అరబ్ దేశాలు చైనా వైపు ఎందుకు చూస్తున్నాయి, ప్రజాస్వామ్యంలో ఆర్ధిక వ్యవస్థలు దెబ్బతింటాయా

అరబ్ దేశాలు
    • రచయిత, జెస్సీ విలియమ్స్, సారా హెబెర్సన్, బెకీ డేల్
    • హోదా, బీబీసీ న్యూస్ అరబిక్, డేటా జర్నలిజం టీమ్

పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో ప్రజాస్వామ్యంపై అరబ్ ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతున్నారు. తమ దేశాలకు ప్రజస్వామ్యం ఆర్థిక స్థిరత్వాన్ని ఇవ్వడంలేదని వారు భావిస్తున్నారు.

బీబీసీ న్యూస్ అరబిక్ కోసం అరబ్ బారోమీటర్ నెట్‌వర్క్ నిర్వహించిన సర్వేలో ఈ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దీని కోసం తొమ్మిది అరబ్ దేశాలతోపాటు పాలస్తీనా ప్రాంతానికి చెందిన 23,000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు.

ప్రజాస్వామ్యంలో ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుందని ఈ సర్వేలో పాల్గొన్న చాలా మంది అంగీకరించారు.

పదేళ్ల కిందట కైరోలో జరిగిన ఓ ప్రజాప్రదర్శన

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పదేళ్ల కిందట కైరోలో జరిగిన ఓ ప్రజాప్రదర్శన

అరబ్ స్ప్రింగ్ నిరసనలతో ఇక్కడి చాలా దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటైన పదేళ్ల తర్వాత ఈ సర్వే ఫలితాలు ఆసక్తిని రేపుతున్నాయి.

ఈ నిరసనల తర్వాత, ప్రస్తుతం ట్యునీసియా మాత్రమే ప్రజాస్వామ్య దేశంగా ఉంది. అయితే, గత వారంలో ఇక్కడ కొత్త రాజ్యాంగ ముసాయిదాను ప్రచురించారు. ఇది ఆమోదం పొందితే మళ్లీ ట్యునీసియా కూడా నిరంకుశ పాలనలోకి వెళ్లిపోతుంది.

2018/19లో చేపట్టిన ఇదివరకటి సర్వేతో పోల్చినప్పుడు ప్రస్తుత సర్వే 2021/22లో ప్రజాస్వామ్యంపై ప్రజల అభిప్రాయాల్లో మార్పు కనిపిస్తోందని అరబ్ బారోమీటర్ డైరెక్టర్ మైఖెల్ రాబిన్స్ చెప్పారు. ప్రిన్స్‌టన్ యూనివర్సిటీకి చెందిన ఈ నెట్‌వర్క్ పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికాలలో ప్రజాభిప్రాయాలను సేకరించే సంస్థలతో కలిసి పనిచేస్తోంది.

‘‘ప్రజాస్వామ్యం సరైన ప్రభుత్వంకాదని ప్రజలు భావిస్తున్నారు. దీనితో అన్ని సమస్యలనూ పరిష్కరించలేమని వారు అభిప్రాయపడుతున్నారు’’అని ఆయన చెప్పారు.

అరబ్ దేశాలు

ప్రజాస్వామ్యంలో ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుందని సర్వేలో పాల్గొన్న సగం కంటే ఎక్కువ మంది అంగీకరించారు.

మరోవైపు ఎలాంటి ప్రభుత్వం ఏర్పాటైంది? అనే దాని కంటే ప్రభుత్వ విధానాల ప్రభావశీలతపై ఎక్కువ ఆందోళన పడుతున్నట్లు సగం కంటే ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తంచేశారు.

ఈఐయూ డెమొక్రసీ ఇండెక్స్ ప్రకారం.. పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా దేశాలు ఈ సూచీలో అట్టడుగున ఉన్నాయి. దీనిలో ఇజ్రాయెల్‌ను లోపభూయిష్టమైన ప్రజాస్వామ్యంగా పేర్కొన్నారు. మరోవైపు ట్యునీషియా, మొరాకోలను హైబ్రిడ్ వ్యవస్థలుగా అభివర్ణించారు. మిగతావన్నీ నిరంకుశ దేశాలని పేర్కొన్నారు.

ప్రస్తుతం సర్వేలో పాల్గొన్న ఏడు దేశాలకు చెందిన సగం కంటే ఎక్కువ మంది ప్రజలు.. అవసరమైతే నిబంధనలను ఉల్లంఘించి చర్యలు తీసుకునే నాయకుడు కావాలని అభిప్రాయపడ్డారు. మొరాకోలో మాత్రం సగం కంటే తక్కువ మంది ఈ విధానంవైపు మొగ్గుచూపారు. జోర్డాన్, సూడాన్‌తోపాటు పాలస్తీనా ప్రాంతాలకు చెందిన చాలా మంది కూడా నిరంకుశ పాలకులు అవసరంలేదని అభిప్రాయపడ్డారు.

అరబ్ దేశాలు

ట్యునీషియాలో సర్వేలో పాల్గొన్న ప్రతి పదిమందిలో ఎనిమిది మంది అవసరమైతే నిబంధనలను ఉల్లంఘించి చర్యలు తీసుకునే నాయకుడు కావాలని అభిప్రాయపడ్డారు. మరోవైపు ప్రతి పదిమందిలో తొమ్మిది మంది.. 2021లో ప్రభుత్వాన్ని, పార్లమెంటును దేశ అధ్యక్షుడు సయీద్ రద్దు చేయడానికి మద్దతు పలికారు. అయితే, ఆయన చర్యలను ప్రత్యర్థులు తిరుగుబాటుగా విమర్శించారు. కానీ, దేశంలో పేరుకున్న అవినీతిని నిర్మూలించేందుకు ఇది తప్పనిసరని ఆయన వ్యాఖ్యానించారు.

2011 అరబ్ స్ప్రింగ్ నిరసనల తర్వాత సుదీర్ఘ కాలం ప్రజస్వామ్య పాలన కొనసాగించిన ఏకైక దేశం ట్యునీషియా మాత్రమే. అయితే, సయీద్ పాలనలో మళ్లీ ఇది నికుంశ పాలన దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈఐయూ డెమొక్రసీ ఇండెక్స్ 2021 ప్రకారం.. ట్యునీషియా 21 స్థానాలు దిగజారింది. దీన్ని లోపభూష్టమైన ప్రజాస్వామ్యం అనే కంటే హైబ్రిడ్ దేశం అనడం మేలని ఈఐయూ పేర్కొంది.

అరబ్ దేశాలు

ట్యునీషియాలో 2021 అక్టోబరు, నవంబరు నెలల్లో ఈ సర్వే చేపట్టారు. అయితే, ఆ తర్వాత అధ్యక్షుడు సయీద్‌కు వ్యతిరేకంగా నిరసనలు చోటుచేసుకున్నాయి. పార్లమెంటును రద్దుచేసి ఎన్నికల కమిషన్‌ను నియంత్రణలోకి తీసుకోవడంతో ఆయనపై పెద్దయెత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

మరోవైపు కొత్త రాజ్యాంగం కోసం ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తంచేశారు. ఈ రాజ్యాంగం అమలులోకి వస్తే, ఆయనకు మరిన్ని అధికారాలు దాఖలు పడతాయి. మరోవైపు దేశాన్ని ఆర్థిక సంక్షోభం పీడిస్తోంది.

‘‘దురదృష్టవశాత్తు ఇప్పుడు ట్యునీషియా కూడా నిరకుంశ పాలన దిశగా అడుగులు వేస్తోంది. ఇక్కడ ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడుస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇదొక ట్రెండ్‌గా మారింది’’అని అరబ్ బారోమీటర్ వ్యవస్థాపకుడు, ప్రిన్స్‌టన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ డీన్ అమనే జమాల్ వ్యాఖ్యానించారు.

‘‘ఇప్పుడు నిరంకుశంవైపు ఇష్టంతో ప్రజలు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. నిజానికి ప్రజాస్వామ్యం విఫలం అవుతోందని వారు గట్టిగా నమ్ముతున్నారు’’అని ఆయన అన్నారు.

అరబ్ దేశాలు

అవినీతి, రాజకీయ అస్థిరత, కోవిడ్-19 వ్యాప్తి కంటే ఆర్థిక పరిస్థితి వల్లే ఎక్కువ సవాళ్లు ఎదురవుతున్నాయని సర్వేలో పాల్గొన్న ఏడు దేశాలతోపాటు పాలస్తీనా వాసులు కూడా అభిప్రాయపడ్డారు.

ఇరాక్‌లో మాత్రం అవినీతి, లిబియాలో రాజకీయ అస్థిరతను పెద్ద సవాల్‌గా భావిస్తున్నారు.

ప్రతి దేశంలోనూ ముగ్గురిలో ఒకరు గత ఏడాదిలో తమ ఇంట్లో ఆహార నిల్వలు పూర్తిగా తరిగిపోయాయని, అదే సమయంలో పొరుగింటి వారి దగ్గర కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి సరిపడా నిధులు ఉన్నాయని చెప్పారు.

వీడియో క్యాప్షన్, కామసూత్ర: అరబ్ సెక్స్ సాహిత్యంలో ఏముంది?

ఈజిప్టు, మారిటేనియాలలో ఆహార సంక్షోభం గురించి ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఇదే విషయాన్ని వెల్లడించారు.

యుక్రెయిన్‌పై రష్యా దాడికి ముందే, చాలాచోట్ల ఈ సర్వేను నిర్వహించారు. యుక్రెయిన్‌పై దాడి తర్వాత ఆహార సంక్షోభం మరింత ముదిరిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈజిప్టు, లిబియా, ట్యునీషియాలపై ఈ ప్రభావం ఎక్కువగా పడింది. ఈ మూడు దేశాలు గోదుమ దిగుమతి కోసం రష్యా, లేదా యుక్రెయిన్‌పై ఎక్కువగా ఆధాపడుతున్నాయి.

తమ దగ్గర ఆహారం అయిపోయినప్పుడు ఎక్కువ ఆహార పదార్థాలు కొనుగోలు చేయలేకపోయిన వారు ప్రజాస్వామ్యానికి తక్కువగా మద్దతు పలుకుతున్నారు. ముఖ్యంగా సూడాన్, మారిటేనియా, మొరాకోలలో ఈ అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అరబ్ దేశాలు

ఈ అరబ్ దేశాల్లో ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. సర్వేలో పాల్గొన్న వారిలో సగం కంటే తక్కువ మంది మాత్రమే తమ దేశ ఆర్థిక పరిస్థితి బావుందని చెప్పగలుగుతున్నారు.

ఈ దేశాల్లో లెబనాన్ అట్టడుగున ఉంది. ఇక్కడ కేవలం ఒక శాతం కంటే తక్కువ మంది మాత్రమే తమ ఆర్థిక వ్యవస్థ బావుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. 19వ శతాబ్దం మధ్య నుంచి పోలిస్తే, ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణంగా పతనమైన దేశాల్లో లెబనాన్ కూడా ఒకటని ఇటీవల ప్రపంచ బ్యాంకు పేర్కొంది.

మరోవైపు రానున్న రెండు మూడేళ్లలో తమ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని భావించడంలేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే, ఆరు దేశాల్లో మూడోవంతు ప్రజలు మాత్రం తర్వాత రెండు, మూడేళ్లలో పరిస్థితి మెరుగు పడొచ్చని ఆశాభావం వ్యక్తంచేశారు.

వీడియో క్యాప్షన్, నూపుర్ శర్మ వివాదంతో గల్ఫ్‌లో తమపైన ఎలాంటి ప్రభావం పడలేదన్న ప్రవాస భారతీయులు

ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం పీడిస్తున్నప్పటికీ ట్యునీషియా ప్రజలు చాలా ఆశాభావంతో ఉన్నారు. వీరిలో 61 శాతం మంది పరిస్థితి మెరుగుపడుతుందని చెబుతున్నారు.

భవిష్యత్ మాత్రం అస్పష్టంగా ఉందని డాక్టర్ రాబిన్స్ అంటున్నారు. చైనా లాంటి ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థలవైపు ఇక్కడి ప్రజలు చూస్తున్నారని ఆయన అన్నారు. ‘‘చైనాలో గత 40ఏళ్లలో భారీగా ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చారు. అలాంటి వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి ఇప్పుడు ప్రజలకు అవసరం’’అని ఆయన వ్యాఖ్యానించారు.

(డేటా జర్నలిజంలో ఎర్వన్ రివాల్ట్ సాయం అందించారు.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)