టర్ మిహిర్ శర్మ వ్యాఖ్యానించారు.
‘‘అయితే ఇప్పుడు వస్తున్న భారీ పెట్టుబడులు, దీర్ఘకాలంలో ఇలానే కొనసాగుతాయా? అనేది ఇప్పుడే చెప్పడం కష్టం’’అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘భారత్‌లో చిన్న, మధ్యస్థ పరిశ్రమలు భారీగా ఉపాధి కల్పిస్తున్నాయి. కానీ, మోదీ ప్రభుత్వ ఆర్థిక ప్రోత్సాహకాల పథకంలో వీటికి ఎలాంటి ప్రయోజనాలూ లేవు’’అని ఆయన అన్నారు.
జౌళీ రంగం మినహా కార్మికులు ఎక్కువగా పనిచేసే తయారీ పరిశ్రమలకు ఈ పథకంలో ఎలాంటి ప్రత్యేక ప్రోత్సాహకాలు లేవని ఓఆర్ఎఫ్ అంటోంది. ప్లస్ వన్ వ్యూహంలో ఈ రంగాలు ప్రధాన పాత్ర పోషించలవని, మార్కెట్‌లో ఉద్యోగాల కోసం ఏటా కొత్తగా వచ్చే 1.2 కోట్ల మంది యువతకు ఇవి ఉపాధి అవకాశాలు కల్పించగలవని వివరిస్తోంది.
‘‘ఇతర ఆసియా దేశాలతో పోటీ పడగలిగేలా ఇక్కడ వాతావరణాన్ని ప్రభుత్వం మార్చాల్సి ఉంటుంది. ఇక్కడ సిబ్బందికి ప్రత్యేక నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వాలి’’అని శర్మ అన్నారు.
ప్రపంచ బ్యాంకు సులభతర వాణిజ్యం ర్యాంకింగ్స్‌లో భారత్ కంటే థాయిలాండ్, వియత్నాం, దక్షిణ కొరియా ముందున్నాయి. వస్తూత్పత్తికి ఊతం ఇచ్చే సమగ్ర మౌలిక సదుపాయాల కారిడార్‌ల ఏర్పాటుకు ఇప్పటికే మాస్టర్ ప్లాన్- 2030ని వియత్నాం విడుదల చేసింది.
మెరుగైన స్థితిలో భారత్..
ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి భారత్ నేడు మెరుగైన స్థితిలో ఉందని హిన్రిక్ ఫౌండేషన్‌కు చెందిన అలెక్స్ కాప్రి చెప్పారు.
దక్షిణాదిలో తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాదిలో దిల్లీ లాంటి ప్రాంతాలు భారీగా వస్తూత్పత్తికి అనుకూలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. చైనా నుంచి వెనక్కి వస్తున్న అమెరికా, దేశ మిత్రపక్షాలకు ఈ ప్రాంతాలు అనువుగా ఉంటాయని ఆయన వివరించారు.
మరోవైపు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకర పోటీకి ఇది బాటలు పరిచే అవకాశముంది.
భారత్‌లో చవకైన ధరకు లభించే శ్రామిక శక్తిని అవకాశంగా మలచుకుంటూ తైవాన్ టెక్ దిగ్గజాలతో భారత్ ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకుంటే ఇక్కడి తయారీ రంగానికి మేలు జరుగుతుందని కాప్రి అన్నారు.
దీన్ని టిప్పింగ్ పాయింట్‌గా అనుకోవచ్చా?
‘‘భారత్‌కు చెందిన నా స్నేహితులు నాకు ఒక విషయం చెబుతుంటారు. అవకాశాలను చేజార్చుకునే అవకాశాన్ని భారత్ ఎప్పుడూ వదిలిపెట్టదని అంటారు. కానీ, నేడు పరిస్థితులు పూర్తిగా మారాయి’’అని కాప్రి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- చైనా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది.. ఈ ‘విధ్వంసానికి’ 5 కారణాలు..
- తెలంగాణ: ‘చూపు పోయింది.. వరంగల్‌లో అడుక్కుని బతకమన్నారు.. 50 ఏళ్లుగా నేను ఏం చేస్తున్నానంటే..’
- జనాభా నియంత్రణ గురించి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు.. టార్గెట్ ముస్లింలు, క్రైస్తవులేనా?
- శ్రీకాకుళం జిల్లా: బట్టలు ఉతకం అన్న రజకులు.. ఇతర కులాల సహాయ నిరాకరణ.. ఏం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మెక్సికోలో అగంతకుల కాల్పులు, మేయర్ సహా 18మంది మృతి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















