బ్రిటన్: ‘ధరలు పెరిగిపోయాయి, కడుపునిండా తినే స్థోమత లేదు.. నూడుల్స్ తిని బతకాల్సి వస్తోంది’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వరికూటి రామకృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్న దేశం బ్రిటన్.
బ్రిటన్ ప్రధానమంత్రులు తరచూ మారుతున్నారు. నిన్నకాక మొన్న అధికారం చేపట్టిన లిజ్ ట్రస్ అప్పుడే రాజీనామా చేశారు.
మరొకవైపు బ్రిటన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని, పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే వార్తలు కూడా మీడియాలో కనిపిస్తున్నాయి.
లిజ్ ట్రస్ తరువాత బ్రిటన్ ప్రధాని పగ్గాలు ఎవరు చేపడతారు? ప్రస్తుత ఆర్థిక, రాజకీయ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారు? అనే అంశాల మీద మీడియాలో చర్చలు నడుస్తున్న తరుణంలోనే పెరుగుతున్న ధరలు తమ జీవితాలను ఎలా తలకిందులు చేస్తున్నాయో ప్రజలు మాట్లాడుతున్నారు.

నూడుల్స్ మాత్రమే తినాల్సి వస్తోంది..
మాండీ డోక్స్ వంటి వారు ఈ మధ్య ఎక్కువగా నూడుల్స్ మాత్రమే తింటున్నారు. అవంటే ఆ యువతికి ఇష్టమని కాదు, ఇతర ఫుడ్ ఐటమ్స్ కొనే స్థోమత లేక.
నార్విచ్‌కు చెందిన రెబెక్కా కెల్లావే పెరుగుతున్న ఖర్చులను తట్టుకునేందుకు అయిదు ఉద్యోగాలు చేస్తున్నారు.
కరెంటు బిల్లుకు భయపడి, చలికి హీటర్ వేసుకోవడం కూడా మానేశారు గెయిన్స్‌బరోకు చెందిన నికోలీ.
అంతేకాదు ఆహార పదార్థాలు ఎక్కడ తక్కువ రేటుకు దొరుకుతాయా అని నాలుగైదు మార్కెట్లు తిరిగి కొంటున్నారు. రేపటి కోసం పొదుపు చేసుకున్న సేవింగ్స్ నుంచి డబ్బులు బయటకు తీస్తున్నారు. ఇంట్లో వాళ్లు, తెలిసిన వాళ్ల నుంచి చేబదులు తీసుకుంటున్నారు. బ్యాంకులను లోన్లు అడుగుతున్నారు. చివరకు కొందరు తిండి కోసం ప్రభుత్వం నడిపే ఫుడ్ బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు.
మారుతున్న వీరి జీవన పరిస్థితులు బ్రిటన్ ఆర్థికవ్యవస్థ ఇబ్బందుల్లో ఉందనేందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
42శాతం పెరిగిన పాల ధరలు
ఇంగ్లండ్‌లోని మిల్టన్ కీన్స్ అనే కౌన్సిల్ ఏకంగా ఎమర్జెన్సీ విధించింది. ప్రజలు విద్యుత్, గ్యాస్, పెట్రోలు వంటి ఖర్చులు చెల్లించలేక పోవడంతో 'కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎమర్జెన్సీ' విధిస్తున్నట్లు కౌన్సిల్ ప్రకటించింది.
బ్రిటన్‌లో ధరలు పెరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బణం సుమారు 10శాతానికి చేరింది. ఇది 40 ఏళ్ల గరిష్టం. ఇది ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు.
2021 సెప్టెంబరు నుంచి ఈ ఏడాది సెప్టెంబరు మధ్య పాల ధర 42.1శాతం పెరిగింది. గోదుమ, మొక్కజొన్న వంటి వాటి పిండి ధరలు 29.6శాతం పెరిగాయి. జామ్ 28.1శాతం, చీజ్ 23.1శాతం, గుడ్లు 22.3శాతం, ఆలుగడ్డ 19.9శాతం, చికెన్ 17.2శాతం, బ్రెడ్ 146.శాతం చొప్పున ప్రియం అయ్యాయి.
ఇక పెట్రోలు, డీజిల్ ధరలు ఇప్పటికే కొండ ఎక్కి కూర్చున్నాయి. లీటరు పెట్రోలు ధర సుమారు రూ.167(162.81 పెన్స్), డీజిల్ రేటు దాదాపు రూ.187(181.86 పెన్స్). ఇవి గతంలో కంటే చాలా ఎక్కువ.
2020లో సగటున లీటరు పెట్రోలు 110 పెన్స్ ఉండగా డీజిల్ ధర 115 పెన్స్‌గా ఉండేది.
ఈ కష్టాలనే తగ్గించి ప్రజల బతుకు చిత్రాలను మారుస్తానంటూ లిజ్ ట్రస్ అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు ఆ పని చేయలేక దిగిపోతున్నారు.

ఫొటో సోర్స్, BBC
ఆర్థికమాంద్యం వచ్చిందా?
ఇటీవలే బ్రిటన్‌ను అధిగమించి ప్రపంచంలోనే అయిదో పెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ అవతరించింది. కొంతకాలంగా బ్రిటన్ జీడీపీ తగ్గుతూ రావడం కూడా ఇందుకు ఒక కారణంగా కనిపిస్తోంది.
2020లో బ్రిటన్ జీడీపీ 11శాతం పడిపోయింది. 1709 తరువాత ఇదే అతి పెద్ద క్షీణత. ఆ తరువాత కాస్త కోలుకున్నట్లు కనిపించినా ఈ ఏడాది అగస్టులోనూ మళ్లీ -0.3శాతం నమోదైంది. తయారీ, సేవల రంగాలు నెమ్మదించాయి. డాలర్‌తో పోలిస్తే పౌండ్ పడిపోతూ ఉంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేట్లు పెంచుతోంది.
మరోవైపు లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీకి చెందిన ఎఫ్‌టీఎస్‌ఈ 100 ఇండెక్స్ గత ఆరు నెలల్లో 9.26శాతం పడిపోయింది. గత అయిదేళ్లలో 7.78శాతం నష్టాన్ని చవి చూసింది.
బ్రిటన్ ఆర్థికమాంద్యంలోకి జారుకుంటున్నట్లు రాయిటర్స్ వంటి వార్తా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఆర్థికమాంద్యం వచ్చి ఉండొచ్చు అని కొందరు నిపుణులు భావిస్తున్నారు.
కారణాలు ఏంటి?
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కరోనా సంక్షోభం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీనికి అదనంగా రష్యా-యుక్రెయిన్ యుద్ధం మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది.
కానీ బ్రిటన్ ఆర్థిక సమస్యలకు మరొక కారణం ఉంది. అదే బ్రెగ్జిట్... అంటే యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ బయటకు రావడం. బ్రెగ్జిట్ తరువాత ఏర్పడిన అనిశ్చితితో బ్రిటన్ ఆర్థికవ్యవస్థ చిక్కుల్లో పడింది.
నేటికీ ఈయూతో వాణిజ్య పరంగా బ్రిటన్ పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చాలానే మిగిలి పోయాయి.

ఫొటో సోర్స్, AFP
బ్రెగ్జిట్
2016లో నిర్వహించిన రెఫరెండంలో ఈయూ నుంచి బ్రిటన్ బయటకు రావాలని ప్రజలు తీర్పునిచ్చారు. నాటి నుంచి బ్రిటన్‌కు విదేశీ పెట్టుబడులు రావడం తగ్గిపోయింది. ఎందుకంటే బ్రిటన్‌కు ఉన్న అతి పెద్ద వాణిజ్యభాగస్వామి ఈయూ.
బ్రెగ్జిట్ వల్ల దీర్ఘకాలంలో బ్రిటన్ ఆర్థికవ్యవస్థ 4శాతం తగ్గుతుందని ఆ దేశ ప్రభుత్వానికి చెందిన ఆఫీస్ ఫర్ బడ్జెట్ రెస్పాన్సిబిలిటీ(ఓబీఆర్) గత ఏడాది అంచనా వేసింది.
2021 జనవరి నుంచి చూస్తే ఈయూ కూటమికి బ్రిటన్ ఎగుమతులు 16శాతం పడిపోయాయి. బ్రిటన్‌కు ఈయూ ఎగుమతులు 20శాతం తగ్గాయి.
కరోనా సంక్షోభం
అన్ని దేశాల మాదిరిగానే బ్రిటన్ ఆర్థికవ్యవస్థ మీద కోవిడ్-19 సంక్షోభం తీవ్ర ప్రభావం చూపింది. 2020లో ఆ దేశ జీడీపీ -11శాతం నమోదైంది. 2021లో మళ్లీ పెరిగి 7.5శాతంగా రికార్డ్ అయింది.
లాక్ డౌన్, ఆర్థిక కార్యకలాపాలు నిలిచి పోవడం, ప్రయాణాలు ఆగిపోవడం, ఎగుమతులు-దిగుమతులు ఇబ్బందుల్లో పడటం వంటివి బ్రిటన్ ఆర్థికవ్యవస్థ మీద తీవ్ర ప్రభావాన్ని చూపాయి.

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్-రష్యా యుద్ధం
కరోనా సంక్షోభం ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోక ముందే యుక్రెయిన్-రష్యా యుద్ధం రూపంలో ప్రపంచానికి మరొక ముప్పు వచ్చి పడింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో యుక్రెయిన్ మీదకు రష్యా దండెత్తింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు అమాంతం పెరిగిపోయాయి. అప్పటి వరకు దాదాపు 90 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ముడిచమురు ధర మార్చిలో 134 డాలర్ల వరకు పెరిగింది.
దీంతో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. లాక్‌డౌన్ తరువాత ఇంధనానికి డిమాండ్ బాగా పెరిగింది. అదే సమయంలో యుక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల డిమాండ్‌కు తగిన చమురు సరఫరా జరగడం లేదు.
మరొకవైపు 40శాతం గ్యాస్‌ను రష్యా నుంచే దిగుమతి చేసుకుంటోంది యూరప్. యుక్రెయిన్ మీద దాడిని వ్యతిరేకిస్తూ పశ్చిమ దేశాలు రష్యా మీద ఆంక్షలు విధించాయి. దాంతో యూరప్‌కు సరఫరా చేస్తున్న గ్యాస్‌ను రష్యా తగ్గించింది.
ఇందువల్ల కూడా బ్రిటన్‌లో గ్యాస్ ధరలు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. నార్వే నుంచి సుమారు 70శాతం గ్యాస్‌ను బ్రిటన్ దిగుమతి చేసుకుంటోంది. యూరప్‌కు రష్యా గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో ఆ లోటును పూడ్చేందుకు నార్వే ప్రయత్నిస్తోంది. అందువల్ల బ్రిటన్‌కు నార్వే గ్యాస్ సరఫరా మీద ఒత్తిడి పడుతోంది.
మరొక వైపు దిగుమతులు తగ్గి దేశంలో ఆహార ధాన్యాల లభ్యత తగ్గిపోయింది. దీంతో ఆహార పదార్థాల ధరలు పెరిగిపోయాయి.
ఇక ప్రజల జీతాలు పెద్దగా పెరగడం లేదు. ప్రైవేటు సెక్టారులో 6.2శాతం, ప్రభుత్వ రంగంలో 2.2శాతం మాత్రమే జీతాలను పెంచారు. కానీ ద్రవ్యోల్బణం రేటు అంతకంటే ఎక్కువగా ఉంది.
ఇవి కూడా చదవండి:
- చిన్నాన్న-పెదనాన్న, మేనత్త-మేనమామ పిల్లల్ని పెళ్లి చేసుకుంటే జరిగే జన్యు మార్పులు ఏంటి?
- మోదీ ప్రభుత్వం ముస్లిం, క్రైస్తవ దళితులకు రిజర్వేషన్లు ఇవ్వాలని నిజంగానే అనుకుంటోందా?
- పాకిస్తాన్లో క్రికెట్‌ను భారత్ వ్యాపార సంస్థలే నడిపిస్తున్నాయా? బీసీసీఐ నిధులు ఇవ్వకపోతే పాక్ క్రికెట్ బోర్డు కూలిపోతుందా?
- రాజరాజ చోళుడు హిందువు కాదా, అసలు హిందూ అనే మతమే లేదా, చరిత్ర ఏం చెబుతోంది?
- వీర్యం శరీరంపై పడితే అలర్జీ వస్తుందా, ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














