కెంపెగౌడ: 4,000 కేజీల కత్తి సహా 220 టన్నులున్న ఈ విగ్రహం ఎవరిది - బెంగళూరులో మోదీ ఆవిష్కరిస్తున్న దీని వెనుక కుల రాజకీయాలున్నాయా

- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
బెంగళూరు నిర్మాత కెంపెగౌడ 108 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. బెంగళూరు నగరానికి విమానంలో వచ్చేవారికి ఈ విగ్రహం కనిపిస్తుంది. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం సామంతుల్లో ఒకరైన కెంపెగౌడ, 511 సంవత్సరాల కిందట బెంగళూరు నగరాన్ని నిర్మించారు.
ఇప్పుడు 4 టన్నుల బరువున్న ఖడ్గం సహా 220 టన్నుల కెంపెగౌడ విగ్రహాన్ని రూపొందించారు.
ప్రధానమంత్రి ఆ విగ్రహాన్ని కర్ణాటక ప్రజలకు అంకితం చేస్తారు. గుజరాత్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం స్టాట్యూ ఆఫ్ యూనిటీని రూపొందించిన శిల్పి రామ్ వి.సుతార్ ఈ విగ్రహాన్ని రూపొందించారు. సర్దార్ పటేల్ విగ్రహాన్ని రూపొందించడం రాజకీయంగా బీజేపీకి ప్రయోజనం కలిగించే చర్యగా అప్పట్లో విమర్శలు వినిపించాయి.
అయితే, పటేల్ ప్రధానమంత్రి పదవికి అర్హుడైన వ్యక్తని, కాంగ్రెస్ ఆయనకు ఆ అవకాశం ఇవ్వలేదని బీజేపీ విమర్శించింది. ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్ణాటకలోని వొక్కలిగ కులం నుంచి మద్దతు పొందేందుకు ఈ విగ్రహం ఏర్పాటు ఒక ప్రయత్నంగా బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

బెంగుళూరు, మాండ్య, మైసూరు, చామరాజనగర్, హసన్, చిక్కమగళూరు, తుముకూరు, కోలార్ జిల్లాలకు వ్యాపించి ఉన్న ఓల్డ్ మైసూర్ ప్రాంతం లేదా దక్షిణ కర్ణాటకలో వొక్కలిగ కులస్తుల ఆధిపత్యం కనిపిస్తుంది.
కెంపెగౌడ కూడా ఈ సామాజిక వర్గం నుంచి వచ్చిన సామంత రాజు. ఉత్తర కర్ణాటకకే పరిమితమైన లింగాయత్‌లు, ఇతర కులాల మాదిరిగా కాకుండా, వొక్కలిగలు రాష్ట్రమంతటా విస్తరించి ఉన్నారు. పాత మైసూర్ ప్రాంతం ప్రధానంగా కాంగ్రెస్, జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) పార్టీలకు బాగా పట్టున్న ప్రాంతం.
మాజీ ప్రధాని దేవెగౌడ ఇక్కడ బలమైన నాయకుడు.
లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ ప్రభావం చూపినప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్, జేడీఎస్‌లను అధిగమించలేకపోయింది. 23 ఎకరాల విస్తీర్ణంలో థీమ్ పార్కుతో పాటు విగ్రహం తయారీకి 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి ఏడాదిలోనే అప్పటి ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప రూ.100 కోట్లు ప్రకటించారు.
అయోధ్యలోని రామ మందిరానికి దేశంలోని అన్ని జిల్లాల నుంచి ఇటుకలను తీసుకెళ్లినట్లుగానే, రాష్ట్రంలోని 31 జిల్లాల నుంచి మట్టి, నీటిని థీమ్ పార్క్ కోసం సేకరించారు. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-2తోపాటు ఈ విగ్రహాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు.

ఫొటో సోర్స్, @CMofKarnataka
కెంపెగౌడ ఎవరు?
యల్హంకలో జన్మించిన కెంపెగౌడ కర్ణాటకలో మిగిలిన సామంత రాజులకు భిన్నమైన వ్యక్తి. ‘‘విజయనగర సామ్రాజ్యం రాళ్లతో చేసిన కోటలను ఇష్టపడలేదు. తమ కోటలు శత్రు దుర్భేధ్యంగా ఉండాలని భావించేవారు. ఈ నిర్ణయాన్ని అనుసరించిన కెంపెగౌడ ఎత్తయిన ప్రదేశాలో కోటను నిర్మించేందుకు అంగీకరించారు. ఎత్తయిన ప్రదేశంలో కోట ఉండటంవల్ల, దూర ప్రాంతాలపై నిఘా ఉంచడానికి వీలవుతుంది. ఈ విధంగా ఆయన తనకు, తన ప్రజలకు ఒక నిఘా వ్యవస్థను సృష్టించారు’’ అని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌కు చెందిన ప్రొఫెసర్ నరేందర్ పాణి బీబీసీతో అన్నారు. నగరంలో నాలుగు వాచ్‌టవర్‌లను కూడా కెంపెగౌడ ఏర్పాటు చేయించారు. కొంతమంది చరిత్రకారులు దీనిని నగర విస్తరణకు ఆయన చేసిన ప్రయత్నంగా భావిస్తున్నారు. ప్రస్తుత లాల్‌బాగ్, గవి గంగాధరేశ్వర ఆలయం, ఎంఈజీ సెంటర్, యలహంక గేట్‌ల దగ్గర ఈ వాచ్ టవర్‌లు ఉన్నాయి.
ప్రస్తుతం ఓల్డ్ సిటీ ప్రాంతంలో చిన్న చిన్న దేవాలయాలను కూడా కెంపెగౌడ అభివృద్ధి చేశారు. ‘‘ఈ ఆలయాలు చాలా వరకు ద్రవిడ వాస్తు ప్రకారం ఉన్నాయి. బయటి గోడలపై రామాయణం వంటి కథాశిల్పం ఉంటుంది. ఇలాంటివి విజయనగర రాజుల కాలంలోనే కనిపిస్తాయి. దేవనహళ్లిలో (అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో) ఆలయ మండపం విజయనగర శైలికి భిన్నంగా ఉందని మీరు గమనించవచ్చు’’ అని ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్ (ఐసీహెచ్‌ఆర్) డిప్యూటీ డైరెక్టర్ ఎస్.కె. అరుణి అన్నారు.
‘‘ఆయనొక ఆచరణాత్మకమైన వ్యక్తి. తాను ఏది అనుకుంటారో అది చేసేవారు. ఒక చర్య తీసుకుంటే, దాని పరిణామాలకు సిద్ధంగా ఉండేవారు. ఆయన సామంత రాజ్యానికి సొంతంగా కరెన్సీని ముద్రించారు. దీనిపై శ్రీకృష్ణ దేవరాయల ఆగ్రహానికి గురయ్యారు. అయితే, ఆయన తనదైన శైలిలో దాని నుంచి బయట పడగలిగారు’’ అని ప్రొఫెసర్ పాణి వివరించారు.
ఆయన తాను నిర్మింంచిన పట్టణాల సమీపంలోనే నీటి పారుదల కోసం అనేక చెరువులను కూడా తవ్వించారు. అయితే, బెంగళూరును పాలించిన కాలంలో ఆయన ఎన్ని చెరువులను తవ్వించారన్న దానిపై కచ్చితమైన ఆధారాలు చరిత్రకారుల దగ్గర లేవు.

ఫొటో సోర్స్, @narendramodi
కెంపెగౌడ 1513 నుండి 1569 వరకు పాలించినట్లు ఆధారాలున్నాయని డాక్టర్ సూర్యనాథ్ కామత్ వెల్లడించారు. ఆయన 1608 వరకు జీవించి ఉన్నట్లు కొన్ని ఆధారాలున్నాయని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు.
‘‘కెంపెగౌడ గురించి ఎపిగ్రఫీకన్నా, జానపద గాథల నుంచే ఎక్కువ ఆధారాలు తెలుస్తున్నాయి’’ అని బెంగళూరు యూనివర్శిటీలో చరిత్రశాఖ మాజీ అధ్యక్షురాలు డాక్టర్ ఎం.జమున బీబీసీతో అన్నారు.
ఇటీవలి దశాబ్దాల్లో కెంపెగౌడకు యోధుడిగా గుర్తింపునిస్తున్నారని డాక్టర్ జమున అన్నారు. తిరుమల ఆలయంలో దొరికిన కృష్ణదేవరాయలు, కెంపెగౌడల కాంస్య విగ్రహాలను చూస్తే ఈ అభిప్రాయం పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తుందని ఆమె అన్నారు.
‘‘మేము కెంపెగౌడ ఫొటో ఒకదాన్ని మేం ప్రచురించాం. ఆయనను ఈ రోజుల్లో విగ్రహాలు, ఫొటోలలో చూపిస్తున్నట్లు పెద్ద కత్తి, డాలు, మీసాలతో కనిపించే వ్యక్తి కాదు. ఆయన యుద్ధాలు చేశారు. కానీ పాలేగార్లలో శాంతిని నెలకొల్పడానికి కృషి చేసిన దౌత్యవేత్తగానే ఎక్కువ పేరు సంపాదించారు’’ అని డాక్టర్ జమున అన్నారు.
కెంపెగౌడ యోధుడి వేషధారణ, బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ముందు ఆయన విగ్రహం పెట్టిన తీరును మరో చరిత్రకారుడు ప్రస్తావించారు. ఆయన తన పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు. ఈ విగ్రహంలో కెంపెగౌడ చుడీదార్ ధరించినట్లు కనిపిస్తారని, కానీ ఈ చుడీదార్లు 300 సంవత్సరాల కిందట, లేదా మొఘల్ శకం చివరిలో ఉనికిలోకి వచ్చాయని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను గెలిపించిన 5 అంశాలేంటి... మిగతా పార్టీలు సాధించిందేంటి?
- ‘ఇండియా 2022లో న్యాయం ఇలా ఉంటుంది’ – రేప్ కేసులో మరణశిక్ష పడిన నిందితుల విడుదలపై దిగ్భ్రాంతి, ఆగ్రహం
- టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్: పాకిస్తాన్ 1992ను రిపీట్ చేస్తుందా, న్యూజీలాండ్ తొలి వరల్డ్ కప్ కల ఫలిస్తుందా?
- టీ20 వరల్డ్ కప్: భారత్, పాకిస్తాన్ ఫైనల్‌కు వస్తాయా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














