సైకోపాత్ లక్షణాలు ఏమిటి? ఫిమేల్ సైకోపాత్‌ జీవితం ఎలా ఉంటుంది?

సైకోపాత్

ఫొటో సోర్స్, Somsara Rielly

    • రచయిత, మేఘ మోహన్
    • హోదా, జెండర్, ఐడెంటిటీ రిపోర్టర్

‘‘సైకోపతీ’’ అనేది ఒక వ్యాధి. దీని గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి కనబరుస్తుంటారు. అసలు సైకోపాత్‌లను గుర్తించడం ఎలా అంటూ ఆన్‌లైన్‌లో వీడియోలు కూడా కనిపిస్తుంటాయి.

అయితే, దీని గురించి ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. చాలా మంది దీన్నొక చెడు వ్యాధిగా భావిస్తుంటారు. ముఖ్యంగా మహిళలకు సైకోపతీ సోకినప్పుడు ఈ సమస్య మరింత జటిలం అవుతోంది.

విక్టోరియాకు తన బాయ్‌ఫ్రెండ్ భార్య గురించి తెలుసు. అయితే, అతడికి మరికొంత మంది ప్రియురాళ్లు ఉన్నారేమో అని విక్టోరియాకు అనుమానంగా ఉండేది.

ఆ ఆరోపణలపై తన దగ్గర ఎలాంటి ఆధారాలూలేవని విక్టోరియా చెప్పారు. కానీ, అతడి బాడీ లాంగ్వేజ్ భిన్నంగా కనిపించేదని ఆమె అన్నారు. ఆయన చెప్పే మాటలు పొంతన ఉండేవి కాదని, అబద్ధం చెప్పినప్పుడు అతడి ముఖం కాస్త భిన్నంగా కనిపిస్తుందని వివరించారు.

‘‘సంభాషణల విషయంలో నా జ్ఞాపకశక్తి చాలా మెరుగ్గా ఉంటుంది’’అని ఆమె చెప్పారు. ‘‘అతడికి అబద్ధాలు చెప్పడం రాదు. అసలు తన భార్య ఈ విషయాలను ఎందుకు గుర్తించలేకపోతోందో నాకు అర్థం కావడం లేదు’’అని ఆమె చెప్పారు.

సైకోపాత్

ఫొటో సోర్స్, Somsara Rielly

బలమైన కోరికే...

అతడిని ఎలాగైనా శిక్షించాలనే బలమైన కోరిక విక్టోరియా మానసిక స్థితిని తలకిందులు చేసింది. కొన్ని రోజులకు ఆమె ప్రవర్తన పూర్తిగా మారిపోయింది.

అలా కొన్ని నెలల్లో ఆమె పూర్తిగా మారిపోయారు. తన బాయ్‌ఫ్రెండ్ నగ్న చిత్రాలను కూడా అతడి భార్యకు ఆమె పంపించారు. ఆ తర్వాత అసలేమీ తెలియనట్లు ప్రవర్తించేవారు.

తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయిన అతడు తన దగ్గరకు వచ్చినప్పుడు.. అసలు అలాంటి ఫోటోలను ఎవరు పంపించి ఉంటారు? అని విక్టోరియా అడిగేవారు. నిజానికి ఈ మధ్యలో అతడి బాయ్‌ఫ్రెండ్ భార్య ఆరోగ్యం కూడా దెబ్బతింది.

మొత్తానికి తను ఇతర మహిళలతో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్లు విక్టోరియా ఎదుట అతడు అంగీకరించాడు. కానీ, ఆ ఫోటోలు పంపింది విక్టోరియానేనని అతడు అనుమానించలేదు. పైగా అతడిని ఆమె ఓదార్చేది కూడా.

ఆ తర్వాత ఆమెకు విసుగువచ్చింది. ఆ రిలేషన్‌షిప్‌కు ముగింపు పలకాలని అనుకుంది. దీంతో అతడి భార్యకు వరుసగా మిగిలిన అన్ని నగ్న ఫోటోలను ఆమె పంపించారు. అందులో చివరి ఫోటోలో ఆమె కూడా ఉన్నారు. అలా మొత్తంగా ఆ కథకు ఆమె ముగింపు పలికారు.

ఈ కథ తనకు తెలిసిన వారందరికీ విక్టోరియా చెప్పేవారు. అయితే, ఆమెను చూసి చాలా మంది భయపడేవారు. మరికొంత మంది అప్రమత్తం అయ్యేవారు. ‘‘అతడి భార్యకు ఎందుకు అలా చేశావు? ఆమెకు అంత వేదనను ఎందుకు మిగిల్చావు? అని కొంత మంది నన్ను అడిగేవారు’’అని విక్టోరియా వివరించారు. అయితే, జీవితం అనేది కొందరికి శాపంలా మారుతుందని ఆమె తనకు తానే సర్దిచెప్పుకునేది.

‘‘నాలో ఒకప్పుడు కనిపించిన విపరీత సైకోపాత్ లక్షణాలకు ఇదొక ఉదాహరణ. ఇతరులకు ఏం అవుతుందోనని అసలు పట్టించుకునేదాన్ని కాదు’’అని ఆమె వివరించారు.

సైకోపాత్

ఫొటో సోర్స్, Somsara Rielly

మానసిక రుగ్మత..

సైకోపతీ రుగ్మతను చాలా దేశాల్లో మానసిక రుగ్మతగా అధికారికంగా నిర్ధారించరు. అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ (ఏపీఏ) విడుదల చేసే తాజా డయోగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్‌ల జాబితాలోనూ ఇది లేదు. కానీ, ఈ పదాన్ని వైద్యులతోపాటు సాధారణ ప్రజలకు కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

దీన్ని ‘‘న్యూరోసైకియాట్రిక్ డిజార్డర్’’గా చెప్పుకోవచ్చు. ఎలాంటి సానుభూతి చూపించకపోవడం, ఇతరులతో కలవకపోవడం, నేరప్రవృత్తిని కలిగి ఉండటం లాంటి లక్షణాలు ఈ వ్యాధితో బాధపడేవారిలో కనిపిస్తాయి. 19వ శతాబ్దం మొదట్లో అమెరికా, యూరప్‌లలోని డాక్టర్లు ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగించడం మొదలుపెట్టారు. 1941ల్లో దీనిపై పరిశోధనలు కూడా మొదలయ్యాయి.

‘‘సైకోపతీని నిర్వచించడంపై ప్రపంచ ప్రముఖ విద్యావేత్తలు చర్చలు కూడా నిర్వహించారు’’అని వాషింగ్టన్ డీసీలోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీకి చెందిన సైకాలజీస్టు, న్యూరోసైంటిస్టు అబీగైల్ మార్ష్ చెప్పారు. ‘‘మీరు ఫొరెన్సిక్ సైకాలజిస్టుతో మాట్లాడితే ఒకరమైన వివరణ వస్తుంది, అదే క్రిమినాలజిస్టుతో మాట్లాడితో మరొక రకంగా చెబుతారు’’అని ఆమె వివరించారు.

సైకోపాత్

ఫొటో సోర్స్, Somsara Rielly

30 శాతం మందిలో లక్షణాలు..

సాధారణంగా హింసాత్మక లేదా విపరీతమైన భావోద్వేగాలను కనబరిచినప్పుడే సైకోపతీ లక్షణాలు ఉన్నట్లు క్రిమినల్ సైకాలజిస్టులు చెబుతారని మార్ష్ వివరించారు. ‘‘అయితే, ఈ రుగ్మత చాలా భిన్నమైనది. మనిషిని బట్టీ మారుతుంది. అలా లక్షణాలు బయటకు కనిపించినప్పుడు మాత్రమే సైకోపతీ ఉందని భావించకూడదు’’అని అంటారు ఆమె.

‘‘అయితే, ఇటు సైకాలజిస్టులు, అటు సైకియార్టిస్టులు ఇద్దరూ అంగీకరించే విషయం ఏమిటంటే.. ప్రపంచంలో ప్రతి వంద మందిలో ఒకరి నుంచి ఇద్దరికి ఈ లక్షణాలు ఉంటాయి. మరోవైపు 30 శాతం మందికి ఏదో ఒక స్థాయిలో ఈ రుగ్మత లక్షణాలు ఉంటాయని కొన్ని పరిశోధనలు కూడా వెల్లడించాయి’’అని మార్ష్ చెప్పారు.

‘‘సైకోపతీపై పరిశోధనలన్నీ నేరస్థుల చుట్టూ తిరుగుతుంటాయి. నిజానికి ప్రజలందనీ దృష్టిలో పెట్టుకొని ఈ పరిశోధనలు చేపట్టాలి’’అని మార్ష్ చెప్పారు.

అయితే, మహిళలతో పోలిస్తే, పురుషులకు ఈ రుగ్మత సోకే అవకాశం ఎక్కువని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ‘‘ఇలా ఎందుకు జరుగుతుందంటే 1970ల్లో పురుష ఖైదీలపై కెనడా సైకాలజిస్టు పరిశోధన చేపట్టి ఆ సైకోపతీ పరీక్షను అందుబాటులోకి తీసుకొచ్చారు. అందుకే అది పురుషుల్లోనే సైకోపాత్‌లనే ఎక్కువగా గుర్తించగలుగుతోంది’’అని మార్ష్ వివరించారు.

సైకోపాత్‌లపై నిర్వహించిన అధ్యయనాలను మాద్రీద్‌ యూనివర్సిటీలోని సైకాలజీ పీహెచ్‌డీ స్టూడెంట్ అనా శాంగ్ గార్సియా విశ్లేషించారు. ‘‘ఈ అధ్యయనాలలో పురుషులతో పోలిస్తే సైకోపాత్ మహిళల్లో హింసా ప్రవృత్తి కాస్త తక్కువగా కనిపిస్తుందని, అయితే, ఇతరులను తమ మాటలతో ప్రభావితం చేయడంలో వీరి పాత్ర ఎక్కువని తేలింది’’అని ఆమె చెప్పారు.

వీడియో క్యాప్షన్, నిద్ర సరిగా పోని వాళ్ళకు సాయం చేసే గుణం తగ్గిపోతుందా?

సైకోపాత్‌ల లక్షణాలు ఏమిటి?

డాక్టర్ మార్ష్ మొదలుపెట్టిన సైకోపతీఎల్ఎస్.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో అసలు సైకోపాత్‌ల లక్షణాలు ఎలా ఉంటాయో పేర్కొన్నారు.

  • జీవిత భాగస్వాములతో చాలా సెల్ఫిష్‌గా ప్రవర్తించడం
  • బాధలో ఉండేవారిపై కనీస సానుభూతి చూపకపోవడం
  • ఇతరులను బాధపెట్టిన తర్వాత కనీసం పశ్చాత్తపం ప్రకటించకపోవడం
  • తమ పనులను పూర్తిచేసుకోవడానికి ఇతరులను వాడుకోవడం లేదా మోసం చేయడం
  • ప్రమాదకరమైన లేదా ముప్పు పొంచివున్న పనులు చేయడం
  • తమకు పనులను చేయించుకోవడానికి పైపైకి మంచిగా కనిపించడం

 ఇతరులను తన మాటలతో లోబరుచుకునే లక్షణాలు తనలో చిన్నప్పటి నుంచీ ఉన్నాయని విక్టోరియా చెబుతున్నారు.

తన బాల్యం మలేసియాలో చాలా బాధాకరంగా గడిచింది. ఆమె తండ్రి మద్యానికి బానిస కావడంతో ఇంట్లో పరిస్థితులు దారుణంగా ఉండేవి. సరదా కోసం ఆమె స్నేహితుల రహస్యాలను ఇతరులకు చెప్పేసేవారు. స్కూళ్లో చాలా గొడవలకు ఆమెనే కారణమయ్యేవారు.

తను చేసే తప్పులకు ఇతరులు బాధ్యత తీసుకునేలా వారిని ఎలా లోబరుచుకోవాలో విక్టోరియాకు బాగా తెలుసు. ఆపద నుంచి ఎలా బయటపడాలో కూడా ఆమె నేర్చుకున్నారు. పిల్లలు ఒత్తిడి చేయడం వల్లే తనపై టీచర్ చాక్‌పీస్ విసిరారని టీచర్‌కే ఆమె చెప్పేవారు.

‘‘నిజానికి టీచర్‌ కూడా అదే వినాలని అనుకునేవారు. చాలా తెలివైన ఈ అమ్మాయి చెడ్డదికాదని టీచర్ నమ్మాలని నేను అనుకునేదాన్ని’’అని ఆమె వివరించారు.

వీడియో క్యాప్షన్, ఇవి రాత్రి పూట తమ నివాస రంధ్రాలు వీడి, కొత్త రంధ్రాలు వెతుక్కుని, అక్కడ జీవులతో జతకడతాయి

సైకోపాత్ చాలెంజ్..

ఇటీవల ‘‘ద సైకోపాత్ చాలెంజ్’’ వీడియోలు టిక్‌టాక్‌లో వైరల్ అవుతున్నాయి. వీటికి 2 కోట్లకుపైగా వ్యూస్ వచ్చాయి. అసలు సైకోపాత్‌లను గుర్తుపట్టడం ఎలా? అనే డిస్క్రిప్షన్‌తో, సైకోపాత్ ట్యాగ్‌తో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. విచారణను ఎదుర్కొంటున్న ఖైదీలు, కొన్ని చెడు ప్రవర్తన కనిపించే వీడియోలు వీటిలో ఉన్నాయి. అయితే, ఈ వీడియోలపై ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. అదే సమయంలో వీటిని ద్వేషిస్తున్నారు కూడా.

అయితే, ఈ వీడియోల్లో తనకేమీ ద్వేషం కనిపించడం లేదని విక్టోరియా అంటున్నారు.

‘‘అసలు సైకోపాత్ అంటే.. ఇతరులు ఏం అనుకుంటున్నారో పట్టించుకోకపోవడం. అందుకే వాటి గురించి నేను పెద్దగా ఆందోళన పడను’’అని అంటారు ఆమె.

‘‘అదే సమయంలో ఈ వ్యాధి గురించి ప్రజలకు ఎంత తక్కువ తెలుసో అన్న విషయం దీని నుంచి మనం అర్థం చేసుకోవచ్చు’’అని ఆమె వివరించారు.

సైకోపాత్ లక్షణాలు ఉండేవారు జంతువులకు హాని చేస్తారని వీడియోల కింద కమెంట్లలో చెబుతున్నారు. దీనిపై విక్టోరియా స్పందిస్తూ.. ‘‘మా లాంటి వారు మనుషుల కంటే జంతువులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు’’అని ఆమె అన్నారు. తన పెంపుడు పిల్లి గిబ్బెరిష్‌ను ఆమె చూపించారు.

‘‘మాలాంటి వారు’’అని పదాన్ని ఆమె ఆన్‌లైన్ సైకోపాత్ కమ్యూనిటీ గురించి ఉపయోగించారు. సైకోపతీతో బాధపడుతున్న ప్రముఖ రచయిత ఎంఈ థామస్ బ్లాగు నుంచి వీరంతా ఒక కమ్యూనిటీగా ఏర్పడ్డారు.

టెక్సస్ ఏఅండ్ఎం యూనివర్సిటీ ఫొరెన్సిక్ సైకోలజిస్టు డాక్టర్ ఏడెన్స్ నిర్వహించిన టెస్టులో థామస్‌కు 99 శాతం సైకోపాత్ లక్షణాలు ఉన్నాయని తేలింది.

వీడియో క్యాప్షన్, కళ్ళు ఎందుకు అదురుతాయి? కళ్ళు చెప్పే ఆరోగ్య రహస్యాలివే..

సోషియోపాత్

అసలు సైకోపతీతో జీవితం ఎలా ఉంటుందో థామస్ తన బ్లాగులో వివరించారు. అయితే, ఆమె సైకోపాత్‌కు బదులుగా సోషియోపాత్ అనే పదాన్ని ఉపయోగించారు. ఈ పదాన్ని ప్రజలు మెరుగ్గా అర్థం చేసుకుంటారని ఆమె చెబుతున్నారు.

సైకోపాత్‌ అనే పదానికి చెడ్డపేరు ఉందని భావించేవారు ఎక్కువగా సోషియోపాత్‌ను ఎంచుకుంటారని డాక్టర్ మార్ష్ చెప్పారు.

థామస్ బ్లాగు ఒక పుస్తకంగా ప్రచురితమైంది. దీన్ని పదికిపైగా భాషల్లోకి అనువదించారు. దీనిపై ఒక సినిమా కూడా వస్తోంది. దీనిలో లీసా ఎడెల్‌స్టెయిన్ నటిస్తున్నారు.

‘‘నన్ను నేను ఒక ఫార్ములాగా భావిస్తాను. మనిషిలా అనుకోను. ఇది ఎలా ఉంటుందంటే.. ఎక్సెల్ షీట్‌లో మనకు కావాల్సిన ఫలితం కోసం ఫార్ములా సిద్ధంచేసినట్లే ఉంటుంది’’అని థామస్ వివరించారు.

ఉదాహరణకు తను ఎవరినైనా ప్రేమిస్తున్నానని చెబితే, వారి నుంచి తను ఎదైనా తప్పకుండా కోరుకుంటానని ఆమె వివరించారు.

ఇతరులను మాటలతో లోబరుచుకోవడం అనేది ప్రధానమైన సైకోపాత్ లక్షణం. ఇదే తను లాయర్‌గా స్థిరపడేందుకు ఉపయోగపడిందని థామస్ చెబుతున్నారు.

బ్లాగులో తన రోజువారీ ఆలోచనలు, ఇంటర్వ్యూలను థామస్ పెడుతుంటారు. ఇతర సైకోపాత్ లక్షణాలు ఉండేవారిని ఆమె ఇంటర్వ్యూ చేస్తుంటారు.

ఆమె పోస్టులు, వీడియోల కింద చాలా మంది కమెంట్లు చేస్తుంటారు. తమలో కూడా ఇలాంటి అక్షణాలు ఉన్నాయని, ఇక్కడ తమపై ఎలాంటి పక్షపాతం ఉండదని చెబుతుంటారు.

వీడియో క్యాప్షన్, శరీరానికి తగినంత విటమిన్-డి అందాలంటే ఏ సమయంలో ఎంతసేపు ఎండలో ఉండాలి?

‘‘మనలో ప్రతి ఒక్కరికీ ఈ సైకోపాత్ లక్షణాలుండే ఎవరో ఒకరు తెలిసే ఉంటారు’’అని డాక్టర్ మార్ష్ వివరించారు. సైకోపతీ ఎల్‌ఎస్ పేరుతో ఆమె ఒక స్వచ్ఛంద సంస్థను కూడా మొదలుపెట్టారు. సైకోపతీతో బాధపడేవారికి ఆమె దీని ద్వారా సాయం అందిస్తున్నారు.

సైకోపతీ అనే రుగ్మత విషయంలో ఉండే చెడు ఆలోచనలను తొలగించాలని డాక్టర్ మార్ష్ ప్రయత్నిస్తున్నారు.

‘‘సైకోపతీ అనేది ఒక కేటగిరీ కాదు. ఇది అందరిలోనూ కనిపిస్తుంది. అయితే, ఇది ఒక్కొక్కరిలో ఒక్కోస్థాయిలో ఉంటుంది. కొంతమంది వల్ల విధ్వంసాలే జరుగుతాయి. కొందరు తమ లక్షణాలను అదుపులో పెట్టుకుంటారు’’అని ఆమె వివరించారు.

విక్టోరియా, థామస్‌లు ఇప్పుడు ధ్యానం, థెరపీతో లక్షణాలను అదుపులో ఉంచుకుంటున్నారు. వీరికి ఆన్‌లైన్‌లో ప్రజల మద్దతు కూడా లభిస్తోంది.

‘‘ఎప్పుడూ ఆ ప్రపంచంలోనే ఉండిపోకుండా ఉండటానికి ఇవి తోడ్పడతాయి. కానీ, ఇప్పటికీ సైకోపాత్ అనే వ్యాధి చుట్టూ చాలా అపోహలు ఉన్నాయి. ఈ విషయంలో చేయాల్సిన కృషి చాలా ఉంది. చర్చలు జరగాలి. దీని గురించి అందరూ తెలుసుకోవాలి’’అని విక్టోరియా అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)