అమెజాన్: రోబోలు విస్తరించాయి.. కానీ ‘మనుషులు ఇంకా అవసరమే’

రోబో చెయ్యి

ఫొటో సోర్స్, AMAZON

ఫొటో క్యాప్షన్, అమెజాన్ కొత్త రోబో ‘స్పారో’ వస్తువులను ఏరి, వాటిని బాక్సుల్లో ప్యాక్ చేయగలదు

అమ్మకాల వృద్ధి నెమ్మదించటంతో ఖర్చులు తగ్గించే ఒత్తిడిని ఎదుర్కొంటున్న అమెజాన్‌ సంస్థ రోబోల వినియోగాన్ని పెంచుతోంది.

ఇప్పటికే ఈ ఈ-కామర్స్ దిగ్గజం డెలివరీ చేస్తున్న ప్యాకేజీల్లో నాలుగింట మూడు వంతులు ఏదో ఒకరకమైన రోబో వ్యవస్థలను తాకాయి.

అయితే రాబోయే ఐదేళ్లలో ఇది వంద శాతానికి పెరిగే అవకాశం ఉందని అమెజాన్ రోబోటిక్స్ విభాగం చీఫ్ టెక్నాలజిస్ట్ టే బ్రాడీ బీబీసీతో చెప్పారు.

కానీ ఈ రంగంలో పెట్టుబడుల వల్ల ఎంతమేరకు ఖర్చులు తగ్గుతాయనేది చెప్పటానికి ఆ సంస్థ నిరాకరించింది.

సంస్థలో మనుషుల స్థానాన్ని యంత్రాలు ఎంత వేగంగా భర్తీ చేసే అవకాశం ఉందనే ప్రశ్నలను కూడా అమెజాన్ సిబ్బంది దాటవేశారు. సాంకేతిక పరిజ్ఞానం పురోగమించినందువల్ల 700 కొత్త రకాల ఉద్యోగాల కల్పన జరిగిందని పేర్కొన్నారు.

‘‘ఉద్యోగాలు కచ్చితంగా మారుతాయి. కానీ మనుషుల అవసరం ఎల్లప్పుడూ ఉంటుంది’’ అని బ్రాడీ పేర్కొన్నారు.

అమెరికాలోని బోస్టన్ సమీపంలో గల అమెజాన్ రోబోటిక్స్ హబ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బ్రాడీ మాట్లాడారు. తమ సంస్థ తాజాగా వినియోగించనున్న రోబోలు, డ్రోన్లు, మ్యాపింగ్ టెక్నాలజీని ఈ సందర్భంగా విలేకరుల బృందానికి ప్రదర్శించారు.

ఒక భారీ రోబో చేతిని అమెజాన్ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. ఆ చెయ్యి.. వస్తువుల తీసి, ప్యాక్ చేస్తుంది. ఇదొక ప్రధానమైన విజయమని ఈ కార్యక్రమ నిర్వాహకులు చెప్పారు. అలాగే.. గిడ్డింగి నేల మీద మనుషులతో పాటు స్వేచ్ఛగా తిరుగాడే ఒక యంత్రాన్ని కూడా ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు.

అమెజాన్ ప్యాకేజీలను డ్రోన్ల ద్వారా డెలివరీ చేయటం మొట్టమొదటిగా ఈ ఏడాది చివర్లో అమెరికాలో ప్రారంభం కానుంది.

అమెజాన్ డ్రోన్

ఫొటో సోర్స్, AMAZON

ఫొటో క్యాప్షన్, ఈ శతాబ్దం చివరికల్లా ఏటా 50 కోట్ల ప్యాకేజీలను డ్రోన్ల ద్వారా డెలివరీ చేయాలన్నది తమ ప్రణాళికగా అమెజాన్ చెప్తోంది

‘‘రాబోయే ఐదేళ్లలో మేం చేయబోయే పని ముందు.. గత పదేళ్లలో మేం చేసిన పని మొత్తం దిగదిడుపు అవుతుందని నేను భావిస్తున్నా. మా నెట్‌వర్క్‌ను ఇది నిజంగా సమూలంగా మార్చివేస్తుంది’’ అని అమెజాన్‌ రోబోటిక్స్ ఫుల్‌ఫిల్‌మెంట్ అండ్ ఐటీ విభాగం వైస్ ప్రెసిడెంట్ జో క్విన్‌లివాన్ చెప్పారు.

ఒకరకంగా చూస్తే రోబో బృందంలో అమెజాన్ ఆలస్యంగా చేరింది.

చైనాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం జేడీ.కామ్.. దాదాపు నాలుగేళ్ల కిందటే కేవలం నలుగురు ఉద్యోగులు మాత్రమే ఉన్న ఒక గిడ్డింగిని ఆవిష్కరించింది. అలాగే అమెజాన్ ప్రత్యర్థి సంస్థ వాల్‌మార్ట్ ఇప్పటికే డ్రోన్ డెలివరీ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.

సరఫరా వరుసలోని కంపెనీలు ఇలాంటి పెట్టుబడుల్లో డబ్బులు గుమ్మరిస్తున్నాయని గార్టనర్ లాజిస్టిక్స్ టీమ్ పరిశోధన విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న డ్వైట్ క్లాపిచ్ చెప్పారు. కార్మికులు దొరకటం కష్టమవటం ఇందుకు పాక్షిక కారణమని ఆయన పేర్కొన్నారు.

‘‘ఏ పరిశ్రమలోనైనా, ఎంత చిన్న, పెద్ద కంపెనీ అయినా.. అన్నిచోట్లా చాలా వినూత్న ఆవిష్కరణలు జరుగుతున్నాయి’’ అని ఆయన అంటున్నారు.

అమెరికాలోని తమ గిడ్డంగుల్లో నియమించటానికి 2024 నాటికి మనుషులు దొరకని పరిస్థితి రావచ్చునని అమెజాన్ హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి రోబో వ్యవస్థ ప్రాజెక్టుల మీద ఆ సంస్థ దశాబ్దానికి పైగా పని చేస్తోంది.

ఈ కృషిని ప్రారంభించటానికి ఆ సంస్థ 2012లో బోస్టన్‌ కేంద్రంగా ఉన్న రోబోటిక్స్ కంపెనీ కీవా సిస్టమ్స్‌ను కొనుగోలు చేసింది. సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బోజోస్ తమ డ్రోన్ ఆకాంక్షల గురించి 2013లో ఒక ఇంటర్వ్యూలో చర్చించారు.

ప్రస్తుతం తమ గోడౌన్లలో 5,20,000 మొబైల్ డ్రైవ్ రోబోలు తిరుగుతూ ఉన్నాయని అమెజాన్ చెప్పింది. ఇది 2019 నాటి సంఖ్యకు రెట్టింపు కన్నా ఎక్కువ. అలాగే తన రోబో చెయ్యి తొలి వెర్షన్లను అమెరికా, యూరప్‌లలోని తన గోడౌన్లలో ప్యాకేజీలను వర్గీకరించటానికి ఇన్‌స్టాల్ చేసింది.

అమెజాన్ గురువారం నాడు ప్రదర్శించిన రోబోలు కూడా ఇంకా ట్రయల్ విధానంలోనే ఉన్నాయి. రాబోయే రెండేళ్లలో వీటిని మరింత విస్తృతంగా రంగంలోకి దించాలని భావిస్తున్నారు.

ఈ శతాబ్దం చివరికల్లా ఏటా 50 కోట్ల ప్యాకేజీలను డ్రోన్ల ద్వారా డెలివర్ చేయాలన్నది అమెజాన్ ప్రణాళిక. ఆ ప్రణాళికను అమలు చేయదలచుకున్న ప్రాంతాల్లో సియాటిల్ వంటి జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు కూడా ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, ప్రపంచంలో తొలి ట్రిలియనీర్ జెఫ్ బెజోస్

ఇవి కూడా చదవండి: